
పవన్ కళ్యాణ్ చివరగా `హరి హర వీరమల్లు` చిత్రంలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచింది. ఫ్యాన్స్ చాలా డిజప్పాయింట్ అయ్యారు. దీంతో ఇప్పుడు వస్తోన్న `ఓజీ`పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. పైగా కంటెంట్ కూడా అలానే ఉండటంతో ఆ అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో పవన్‌కి జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ నటించింది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటించాడు. శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, రాహుల్ రవీంద్రన్ వంటి భారీ కాస్టింగ్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. ముంబయి గ్యాంగ్ స్టర్ కథతో రూపొందిన ఈ మూవీ సెన్సార్ నుంచి `ఏ` సర్టిఫికేట్ పొందింది. పవన్ కళ్యాణ్ నుంచి వస్తోన్న సినిమాకి `ఏ` సర్టిఫికేట్ అంటూ మామూలు విషయం కాదు. ఇందులో యాక్షన్ సీన్లు, హింస ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా ఆ విషయాన్ని స్పష్టం చేసింది. గతంలో ఎప్పుడూ చూడని పవన్ కళ్యాణ్‌ని ఇందులో చూడబోతున్నామనే విషయం అర్థమవుతోంది. ఈ క్రమంలో భారీ అంచనాల మధ్య గురువారం(సెప్టెంబర్ 25) విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ చిత్రాన్ని బెనిఫిట్ షోలో బుధవారం రాత్రినే వీక్షించాం. ఫ్యాన్స్ హంగామా మధ్య సినిమాని తిలకించాం. థియేటర్లో సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు అభిమానుల హోరో మామూలుగా లేదు. పూనకాలు తెప్పించేలా ఉంది. మరి సినిమా ఆ రేంజ్‌లో ఉందా అనేది రివ్యూలో తెలుసుకుందాం.
ఇండియా నుంచి జపాన్ వెళ్లిన ఒక సైనికుడు అక్కడి యుద్ధంలో మరణిస్తాడు. అతని కొడుకు గాంభీర(పవన్ కళ్యాణ్)ని స్థానిక గ్యాంగ్ స్టర్ పెంచుతాడు. మార్షల్ ఆర్ట్స్ విద్యలు నేర్పిస్తాడు. అయితే ఓ సారి ఆ మార్షల్ ఆర్ట్స్ స్థావరంపై మరో గ్యాంగ్‌స్టర్ ఎటాక్ చేసి అందరిని చంపేస్తారు. కానీ గాంభీర తప్పించుకుంటాడు. అక్కడ జరిగే ఈ గొడవల కారణంగానే సత్యదాదా(ప్రకాష్ రాజ్) అతని స్నేహితుడు మిరాజ్ కర్(తేజ్ సప్రూ) తప్పించుకుని పారిపోయేందుకు భారీగా బంగారంతో పోర్ట్ కి వస్తారు. అయినా పోర్ట్ లో ఎటాక్ చేస్తారు. ఆ సమయంలో గాంభీర వారిని కాపాడతాడు. దీంతో గాంభీరని తనవెంట ముంబాయి తీసుకొచ్చి పెంచుతాడు సత్యదాదా. ముంబాయిలో పోర్ట్ నిర్మించి మంచి పనులకు ఉపయోగిస్తుంటారు. గాంభీర సహకారంతో తిరుగులేని గ్యాంగ్‌స్టర్‌గానూ ఎదుగుతాడు. ఈ క్రమంలో ఆ పోర్ట్ పై మిరాజ్‌కర్ కన్నుపడుతుంది. స్నేహితుడిని మోసం చేసి పోర్ట్ ని ఛేజిక్కించుకోవాలనుకుంటాడు. ఆ సమయంలోనే గాంభీర వచ్చి సత్యదాదాకి అండగా ఉంటాడు. మిరాజ్‌కర్‌కి ప్రాణభిక్ష పెడతారు. అప్పట్నుంచి ముంబయికి గాంభీర అంటే హడల్. కొన్నేళ్ల వరకు ఎవరూ వారిని టచ్ చేయరు. ఆ తర్వాత రాజకీయ నాయకుడిగా ఎదుగుతాడు మిరాజ్‌కర్. పదే పదే ఆ పోర్ట్ పై కన్నేస్తుంటాడు. ఇక ఆయన కొడుకులు జిమ్మి(సుదేవ్ నాయర్), ఓమీ(ఇమ్రాన్ హష్మి) రంగంలోకి దిగుతారు. పోర్ట్ కి వచ్చిన ఆర్డీ ఎక్స్ కంటెయినర్ కోసం సత్యదాదా చిన్న కొడుకు పార్థు(వెంకట్)ని చంపేస్తాడు జిమ్మి. అల్లకల్లోలం సృష్టిస్తాడు. చివరికి సత్యాదాదాని చంపేందుకు కుట్ర చేస్తారు. కానీ ఆసమయంలో గాంభీర వారి వెంట ఉండదు. ఆయన 15ఏళ్లుగా సత్యదాదాకి దూరంగా భార్య, కూతురుతో నాసిక్‌లో ఉంటాడు. ఇదే అదనుగా భావించి సత్యదాదా పోర్ట్ ని తన కంట్రోల్ లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తారు మిరాజ్‌కర్ గ్యాంగ్. సత్యదాదాపై ఎటాక్ చేస్తారు. మరి ఆయన్ని కాపాడుకునేందుకు గాంభీర వచ్చాడా? గాంభీర గతం ఏంటి? ఆయన ఓజాస్ గాంభీరగా ఎలా మారాడు? జపాన్‌లో ఏం చేశాడు? 15ఏళ్లుగా సత్యదాదాకి దూరంగా ఎందుకు ఉన్నాడు? కన్మణి(ప్రియాంక మోహన్)కి, గాంభీరకి మధ్య లవ్ ట్రాక్ ఏంటి? ఇందులో శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ పాత్రలేంటి? వారికి గాంభీరకి ఉన్న సంబంధం ఏంటి? గాంభీర పేరు చెబితే సీఎం, పోలీసులతో సహా అంతా ఎందుకు బయపడుతున్నారు? గాంభీర తిరిగి ముంబయికి ఎందుకు రావాల్సి వచ్చింది? గాంభీర జీవితంలోని విషాదం ఏంటి? అనేది మిగిలిన సినమా కథ.
`ఓజీ` పూర్తి గ్యాంగ్ స్టర్ మూవీ. పవన్ కళ్యాణ్ `పంజా`లో కొంత వరకు ఈ మాఫియా, గ్యాంగ్ స్టర్ జోనర్‌ని టచ్ చేశారు. కానీ ఇందులో పూర్తిగా గ్యాంగ్ స్టర్ కథగానే తెరకెక్కించారు. ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు అలానే ఉంటుంది. సినిమా మొత్తం యాక్షన్ ప్రధానంగానే సాగుతుంది. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఓ ఎత్తు అయితే, ఈ మూవీ మరో ఎత్తు. పవన్ కళ్యాణ్‌ని ఇలాంటి గ్యాంగ్ స్టర్ చిత్రాల్లో చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆయన ఇమేజ్, ఆయన రేంజ్‌ని ఎలివేట్ చేసే సినిమా కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ కోసం, వారి ఆకలి తీర్చేందుకు వచ్చిన చిత్రమే `ఓజీ`. పవన్ మార్క్ ఎలివేషన్లు, యాక్షన్‌తోనే ఈ సినిమా మొత్తం సాగుతుంది. ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు అదే ఉంటుంది. మధ్య మధ్యలో ఫ్యామిలీ డ్రామా, యాక్షన్ తాలుకూ డ్రామాని జోడించారు. సినిమా ప్రారంభం.. ఓజీ పాత్ర జర్నీని 1940లో ఏం జరిగింది. 1970లో చోటు చేసుకున్న సంఘటనలు, ఆ సమయంలో ఓజీ లైఫ్ ఎలా టర్న్ తీసుకుంది. 1993లో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయనేది ప్రధానంగా చేసుకుని మూడు దశల్లో ఓజీని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. సినిమా ప్రారంభమైన దాదాపు ఇరవై నిమిషాల తర్వాత పవన్ ఎంట్రీ ఉంటుంది. కానీ `కేజీఎఫ్` తరహాలో ప్రారంభం నుంచి ఆయన గురించే చర్చ, ఆయన ఎలివేషన్లతోనే నడుస్తుంది. యాక్షన్ సీక్వెన్స్ తో పవన్ ని చూపించారు. ఆయా ఫైట్ సీన్లు వాహ్ అనేలా ఉంటాయి. రెగ్యూలర్‌కి భిన్నంగా చాలా బాగున్నాయి. ఆకట్టుకునేలా ఉన్నాయి. మొదటి భాగంలో మెయిన్‌గా మూడు యాక్షన్ సీన్లు, మధ్య మధ్యలో చిన్న చిన్న యాక్షన్ సన్నివేశాలుంటాయి. అయితే ప్రతి పది నిమిషాలకు, పదిహేను నిమిషాలకు పవన్ ఎలివేషన్లతో సినిమా సాగుతుంది. ముంబయి పోర్ట్ చుట్టూ, దాన్ని విలన్లు దక్కించుకునేందుకు కుట్ర చేయడం ఓవైపు, పవన్‌కళ్యాణ్ గాంభీర పాత్ర ఎలివేషన్లు మరోవైపు ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ సినిమా సాగుతుంది. ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ మాత్రం వాహ్ అనేలా ఉంది. పూనకాలు తెప్పించింది.
అందులోనే లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ని ఆవిష్కరించారు. అయితే అవి కట్టెకొట్టే తెచ్చే అనేలా ఉన్నాయి. ఆ లవ్ ట్రాక్‌ని ఎస్టాబ్లిష్ చేయలేదు. ఆ ఎమోషన్ ని బిల్డ్ చేయలేదు. ఇంటర్వెల్ తర్వాత సీన్ ఎమోషనల్‌గా ఉంటుంది. గాంభీర జీవితంలో పెద్ద లాస్ కారణంగా ఆయన చాలా బాధపడతాడు. ప్రతీకారం తీర్చుకునేందుకు ముంబయికి రావడం వంటి సీన్లు కాస్త నెమ్మదిగా సాగుతాయి. స్లోగా అనిపిస్తాయి. కూతురు, భార్య ఎమోషన్స్ కొంత టచ్ చేస్తుంది. దీనికితో ఓమీ ఎంట్రీ కూడా అదిరిపోయేలా ఉంది. అనంతరం ఓమీ చేసే కుట్రలు, వాటిని తెలుసుకుని ఆపేందుకు ఓజీ ప్రయత్నించడం వంటిసీన్లు కొంత రొటీన్‌గా అనిపిస్తాయి. ముంబాయిలో ఎటాక్ ప్లాన్స్ వంటివన్నీ రెగ్యూలర్ సినిమాలను తలపిస్తాయి. అయితే ఆయా సీన్లు పెద్దగా లేవు. తన ఫ్యామిలీ విషయంలో ప్రతీకారమనేది బాగా ఎమోషనల్‌గా అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్లు బాగున్నాయి. యాక్షన్ సీన్లు అదిరిపోయాయి. ఇంటర్వెల్ యాక్షన్ సీన్ స్థాయిలో అనిపించలేదు. కొన్ని ట్విస్ట్ లు బాగున్నాయి. ఆకట్టుకున్నాయి. సెకండాఫ్‌ని చాలా వరకు ఎమోషనల్ డ్రైవ్‌తో నడిపించాడు. అది కొంత వరకే వర్కౌట్ అయ్యింది. పవన్ లుక్స్ కి సంబంధించిన సీజీలో మ్యానేజ్ చేయడమనేది తేలిపోయింది. అది సీజీ అని అర్థమవుతుంది. ఇంకోవైపు ప్రారంభం నుంచి సీన్లకి సీన్లకి మధ్య కంటిన్యూటీ దెబ్బతిన్నది. చాలా సీన్లకి క్లారిటీ లేదు. చాలా వరకు కట్, కట్ అనేలానే ఉన్నాయి. దీంతో ఎమోషన్స్ పండలేదు. చాలా చోట్ల డ్రామా కూడా తేలిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. సెకండాఫ్ మరింత డల్‌గా అనిపిస్తుంది. అయితే మధ్య మధ్యలో కూతురు సీన్లు బాగానే వర్కౌట్ అయ్యాయి. క్లైమాక్స్ ని మరింత బాగా డీల్ చేస్తే బాగుండేది. ఓమీ పాత్రని కూడా ఇంకా బాగా చూపించాల్సింది. ఓవరాల్‌గా మాత్రం ఇలాంటి మైనస్‌లు పక్కన పెడితే `ఓజీ` ఫ్యాన్స్ కి పండగ చేసుకునే చిత్రమవుతుంది. ఫ్యాన్స్ కూడా ఇదే అభిప్రాయపడుతున్నారు. ఇంతకంటే ఏం కావాలని, బాక్సాఫీసు షేకే అంటున్నారు. ఇన్నాళ్లకి పవన్‌కి సరైన హిట్ పడిందంటున్నారు.
ఓజాస్ గాంభీరగా పవన్ కళ్యాణ్ అదరగొట్టారు. ఆయన తెరపై కనిపిస్తే పూనకమే అనేలా ఆయన పాత్రని తీర్చిదిద్దాడు సుజీత్. తెరపై కూడా ఆ పాత్ర అంతే బాగా పండింది. ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ లా పవన్ పాత్ర ఉండటం విశేషం. అయితే పవన్ యాక్టింగ్ గురించి ఎవరూపట్టించుకోరు, ఆయన ఎలా కనిపించాడు, ఎలా యాక్షన్‌తో అదరగొట్టాడనేదే ముఖ్యం. ఆ విషయంలో ఫ్యాన్స్ కి పవన్ ఫుల్ మీల్స్ పెట్టాడని చెప్పొచ్చు. ఓమీ పాత్రలో ఇమ్రాన్ హష్మీ రోల్ కూడా స్ట్రాంగ్‌గా ఉంటుంది. కానీ చివర్లో తేలేశాడు. స్టయిలీష్ లుక్‌లో, యాక్షన్‌లో ఇమ్రాన్ అదరగొట్టాడు. సత్యదాదా పాత్రలో ప్రకాష్ రాజ్ ఒదిగిపోయాడు. అంతేబాగా చేసి మెప్పించాడు. అర్జున్ పాత్రలో అర్జున్ దాస్ పాత్ర ఫర్వలేదు. ఆయన పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయి. శ్రీయా రెడ్డి కూడా బలమైన పాత్రలో సత్యదాదా పెద్ద కోడలిగా అదరగొట్టింది. ఆమె పాత్ర ఎలివేషన్లు బాగున్నాయి. ఇక శుభలేఖ సుధాకర్ రోల్ అలరిస్తుంది. పార్థుగా వెంకట్ కాసేపే మెరిశాడు. జిమ్మిగా సుదేవ్ నాయర్ బాగా చేశాడు. ప్రియాంక మోహన్ లవ్ ట్రాక్ చిన్నగానే ఉంది. పవన్, ఆమె మధ్య సీన్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. కాకపోతే వీరి మధ్య బాండింగ్‌ని ఎస్టాబ్లిష్ చేసేలా సీన్లు ఉంటే బాగుండేది. మిరాజ్‌కర్ గా తేజ్ సప్రూ ఉన్నంతలో మెప్పించారు. మిగిలిన పాత్రలు ఓకే అనిపిస్తాయి. అయితే సినిమాలో పవన్ ముందు ఏ పాత్ర నిలవలేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సింపుల్‌గా చెప్పాలంటే `ఓజీ` పవన్ ఎలివేషన్లు, యాక్షన్ సీన్లు, తమన్ బీజీఎం కలిపితే అరాచకం.
`ఓజీ` మూవీ టెక్నీకల్‌గా సాలిడ్‌గా ఉంది. దీనికి ఎస్‌ఎస్ థమన్ సంగీతం అందించారు. ఆయన మ్యూజిక్ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్‌గా చెప్పొచ్చు. పాటలు ఆకట్టుకున్నాయి. బీజీఎం అదిరిపోయింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎలివేషన్లలో తమన్ బీజీఎం దుమ్ములేపింది. సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఫస్టాఫ్‌లో యాక్షన్ సీన్లు పీక్‌లో అనిపిస్తాయంటే తమన్ సంగీతమే కారణం. యాక్షన్ సీన్లలో, ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్, క్లైమాక్స్ లో పూనకాలు తెప్పించిందని చెప్పొచ్చు. బీజీఎం వల్లే సినిమా నెక్ట్స్ లెవల్‌కి వెళ్లింది. అడగడుగునా పవన్ ఎలివేషన్లు మతిపోగొట్టేలా ఉంది. సినిమాకి అసలైన హీరో తమనే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. రవి కె చంద్రన్, మనోజ్ కెమెరా వర్క్ సైతం బాగుంది. విజువల్స్ కనువిందుగా ఉన్నాయి. నైట్ షాట్స్, బ్లాక్ టోన్‌లో విజువల్స్ సరికొత్తగా ఉన్నాయి. మాస్ ఆడియెన్స్ కి ఫీస్ట్ లా ఉన్నాయి. ఇక నవీన్ నూలి ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. తన బెస్ట్ ఇచ్చారని అర్థమవుతుంది. డీవీవీ దానయ్య నిర్మాణ విలువలకు కొడవలేదు. దర్శకుడు సుజీత్.. పవన్ కళ్యాణ్‌కి అభిమాని. ఆ అభిమానం తెరపై కనిపిస్తుంది. ప్రతి ఫ్రేములోనూ కనిపిస్తుంది. పవన్‌ని ఓ రేంజ్‌లో చూపించాడు. పవన్ షాట్స్ ముఖ్యంగా వాహ్ అనిపించాయి. పూనకాలు తెప్పించాయంటే అందులో సుజీత్ అభిమానం స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో కథ పెద్దగా ఆశించలేం. హీరో క్యారెక్టరైజేషన్ మెయిన్‌గా సినిమా సాగుతుంది. ఎలివేషన్లకి, యాక్షన్ సీన్లకి ప్రయారిటీ ఇస్తూ సినిమాని తెరకెక్కించారు. అదే సమయంలో మధ్యలో ఫ్యామిలీ ఎమోషన్స్ కి కూడా ప్రయారిటీ ఇచ్చారు. ఆ ఎమోషన్స్ విషయంలో మరింత వర్కౌట్ చేయాల్సింది. సినిమా కంటిన్యూటీ విషయంలో కేర్ తీసుకోవాల్సింది.
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఫీస్ట్. కొన్నేళ్లుగా ఆకలితో ఉన్న వారి ఆకలి తీర్చే సినిమా అవుతుంది. ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఎలివేషన్లు, యాక్షన్ సీన్లలో తమన్ బీజీఎం కోసమైనా మూవీ చూడొచ్చు.ఫైనల్‌గా యాక్షన్ లవర్స్, పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకునే మూవీ.
కండీషన్‌ః కథ, లాజిక్ లు మాత్రం అడగొద్దు.
రేటింగ్‌ః 3