Mirzapur Season 3
క్రైమ్, థ్రిల్లర్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్’ (Mirzapur). ఇప్పటికే విడుదలైన రెండు సీజన్లు హిట్ అవటంతో మూడో సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అనుకున్నట్లుగానే జూలై 5 నుంచి కొత్త సీజన్ స్ట్రీమింగ్ మొదలైంది. మరి.. కొత్త సీజన్ ఎలా ఉంది? ఈ సీజన్ లో కథ ఏంటి? రెండు సీజన్స్ మాదిరిగానే ఈ సీజన్ కూడా క్లిక్ అవుతుందా... ఎవరు ఎలా చేశారు? ఈ రివ్యూలో చూద్దాం.
ఉత్తర ప్రదేశ్‌లోని మీర్జాపూర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్ తొలి సీజన్ 2018 నవంబరు 16న విడుదలైంది. పంకజ్ త్రిపాఠి, శ్వేతా త్రిపాఠి, దివ్యేందు శర్మ, అలీ ఫజల్, శ్రియ పిల్గోంగర్, హర్షిత గౌర్ తదితరులు నటించిన ఫస్ట్ సీజన్‌కు మంచి స్పందన లభించింది. దానికి కొనసాగింపుగా 2020 అక్టోబరు 23న రెండో సీజన్ విడుదలైంది. మూడో సీజన్ ఇప్పుడు విడుదల కాస్త లేటుగా రిలీజైంది. ఈ సిరీసే కాదు గుడ్డూ భయ్యాగా అలీ ఫజల్ కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.
సీజన్ 1 లో జరిగింది ఇదీ
సీజన్ 1లో కాలిన్ భయ్యా(పంకజ్ త్రిపాఠి) దగ్గర పనికి చేరిన ఇద్దరు అన్నదమ్ములు.. ఆ సీజన్ ముగిసే సమయానికి శత్రువులు అయ్యారు. తాను ప్రేమించిన యువతిని బబ్లూ పండిట్(విక్రాంత్ మాస్సే) ప్రేమించాడని కోపంతో మున్నా(దివ్యేందు).. గుడ్డు(అలీ ఫజల్) తమ్ముడినే కాకుండా.. వాళ్ల బంధువులను కూడా చంపేస్తాడు. అక్కడి నుంచే గుడ్డు త్రిపాఠి వంశంపై యుద్ధం ప్రకటిస్తాడు. అలా తొలి సీజన్‌లో గుడ్డూ భయ్యా, తన తమ్ముడు బబ్లూ, భార్య శ్వేతలను మున్నా ఎలా ఇబ్బంది పెట్టాడని చూపించారు. మున్నా కారణంగా గుడ్డూ, తన తమ్ముడు బబ్లూ మరియు భార్య శ్వేతలను కోల్పోవటం కథ.
సీజన్ 2 లో జరిగింది ఇదీ
రెండో సీజన్లో మున్నాపై గుడ్డూ భయ్యా ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడో చూపించారు. సీజన్ 2 ఆఖర్లో తండ్రీకొడుకులు ఇద్దరికి టార్గెట్ ఫిక్స్ చేస్తాడు. కానీ, కాలిన్ భయ్యా తప్పించుకుంటాడు. కానీ, మున్నా మాత్రం ప్రాణాలు కోల్పోతాడు. దీంతో మూడో దానిపై ఆసక్తి నెలకొంది. ఇందులో విజయ్ వర్మ కీలకపాత్రలో కనిపించారు. ఈ సిరీస్‌ను గుర్మీత్ సింగ్, మిహిర్ దేశాయ్‌లు తెరకెక్కించారు.
మీర్జాపూర్ సీజన్ 3ని.. ఎక్కడైతే సీజన్ 2ని ముంగించారో అక్కడి నుంచే ప్రారంభించారు. ఆ తర్వాత సీజన్ 2లో కాలిన్ భయ్యా కుటుంబాన్ని వేటాడటం మొదలు పెడతాడు. ఆ సీజన్ ని మున్నా మరణంతో ముగించారు. దాంతో ఈ సీజన్ ని మున్నా అంత్యక్రియలతో స్టార్ట్ చేశారు.
సీజన్ 3 కథ
మున్నా (దివ్యేందు) చనిపోగా.. కాలీన్ భయ్యా (పంకజ్ త్రిపాఠి) తీవ్రంగా గాయపడి కనిపించకుండా పోతాడు. దీంతో మీర్జాపూర్ ని ఏలటానికి రంగం సిద్దమవుతుంది. ఆ మీర్జాపూర్ కుర్చిని దక్కించుకునే క్రమంలో పూర్వాంచల్‌లో ప్రతి దాన్ని శాసించే శక్తిగా ఎదగాలనుకుంటాడు గుడ్డు. కాలీన్ భాయ్ అనే వాడిని జనాలు మర్చిపోయేలా చేయాలని ప్రయత్నిస్తాడు. మరో ప్రక్క కాలిన్ భయ్యా పరారీతో బీనా ఆంటీ(రషిక దుగల్) గుడ్డుకు మద్దతు పలుకుతుంది. అలా ఆమె సపోర్ట్ తీసుకుని మీర్జాపూర్ సింహాసనంపై గుడ్డు పండిట్ కూర్చుంటాడు.
ఇక మున్నాభాయ్ మరణంతో మాధురీ యాదవ్ (ఇషా తల్వార్) రాజకీయాల్లోకి అడుగు పెట్టడమే కాకుండా ముఖ్యమంత్రి కూడా అవుతుంది. కనిపించకుండా పోయిన కాలీన్ భయ్యాపై సింపథీని క్రియేట్ చేసి, ప్రజలకు చేరువ కావాలని భావిస్తుంది. రెండు సీజన్స్ లో ఎంతో పవర్ ఫుల్ గా కనిపించిన కాలీన్ భయ్యా.. ఈసారి ఎక్కువగా కనపడదు. నాలుగో ఎపిసోడ్ లోనే కనిపిస్తాడు. అతడిని కాపాడిన శరద్ శుక్లా, శతృఘ్ను ఇద్దరూ మీర్జాపూర్ సింహాసనం మీద ఫోకస్ పెడతారు.
Mirzapur Season 3
ఇదిలా ఉంటే గుడ్డు తో శరద్ శుక్లా ప్రత్యక్షంగానే యుద్ధం చేస్తూ ఉంటాడు. గుడ్డు పండిట్ ని ఎన్ని విధాలుగా దెబ్బ కొట్టాలో అని వాళ్లు ప్లాన్స్ రచిస్తూ ఉంటారు. గుడ్డూకి వ్యతిరేకంగా అనేక శక్తులు ఒకటవుతాయి. ముఖ్యమంత్రి మాధురీ, శరద్ శుక్లా, దద్దా త్యాగి(లిల్లిపుట్ ఫరూఖీ), దద్దా త్యాగి కుమారుడు భరత్ త్యాగి(విజయ్ వర్మ) అంతా ఒకటవుతారు. మరోవైపు గుడ్డూ పండిట్ తండ్రి రమాకాంత్ పండిట్ జీవితంలో చాలానే విలువైన పాఠాలు నేర్చుకుంటాడు. చివరికి ఎవరు ఆ సింహాసనాన్ని దక్కించుకుంటారు? ఎవరు ఆ సింహాసనం మీద కూర్చుంటారు? అసలు మీర్జాపూర్ సింహాసనాన్ని గుడ్డు పండిట్ కాపాడుకోగలిగాడా? మరి వీరిలో ఎవరు మీర్జాపూర్ సింహాసనాన్ని అధిరోహించారన్నదే సీజన్-3 కథ.
ఎలా ఉంది
మీర్జాపూర్ సిరీస్ కి ప్రత్యేకమైన సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉండటంతో కలిసొచ్చింది. దాంతో ఈ సీరిస్ పై ఒక రేంజిలో హై ఎక్స్ పెక్టెషన్స్ ఉన్నాయి. అయితే వాటిని సీరిస్ అందుకోలేదనే చెప్పాలి. మొదటి సీజన్ తో పోలిస్తే.. రెండో సీజన్ కాస్త తగ్గినట్లు అందరికీ అనిపించింది. ఇప్పుడు మూడో సీరిస్ లోనూ అదే ఫీల్ వస్తుంది. రెండో సీజన్ కంటే మూడో సీజన్ మరీ తగ్గినట్లు అనిపించింది. అందుకు కారణం ఇందులో వెలెన్స్, ఎలివేషన్స్ మొదటి రెండు సీజన్స్ తో పోలిస్తే బాగా తక్కువ. కేవలం పొలిటికల్ మైండ్ గా ఈ సీజన్ ని డీల్ చేసారు.
అయితే డ్రామాలో మలుపులు బాగుండటంతో ఇంట్రస్టింగ్ గా సాగింది. దానికి తగినట్లు స్త్రీ పాత్రలకు బాగా ప్రయారిటీ ఇచ్చారు. ఇక ఈ సీరిస్ ని మొదటి నుంచీ రియలిస్టిక్ గా అనిపించేలా డిజైన్ చేసారు. అందుకే యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. మూడో సీజన్ కు వచ్చేసరికి కేవలం మీర్జాపూర్ కుర్చీకోసం పోరుగా మార్చేసారు. దాంతో కొంత సాగినట్లు, అక్కడక్కడే తిరుగుతున్నట్లు అనిపిస్తుంది.
ఇక మీర్జాపూర్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయిందో అందులోని క్యారెక్టర్ల పేర్లు కూడా అంతే పాపులర్ అయ్యాయి .ముఖ్యంగా మున్నా భయ్యా, గుడ్డూ భయ్యా మరియు బబ్లూల పేర్లు బాగా వైరలయ్యాయి. అయితే ఈ సిరీస్ లో ఎక్కువగా హింస, రొమాన్స్ తో కూడిన సన్నివేశాలు ఉండడం మీర్జాపూర్ సిరీస్‌లో ఫ్యామిలీ ఆడియన్స్ దూరంగా ఉన్నారని చెప్పొచ్చు.
టెక్నికల్ గా ...
ఈ సిరీస్ టేకింగ్.. మేకింగ్ మొదటి రెండు సీజన్ తరహాలోనే నేచురల్ గా ఉండేలా తీసారు. అయితే ఆ పార్ట్ లు నాటికి ఇప్పటికి ఓటిటి ప్రపంచం బాగా మారిపోయింది. ఇప్పుడు జనం వెబ్ సీరిస్ లు తెగ చూస్తున్నారు. నాలుగేళ్ల క్రితం మొదటి సీజన్ వచ్చేనాటికు ఇదే కొత్త. డైరెక్టర్స్ గుర్మీత్ సింగ్, ఆనంద్ అయ్యర్ కథను ముఖ్యంగా స్క్రీన్ ప్లేను సాగ తీయకుండా రాసుకుని ఉంటే బాగుండేది. ఇక ఈ సీరిస్ ప్రాణం పోసే బ్యాక్ గ్రౌండ్ స్కోర్.., కెమెరా పనితనం ఎప్పటిలాగానే ది బెస్ట్ గా ఉన్నాయి. . మొత్తం పది ఎపిసోడ్స్ (ఒక్కో ఎపిసోడ్ 40 నుంచి 50 నిమిషాలు పైనే) లెంగ్త్ మరీ ఎక్కువ అనిపించి, మరీ సాగదీత ఫీల్ కలుగుతుంది.
నటీనటుల ఫెరఫార్మెన్స్ విషయానికి వస్తే..
ఈ సీజన్ మొత్తం అలీ ఫజల్(గుడ్డ భయ్యా) దే. అతను విశ్వరూపం చూపించాడు. శ్వేతా త్రిపాఠి(గోలు), రషిక దుగల్(బీనా ఆంటీ) కూడా నచ్చుతాయి. ఎప్పటిలాగే పంకజ్ త్రిపాఠి అదరకొట్టారు. మిగతా పాత్రలు కూడా ఎవరికి వంక పెట్టలేని విధంగా ఉన్నాయి
నటీనటులు: పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, శ్వేత త్రిపాఠి, మాధురీ యాదవ్, విజయ్ వర్మ తదితరులు;
దర్శకత్వం: గుర్మీత్ సింగ్, ఆనంద్ అయ్యర్
చూడచ్చా
ఇప్పటికే రెండు సీజన్స్ చూసి సీజన్ 3 కూడా ఎదురుచూస్తే మాత్రం మీ ఎక్సపెక్టేషన్స్ ని మాత్రం రీచ్ కాదు. అలాగని పూర్తిగా మరీ ప్రక్కన పెట్టేయాల్సిన సీరిస్ అయితే కాదు. కొత్తగా చూసేవారికి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది.
ఫ్యామిలీతో చూడలేం
మితి మీరిన హింస, రక్తపాతం, బూతులు ఈ సిరీస్‌లోనూ మొదటి నుంచి చివరిదాకా కనిపిస్తూ, వినిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఫ్యామీలితో చూడటం అనే పోగ్రాం పెట్టుకోవద్దు.
ఎక్కడ చూడచ్చు
. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులోనూ అందుబాటులో ఉంది.