
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్పెషల్ పేజ్ ను సాధించుకున్న నటుడు, నటశేఖర ‘సూపర్ స్టార్’ కృష్ణ. టాలీవుడ్‌లో సాంకేతిక విప్లవానికి, సరికొత్త ధోరణులకు నాంది పలికిన హీరో ఆయన. కెరీర్‌లో ఎన్నో ప్రయోగాలు, మరెన్నో రికార్డులు కృష్ణ సొంతం. అయితే ఆయన సినీ ప్రస్థానంలో ప్రతీ సినిమాకు ఒక ప్రత్యేకత ఉంటుది. అలాగే ‘పాడిపంటలు’ (1976) చిత్రానికి కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది.
పరాజయాల సుడిగుండంలో చిక్కుకున్న కృష్ణను మళ్లీ బాక్సాఫీస్ విజేతగా నిలబెట్టిన తిరుగులేని మాస్టర్‌పీస్ ఇది.ఒక వైపు వరుస ప్లాప్‌లు, మరోవైపు తోటి స్టార్ హీరోల నుంచి గట్టి పోటీ.. ఈ క్లిష్ట పరిస్థితుల్లో సూపర్ స్టార్ కృష్ణ నిర్మించి, నటించిన ఈ క్లాసిక్ విలేజ్ డ్రామా వెనుక ఉన్న ఆసక్తికర విశేషాలు, పడిన శ్రమ, సమగ్ర విశ్లేషణ.
1974లో వచ్చిన తెలుగు సినీ చరిత్రలోని మొదటి కలర్ సినిమా ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రంతో కృష్ణ తిరుగులేని స్టార్‌డమ్ సాధించారు. అయితే, ఆ సూపర్ సక్సెస్ తరువాత కృష్ణ కెరీర్ ల అప్ అండ్ డౌన్ స్టార్ట్ అయ్యింది. సీతారామరాజు పాత్ర తరువాత ఏ పాత్ర చేసినా.. అభిమానులు తీసుకోలేకపోయారు. ‘అల్లూరి’ లాంటి భారీ హిట్ తర్వాత కృష్ణ దాదాపు 13 వరుస ప్లాప్‌లను చూశారు. అంతే కాదు నిరంతరం సినిమాలు విడుదల కావడం, కొన్ని ప్రయోగాత్మక చిత్రాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో పంపిణీదారులు, నిర్మాతలు కృష్ణ డేట్ల విషయంలో కాస్త వెనకడుగు వేయడం ప్రారంభించారు.
దానికి తోడు శోభన్ బాబు ‘సొగ్గాడు’ వంటి సంచలన విజయాలతో దూసుకుపోతుండగా, ఎన్టీఆర్, ఏఎన్నాఆర్‌ల హవా కొనసాగుతోంది. ఇలాంటి అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో కృష్ణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన సొంత బ్యానర్ ‘పద్మాలయా ఆర్ట్ పిక్చర్స్’ మీద తనే రిస్క్ తీసుకుని ఒక ప్రాజెక్ట్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అదే ‘పాడిపంటలు’.
హిందీలో మనోజ్ కుమార్ నటించిన క్లాసిక్ సినిమా ‘ఉప్‌కార్’ (Upkar) ఆధారంగా ఈ కథను రూపొందించారు. ఉప్‌కార్' సినిమా ఉత్తర భారత వాతావరణంలో సాగుతుంది. దానిని తెలుగు నేటివిటీకి, మన గ్రామీణ వాతావరణానికి తగినట్టుగా మార్చేశారు. పాడి-పంటల సంస్కృతికి తగ్గట్లుగా రచయిత త్రిపురనేని మహారథి, దర్శకుడు పి. చంద్రశేఖరరెడ్డి అద్భుతంగా రూపాంతరం చేశారు. గ్రామీణ ప్రాంతంలో అన్నదమ్ములు, భూమి ప్రాముఖ్యత, స్వార్థం లేని రైతు శ్రమ, కల్తీలు చేసే వ్యాపారుల కుట్రలతో కూడిన సామాజిక నేపథ్యాన్ని ఈ సినిమా కోసం రాసుకున్నారు.
తల్లిదండ్రులు లేని కుటుంబంలో పెద్దవాడైన రాము (గుమ్మడి) తన తమ్ముడైన గోపి (కృష్ణ)ని ఎంతో ప్రేమగా పెంచుతాడు. గోపి తన చదువు పూర్తయ్యాక పట్నం ఉద్యోగాలకు వెళ్లకుండా, సొంత ఊరిలోనే ఉండి వ్యవసాయం చేసి ఊరిని అభివృద్ధి చేయాలనుకుంటాడు. అయితే, ఊళ్లో ఉన్న దుష్ట శక్తులు (నాగాభూషణం వర్గం) ఈ కుటుంబంలో విబేధాలు సృష్టిస్తారు. స్వార్థపరులైన బంధువుల వల్ల అన్నదమ్ములు విడిపోతారు. దేశానికి హాని తలపెట్టే నకిలీ మందులు, కల్తీ వ్యాపారులపై పోరాటం చేస్తూ గోపి సైన్యంలో చేరాల్సి వస్తుంది. చివరకు కష్టాలను ఎదుర్కొని గోపి ఎలా తన కుటుంబాన్ని, గ్రామాన్ని కాపాడుకున్నాడు అనేదే ఈ చిత్ర ప్రధాన కథ.
