విజయ్‌ సేతుపతి `మహారాజ` మూవీ తెలుగు రివ్యూ, రేటింగ్‌

First Published | Jun 14, 2024, 8:05 PM IST

విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి హీరోగా నటించిన మూవీ `మహారాజ`. తమిళంలో రూపొందిన ఈ మూవీ తెలుగులోనూ అదే పేరుతో విడుదలవుతుంది. నేడు రిలీజ్‌ అయిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

విజయ్‌ సేతుపతి విలక్షణ నటుడు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా ఇలా ఎలాంటి పాత్ర అయినా అవలీలగా చేయగలడు. ప్రస్తుతం ఇలాంటి పాత్రలు చేస్తున్న నటుల్లో ఆయనే ముందు వరుసలో ఉంటారు. `సైరా నరసింహారెడ్డి`, `ఉప్పెన`, `మైఖేల్‌` చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకున్నాడు విజయ్‌ సేతుపతి. `ఉప్పెన`లో ఆయన హీరోయిన్‌ తండ్రిగా అదరగొట్టాడు. అంతేకాదు కమల్‌ హాసన్‌ `విక్రమ్‌`లో నెగటివ్‌ రోల్‌తోనూ దుమ్ములేపాడు. ఇప్పుడు ఆయన హీరోగా తమిళంలో ఓ మూవీ తెరకెక్కింది. దాన్ని `మహారాజ`గా తెలుగులో డబ్‌ చేసి రిలీజ్‌ చేశారు. ఇందులో విజయ్‌ సేతుపతితోపాటు అనురాగ్‌ కశ్యప్‌, మమతా మోహన్‌ దాస్‌, భారతీరాజా కీలక పాత్రలు పోషించారు. నితిలన్‌ సామినాథన్‌ దర్శకత్వం వహించారు. నేడు శుక్రవారం ఈ మూవీ విడుదలైంది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 
 

కథః 
మహారాజ(విజయ్‌ సేతుపతి) బార్బర్‌ షాప్‌ నిర్వహిస్తుంటాడు. ప్రమాదంలో భార్య చనిపోతుంది. కూతురు జ్యోతిని చెత్తబుట్ట కాపాడుతుంది. దీంతోదానికి లక్ష్మి అని పేరు పెట్టి ప్రతి వారం కడిగి పూజ చేస్తుంటారు. కూతురు జ్యోతితో కలిసి ఊరికి దూరంగా జీవిస్తుంటాడు. బార్బర్‌ షాప్‌లో పనిచేసిన ఆయన ఆ తర్వాత సొంతంగా కటింగ్ షాప్‌ పెట్టుకుంటాడు. తన కూతురు స్పోర్ట్స్ కోసం బెంగుళూరు క్యాంప్‌కి వెళ్తుంది. దీంతో ఒక్కడే ఉంటాడు. ఓ రోజులో ఇంట్లో దొంగతనం జరుగుతుంది. ఆ సమయంలో తన లక్ష్మి(చెత్తబుట్ట)ని ఎత్తుకుపోతారు దొంగలు. దీంతో తన లక్ష్మిని ఎవరో ఎత్తుకు పోయారని చెప్పి పోలీస్‌ స్టేషన్‌కి వస్తాడు మహారాజ. అక్కడ ఆయన చెప్పే కథ విని పోలీసులు నవ్వుకుంటారు. ఆ తర్వాత చిరాకు పడి కొడతారు. అయినా తన లక్ష్మి కావాలని మొండికేస్తాడు మహారాజ. ఇన్‌స్పెక్టర్‌ వచ్చాక తన లక్ష్మిని పట్టిస్తే ఏడు లక్షలు ఇస్తానని ఆఫర్‌ ఇస్తాడు. దీంతో ఆ చెత్తబుట్టని కనిపెట్టే పనిలో పోలీసులు బిజీ అవుతారు. దీనికోసం రెండు టీములుగా విచారణ కూడా జరుగుతుంది. అది దొరక్కపోవడంతో సేమ్‌ అలానే ఓ చెత్తబుట్టని తయారు చేస్తారు. ఓ దొంగ దాన్ని ఎత్తుకుపోయాడని చెప్పి పోలీసులు ఓ దొంగకి ఆ పని అప్పగిస్తారు. అతను ఆ దొంగ చెత్తబుట్ట తెచ్చి ఇస్తున్నట్టుగా, తప్పు అయ్యిందని క్షమాపణలు చెప్పేలా డ్రామా ప్లాన్‌ చేస్తారు పోలీసులు. కానీ ఆ చెత్తబుట్టని కనిపెట్టే పనిలో పోలీసుల విచారణ ఓ షాకింగ్‌ విషయం బయటపడుతుంది. ఆ ట్విస్ట్ ఏంటి? బెంగుళూరు నుంచి వచ్చిన కూతురు జ్యోతికి ఏమైంది? మహారాజా చెత్త బుట్ట కోసం ఎందుకు అంతగా ప్రయారిటీ ఇస్తున్నాడు? ఇందులో అనురాగ్‌ కశ్యప్‌ పాత్ర ఏంటి? ఈ కేసుకి ఆయనకు సంబంధం ఏంటి? ఆయన కథేంటి? చివరికి ఈ సినిమా కథ ఏ తీరం చేరిందనేది సినిమాలో చూడాల్సిందే. 
 


