Maya Lady Movie Review: మాయ లేడీ మూవీ రివ్యూ.. రాకేష్‌ వర్రే హీరోగా, నిర్మాతగా చేసిన మూవీ ఎలా ఉందంటే?

Published : Nov 13, 2026, 01:43 PM IST

విలన్‌గా, హీరోగా రాణిస్తోన్న రాకేష్‌ వర్రే హీరోగా, నిర్మాతగా మారి చేసిన మూవీ `మాయ లేడీ`. ఈ శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది? రాకేష్‌కి హిట్‌ పడిందా అనేది రివ్యూలో చూద్దాం.

PREV
16
మాయ లేడీ మూవీ రివ్యూ

బాహుబలి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాకేష్ వర్రే హీరోగా నటిస్తూ, స్వయంగా నిర్మించిన చిత్రం మాయలేడీ. క్రేజీ యాంట్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మించారు. `ఎవరికీ చెప్పొద్దు`, `పేకమేడలు` వంటి విభిన్నమైన కథాంశాలతో సినిమాలను నిర్మించిన ఆయన, ఈసారి రొమాన్స్, కామెడీ, సస్పెన్స్, ఎమోషన్స్ కలగలిపిన కథతో ప్రేక్షకుల ముందుకొచ్చారు.

ప్రశాంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బెంగాలీ నటి మధుమిత సర్కార్ హీరోయిన్‌గా నటించింది. సత్య, ఇంద్రజ, సీనియర్‌ నటుడు సురేష్‌ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ఇది నేడు శుక్రవారం(నవంబర్ 13న) ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి సినిమా ఎలా ఉంది? రాకేష్‌ వర్రే హీరోగా సక్సెస్‌ అయ్యాడా? ఆయన కోరుకున్నట్టు మూవీ బ్లాక్‌ బస్టర్‌ అవుతుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

26
మాయ లేడీ మూవీ కథ

క్రిష్ (రాకేష్ వర్రే) ఒక సెల్ఫ్ డిఫెన్స్ కోచ్. అమ్మాయిలకు ఆత్మరక్షణలో శిక్షణ ఇస్తూ తన జీవితంలో కూడా తనకు నచ్చిన అమ్మాయి కోసం ఎదురుచూస్తుంటాడు. అలాంటి సమయంలో అతడి జీవితంలోకి ఆశా (మధుమిత సర్కార్) ప్రవేశిస్తుంది. సమాజ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా ఉండే ఆశా వ్యక్తిత్వానికి క్రిష్ ఫిదా అవుతాడు. ఆమెతో ప్రేమలో పడతాడు.

అయితే క్రిష్ జీవితంలోకి రూపా(మధుమిత సర్కార్‌) అనే మరో అమ్మాయి ఎంట్రీ ఇవ్వడంతో కథ ఆసక్తికరంగా మారుతుంది. ఆశాకు పూర్తి భిన్నమైన స్వభావం కలిగిన రూపా కూడా క్రిష్‌ను ప్రేమిస్తుంది. దీంతో అతడి జీవితంలో అనేక గందరగోళాలు స్టార్ట్ అవుతాయి. అసలు ఆశా, రూపాల మధ్య సంబంధం ఏమిటి? రూపా క్రిష్ జీవితంలోకి ఎందుకు వచ్చింది? ఆమె వెనుక ఉన్న రహస్యం ఏంటి? చివరకు క్రిష్ ప్రేమ ప్రయాణం ఎలాంటి మలుపులు తీసుకుంది? అనేదే సినిమా కథ.

36
మాయ లేడీ మూవీ విశ్లేషణ

మల్టీపుల్‌ పర్సనాలిటీ డిజార్డర్‌ నేపథ్యంలో అడపాదడపా సినిమాలు వస్తూనే ఉన్నాయి. `అపరిచితుడు`, `చంద్రముఖి` అలాంటి కోవకు చెందినవే. ఈ మూవీ కూడా ఆ జోనర్‌కి చెందినదే. అయితే పూర్తిగా ఆ స్టయిల్‌లో ఉండదు, కామెడీ, లవ్‌ స్టోరీ, ఫ్యామిలీ ఎలిమెంట్లు, ఎమోషన్స్ ప్రధానంగా చేసుకొని ఈ చిత్రాన్ని రూపొందించారు.

సాధారణంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటే ఇద్దరు అమ్మాయిల మధ్య హీరో ప్రేమ కోసం జరిగే సంఘర్షణ గుర్తుకొస్తుంది. కానీ మాయలేడీని కేవలం ప్రేమకథగా మాత్రమే పరిమితం చేయకుండా కామెడీ, సస్పెన్స్, ఎమోషన్స్‌ మేళవించి రూపొందించారు. ముఖ్యంగా హీరోయిన్‌ పాత్రలోని ట్విస్టులు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి.

ఫస్టాఫ్‌లో క్రిష్ ప్రేమ ప్రయాణం, ఆశా పరిచయం, రూపా ఎంట్రీతో వినోదాత్మకంగా కథ సాగుతుంది.ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. అక్కడ నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది. సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇందులో అక్కడక్కడా సత్య కామెడీ సన్నివేశాలు నవ్విస్తాయి.

