`నింద` మూవీ రివ్యూ, రేటింగ్‌

వరుణ్‌ సందేశ్‌ సక్సెస్‌ స్ట్రగుల్‌ అవుతున్నాడు. ఈ క్రమంలో ఆయన `నింద` అనే క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ చిత్రంతో వచ్చాడు. ఈ మూవీ శుక్రవారం విడుదలైంది. ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

వరుణ్‌ సందేశ్‌ అంటే `హ్యాపీడేస్‌`, `కొత్త బంగారులోకం` చిత్రాలే గుర్తుకు వస్తాయి. ఆయన బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్లు కొట్టి యూత్‌కి బాగా దగ్గరయ్యాడు. `ఎవరైనా ఎప్పుడైనా`, `ఏమైంది ఈ వేళా` వంటి చిత్రాలతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వరుణ్‌ సందేశ్‌కి విజయాలు దక్కలేదు. చాలా ప్రయత్నాలు చేసినా మళ్లీ బ్రేక్‌ ఇచ్చే చిత్రం పడలేదు. దీంతో కొన్నాళ్లు సినిమాలకు కూడా బ్రేక్‌ ఇచ్చాడు. రెండేళ్ల క్రితం `ఇందువదన` సినిమాతో కమ్‌ బ్యాక్‌ అయ్యాడు. ఆ మూవీ కూడా ఆడలేదు. గతేడాది సందీప్‌ కిషన్‌తో `మైఖేల్‌` మూవీలో నటించాడు. అయినా సక్సెస్‌ దక్కలేదు. ఈ క్రమంలో ఇప్పుడు మరో విభిన్నమైన కథా చిత్రంతో వచ్చాడు. `నింద` అనే సినిమాతో మళ్లీ వచ్చాడు. రియల్‌ ఇన్సిడెన్స్ ఆధారంగా రూపొందిన మూవీ ఇది. రాజేష్‌ జగన్నాథం దర్శకత్వంలో  ఫెర్వెంట్‌ ఇండీ ప్రొడక్షన్‌ పతాకంపై ఈ సినిమా రూపొందింది. నేడు శుక్రవారం విడుదలైంది. మరి వరుణ్‌ సందేశ్‌కిది బ్రేక్‌ ఇచ్చిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

కథః
కాండ్రకోట అనే గ్రామంలో మంజు అనే అమ్మాయి హత్యకు గురవుతుంది. ఆ హత్య బాలరాజు(ఛత్రపతి శేఖర్‌) చేశాడని కోర్ట్ లో నిరూపితం కావడంతో జడ్జ్ సత్యానంద్‌(తనికెళ్ల భరణి) అతనికి ఉరిశిక్ష వేస్తాడు. బాలరాజు ఆ నేరం చేయలేదని జడ్జ్ నమ్ముతాడు. కానీ తీర్పు వెల్లడించాడు. కానీ ఆయనలో మాత్రం ఆ బాధ ఉండిపోతుంది. పైగా అదే చివరి తీర్పు. అనంతరం రిటైర్మెంట్‌ అవుతాడు. ఈ బాధని తన కొడుకు వివేక్‌(వరుణ్‌ సందేశ్‌)తో పంచుకుంటాడు. అతను నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్ కమిషనర్‌గా పనిచేస్తుంటాడు. తన తండ్రి కోరిక మేరకు బాలరాజుకి న్యాయం చేయాలని, ఉరిశిక్ష పడకుండా చేయాలని నిర్ణయించుకుని తనే రంగంలోకి దిగాడు. కాండ్రకోట గ్రామానికి వెళి ఈ కేసుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్నవారిని కిడ్నాప్‌ చేసి రహస్యంగా విచారిస్తాడు. అందుకు ఓ కొత్త గేమ్‌ ప్లాన్‌ చేస్తాడు. మరి ఆ గేమ్‌ ఏంటి? ఎందుకు ఆయన అలా చేయాల్సి వచ్చింది. ఇంతకి మంజుని చంపిందెవరు? బాలరాజుని ఇరికించింది ఎవరు? క్లైమాక్స్ లో వచ్చే అదిరిపోయే ట్విస్ట్ ఏంటి? మంజు మరణంతో ఆమె ఫ్రెండ్‌ సుధా(అన్నీ) ఏం చేసింది? బాలరాజుకి న్యాయం జరిగిందా? వివేక్‌కి తెలిసిన షాకింగ్‌ నిజం ఏంటి? అనేది ఈ మూవీ మిగిలిన కథ. 
 