విశ్లేషణః
విజయ్‌ సేతుపతి సినిమా అంటే మినిమమ్‌ గ్యారంటీ. ఆయన సినిమాల్లో బలమైన కథ ఉంటుంది, ఆయన పాత్ర అంతే బలంగా ఉంటుంది. ఆడియెన్స్ పై ప్రభావం చూపేలా ఉంటాయి. ఆయన్నుంచి వస్తోన్న సినిమా అంటే మంచి అంచనాలుంటాయి. డిజప్పాయింట్‌ చేయదనే ఫీలింగ్‌ కలుగుతుంది. తాజాగా ఆయన `మహారాజ` అనే సినిమాతో వచ్చాడు. ఆద్యంతం సస్పెన్స్ తో సాగే యాక్షన్‌ మూవీ ఇది. అలాగని యాక్షన్‌ ఓవర్‌ డోస్‌ ఉండదు, ఎంత అవసరమో అంతే ఉంటుంది. సరికొత్త స్క్రీన్‌ప్లేతో(నాన్‌ లీనియర్‌ నరేటివ్స్) సాగే మూవీ ఇది. సినిమాని చాలా తెలివిగా నడిపించడం. సినిమాలో రెండు మూడు ఫ్లాట్స్ ఉంటాయి. అవన్ని ఒకేచోట కలుస్తాయి, ఒకే పాయింట్‌తో ముడిపడి ఉంటాయి. ఆ చివరి పాయింట్‌ వరకు వెళ్లే క్రమంలో అనేక మలుపులు, ట్విస్టులు చోటు చేసుకుంటాయి. అర్థమైనట్టుగా ఉంటుంది, అర్థం కాదు, కొత్త ట్విస్ట్ లు వస్తుంటాయి, కొత్త పాత్రలు వస్తుంటాయి. ఇలా ఒక్కోటి రివీల్‌ అవుతుంది. కన్‌ఫ్యూజ్‌ చేస్తుంది. ఫైనల్‌గా అన్ని ఒకేచోట కలిసి క్లారిటీ ఇస్తుంది. ఓహో.. ఇదా జరిగింది అని ఆడియెన్స్ ఫీలయ్యేలా చేస్తాయి. `మహారాజ` సినిమా విషయంలో దర్శకుడు సేమ్‌ అదే చేశాడు. అనేక మలుపులు, ట్విస్ట్ లు, టర్న్ లు తిప్పి ఓ చోట కలిపి ట్విస్ట్ లకే ట్విస్ట్ ఇచ్చి గుండె బరువెక్కించి వదిలేశాడు. 
 

