`నరుడి బ్రతుకు నటన` మూవీ రివ్యూ, రేటింగ్‌

First Published | Oct 25, 2024, 3:05 PM IST

యంగ్‌ హీరో శివకుమార్‌, నితిన్‌ ప్రసన్న ప్రధాన పాత్రలో నటించిన మూవీ `నరుడి బ్రతుకు నటన`. ఈ మూవీ నేడు శుక్రవారం విడుదలైంది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 
 

నటుడిగా పాజిటివ్‌, నెగటివ్‌ క్యారెక్టర్లు చేస్తూ వస్తున్న శివ కుమార్‌ హీరోగా నిలబడేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో కంటెంట్ ఉన్న చిత్రాలతో ఆకట్టుకుంటున్నాడు. అందులో భాగంగా ఇప్పుడు `నరుడు బ్రతుకు నటన` అనే సినిమాలో నటించారు. ఇందులో మలయాళ నటుడు నితిన్‌ ప్రసన్న మరో ముఖ్య పాత్రలో నటించగా, రిషికేశ్వర్ యోగి దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్‌, ఎస్‌ స్వ్కేర్‌ సినిమాస్‌, సీ ఫర్‌ యాపిల్‌ ప్రొడక్షన్స్ పతాకాలపై సుకుమార్‌ బోరెడ్డి, డాక్టర్‌ సింధూ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా నేడు శుక్రవారం విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

కథః 
హీరోగా రాణించడం కోసం కష్టపడుతుంటాడు సత్య(శివకుమార్‌). కానీ ప్రతి చోట తిరస్కరించబడతాడు. చాలా మంది నీకు యాక్టింగ్‌ రాదని అవమానిస్తారు. ఇంట్లో తండ్రి(దయానంద్‌ రెడ్డి) కూడా సత్య యాక్టింగ్‌ రాదని అవమానిస్తాడు. ఓ ఆడిషన్‌లోనూ అలాంటి అవమానమే ఎదురవుతుంది. చివరకు ఫ్రెండ్‌ జ్ఞానోదయం చేస్తాడు. ఫ్రస్టేషన్‌లో ఓ యాక్సిడెంట్‌ చేసినప్పుడు ఫ్రెండ్‌ అసలు విషయం చెబుతాడు. యాక్టింగ్‌ రావాలంటే కష్టం విలువ తెలియాలని, సమాజంలోని ప్రతి ఒక్క ఎమోషన్స్ తెలియదని, అవన్నీ అనుభవిస్తేనే వస్తాయని చెబుతాడు. దీంతో సమాజం, మనుషులు ఎలా ఉంటారు తెలుసుకోవాలనే ప్రయత్నంలో భాగంగా జర్నీ చేస్తాడు. ఇలా కేరళాకి వెళ్తాడు. అక్కడ తెలుగు తెలిసిన ఒకే ఒక్క వ్యక్తి డీ సల్మాన్‌(నితిన్‌ ప్రసన్న) పరిచయం అవుతాడు. అతను లవ్‌ ఫెయిల్యూర్‌. తన హార్ట్ చాలా బ్యూటీఫుల్‌ అంటూ సత్యకి షెల్టర్‌ ఇస్తాడు. ఇలా ఇద్దరు కలిసి ఉంటారు, అసలు మనుషులు ఎమోషన్స్, బాధలు అక్కడ చూస్తాడు సత్య. డి సల్మాన్‌ ప్రేమ, పక్కింటి గర్భిణి అద్భుతమైన గొంతుని, ఆమె ఫేస్‌ ఎక్స్ ప్రెషన్స్ ని, ఆటలో ఆడినప్పుడు ఫ్రెండ్స్ సంతోషాన్ని, వాళ్ల ఫ్రస్టేషన్‌ని చూస్తాడు. ఈ క్రమంలో చాలా రోజులు ఈ ఇద్దరు కలిసే జర్నీ చేస్తారు. గర్భిణి వాయిస్‌కి ఫిదా అయిన సత్య ఆమెతో లవ్‌లో పడిపోతాడు. ఆ విషయం చెప్పాలనుకుంటాడు. ఇంతలోనే ట్విస్ట్. మరి ఆ ట్విస్ట్ ఏంటి? తాను కేరళాలో ఏం తెలుసుకున్నాడు? డి సల్మాన్‌ నేర్పించిన జీవిత పాఠం ఏంటి? అక్కడ తాను ఎలాంటి అనుభవాలు ఫేస్‌ చేశాడు? ఆ తర్వాత సత్య హీరో అయ్యాడా? చివర్లో ఆయన ఇచ్చిన ట్విస్టేంటి? అనేది `నరుడి బ్రతుకు నటన` మిగిలిన కథ. 
 

Latest Videos


విశ్లేషణః 
సినిమా హీరో కావాలనుకున్న ఓ కుర్రాడి కథ ఇది. సూపర్‌ స్టార్‌గా ఎదిగిన ప్రతి ఒక్క హీరో తన జీవితంలో కష్టాలు, కన్నీళ్లు, బాధలు చూసినవాళ్లే. జీవితంలో స్ట్రగుల్స్ లేకుండా ఎదిగిన ఒక్క లెజెండ్‌ యాక్టర్స్ ని చూపించమని సినిమాలో డైలాగ్‌ ఉంటుంది. ఏ నటుడు అయినా, కెమెరా ముందు ఆయా భావోవ్వేగాలు పలికించాలంటే అవి నిజ జీవితంలో అతను అనుభవించి తీరాలి. అప్పుడే బెస్ట్ యాక్టింగ్‌ బయటకు వస్తుందనేది, వాళ్లే నిజమైన యాక్టర్స్ అని ఈ సినిమా అంతర్లీనంగా ఇచ్చిన సందేశం.

నటుడు కావాలనుకున్న వ్యక్తి వెనుక అసలు జీవితాన్ని చూపించిన చిత్రమిది. సినిమాలో కొంత ఆర్ట్ ఫ్లేవర్‌ ఉంటుంది. అదే సమయంలో ఎంతో ఫీల్‌ గుడ్‌ అంశాలున్నాయి. ఎమోషనల్‌ రోల్‌ కోస్టర్‌లా ఉంటుంది. అందులోనూ మంచి ఫన్‌ ఉంటుంది. ఇలాంటి సినిమాల్లో ఫన్‌ మేళవించడం, దాన్ని కన్విన్సింగ్‌గా చెప్పడం చాలా కష్టం. కానీ ఆ ఎలిమెంట్‌ ఇందులో హైలైట్‌గా నిలుస్తుంది.

సినిమాగా ఫస్టాఫ్‌ కాస్త స్లోగా సాగుతుంది. సత్య పాత్రలోని ఎమోషన్స్ కనెక్ట్ చేసే క్రమంలో, ఆ పాత్ర తీరుతెన్నులను ఎస్టాబ్లిష్‌ చేసే క్రమంలో కొంత టైమ్‌ తీసుకున్నారు. దీంతో సినిమా నెమ్మదిగా సాగుతుంది. హీరో పాత్ర జర్నీ చేసిన తర్వాత కొంత ఫన్‌ యాంగిల్‌ యాడ్‌ అవుతుంది. ఫస్టాఫ్‌ మాత్రం ఇలా సీరియస్‌గా, స్లోగా సాగుతుంది. కానీ ఎమోషనల్‌గా ఉంటుంది. 
 

ఇక సెకండాఫ్‌లో మాత్రం ఫన్‌ యాంగిల్‌ యాడ్‌ అయ్యింది. ముఖ్యంగా కేరళాకి కథ షిఫ్ట్ అయ్యాక, డీ సల్మాన్‌ పాత్ర ఎంట్రీతో ఫన్నీగా మారింది. అక్కడ కూడా హీరో పాత్ర పడే స్ట్రగుల్‌ కొంత ఎమోషనల్‌గా అనిపించినా, ఆ తర్వాత నెమ్మదిగా సినిమా స్పీడ్‌ అందుకుంటుంది. విభిన్నమైన ఎమోషన్స్ యాడ్‌ అవుతూ ఆకట్టుకుంటుంది. పక్కింటి గర్భిణి పాడే పాట, దాన్ని సత్య పొందే అనుభూతి ఫీల్‌ గుడ్‌గా మారుస్తుంది. ఆమెపై ఇష్టం పెంచుకోవడం కూడా ఆకట్టుకునే ఎలిమెంట్‌.

అయితే డీ సల్మాన్‌ పాత్ర లవ్‌ ఫెయిల్యూర్‌ ఎపిసోడ్‌ కడుపుబ్బా నవ్విస్తుంది. మందు ఎక్కువై పెళ్లి జరుగుతున్న అతని లవర్‌ ఇంటికెళ్లి చికెన్‌ కావాలని అడిగే సీన్‌ ది బెస్ట్ అని చెప్పొచ్చు. అక్కడ నవ్వడం మీ తరం కాదని చెప్పొచ్చు. క్లైమాక్స్ ఎమోషనల్‌గా ఫీల్‌గుడ్‌గా ముగుస్తుంది. హీరో పాత్రలోని చిన్న ట్విస్ట్ సర్ప్రైజ్‌ చేస్తుంది. కన్‌ క్లూజన్‌ మరింత ఎమోషనల్‌గా మార్చేస్తుంది.

సినిమా స్లోగా సాగడమే ఇందులో మైనస్‌. కమర్షియల్‌ ఎలిమెంట్లు లేకపోవడంతో మరీ ఆర్ట్ సినిమాలను తలపిస్తుంది. ఫస్టాఫ్‌పై కూడా బాగా వర్క్ చేసి, కొన్ని ఫన్నీ సీన్లు పెడితే మంచి సినిమా అయ్యేది. దీంతోపాటు క్లైమాక్స్ కూడా ఇంకా బాగా చేయాల్సింది. అక్కడ కిక్‌ తగ్గింది.  
 

నటీనటులుః 
 హీరో కావాలని స్ట్రగుల్‌ అయ్యే సత్య పాత్రలో శివ కుమార్ బాగా చేశాడు. ఆ రోల్‌కి యాప్ట్ గా నిలిచాడు. విభిన్నమైన ఎమోషన్స్ ని బాగా పలికించగలిగాడు. అతనికిది నటుడిగా ఓ మెట్టు ఎక్కించే పాత్ర అవుతుంది. రియల్‌ లైఫ్‌లో నటులు కావాలనుకునే వాళ్లకి సత్య పాత్ర ఓ సందేశంగా నిలుస్తుంది. ఇక డీ సల్మాన్‌ పాత్రలో నితిన్‌ ప్రసన్న అదరగొట్టాడు. అతని పాత్రలో వచ్చే కామెడీ మాత్రం హైలైట్‌. సీరియస్‌గా, ఇన్నోసెంట్‌గా, ఫన్నీగా ఆయన చేసిన తీరు బాగుంది.

హీరో తండ్రి పాత్రలో దయానంద్‌ రెడ్డి కాసేపు ఆకట్టుకున్నాడు. గర్భిణిగా, సత్య ఇష్టపడే అమ్మాయిగా శృతి జయన్‌ ఉన్నంతలో బాగా చేసింది. ఎక్స్ ప్రెషన్స్ చాలా బాగా ఇచ్చింది. హీరో ఫ్రెండ్‌గా వైవా రాఘవ మరోసారి తనకు యాప్ట్ అయిన పాత్రలో మెప్పించారు. మిగిలిన ఆర్టిస్ట్ లు ఓకే అనిపించారు. 
 

టెక్నీషియన్లుః 
సినిమాకి మ్యూజిక్‌ కీలక భూమిక పోషించింది. నైక్స్ లోపేజ్‌ మంచి పాటలు అందించారు. దాన్ని మించిన ఫీల్‌గుడ్‌ బీజీఎంని అందించారు. తన ఆర్ఆర్‌తో ఆడియెన్స్ గుండె బరువెక్కించారు. ఫహద్‌ అబ్దుల్‌ మజీద్‌ కెమెరా వర్క్ సూపర్‌ గా ఉంది. చిన్న సినిమా అనే ఫీలింగ్‌ లేకుండా ప్రతి ఫ్రేమ్‌ సూపర్‌గా ఉంది. సౌండింగ్‌ ప్రత్యేకంగా నిలుస్తుంది. దర్శకుడే ఎడిటర్‌. అందుకే కట్‌ చేయడానికి వెనకాడాడు.

కానీ కట్‌ చేసేందుకు స్కోప్‌ ఉంది. దర్శకుడు రిషికేశ్వర్‌ యోగి మంచి కథని రాసుకున్నారు. దాన్ని బాగానే తెరకెక్కించారు. అయితే సెకండాఫ్‌లో వచ్చే ఒక్క కామెడీ సీన్‌ తప్పితే సినిమా చాలా చోట్ల డ్రైగా సాగుతుంది. పడుతూలేస్తూ స్క్రీన్‌ ప్లే సాగింది. కొన్ని చోట్ల ఎమోషన్స్ పండాయి. కానీ కొన్ని చోట్ల వర్కౌట్‌ కాలేదు. క్లైమాక్స్ ని ఇంకా బాగా చేయాల్సింది. కానీ డైలాగ్స్ మాత్రం బాగున్నాయి. ఆలోచింప చేసేలా ఉన్నాయి. 

ఫైనల్‌గాః `నరుడి బ్రతుకు నటన` అసలు జీవితాన్ని చూపించే ఫీల్‌ గుడ్‌ మూవీ. 
రేటింగ్‌ః 2.75

read more: లవర్‌ బాయ్ గా స్టార్‌ ఇమేజ్‌ పీక్‌, సడెన్‌గా సినిమాలకు అబ్బాస్‌ గుడ్‌ బై.. తప్పుకోవడానికి కారణం తెలిస్తే షాక్‌

Also Read: `ఐందం వేదం`: మైథలాజికల్ థ్రిల్లర్ రివ్యూ

click me!