`పొట్టేల్‌` సినిమా రివ్యూ, రేటింగ్‌

First Published | Oct 24, 2024, 5:21 PM IST

అనన్య నాగళ్ల నటించిన `పొట్టేల్‌` మూవీకి ఇటీవల బాగా హైప్‌ వచ్చింది. శుక్రవారం విడుదలవుతున్న ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 
 

అనన్య నాగళ్ల `మల్లేశం` సినిమాతో ఆకట్టుకుంది. `వకీల్‌ సాబ్‌`లో ముగ్గురు అమ్మాయిల్లో ఒకరిగా నటించి మెప్పించింది. హీరోయిన్‌ గా మారి అడపాదడపా సినిమాలు చేస్తుంది. కానీ సరైన బ్రేక్‌ ఇచ్చే మూవీ పడలేదు. ఈ క్రమంలో కంటెంట్‌ ఓరియెంటెడ్‌ సినిమా `పొట్టేల్‌` చేసింది. ఇందులో యువ చంద్ర హీరోగా నటించగా, అజయ్‌, నోయల్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్ ముఖ్య పాత్రలు పోషించారు.

దీనికి `సవారి` ఫేమ్‌ సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహించారు. నిశాంక్‌ రెడ్డి కుడితి, సురేష్‌ కుమార్‌ సడిగె సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 25న(రేపు శుక్రవారం) విడుదల కానుంది. ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించారు. టీజర్, ట్రైలర్‌, ప్రమోషన్స్ పరంగా బజ్‌ పెంచుకున్న ఈ మూవీ ఆ రేంజ్‌లో ఉందా? లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

కథః 
1970-90 మధ్య తెలంగాణలోని గుర్రంగట్టు అనే చిన్నపల్లెటూరిలో జరిగే కథ ఇది. పటేల్‌ వ్యవస్థ రాజ్యమేలుతున్న రోజులవి. ఆ ఊర్లో పటేల్‌లకు ఊరి గ్రామ దేవత బాలమ్మ పూనుతుంటుంది. వాళ్లే శిగం ఊగుతూ బాగోగులు చెబుతుంటారు. వారి వారసులుగా చిన్న పటేల్‌(అజయ్‌) వస్తాడు. కానీ ఆయనకు మాత్రం బాలమ్మ పూనదు. దీంతో ఆ ఊరుకి వర్షాలు లేక కరువుతో ఇబ్బంది పడుతుంది. తెలియని రోగం వచ్చి జనాలు వరుసగా చనిపోతుంటారు.

చదువుకున్నవాళ్లు లేక జనాలకు ఏమీ తెలియక పటేల్‌కి బానిసలుగా బతుకుతుంటారు. బాలమ్మ తనకు పూనకపోవడంతో పటేల్‌పై భయం తగ్గిపోతున్న క్రమంలో తనకు బాలమ్మ పూనినట్టు నటిస్తుంటాడు పటేల్‌. ఈ విషయం గంగాధర్‌(యువ చంద్ర)కి తెలుసు. అది ఊరి జనంకి చెప్పినా వాళ్లు నమ్మరు. ఆ ఊరు గ్రామ దేవత బాలమ్మ కోసం పొట్టేల్‌ బలివ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సారి ఆ పొట్టేల్‌ని పెంచే బాధ్యత గంగాధర్‌ తీసుకుంటాడు.

అదే సమయంలో ఆ పటేల్‌ని ఎదురించే ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఈక్రమంలోనే బుజ్జమ్మ(అనన్య నాగళ్ల) పరిచయం అవుతుంది. ఆమె అన్న శ్రీను(నోయల్‌)ని ఎదురించి ప్రేమ పెళ్లి చేసుకుంటారు. వీరికి కూతురు సరస్వతి పుడుతుంది. తన కూతురుని చదివించాలనుకుంటాడు గంగాధర్‌. స్కూల్‌ టీచర్‌ (శ్రీకాంత్‌ అయ్యంగార్‌)నో చెబుతాడు. చదువు చెప్పాలంటే కొన్ని కండీషన్స్ పెడతాడు.

అందులో భాగంగా పటేల్‌ ఇంట్లో ఉన్న విగ్రహాన్ని తనకు తెచ్చివ్వాలనగా, అందుకోసం దొంగతనం చేసి దొరికిపోతాడు గంగాధర్. బాగా కొడతాడు పటేల్‌. ఆ సమయంలోనే పొట్టేల్‌ మిస్ అవుతుంది. బాలమ్మ దేవత పండగ కొద్ది రోజుల్లోనే ఉంటుంది. పొట్టేల్‌ని పట్టుకురా చదువు చెబుతా అని టీచర్ అంటాడు.

మరి ఆ పొట్టేల్‌ దొరికిందా? అది ఎలా మిస్‌ అయ్యింది? అమ్మోరుకి గంగాధర్‌ కూతురుని పటేల్‌ ఎందుకు బలివ్వాలనుకుంటారు? తన కూతురుకి చదువు చెప్పించాలనే గంగాధర్‌ కల నెరవేరిందా? చివరికి పటేల్‌ ఆగడాలను ఊరి జనం ఎలా ఎదుర్కొన్నారు? ఫైనల్‌గా ఏం జరిగిందనేది మిగిలిన సినిమా. 
 

Latest Videos


విశ్లేషణః 

పటేల్‌ వ్యవస్థ ఒకప్పుడు తెలంగాణలో చాలా ఉండేది. బడుగు బలహీన వర్గాలు, దళిత ప్రజలను బానిసలుగా భావించేవాళ్లు. దారుణమైన వివక్ష ఉండేది. పేదలకు చదువుకునే అవకాశం ఇచ్చేవాళ్లు కాదు, ఎవరైనా చదువుకోవాలనుకుంటే వాళ్లని బెదిరించి, భయపెట్టేవాళ్లు, అవసరమైతే అరాచకాలు చేసేవాళ్లు. ఇదంతా నలభై, యాభై ఏళ్ల క్రితం నాటి స్టోరీ. ఇలాంటి కథలతో చాలా సినిమాలు వచ్చాయి. `పొట్టేల్‌` సినిమా కథ కూడా అదే. కూతురిని చదివించడం కోసం తండ్రి పడే స్ట్రగుల్‌ నేపథ్యంలో సాగుతుంది.

ఈ క్రమంలో పటేల్ కి, హీరోకి మధ్య జరిగే ఫైటే సినిమా. కథ పరంగా ఇప్పటి తరానికి కనెక్ట్ అయ్యేది కాదు, కానీ అప్పుడు ఆ వ్యవస్థ ఎలా ఉండేదనేది ఈ జనరేషన్‌కి చెప్పే ప్రయత్నం. దానికి ఇటీవల బాగా వర్కౌట్‌ అవుతున్న, అమ్మోరు, ఆథ్యాత్మిక సెంటిమెంట్‌, ఎమోషన్స్ ని జోడించి తెరకెక్కించాడు దర్శకుడు. అయితే సినిమా ఏదైనా, కథ ఏదైనా, అది ఎంత రా గా ఉన్నా అందులో మెయిన్‌గా ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్‌. ఏ సినిమా అయినా ఆడియెన్స్ కి కనెక్ట్ కావాలంటే ఎమోషన్స్ కనెక్ట్ కావాలి.

ఎమోషన్స్ పండకపోతే, సినిమాకున్న సోల్‌ ఎక్కకపోతే దానితో ఆడియెన్స్ ట్రావెల్‌ కాలేరు. ఆ ఫీల్‌ పొందలేరు. అది అంతిమంగా  జనాలకు ఎక్కదు. ఎంత గొప్ప కథ అయినా, ఎంత పెద్ద సినిమా అయినా అది బూడిదలో పోసిన పన్నీరుగానే మారుతుంది. `పొట్టేల్‌` విషయంలో అదే జరిగింది. ఈ సినిమా టీజర్‌, ట్రైలర్ చాలా హైప్‌ క్రియేట్‌ చేశాయి. ఏదో చెప్పబోతున్నారు. చాలా రా కంటెంట్‌ ఉందనిపించింది.

పైగా చిన్నారి సెంటిమెంట్‌, అలాగే అమ్మోరు ఎలిమెంట్లు సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. కానీ సినిమాలో ఆయా ఎలిమెంట్లు ఏమాత్రం బలంగా లేవు, కనెక్ట్ అయ్యేలా అసలే లేవు. భావోద్వేగాలు పండకపోవడంతో సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్‌ వరకు బోరింగ్‌గా సాగుతుంది. సీన్‌ బై సీన్‌ వస్తూ పోయినట్టుగానే అనిపిస్తుంది. 
 

సినిమాని ఎత్తుకున్న తీరు బాగుంది. క్యూరియాసిటీ క్రియేట్‌ అయ్యింది. కానీ ఆ తర్వాత నుంచి వరుసగా సీన్లు వచ్చిపోతున్నాయి, తప్పితే ఆ ఎమోషన్స్ ని ఆడియెన్స్ ఫీల్‌ కాలేకపోతున్నాడు. పటేల్‌ అంతకు ముందు తనని ఎదురించిన వాళ్లని చంపేస్తాడు. కానీ హీరోని ఎందుకు వదిలేస్తుంటారో అర్థంకాదు. ఇంత అన్యాయం జరుగుతున్నా? హీరో ఎందుకు ఎదురు తిరగడు అనేది క్లారిటీ లేదు.   ఆ సీన్లలో ఏం చూపించాలనుకున్నారనేది అర్థం కాదు. హీరోతో, అనన్య ల లవ్ ట్రాక్‌ కూడా ఏమాత్రం పండలేదు.

అయితే కథ మొత్తం సీరియస్ సాగుతున్న నేపథ్యంలో వీరి లవ్‌ ట్రాక్‌ పండలేదని చెప్పొచ్చు. సినిమా మొత్తం ఫ్లాట్‌గా సాగుతుంది. ఎక్కడ ట్విస్ట్ లు, టర్న్, వాహ్‌ అనిపించే ఎలిమెంట్లు లేవు, పటేల్‌ ఇబ్బందులు పెడుతుంటాడు, వాటిని జనం భరిస్తారనేలా ఉంది. అయితే ఆ ఇబ్బందులు కూడా పెద్దగా లేవు. కేవలం చిన్నపాపకి చదువు అనేదానిపైనే కథ నడుస్తుంది. ఆ ఎలిమెంట్లు కూడా అంత బలంగా అనిపించవు. అదే సమయంలో సినిమాలో చాలా లాజిక్స్ మిస్‌ అయ్యారు.

ఎన్టీఆర్‌ పార్టీ స్థాపించినప్పుడు పటేల్‌ వ్యవస్థని రద్దు చేస్తామని ప్రకటిస్తాడు. కానీ కొన్ని రోజులకే `శివ` సినిమాని ఊర్లో వేసుకుని చూస్తుంటారు. ఆ టైమ్‌ గ్యాప్‌ కూడా చూసుకోలేదు. చదువు అనేదే తెలియని జనం వాడే భాష మోటుగా ఉంటుంది. పుస్తక భాష అసలే తెలియదు. కానీ హీరోహీరోయిన్ చెప్పే డైలాగ్‌లు మాత్రం గొప్పగా ఉంటాయి? ఇలా చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో లాజిక్‌లు అందవు. 
 

సినిమా మొత్తం స్లోగా సాగుతుంది. అసలే హైప్‌ ఇచ్చే మూమెంట్స్ లేవంటే, పైగా సాధాసీదాగా స్క్రీన్‌ప్లే నడిపించడం పెద్ద మైనస్‌గా చెప్పొచ్చు. దీంతో విలన్‌ ఆగడాలు, ఆడియెన్స్ పై దాడిలా ఉన్నాయి. ఫస్టాఫే స్లో అంటే సెకండాఫ్‌ మరింత స్లోగా మారింది. క్లైమాక్స్  అయినా పరిగెత్తిస్తాడేమో అనుకుంటే అక్కడ కూడా అదే పంథాని ఫాలో అయ్యారు.

కనీసం అక్కడ కూడా ట్విస్ట్ లకు స్కోప్‌ లేదు. ఒకటి రెండు ఉన్నట్టు అనిపించినా, అవి పేలకపోవడంతో క్లైమాక్స్‌ కూడా తేలిపోయింది. సన్నివేశాలు పేలవంగా అంటే మ్యూజిక్‌ పరంగా, ముఖ్యంగా ఆర్‌ఆర్‌తో ఎలివేషన్‌ ఇస్తుంటారు. ఇందులో అది కూడా లేదు. సినిమా కథకి, ఆర్‌ఆర్‌కి పొంతన కుదరలేదు. పొట్టేల్‌ సన్నివేశాలు కూడా అంతగా కిక్‌ ఇచ్చేలా లేవు. కథలో చాలా హైప్‌ ఇచ్చే మూమెంట్లకి స్కోప్‌ ఉంది.

కానీ సినిమాలో వాటిని బలంగా చూపించలేకపోయారు. గూస్‌బంమ్స్ తెప్పించే సన్నివేశాలకు స్కోప్‌ ఉన్నా, ఆ విషయంలో దర్శకుడు విఫలమయ్యాడు. దీంతో ఇదొక రొటీన్‌ మూవీలా మిగిపోయింది. మేకర్స్ కష్టం వృథా అయిపోయిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

నటీనటులుః 
యంగ్‌ హీరో యువ చంద్ర.. సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. డిఫరెంట్‌ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు. నటన పరంగానూ ఫర్వాలేదు. సెటిల్డ్ గా కనిపించాడు. కానీ తన పెయిన్‌గా బలంగా చూపించలేకపోయాడు. ఇంకా బాగా చేయాల్సింది. మరోవైపు అనన్య నాగళ్ల ఇప్పటికే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇందులోనూ బాగా చేసింది. పాత్రలో జీవించేసింది. పటేల్‌ పాత్రలో అజయ్‌ అదరగొట్టాడు.

బాలమ్మ పూనే సన్నివేశాలు తేలిపోయాయి. శ్రీకాంత్‌ అయ్యంగార్‌ టీచర్‌గా బెస్ట్ ఇచ్చాడు. డిఫరెంట్‌ షేడ్స్ చూపించి మెప్పించాడు. నోయల్‌ ఓ కొత్త తరహా పాత్రలో కనిపించాడు. ఫర్వాలేదనిపించాడు. మిగిలిన ఆర్టిస్ట్ లు ఓకే. అయితే ప్రతి సీన్‌లో కనిపించిన వాళ్లే కనిపిస్తుంటారు. అది కూడా కాస్త ఇబ్బంది పెట్టే అంశమే. 
 

టెక్నీకల్‌గాః
సినిమాకి మ్యూజిక్‌, ముఖ్యంగా ఆర్‌ఆర్‌ ప్రధాన బలం. కొన్ని చోట్ల బీజీఎం ఫర్వాలేదు. కానీ చాలా చోట్లు అది అంతగా వర్కౌట్‌ కాలేదు. సీన్లు బలంగా లేకపోవడమా? కథనం స్లోగా నడవడమా? కారణం ఏదైనా ఈ మూవీకి బీజీఎం ఏమాత్రం ఉపయోగపడలేకపోయింది. కెమెరా వర్క్ బాగుంది. అప్పటి ఫీల్‌ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది. ఆర్ట్ వర్క్ కూడా చాలా బాగుంది. ఎడిటింగ్‌ పరంగా మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. సినిమాని స్పీడ్‌ చేయాల్సింది. ఇక దర్శకుడు మంచి కథ ఎంచుకున్నాడు. కానీ దానికి ట్రీట్‌మెంట్‌ సినిమా స్టయిల్‌లో ఇవ్వలేకపోయాడు.

సినిమా అంటేనే వినోదం ఇవ్వాలి, అది కామెడీ అయినా, యాక్షన్‌ అయినా, థ్రిల్‌ అయినా, భయమైనా, మంచిఫీలింగ్‌ అయినా, చివరకు సందేశం అయినా ఇందులో అన్నింటి టచ్‌ ఉంటుంది. కానీ ఏదీ కిక్‌ ఇవ్వదు. అదే పెద్ద మైనస్. దర్శకుడు స్క్రీన్‌ ప్లే బలంగా రాసుకోవాల్సింది. ఎమోషన్స్ పై ఫోకస్‌ పెట్టాల్సింది. ఈ రెండు మిస్‌ కావడమే `పొట్టేల్‌`కి పెద్ద మైనస్‌. దీంతో సినిమా సాదాసీదా సినిమాలా మారిపోయింది. 

ఫైనల్ గా ః చూసేవారికి `పొట్టేల్‌` దెబ్బ 
రేటింగ్‌ః 2  
 

click me!