సినిమాలో మహారాజ తన లక్ష్మి చెత్త బుట్ట పోయిందని పోలీస్‌ స్టేషన్‌లో కంప్లెయింట్‌ ఇవ్వడానికి రావడం, ఆయన చెప్పిన తీరు నవ్వులు పూయించేలా ఉంటాయి. సినిమా సీరియస్‌గా సాగుతుంది, కానీ ఆయా సీన్లు మాత్రం కామెడీగా ఉంటాయి. ఫస్టాప్‌ అంతా పోలీస్‌ స్టేషన్‌లో కామెడీ ఆద్యంతం కామెడీని పంచుతుంది. మరోవైపు ఓ దొంగ పోలీస్‌ పేరుతో చేసే రచ్చ అదిరిపోయింది. కాకపోతే సినిమా కాస్త స్లోగా అనిపిస్తుంది. ఎంతసేపు అక్కడక్కడే తిరిగిన ఫీలింగ్‌ కలుగుతుంది. నెక్ట్స్ ఏం జరగబోతుందో అనే క్యూరియాసిటీ కూడా కలుగుతుంది. ఈ క్రమంలో సంబంధం లేని పాత్రలు ఎంటర్‌ అవుతుంటాయి. ఓ కన్‌ఫ్యూజన్‌ క్రియేట్‌ అవుతుంది. మహారాజ వైపు కథ నడుస్తుండగా, సంబంధం లేని సీన్లు రావడంతో ఏం అర్థం కాని పరిస్థితి నెలకొంటుంది. మరోవైపు మధ్య మధ్యలో గతంలోకి వెళ్లి సీన్లు చూపిస్తుంటాడు. ఓ వైపు ప్రస్తుతం నడుస్తూనే తెలియకుండానే ఫ్లాష్‌ బ్యాక్‌లు చూపిస్తుంటాడు. దీంతో ఏం జరుగుతుందో ఓ డైలమాతోపాటు క్యూరియాసిటీ నెలకొంటుంది. అదే ఈ సినిమా ప్రత్యేకత. సినిమా మొత్తం లక్ష్మి అనే చెత్త బుట్ట చుట్టూతే తిప్పడం ప్రారంభంలో కామెడీగా అనిపించినా, అది కాసేపు అయ్యాక ఆ క్యూరియాసిటీ మిస్‌ అవుతుంది. ఏంది రా ఈ గోల అనే పోలీస్‌ స్టేషన్‌లో పోలీసులు ఫీల్‌ అయినట్టే ఆడియెన్స్ కూడా అదే ఫీలింగ్‌ కలుగుతుంది. కానీ మధ్యలో ఓ కుర్రాడిని విజయ్‌ సేతుపతి చంపడంతో ఒక్కసారి ఝలక్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. ఆ యాక్షన్‌ సీన్లు చాలా ఇంటెన్స్ గా ఉంటాయి. చెత్త బుట్ట మాత్రమే కాదు, ఇంకా ఏదో ఉందనే అనుమానాలు రేకెత్తిస్తుంటాయి. 
 

సినిమాలో అనురాగ్‌ కశ్యప్‌ దొంగతనానికి సంబంధించిన సీన్లు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. చాలా క్రూరంగా అనిపిస్తాయి. ఆయన దొంగతనం చేస్తూ, ఇంట్లో ఏం తెలియని అమాయకుడిలా నటించిన తీరు వాహ్‌ అనిపిస్తుంది. కానీ అంతలోనే అనురాగ్‌ కశ్యప్‌ పాత్ర, మహారాజ పాత్రలు కలిసినప్పుడు స్క్రీన్‌ ప్లే ఉత్కంఠరేపుతుంది. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను ఒక్కోటి రివీల్‌ చేస్తూ వెళ్తాడు దర్శకుడు. మళ్లీ ఓ కన్‌ఫ్యూజన్‌ అనిపిస్తుంది. ముందు వెనక్కి వెళ్లే కొద్ది, ఏది ప్రస్తుతం, ఏది గతం అనే కన్‌ఫ్యూజన్‌ ఏర్పడింది. ఇంటలిజెంట్‌ స్క్రీన్‌ ప్లే మరి ఓవర్‌ డోస్‌లో, మరీ అతిగా మారిన ఫీలింగ్‌ కలుగుతుంది. ఓ వైపు ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. మరోవైపు కన్‌ఫ్యూజన్‌ ఏర్పడుతుంది. అనేక ప్రశ్నలు ఎదరవుతుంటాయి, అనేక కొత్త అంశాలు వస్తుంటాయివాటికి క్లైమాక్స్ లో అదిరిపోయే ట్విస్ట్ లతో సమాధానం చెప్పాడు దర్శకుడు. అది వాహ్‌ అనిపిస్తుంది. కానీ చాలా లాజిక్‌ లేని సీన్లు ఉంటాయి. దర్శకుడు చేసుకుంటూ వెళ్లాడు, మనమే అర్థం చేసుకోవాలి, ఓహో ఇది అక్కడ సీనా? ఇది ఇక్కడి సీనా? అని అంచనా వేసుకోవాలి. అప్పుడే మాత్రమే ఈ సినిమా అర్థమవుతుంది. మరోవైపు చాలా సీన్లకి లాజిక్‌ లేదు. పాము ఎపిసోడ్‌లో ఏం చెప్పాలనుకున్నాడో క్లారిటీ లేదు, ఇంట్లో తాను పడిపోయినట్టు చూపించాడు, ఆ సీన్‌కి జస్టిఫికేషన్‌ లేదు, అత్యాచార ఘటనలో దోషులను ఎలా గుర్తించాడనేది క్లారిటీ లేదు. అంతేకాదు అత్యాచార ఘటన రివేంజ్‌ తీసుకోవాలనుకున్నప్పుడు దాన్నే హైలైట్‌ చేయోచ్చు, దాన్ని ఎందుకు హైలైట్‌ చేయలేదనేది మిస్టరీగానే ఉండిపోతుంది. 
 

