
అనుపమా పరమేశ్వరన్ మొన్నటి వరకు గ్లామర్ పాత్రలతో మెప్పించింది. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ చిత్రం `పరదా`తో వచ్చింది. దీనికి ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహించారు. ఆనంద మీడియా పతాకంపై శ్రీనివాసులు పీ వై, విజయ్ దొంకాడ, శ్రీధర్ మక్కువ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో అనుపమా పరమేశ్వరన్‌తోపాటు సంగీత, దర్శన రాజేంద్రన్, రాగ్ మయూర్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం నేడు శుక్రవారం(ఆగస్ట్ 22)న విడుదలైంది. అయితే ముందే మీడియాకి ప్రదర్శించారు. ఏఏఏలో ఈ మూవీని వీక్షించాను. మహిళా శక్తిని చాటే ఈ మూవీ ఆకట్టుకుందా? ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం.
పడతి అనే గ్రామంలో వింత ఆచారం ఉంది. ఆ ఊర్లో ఆడవారు ముఖానికి పరదా(స్కార్ఫ్) కప్పుకొని ఉండాలి. వారి మొహం ఎవరికీ కనిపించకూడదు. ఇంట్లో తల్లిదండ్రులు, పిల్లలు, భర్తకి తప్ప. ఒకవేళ పరదా లేకుండా కనిపిస్తే ఆ ఊరి దేవత జ్వాలమ్మ ఆగ్రహానికి బలవ్వాల్సి వస్తుంది. ఈ నియమాన్ని ప్రతి ఒక్కరు చాలా కఠినంగా ఫాలో అవుతుంటారు. కానీ అనుకోకుండా ఓ రోజు సుబ్బలక్ష్మి(అనుపమా పరమేశ్వరన్) పరదా గాలికి ఎగిరిపోతుంది. అది తన పొలంలో. ఎవరూ చూడలేదని తాను భావిస్తుంది. కానీ ఆమె ముఖం ఒక మేగజీన్‌లో కవర్ పేజీగా అచ్చు అవుతుంది. సుబ్బలక్ష్మికి తన ప్రియుడు రాజేష్(రాగ్ మయూర్)తో ఎంగేజ్‌మెంట్ రోజే ఆ మేగజీన్‌ని ఆ ఊరు వాళ్లంతా చూస్తారు. దీంతో పెద్ద గొడవ. ఊరు నియమాన్ని బ్రేక్ చేసిన సుబ్బలక్ష్మి ఆత్మహుతికి పాల్పడాలని పెద్దలు తీర్మానిస్తారు. తాను ఏ తప్పు చేయలేదని చెప్పినా వినకుండా ఈ తీర్మానం చేస్తారు. కానీ ఆ దుశ్చర్య నుంచి సుబ్బలక్ష్మి తప్పించుకుంటుంది. దాన్నుంచి ఎలా తప్పించుకుంది? ఆ ఊర్లో పిల్లలు పుట్టకపోవడానికి, ఈ పరదాకి ఉన్న లింకేంటి? తన అత్త రత్న(సంగీత), అమ్మి(దర్శన రాజేంద్రన్)తో కలిసి సుబ్బు ధర్మశాలకు ఎందుకు వెళ్లింది? సుబ్బలక్ష్మి ఫోటో తీసింది ఎవరు? ఆ మేగజీన్‌లో సుబ్బలక్ష్మి ఫేస్ ఎలా వచ్చింది? చివరికి ఊరు కట్టుబాట్లని సుబ్బు ఎలా బ్రేక్ చేసింది? తన శక్తిని ఎలా చాటిందనేది సినిమా.
`పరదా` చిత్ర దర్శకుడు, హీరోయిన్ ప్రెస్ మీట్లలో ఇచ్చిన స్టేట్‌మెంట్లతో సినిమాలో ఏదో ఉండబోతుందనే క్యూరియాసిటీతో మూవీకి వెళ్లాను. మీడియా షో కాబట్టి పెద్దగా హడావుడి లేదు. సినిమా చూస్తున్నప్పుడు, చూశాక ఏమనిపించిందంటే.. ``ఇది ఒక ఊర్లో ఉండే వింత ఆచారాన్ని ఒక మహిళ బ్రేక్ చేసే కథ. తరతరాల కట్టుబాట్లని బద్దలు కొట్టిన అమ్మాయి కథ. మహిళా శక్తిని, మహిళా స్వేచ్ఛని చాటి చెప్పే మూవీ. ఇల్లు, పిల్లలు, కుటుంబం, ఆచారాలు అనే నాలుగు గోడలను దాటితే ప్రపంచం ఎంత పెద్దగా ఉంటుందో, ఎంత గొప్పగా ఉంటుందో మహిళలు తెలుసుకోవాల్సిన మూవీ. మహిళా తలుచుకుంటే ఏం చేయగలదో చూపించే సినిమా. తమకి చుట్టుకున్న ఎన్నో పరదాలు తొలగించుకుని మహిళలు, అమ్మాయిలు స్వేచ్ఛగా ఎగరాలని చెప్పే సినిమా`` అనే భావన కలిగింది. ఒక కల్పిన కథని తీసుకుని దాని చుట్టూ మహిళ శక్తిని, వారి స్వేచ్ఛని తెలియజేస్తూ దర్శకుడు ప్రవీన్ కాండ్రేగుల ఈ సినిమాని తెరకెక్కించిన తీరు బాగుంది. పడతి గ్రామంలో జ్వాలమ్మ ఎలా అవతరించింది. ఆమెకు ఎలాంటి అన్యాయం జరిగింది? పరదా తీసేస్తే ఊర్లో ఎలాంటి అనర్థాలు జరుగుతాయనేది చెప్పిన కథ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. అదే సమయంలో దానికి తగ్గట్టుగానే కథలోకి వెళ్తూ పడతి గ్రామాన్ని, అక్కడి ఆచారాలు, కల్చర్‌ని ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంది. జ్వాలమ్మకి పండగ చేసే సీన్లు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. అవన్నీ కథపై, నెక్ట్స్ ఏం జరగబోతుందనే దానిపై ఆసక్తిని పెంచాయి. సుబ్బలక్ష్మి, రాజేష్‌తో రైల్ బోగిలో ప్రేమ కథ కాస్త కొత్తగా ఉంది. ఆ తర్వాత మేగజీన్‌లో సుబ్బు ఫోటో రావడంతో అసలు కథ స్టార్ట్ అవుతుంది. సుబ్బలక్ష్మి ఆత్మహుతి చేసుకోవాలని ఊరు పెద్దలు తీర్మానించడంతో ఆమెని చంపేసే ప్రయత్నం జరుగుతున్న సందర్భం ఉత్కంఠకి గురి చేస్తుంది. సెకండాఫ్ మొత్తం.. సుబ్బు, రత్న, అమ్మి కలిసి ఆ ఫోటో తీసిన వ్యక్తిని వెతుక్కుంటూ వెళ్లడం, ఈ క్రమంలో వాళ్లు చూసిన ప్రపంచం, వాళ్లు చూసిన స్వేచ్ఛ, వాళ్లు తెలుసుకున్న కొత్త విషయాల చుట్టూ తిరుగుతుంది. సుబ్బుకి ఎదురైన సంఘటనతో ఆమెలో వచ్చిన మార్పు క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. క్లైమాక్స్ మాత్రం వాహ్ అనేలా డిజైన్ చేశారు.
అయితే కథ పరంగా ఇది కాస్త ఓవర్ డ్రామాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇలాంటి ఆచారాలు ఎక్కడ ఉన్నాయనే ఫీలింగ్ కలుగుతుంది. అది సహజత్వానికి దూరంగా ఉంది. ఆ ఊరు ఆచారాలు కూడా వింతగానే అనిపిస్తాయి. మొదటి భాగం చాలా వరకు ఏం జరుగుతుందనే క్యూరియాసిటీతోనే నడుస్తుంది. కానీ సెకండాఫ్‌లో చాలా సాగదీతగా అనిపిస్తుంది. అనుపమా, సంగీత, దర్శన రాజేంద్రన్ కలిసి ట్రావెల్ చేసే సీన్లు కొంత సాగదీసిన ఫీలింగ్ కలుగుతాయి. ఎవరెస్ట్ స్టోరీ, రాజేంద్రప్రసాద్ పాత్ర, లోయల్లో ఇబ్బంది పడటాలు ఇవన్నీ కథని లాగడం కోసం ఇరికించినట్టుగానే ఉంటాయి. కాకపోతే ఈ సీన్ల ద్వారా మహిళ స్వేచ్ఛని చెప్పిన తీరు మాత్రం