వరుస ప్లాప్ లతో ఇబ్బందుల్లో ఉన్న కృష్ణతో సినిమాకు చాలామంది వెనకడుగు వేశారు. కానీ సూపర్ స్టార్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఏదైతే అది అయ్యింది అనుకుని.. సొంత బ్యానర్‌లో భారీ తారాగణంతో సినిమా మొదలు పెట్టాడు. సినిమా అంటేనే అప్పట్లో అతిపెద్ద జూదం. ఈ సినిమా పోతే పద్మాలయా పిక్చర్స్ ఆర్థికంగా కోలుకోవడం కష్టమయ్యేది. కానీ హిట్ అవుతుందన్న కాన్ఫిడెంట్ మాత్రం సూపర్ స్టార్ లో ఉంది.
ఈ సినిమాలో కృష్ణతో పాటు గుమ్మడి, జగ్గయ్య, కాంతారావు, అంజలీదేవి, నాగాభూషణం, చంద్రమోహన్, అల్లు రామలింగయ్య వంటి దిగ్గజ తారాగణం ఉంది. అంతమంది కాల్ షీట్లను సమన్వయం చేసుకుంటూ, గ్రామీణ ప్రాంతాల్లో షూటింగ్ చేయడం పెను సవాలుగా మారింది. ఒక రైతుగా, ఆపై సైనికుడిగా కృష్ణ రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు. పొలం పనులు చేసే దృశ్యాలు, ఎండలో కష్టపడే సన్నివేశాల కోసం ఆయన నిజమైన రైతులాగే శ్రమించారు.
పాడి పంటలు’ సినిమా విజయంలో సంగీతానిది 50% పాత్ర అని చెప్పవచ్చు. కేవీ మహదేవన్ అందించిన స్వరాలు ఇప్పటికీ గోదావరి జిల్లాలలో, పల్లెటూర్లలో మారుమోగుతుంటాయి.
"మన జన్మభూమి బంగారు భూమి.." (ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం) - ఈ పాట తెలుగువారి దేశభక్తి గీతంగా మారిపోయింది. "పనిచేసే రైతన్నా.. పాటుపడే కూలన్నా" (ఎస్.పి.బి, శ్రీశ్రీ సాహిత్యం) - శ్రామిక వర్గానికి ఒక దిశానిర్దేశం చేసిన పాట. "ఇరుసులేని బండి ఈశ్వరుని బండి" - ఆచార్య ఆత్రేయ రాసిన ఈ పాట నిత్యసత్యమైన తత్వాన్ని బోధిస్తుంది. "అట్లతద్దోయ్ ఆరట్లోయ్.." - పండుగ వాతావరణాన్ని కళ్లకు కట్టిన పాట.ఈ సినిమాలో పాటలన్నీ శ్రోతలను అలరించాయి. ఇప్పటికీ కొన్ని సందర్భాల్లో ఈ పాటలు వినిపిస్తూనే ఉంటాయి.
కృష్ణ పవర్ ప్యాక్డ్ యాక్టింగ్: రైతుగా ఆయన చూపించిన ఒద్దిక, ఆ తర్వాత దేశభక్తి కలిగిన జవానుగా చూపించిన పౌరుషం అద్భుతం.
సెంటిమెంట్ & ఎమోషన్స్: గుమ్మడి-కృష్ణ మధ్య అన్నదమ్ముల అనుబంధం, అంజలీదేవి నటించిన సన్నివేశాలు ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించాయి.
సంగీతం-మాటలు: కేవీ మహదేవన్ పాటలు, త్రిపురనేని మహారథి రాసిన ఆలోచనాత్మక సంభాషణలు.
సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు అప్పటి హిందీ నాటకీయతకు దగ్గరగా ఉండటం వల్ల కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది. అయితే కథలోని ఎమోషన్ ముందు ఇవేమీ పెద్ద లోపాలుగా అనిపించవు.
‘పాడి పంటలు’ 1976 సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలవుతోంది అనగా తీవ్రమైన పోటీ నెలకొంది. ఎన్టీఆర్ ‘నేరం నాది కాదు’, శోభన్ బాబు సినిమాలు పోటీలో ఉన్నాయి. కఠినమైన పోటీని తట్టుకుని ‘పాడి పంటలు’ ఆ ఏటి సంక్రాంతి వద్ద ఏకపక్ష విజయాన్ని సాధించింది. ఆంధ్ర, నైజాం, సీడెడ్.. ఇలా అన్ని ప్రాంతాల్లో మొదటి వారంలోనే రికార్డు స్థాయి వసూళ్లను సాధించింది. అప్పట్లోనే దాదాపు రూ. 20 లక్షలకు పైగా ఫస్ట్ వీక్ షేర్ సాధించి పరిశ్రమను షాక్‌కు గురిచేసింది.
కృష్ణ కెరీర్‌లోనే అత్యధికంగా.. 100 రోజులు ఆడిన సినిమాల్లో ఒకటిగా ఈ సినిమా నిలిచింది. ‘పాడి పంటలు’ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు.. పడిపోతున్న కృష్ణ కెరీర్ ను నిలబెట్టిన మాస్టర్ పీస్. వరుస ప్లాప్‌లతో కృష్ణ పని అయిపోయిందని విమర్శించిన నోళ్లను తన సొంత కథ, నమ్మకంతో మూయించిన చిత్రం. తెలుగు సినీ చరిత్రలో "రైతు ప్రాముఖ్యతను, పల్లె అందాలను, అన్నదమ్ముల అనుబంధాన్ని" చాటిచెప్పిన ఆల్‌టైమ్ క్లాసిక్స్ జాబితా తీస్తే.. అందులో మొదటి వరుసలో నిలిచే చిత్రం ‘పాడి పంటలు’. ఈ సినిమా చూడాలి అనుకున్న వారికి యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.