నటీనటులుః
విజయ్‌ సేతుపతి నటనలో ఇండియాలో ఒక బెస్ట్ యాక్టర్స్ లో ఒకరిగా నిలుస్తారు. ఎలాంటి పాత్రల్లో అయినా ఆయన ఇట్టే పరకాయ ప్రవేశం చేయగలడు. ఇందులో బార్బర్‌గా ఒదిగిపోయాడు. బార్బర్స్ ఎంత మోటుగా ఉంటారో, ఎలా బిహేవ్‌ చేస్తారో అనేది చాలా డిటెయిలింగ్‌గా తన పాత్రలో ఆవిష్కరించాడు విజయ్‌ సేతుపతి. ఇన్నోసెంట్‌గా, కడుపులో బాధని దిగమింగుకుని ఉన్న వ్యక్తిగా డిఫరెంట్‌ వేరియన్స్ చూపిస్తూ అదరగొట్టాడు. సినిమా మొత్తంలో ఆయన పాత్రనే హైలైట్‌. అంతేబాగా నటించి మెప్పించాడు. విశ్వరూపం చూపించాడు. మరోవైపు బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తనలోని విలనిజం మరోసారి చూపించాడు. యాప్ట్ అయిన పాత్రలో ఒదిగిపోయాడు. దొంగగా, ఇన్నోసెంట్‌ గా ఆయన కూడా అదరగొట్టాడు. భారతీరాజా కాసేపు మెప్పించాడు. పోలీసులుగా నటరాజ, మునీష్‌ కాంత్‌, అరుల్‌ దాస్‌ బాగా నటించారు. అనురాగ్‌ కశ్యప్‌ భార్యగా అభిరామి, కోచ్‌గా మమితా మోహన్‌ దాస్‌ కాసేపు మెరిశారు. 

టెక్నీకల్‌గాః
సినిమాలో దినేష్‌ పురుషోత్తమన్‌ కెమెరా విజువల్స్ బాగున్నాయి. చూపించిన యాంగిల్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. దీంతోపాటు అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం ఫర్వాలేదు. బీజీఎం చాలా బాగుంది. అదే ఈ సినిమాకి పెద్ద అసెట్‌. ఇంటెన్సిటీని క్యారీ చేయడంలో బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ కీలక పాత్ర పోషిస్తుంది. మరోవైపు ఎడిటింగ్‌ చాలా టిఫికల్‌ విషయం. చాలా బాగా చేశాడు. కానీ ఇంకాస్తస్పష్టత అవసరం. ఇక దర్శకుడు నితిలన్‌ స్వామినాథన్‌ స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌ ఈ మూవీకి పెద్ద హైలైట్‌. అదే మైనస్‌ కూడా. ఇంటలిజెన్స్ ఎక్కువ కావడం వల్ల కన్‌ఫ్యూజన్‌ క్రియేట్‌ అవుతుంది. ఈ సినిమా విషయంలో అదే జరిగింది. చాలా వరకు ఓకే అనిపించినా, ఏదో కన్‌ఫ్యూజన్‌ వెంటాడుతూనే ఉంటుంది. సినిమా అంటే వినోదం అనే భావనతో వచ్చినవాడు, ఏంది రా ఈ బాధ అనే అవకాశాన్ని కూడా ఈ సినిమా తీసుకొచ్చే ప్రమాదం ఉంది. జనానికి ఎక్కేదాన్ని బట్టి ఈ సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. 
 

ఫైనల్‌గాః అతి ఇంటలిజెన్స్ ఉపయోగించి చేసిన మూవీ `మహారాజ`. కొంత వాహ్‌.. మరికొంత కన్‌ఫ్యూజన్‌. 
రేటింగ్‌ః 2.75 

Latest Videos

click me!