బాగుంది. ప్రీ క్లైమాక్స్ కి ముందు అనుపమా ఫేస్ చేసిన సంఘటన, ఇక ఊర్లోకి తిరిగి వచ్చినప్పుడు చోటు చేసుకున్న సంఘటన వాహ్ అనిపిస్తుంది. అది సినిమాకి హైలైట్‌గా నిలిచింది. కాకపోతే ఇంటర్వెల్‌లోనే నెక్ట్స్ ఏం జరగబోతుందనేది, క్లైమాక్స్ ఏంటనేది అర్థమయ్యేలా ఉంది. ఇలాంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, మరింత గ్రిప్పింగ్‌గా సినిమాని తెరకెక్కిస్తే బాగుండేది. మహిళా సాధికారత అనే కోణంలో చూసినప్పుడు మంచి సందేశాత్మక మూవీ అని, మహిళ శక్తిని చాటే సినిమా అవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
సుబ్బలక్ష్మి పాత్రలో అనుపమా పరమేశ్వరన్ అదరగొట్టింది. చాలా సెటిల్డ్ యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేసింది. పాత్రకి ప్రాణం పోసింది. సరదాగా కనిపించే సీన్లలో, ఎమోషనల్ సీన్లలోనూ చాలా బాగా చేసింది. నటిగా తనని మరో మెట్టు ఎక్కించే నటనని ప్రదర్శించిందని చెప్పొచ్చు. రత్నగా సంగీత సైతం బాగా చేసింది. చాలా సహజంగా నటించింది. పాత్రలో ఒదిగిపోయి అలరించింది. తన భర్తతో డ్రామా సీన్లలో మాత్రం అదరగొట్టింది. ఆయా సీన్లు నవ్వులు పూయించేలా ఉంటాయి. ఇక అమ్మీగా దర్శన రాజేంద్రన్ స్ట్రగుల్డ్ సివిల్ ఇంజనీర్ గా, వీరితో కలిసి ట్రావెల్ చేస్తూ ఉమెన్ ఎంపవర్‌మెంట్ గురించి చెప్పే సీన్లలోనూ బాగా నటించింది. రాజేష్ పాత్రలో రాగ్ మయూర్ సైతం సహజంగా కనిపించాడు. తనకు మంచి పేరు తెచ్చే పాత్ర అవుతుంది. ఫోటోగ్రాఫర్‌గా గౌతమ్ మీనన్, రాగ్ మయూర్ అన్నగా చైతన్య రావులు కాసేపు మెరిశారు. ధర్మశాలలో రాజేంద్రప్రసాద్ ఓ మెరుపు మెరిశారు. `బలగం` తాతతోపాటు ఇతర పాత్రధారులు ఓకే అనిపించారు.
ఈ మూవీకి గోపీసుందర్ మ్యూజిక్ అందించారు. `మగువే` పాట ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటుంది. మరో పాట కూడా బాగానే ఉంది. కానీ బీజీఎం అదిరిపోయింది. ముఖ్యంగా జ్వాలమ్మ వారి వద్ద వచ్చే బిజీఎం హైలైట్‌గా నిలుస్తుంది. ఇక మృదుల్ సుజీత్ సేన్ కెమెరా వర్క్ సైతం బాగుంది. కలర్‌ఫుల్‌గా ఉంది. విజువల్స్ సినిమాకి ప్లస్‌గా నిలిచాయి. ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్ ఫర్వాలేదు. సెకండాఫ్‌లో ఇంకా జాగ్రత్త తీసుకోవాల్సింది. నిర్మాణ విలువలకు కొదవ లేదు. దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల ఎంచుకున్న కథని మహిళా కోణంలో చూసినప్పుడు ఆకట్టుకుంటుంది. లాజికల్‌గా చూస్తే ఓవర్‌గా అనిపిస్తుంది. లేని ఆచారాలు చూపించి హడావుడి చేసినట్టుగా ఉంటుంది. అదే సమయంలో మహిళా శక్తిని చాటేలా ఆయన తెరకెక్కించిన తీరు బాగుంది. డైలాగ్‌లు చాలా బలంగా ఉన్నాయి. విభిన్న నేపథ్యాలకు చెందిన మహిళల్లో ఉండే స్ట్రగుల్స్ చూపించిన తీరు బాగుంది. కొంత కామెడీగానూ ఉంది. అయితే కథని లాజికల్‌గా మరింత బాగా రాసుకోవాల్సింది. కాకపోతే కట్టుబాట్లు, ఆచారాలు మనిషి సృష్టించుకున్నవే తప్ప, వాటిని దేవుడికి ఆపాదించకూడదని చెప్పిన సందేశం బాగుంది.
ఫైనల్‌గా ః `పరదా`లు తొలగించుకుని మహిళలు స్వేచ్ఛగా ఎగరాలని చెప్పే మూవీ.
రేటింగ్‌ః 3