
తెలుగు చలనచిత్ర చరిత్రలో 'నర్తనశాల' (1963) ఒక అజరామరమైన దృశ్యకావ్యం. నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) నటవిశ్వరూపానికి, ఎస్వీ రంగారావు (ఎస్వీఆర్) అసమాన నటనా కౌశలానికి, సావిత్రి అభినయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన చిత్రం ఇది. అంతే కాదు భారతీయ పౌరాణిక సినిమాలలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది నర్తనశాల. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో లక్ష్మీరాజ్యం, శ్రీధర్ రావు నిర్మించిన ఈ చిత్రం విడుదలై దశాబ్దాలు గడుస్తున్నా, నేటికీ తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకుంది.
మహాభారతంలోని విరాట పర్వం ఆధారంగా ఈ సినిమా కథ సాగుతుంది. పన్నెండేళ్ల అరణ్యవాసం ముగించుకున్న పాండవులు, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం గడపడానికి మత్స్య దేశాధీశుడైన విరాట రాజు కొలువులో మారువేషాలలో ప్రవేశిస్తారు. ధర్మరాజు కంకుభట్టుగా విరాట రాజుకు పాచికల ఆటలో సలహాదారుడిగా చేరతాడు. భీముడు వలలుడు అనే పేరుతో వంటవాడిగా, మల్లయోధుడిగా నియమితుడవుతాడు. అర్జునుడు బృహన్నల అనే నపుంసక నాట్యాచార్యుడిగా విరాట రాజు కుమార్తె ఉత్తరకు నాట్యం నేర్పించే గురువుగా బాధ్యతలు స్వీకరిస్తాడు. నకులుడు గ్రంథికుడిగా అశ్వశాలలో, సహదేవుడు తంత్రీపాలుడిగా గోశాలలో పనికి కుదురుతారు. ఇక వీరి భార్య ద్రౌపది సైరంధ్రిగా విరాట రాజు భార్య సుదేష్ణ వద్ద పరిచారికగా చేరుతుంది.
అజ్ఞాతవాసం ప్రశాంతంగా సాగుతున్న తరుణంలో, విరాట రాజు బావమరిది, మత్స్య దేశ సైన్యాధ్యక్షుడైన కీచకుడు సైరంధ్రి అందానికి మోహితుడై ఆమెను తన వశం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. కీచకుడి ఆగడాలు శ్రుతిమించడంతో, భీముడు నర్తనశాలలో కీచకుడిని అంతమొందిస్తాడు. కీచకుడి మరణవార్త తెలుసుకున్న దుర్యోధనుడు, పాండవులు మత్స్య దేశంలోనే ఉన్నారని అనుమానించి దక్షిణ, ఉత్తర గోగ్రహణాలకు పూనుకుంటాడు. ఈ యుద్ధంలో బృహన్నల సారథ్యంలో ఉత్తర కుమారుడు, ఆపై అర్జునుడు తన నిజరూపంలోకి వచ్చి కౌరవ సేనను చిత్తు చేయడంతో పాండవుల అజ్ఞాతవాసం విజయవంతంగా ముగుస్తుంది.
ఈ సినిమాకు ప్రధాన బలం ఇందులో నటించిన దిగ్గజ నటీనటుల అభినయం. ముఖ్యంగా ఎన్టీఆర్ తన కెరీర్లో పోషించిన అత్యంత క్లిష్టమైన, వైవిధ్యభరితమైన పాత్రలలో బృహన్నల ఒకటి. ఒకవైపు గాండీవధారి అయిన మహావీరుడు అర్జునుడిగా గాంభీర్యాన్ని చూపిస్తూనే.. మరోవైపు శాపవశాత్తూ నపుంసకుడిగా మారిన బృహన్నల పాత్రలో స్త్రీ సహజమైన హావభావాలను, నాట్య భంగిమలను ఆయన పలికించిన తీరు అద్భుతం. ముఖ్యంగా ఉత్తర కుమారుడికి రథసారథిగా వెళ్లే సన్నివేశాలలో కామెడీతో కడుపుబ్బా నవ్వించారు, యుద్ధభూమిలో అర్జునుడిగా మారేటప్పుడు వీరరసాన్ని పండించిన విధానం నభూతో నభవిష్యతి.
కీచకుడి పాత్రకు ఎస్వీఆర్ ప్రాణం పోశారు. మదమెక్కిన వీరుడిగా, కామాంధుడిగా ఆయన ప్రదర్శించిన హావభావాలు, గంభీరమైన కంఠస్వరం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. నర్తనశాలలో సైరంధ్రి కోసం ఎదురుచూస్తూ భీముడి చేతిలో హతమయ్యే సన్నివేశంలో ఎస్వీఆర్ నటన భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శనలలో ఒకటిగా నిలిచింది. మహానటి సావిత్రి సైరంధ్రి పాత్రలో ఒదిగిపోయారు. రాజరాజేశ్వరిగా వెలిగిన ద్రౌపది, సామాన్య పరిచారికగా మారి కీచకుడి అవమానాలను భరిస్తూ పడే ఆవేదనను, ఆక్రోశాన్ని సావిత్రి తన కళ్లతోనే పలికించారు.
ఇతర నటీనటులు:
భీముడిగా దండమూడి రాజగోపాల్ (భారత వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్) తన ఆహార్యంతో, నటనతో మెప్పించారు. ఉత్తర కుమారుడిగా రేలంగి వెంకటరామయ్య పండించిన హాస్యం సినిమాకు పెద్ద ఆకర్షణ. ఉత్తరగా ఎల్. విజయలక్ష్మి తన అద్భుత నాట్యంతో అలరించగా, విరాట రాజుగా ముక్కామల, ధర్మరాజుగా మిక్కిలినేని, దుర్యోధనుడిగా ధూళిపాళ, భీష్ముడిగా సి.ఎస్.ఆర్. ఆంజనేయులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
నర్తనశాల సినిమా నిర్మాణం వెనుక ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు, అరుదైన రికార్డులు ఉన్నాయి. బృహన్నల పాత్రలో సహజత్వం కోసం ఎన్టీఆర్ ప్రముఖ నాట్యాచార్యులు వెంపటి చినసత్యం వద్ద ప్రత్యేకంగా కూచిపూడి నాట్య శిక్షణ తీసుకున్నారు. స్త్రీల నడక, చేతుల కదలికలు, కంటి చూపుల కోసం ఆయన రోజుల తరబడి అద్దం ముందు సాధన చేసేవారు.
కీచకుడి పాత్ర కోసం తొలుత వేరే నటులను అనుకున్నప్పటికీ, ఎస్వీ రంగారావు అయితేనే ఆ పాత్రకు పూర్తి స్థాయి గాంభీర్యం వస్తుందని భావించి ఆయనను ఎంపిక చేశారు. కీచక వధ సన్నివేశం చిత్రీకరణ సమయంలో ఎస్వీఆర్, దండమూడి రాజగోపాల్ మధ్య జరిగిన పోరాట దృశ్యాలు డూప్ లేకుండా చిత్రీకరించారు.
సాంకేతిక విభాగం - సంగీతం
దర్శకుడు కమలాకర కామేశ్వరరావు మహాభారత ఘట్టాన్ని ఎక్కడా పట్టు తప్పకుండా, రసవత్తరంగా తెరకెక్కించారు. సముద్రాల రాఘవాచార్య రాసిన సంభాషణలు, పాటలు ఈ చిత్రానికి ఆయువుపట్టు. సుసర్ల దక్షిణామూర్తి అందించిన సంగీతం నేటికీ వినిపిస్తుంది. 'జననీ శివకామినీ', 'సలలిత రాగ సుధారస సారం', 'ఎవరికోసం ఈ మందహాసం', 'నారాయణ హరి నారాయణ' వంటి పాటలు, ఘంటసాల గాత్రంలో పద్యాలూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయి.
1964లో ఇండోనేషియాలోని జకార్తాలో జరిగిన 3వ ఆఫ్రో-ఆసియన్ చలనచిత్రోత్సవంలో 'నర్తనశాల' ప్రదర్శితమైంది. ఈ వేడుకలో ఎస్వీ రంగారావుకు ఉత్తమ నటుడిగా అంతర్జాతీయ పురస్కారం లభించింది. ఒక భారతీయ నటుడికి అంతర్జాతీయ వేదికపై ఉత్తమ నటుడు అవార్డు రావడం అదే ప్రథమం. అలాగే ఈ చిత్రానికి ఉత్తమ కళాదర్శకత్వం (టి.వి.ఎస్. శర్మ) విభాగంలోనూ అంతర్జాతీయ అవార్డు దక్కింది.11వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో (1963) ఈ చిత్రం ద్వితీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా (తెలుగు) రజత పతకాన్ని గెలుచుకుంది.
భీముడి పాత్ర పోషించిన దండమూడి రాజగోపాల్ నిజ జీవితంలో అంతర్జాతీయ వెయిట్ లిఫ్టర్. 1948, 1952, 1956 ఒలింపిక్ క్రీడలలో ఆయన భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. ఆయన భారీ కాయానికి, బలానికి భీముడి పాత్ర సరిగ్గా సరిపోయింది. అలనాటి ప్రముఖ నటి లక్ష్మీరాజ్యం, ఆమె భర్త శ్రీధర్ రావు 'రాజ్యం పిక్చర్స్' పతాకంపై ఎంతో కస్టపడి ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమాలోని ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా రావడానికి వారు ఎక్కడా తగ్గలేదు.
ఫైనల్ గా చూస్తే..
ఒక పౌరాణిక కథను కేవలం భక్తి, వీరరసాలకు మాత్రమే పరిమితం చేయకుండా, అందులో హాస్యం, శృంగారం, కరుణ, రౌద్రం వంటి నవరసాలను సమపాళ్లలో మేళవించి రూపొందించడం 'నర్తనశాల' ప్రత్యేకత. మూడు గంటలకు పైగా నిడివి ఉన్నప్పటికీ, ఎక్కడా బోర్ కొట్టకుండా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది సినిమా. దీనికి కారణం దర్శకుడి ప్రతిభ. ఎన్టీఆర్ సత్తాను అర్థం చేసుకోవాలన్నా, ఎస్వీఆర్ విశ్వరూపాన్ని చూడాలన్నా 'నర్తనశాల'ను మించిన సినిమా మరొకటి లేదు. ఈ మూవీని చూడాలి అనుకునే వారికి యూట్యూబ్ లో ఉందుబాటులో ఉంది.