విశ్లేషణః
`నింద` సినిమా యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించిన మూవీ. దోషులు తప్పించుకున్నా ఫర్వాలేదుగానీ, ఒక్క నిర్ధోషికి కూడా శిక్ష పడకూడదని, మన చట్టాలు, రాజ్యంగం చెబుతుంది. `నింద` సినిమా కథ కూడా అదే. మంచోడికి న్యాయం జరుగుతుందని నమ్మకం పోయిన రోజు, ఒక సమాజం చనిపోయినట్టే అవుతుందనే సినిమా డైలాగ్‌ మారిదిగానే నిర్దోషికి శిక్ష వేసినందుకు జడ్జ్ పడే బాధని, నిర్ధోషికి శిక్షపడకూడదని హీరో చేరే ప్రయత్నాన్ని ఇందులో చూపించారు. మర్డర్‌ మిస్టరీ నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా `నింద` సినిమాని నడిపించాడు. కథ పరంగా ఇది చాలా యూనిక్‌ పాయింట్‌. చాలా కొత్తగా, ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. ఇన్వెస్టిగేషన్‌ ప్రాసెస్‌కూడా కొత్తగా రాసుకున్నారు. ఈ విషయంలో దర్శకుడు రాజేష్‌ జగన్నాథంని అభినందించాల్సిందే. ఇటీవల కాలంలో ఇలాంటి సినిమా రాలేదని చెప్పొచ్చు. అయితే జనరల్‌గా ఇలాంటి సినిమాలను కోర్ట్ రూమ్‌ డ్రామాగా చూపిస్తారు. కానీ దీన్ని అందుకు భిన్నంగా చూపించడమే ఇందులో ప్రత్యేకత. కేసుకు సంబంధించిన తీర్పు వచ్చాక, అది ఉరి శిక్షపడిన తర్వాత కూడా న్యాయం కోసం పోరాడవచ్చు అనేది ఈ సినిమా ద్వారా చూపించారు. రీ ఇన్వెస్టిగేషన్‌లో కొత్త కోణం బయటపెట్టిన చిత్రమిది. 
 

సినిమాగా చూస్తే, ప్రారంభంలో మంజు హత్య కేసుతో సంబంధం ఉన్నవాళ్లని, ఎస్‌ఐ, లాయర్‌, సాక్షులను, బాలరాజు దగ్గర వాళ్లని కిడ్నాప్‌ చేసి హీరో రహస్యంగా థ్రిల్లర యాంగిల్‌లో ఇన్వెస్టిగేట్‌ చేస్తుంటాడు. ఆ ఎపిసోడ్‌ కొత్తగా ఉంటుంది. ఏం జరుగుతుందో అనే ఉత్కంఠగా అనిపిస్తుంది. హీరోని చాలా సేపు వరకు రివీల్‌ చేయకుండా సస్పెన్స్ లో పెట్టిన తీరు, ఆ తర్వాత టైమ్‌ వచ్చినప్పుడు ఆయన ఫేస్‌ని రివీల్‌ చేసిన తీరు బాగుంది. ఈ క్రమంలో కేసుకు సంబంధించిన వాళ్లని రహస్యంగా విచారించిన తీరు ప్రారంభంలో ఇంట్రెస్టింగ్‌గా అనిపించినా, ఆ తర్వాత ఆ కిక్‌ పోయింది. స్లోగా, సాగదీతగా అనిపించడంతో బోర్‌ తెప్పిస్తుంది. మరోవైపు ఆయా సీన్లు కూడా సహజంగా అనిపించేలా లేవు. కానీ ఫ్లాష్‌ బ్యాక్‌ రివీల్‌ అయ్యే కొద్ది సినిమాపై ఆసక్తి ఏర్పడుతుంది. వరుణ్‌ సందేశ్‌, తండ్రి తనికెళ్ల భరణి మధ్య వచ్చే సన్నివేశాలు కాస్త ఎమోషనల్‌గా ఉంటాయి. అనంతరం బాలరాజు కేసు ఊపందుకుంటుంది. కేసుకి సంబంధించి వరుణ్‌ సందేశ్‌ చేసే డైరెక్ట్ ఇన్వెస్టిగేషన్‌లో ఒక్కో కొత్త కోణం బయటకు వస్తుంది. మంజు, మనోహన్‌ ల ప్రేమ కథ, సుధా స్నేహం రివీల్‌ అవుతుంది. వీరితోపాటు ఆ ఊర్లో ఎస్‌ఐ, సర్పంచ్‌, చంటి, దివాకర్‌ పాత్రల విచారణలో బయటకు వచ్చే కొత్త విషయాలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతాయి. బాలరాజుని ఎవరు ఇరికించారు, ఎలా ఇరికించారు అనే అంశాలు ఒక్కోటి రివీల్‌ అవుతున్న కొద్ది ఎంగేజింగ్‌గా సాగుతుంది. ఇక క్లైమాక్స్ మాత్రం వేరే లెవల్‌లో ప్లాన్‌ చేశారు. చివర్లో వచ్చే ట్విస్ట్ నిజంగా అందరికి షాకిచ్చేలా ఉంటుంది. ఆడియెన్స్ కి అదొక ఊహించని సర్‌ప్రైజింగ్‌ ఎలిమెంట్‌ అని చెప్పొచ్చు. 
 

సినిమా కథగా బాగుంది. కానీ కథనాన్ని నడిపించే విషయంలో దర్శకుడు తడబడ్డారు. స్క్రీన్‌ ప్లే గ్రిప్పింగ్‌ రాసుకోలేకపోయాడు. సీన్లలో సహజత్వం మిస్‌ అయ్యింది. సీన్‌ బై సీన్‌ కొంత లింక్‌ మిస్‌ అయ్యింది. ప్రారంభంలో ఇన్వెస్టిగేషన్‌ బోర్‌ తెప్పిస్తుంది. అలాగే వరుణ్‌ సందేశ్‌, తనికెళ్ల భరణిల మధ్య వచ్చే ఎమోషనల్‌ సీన్లు బాగున్నా, బాలరాజు కేసుకు సంబంధించిన సీన్లు పండలేదు. కాస్త బలవంతంగా ఇరికించినట్టుగానే ఉంటుంది. అంతేకాదు ఈ కేసు విచారణలో వరుణ్‌ సందేశ్‌.. ఆ కిడ్నప్‌ డ్రామా, దాని ప్రాసెస్‌ కూడా చూడ్డానికి కొత్తగా ఉన్నా, కన్విన్సింగ్‌గా అనిపించలేదు.  కేసు విచారణ ఎంగేజింగ్‌గా, రేసీగా ఉంటే బాగుండేది.కేసులు నత్తనడక సాగినట్టుగానే ఆ విచారణ చేసిన తీరు కూడా అలానే అనిపిస్తుంది. ఆయా సీన్లు ఏమాత్రం పండలేదు. కాకపోతే ఫ్లాష్‌ ఎపిసోడ్స్ బాగున్నాయి. ఈ విషయాల్లో దర్శకుడు మరింత దృష్టిపెట్టాల్సింది. ఇక వరుణ్‌ సందేశ్‌ కూడా తన మార్క్ ఏం చూపించలేకపోయాడు. ఆయన పాత్రలో హీరోయిజం లేదు, సాధారణ ఇన్వెస్టిగేటివ్‌గానే కనిపిస్తాడు. ఆ పాత్ర ఎవరూ చేసినా పెద్దగా తేడా ఉండదు, ఆ విషయంలో వరుణ్‌ తన మార్క్ చూపించేలా పాత్రని డిజైన్‌ చేయాల్సి ఉంది. మరోవైపు మధ్య మధ్యలో వచ్చే ట్విస్ట్ లు కూడా సింపుల్‌గా చూపించాడు. ఇంటర్వెల్‌ బ్యాంగ్ ని కూడా సింపుల్‌గా వదిలేశాడు. ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే సినిమా ఫలితం అదిరిపోయేది. ఓవరాల్‌గా మాత్రం ఇదొక కొత్త తరహా మూవీ అవుతుంది. 
 

నటీనటులుః 

వివేక పాత్రలో వరుణ్‌ సందేశ్‌ ఉన్నంతలో బాగా చేశాడు ఆయన పాత్ర సింపుల్‌గా, అందరిలో ఒకరి పాత్రలాగే సాగుతుంది. ఆయన మార్క్ హీరోయిజం చూపించేలా పాత్ర లేదు. కానీ ఉన్నంత వరకు సెటిల్డ్ గా చేశాడు. ఓ కొత్త లుక్‌లో, కొత్త స్టయిల్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు. మంజు ఫ్రెండ్‌గా సుధా పాత్రలో అన్నీ కనిపించింది. ఆమె పాత్రనే ఈ సినిమాకి హైలైట్‌ పాయింట్‌ గా నిలుస్తుంది. డిఫరెంట్‌ షేడ్స్ లో మతిపోగొట్టింది. ఆమె పాత్రలో ట్విస్ట్ మైండ్‌ బ్లోయింగ్‌ అనిపించేలా ఉంటుంది. బాలరాజు పాత్రలో ఛత్రపతి శేఖర్‌ బాగా చేశారు. ఆయన పాత్ర మరో హైలైట్‌ గా నిలుస్తుంది. జడ్జ్ గా తనికెళ్ల భరణి ఉన్నంత సేపు ఆకట్టుకున్నాడు. ఆయన పాత్రలో ఎమోషనల్‌ సైడ్‌ చూపించాడు. వీరితోపాటు భద్రమ్‌, సూర్య కుమార్‌, మైమ్‌ మధు, సిద్ధార్థ్‌ గొల్లపూడి, అరుణ్‌ దలై, శ్రేయా రాణి రెడ్డి, క్యూ మధు వంటి వారంతా తమ పాత్ర పరిధి మేరకు మెప్పించారు. 
 

టెక్నీకల్‌గాః
రమీజ్‌ నవీత్‌ కెమెరా వర్క్‌ బాగుంది. కెమెరా యాంగిల్స్ కూడా కొత్తదనం చూపించాడు. విజువల్స్ పరంగా సినిమా డీసెంట్‌గా ఉంద. సంతు ఓంకార్‌ మ్యూజిక్‌ ఫర్వాలేదు. బీజీఎం మాత్రం ఆకట్టుకునేలా ఉంది. చాలా సందర్భాల్లో సీన్లని ఎలివేట్‌ చేసేలా ఉంది. కానీ కొన్ని సీన్లు ఎలివేషన్‌ స్థాయిలో లేవు. ఎడిటింగ్‌ పరంగా అనిల్‌ కుమార్‌ మరింత కేర్‌ తీసుకోవాల్సింది. రేసీగా నడిపించడంలో ఆయన ఎడిటింగ్‌ ఉండే బాగుండేది. నిర్మాణ విలువల కథ డిమాండ్‌ మేరకు పెట్టారు. ఆ విషయంలో కొరతలేదు. ఇక దర్శకుడు రాజేష్‌ జగన్నాథ్‌ ఎంచుకున్న పాయింట్‌ బాగుంది. చాలా బలంగానూ ఉంది. దాన్ని నడిపించిన తీరు కూడా బాగుంది. కానీ ఎంగేజింగ్‌గా తీసుకెళ్లడంలోనే ఆయన అనుభవలేమి కనిపిస్తుంది. స్క్రేన్‌ ప్లేని గ్రిప్పింగ్‌గా, బలంగా తీస్తే నిజంగా సినిమా అదిరిపోయేది. అందరి చేత వాహ్‌ అనిపించేది. కానీ మంచి ప్రయత్నంగా ఈ మూవీ నిలుస్తుంది. ప్రశంసించేలా ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

ఫైనల్‌గాః `నింద` యూనిక్‌ పాయింట్‌ పాయింట్‌తో వచ్చిన క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌. క్లైమాక్స్ మాత్రం కేక. 
రేటింగ్‌ః 2.5

నటీనటులు: వరుణ్ సందేశ్, అన్నీ, తనికెళ్ల భరణి, భద్రమ్, సూర్య కుమార్, చత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్ధార్థ్ గొల్లపూడి, అరుణ్ దలై, శ్రేయా రాణి రెడ్డి, క్యూ మధు, శ్రీరామ్ సిద్దార్థ కృష్ణ, రాజ్ కుమార్ కుర్ర, దుర్గా అభిషేక్ తదితరులు.

సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్
రచయిత, దర్శకుడు మరియు నిర్మాత: రాజేష్ జగన్నాధం
సంగీతం: సంతు ఓంకార్
కెమెరామెన్: రమీజ్ నవీత్
ఎడిటింగ్: అనిల్ కుమార్
సాహిత్యం: కిట్టు విస్సాప్రగడ
కాస్ట్యూమ్ డిజైనర్: అర్చన రావు
సౌండ్ డిజైనర్: సింక్ సినిమా
PRO: ఎస్ఆర్ ప్రమోషన్స్ (సాయి సతీష్)
 

Latest Videos

click me!