ముఖ్యంగా చివరి భాగంలో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు కథకు బలాన్ని అందిస్తాయి. అయితే కొన్ని చోట్ల కథనం మరింత వేగంగా సాగి ఉంటే బాగుండేది. కొన్ని సన్నివేశాల్లో కామెడీని ఇంకాస్త బలంగా రాసుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ అనూహ్యమైన మలుపులు ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి. వీటితోపాటు మల్టీపుల్‌ పర్సనాలిటీకి సంబంధించి చూపించిన ఎలిమెంట్లు మెప్పిస్తాయి.

అయితే సినిమా కొంత రెగ్యూలర్‌గా సాగుతుంది. పెద్దగా మలుపులు ఉండవు. సత్య కామెడీని అన్ని చోట్ల వర్కౌట్‌ కాలేదు. అలాగే ఆశా, రూపాల పాత్రలకు సంబంధించిన సీన్లు కన్‌ఫ్యూజ్‌ చేస్తాయి. గందరగోళంగా మారుతుంది. కాకపోతే ఆ రెంటింటిని బ్యాలెన్స్ చేయడం విశేషం.

అయితే ట్విస్ట్ లను మరింత బలంగా రాసుకోవాల్సింది. కామెడీ విషయంలో ఇంకా వర్కౌట్‌ చేస్తే, సహజంగా ఫన్‌ క్రియేట్‌ చేస్తే బాగుండేది. చాలా వరకు కామెడీకి స్కోప్‌ ఉన్నా దాన్ని వాడుకోలేదు. మ్యూజిక్‌ బాగుంది. కానీ `సీతారామం`ని గుర్తు చేస్తుంది. విజువల్‌గా సినిమా బాగుంది.

46
మాయ లేడీలో ఆర్టిస్ట్ ల పర్‌ఫెర్మెన్స్

క్రిష్ పాత్రలో రాకేష్ వర్రే తనదైన నటనతో ఆకట్టుకున్నారు. రొమాంటిక్ సన్నివేశాలతో పాటు యాక్షన్, ఎమోషనల్ సీన్స్‌లోనూ మంచి ప్రయత్నం చేశారు. హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా సినిమాపై తన అభిరుచిని చూపించారు. కాకపోతే కథల విషయంలో మరింత కేర్‌ తీసుకోవాల్సింది.

ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ మధుమిత సర్కార్. ఆశా, రూపా అనే రెండు విభిన్నమైన పాత్రల్లో ఆమె నటన ప్రత్యేకంగా నిలుస్తుంది. ముఖ్యంగా రెండు పాత్రల మధ్య బాడీ లాంగ్వేజ్, హావభావాల్లో చూపించిన డిఫరెన్స్ బాగుంది. సత్య తన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించారు. ముఖ్యంగా పబ్ ఎపిసోడ్‌లో ఆయన కామెడీ, పంచ్ డైలాగులు అలరిస్తాయి. ఇంద్రజ, మైసూర్ సురేష్, మధురిమ నార్ల, లావణ్య రెడ్డి, వినోద్ కిషన్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.

56
టెక్నీకల్‌గా మాయ లేడీ మూవీ ఎలా ఉందంటే?

విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం సినిమాకు మంచి అసెట్‌గా నిలుస్తుంది. ప్రేమ సన్నివేశాలకు మెలోడీ టచ్ ఇవ్వడంతో పాటు కీలకమైన సన్నివేశాల్లో నేపథ్య సంగీతంతో ఆసక్తిని పెంచారు. యెదు రాధాకృష్ణన్ సినిమాటోగ్రఫీ బాగుంది. కథలోని రొమాంటిక్, కామెడీ, ఎమోషనల్ సన్నివేశాలను బాగా చూపించారు. రవితేజ గిరిజాల ఎడిటింగ్ కథనానికి అనుగుణంగా సాగింది. కొంత ట్రిమ్‌ చేసి స్పీడ్‌గా మారిస్తే బాగుండేది.

నిర్మాణ విలువలకు కొదవలేదు. రాజీ లేకుండా నిర్మించారు. దర్శకుడు ప్రశాంకర్‌.. ఎంచుకున్న కథ బాగానే ఉంది. కానీ కామెడీ పరంగా, ఎమోషనల్ గా దాన్ని తెరకెక్కించే విషయంలో పూర్తి స్థాయిలో సక్సెస్‌ కాలేదు. నార్మల్‌ మూవీగా మార్చేశారు. అదే పెద్ద మైనస్‌. ఇలాంటి సినిమాలకు స్క్రీన్‌ ప్లే చాలా ఇంపార్టెంట్‌ ఆ విషయంలో ఇంకా బాగా రాసుకోవాల్సింది.

66
ఫైనల్‌గా..

మాయలేడీ ఒక రొటీన్ ప్రేమకథలా మొదలై, అనూహ్యమైన మలుపులు, కామెడీ, ఎమోషన్స్‌తో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేసింది. రొమాంటిక్ కామెడీతో పాటు సస్పెన్స్‌ను ఇష్టపడేవారు ఒకసారి ప్రయత్నించవచ్చు.

రేటింగ్‌ : 2.5

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories