
డిఫరెంట్ కాన్సెప్ట్ తో, కామెడీ ప్రధానంగా చేసుకొని తెలుగులో ఇటీవల చాలా సినిమాలు వస్తున్నాయి. అందులో విజయం సాధిస్తున్న మూవీస్ శాతం తక్కువనే చెప్పాలి. అందులో భాగంగా ఇప్పుడు తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో ఇన్నోసెంట్ కుర్రాళ్లు రాకెట్ తయారు చేయడమనే కథాంశంతో `చంద్రయాన్` మూవీ తెరకెక్కింది. శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రవీణ్ మొలక నిర్మించారు. దర్శకుడు వేణు ఉడుగుల సమర్పకులుగా వ్యవహరించారు.
ఇందులో శివకుమార్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఆయనతోపాటు రవి శివతేజ, వంశీధర్, లోకేష్, బలగం సత్యనారాయణ ఇతర పాత్రలు పోషించారు. స్వప్న ప్రియదర్శిని హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్రం నేడు శుక్రవారం(నవంబర్ 13)న విడుదలైంది. మరి రాకెట్ ప్రయోగం సక్సెస్ అయ్యిందా? సినిమా నవ్వులు పూయించిందా? కొత్త కుర్రాళ్లు ఆకట్టుకున్నారా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
మంచిర్యాల జిల్లాలోని మందమర్రి అనే గ్రామంలో ఈ కథ సాగుతుంది. ఊరిలో పెద్దగా గుర్తింపు లేని నలుగురు యువకులు(శివకుమార్, వంశీధర్, రవి శివ తేజ, లోకేష్) పనీపాట లేకుండా తిరుగుతుంటారు. వీళల్ని శనిగాళ్లు అంటుంటారు. అందులో శివ(శివకుమార్) వారికి లీడ్. రాజు(వంశీధర్) గూగుల్‌ని నమ్ముకొని కోతి ప్రయోగాలు చేస్తుంటారు. అన్నింటిలోనూ ఫెయిల్యూర్.
ఈ క్రమంలో ఊర్లోకి బిందు(స్వప్న ప్రియదర్శిని) వస్తుంది. ఆమెని చూసి ఇంప్రెస్ అవుతాడు శివ. అయితే తనని ప్రేమించడానికి మీరు ఏం సాధించారని చెప్పి క్లాస్ పీకుతుంది. దీంతో ఏదైనా సాధించాలని కలలు కంటుంటారు. కనీసం సైన్స్, లెక్కలపై కూడా సరైన అవగాహన లేని ఈ నలుగురు యువకులు ఏకంగా రాకెట్ తయారుచేసి చంద్రుడిపైకి వెళ్లాలని నిర్ణయించుకుంటారు.
అందుకోసం గూగుల్ సహాయంతో రాకెట్ తయారీకి ప్రయత్నాలు మొదలుపెడతారు. రాకెట్‌కు అవసరమైన ఇంధనం నుంచి ప్రయోగాల వరకు వాళ్లు చేసే పనులు అనేక విచిత్రమైన పరిస్థితులకు దారితీస్తాయి. మరి వారి రాకెట్ ప్రయోగం ఫలించిందా? శివకు ప్రియురాలు దక్కిందా? ఊరు తలెత్తుకునేలా చేశారా? అనేది మిగిలిన కథ.
చంద్రయాన్ సినిమాకు ప్రధాన బలం దాని కథా ఆలోచన. సాధారణంగా చంద్రుడిపైకి వెళ్లడం, అంతరిక్ష ప్రయోగాలు అంటే భారీ బడ్జెట్, సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రవేత్తల నేపథ్యంతో సినిమాలు వస్తుంటాయి. కానీ ఎలాంటి అవగాహన లేని ఇన్నోసెంట్ కుర్రాళ్లు రాకెట్ తయారుచేసి చంద్రుడిపైకి వెళ్లాలని ప్రయత్నించడం అనే పాయింట్ ఆసక్తిని కలిగిస్తుంది.
ఈ కాన్సెప్ట్‌ను కామెడీతో ముడిపెట్టడం మంచి ప్రయత్నం. ముఖ్యంగా గ్రామీణ వాతావరణం, తెలంగాణ యాస, నలుగురు స్నేహితుల మధ్య సాగే సరదా సంఘటనలు ఎంటర్‌టైనింగ్‌గా ఉంటాయి, నవ్విస్తాయి. అయితే ఇలాంటి కథల్లో కామెడీ సహజంగా పండటం చాలా ముఖ్యం.
సన్నివేశాల్లో బలవంతపు హాస్యం కాకుండా పాత్రల ప్రవర్తన నుంచే నవ్వులు పుట్టినప్పుడే సినిమా మరింత ఆకట్టుకుంటుంది. ఇందులో చాలా వరకు ఆ ప్రయత్నం చేశారు. కానీ కొన్ని చోట్ల అది మిస్ ఫైర్ అయ్యింది. నలుగురు కుర్రాళ్లు చేసే అల్లరి, కోతి ప్రయత్నాలు ఫన్నీగా ఉంటాయి. అవి కొంత వరకు నవ్వించాయి. చాలా చోట్ల అంతగా వర్కౌట్ కాలేదు.
ఫస్టాఫ్ డైలాగ్ కామెడీ, సిచ్చువేషన్ కామెడీ అలరిస్తుంది. ఇంటర్వెల్ వరకు ఫర్వాలేదు. కానీ సెకండాఫ్ ఆ స్థాయిలో వర్కౌట్ రాలేదు. రాకెట్ ప్రయోగాలు కొంత సాగదీసినట్టుగా ఉంటుంది. డ్రామా వర్కౌట్ కాలేదు. రాకెట్‌లో కనకవ్వతో డిస్కషన్ బోరింగ్‌గా ఉంటుంది. క్లైమాక్స్ కూడా అంతగా పండలేదు.
కాకపోతే అంతిమంగా ఎవరూ తక్కువ కాదని చెప్పే విషయం బాగుంది. దీనికి పాకిస్థాన్‌ని బకరా చేసే సీన్ బాగుంది. అయితే అన్ని చోట్ల కామెడీ వర్కౌట్ కాకపోవడం మైనస్. కథ విషయంలో మరింత కేర్ తీసుకుంటే బాగుండేది. రాకెట్ ప్రయోగం అనేది కామన్ ఆడియెన్స్ కి పెద్దగా అర్థం కాదు, కానీ వాళ్లు చేసిన ప్రయోగాలు మాత్రం నవ్విస్తాయని చెప్పొచ్చు.
శివకుమార్ ధీకొండకు హీరోగా మెప్పించాడు. కొత్త కుర్రాడు అయినా తనదైన నటనతో మెప్పించాడు. నవ్వించే ప్రయత్నం చేశాడు. బాడీలో ఈజ్ ఉంది. తొలి చిత్రంతోనే కొత్త ప్రయత్నం చేశాడు. ఇండస్ట్రీలో నిలబడతాడు. ఇక ఫ్రెండ్స్ గా రవి శివ తేజ అదరగొట్టాడు. అలాగే వంశీధర్ సైతం మెప్పించాడు. గూగుల్ మామ అంటూ అలరించారు. చిన్నపిల్లాడు లోకేష్ నవ్వించడంలో సక్సెస్ అయ్యాడు. చిన్నోడు అయినా బాగా చేశారు. బలగం సత్యనారాయణ పాత్ర అలరిస్తుంది. సినిమా మొత్తం ఆయన పాత్ర ఉంటుంది. వారితోపాటు ఊర్లో సర్పంచ్, ఇతర పాత్రధారులు సహజమైన నటనతో మెప్పించారు.
దర్శకుడు శ్రీనాథ్ చంద్రశేఖర్ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. కొత్త కాన్సెప్ట్‌ను ఎంచుకోవడంతో పాటు దాన్ని వినోదాత్మకంగా తెరకెక్కించాలనే ప్రయత్నం చేశారు. అందులో కొంత వరకు సక్సెస్ అయ్యారు. శ్రీనివాస బి. సినిమాటోగ్రఫీ బాగుంది. గ్రామీణ వాతావరణాన్ని అంతే సహజంగా తెరపై ఆవిష్కరించారు. హర్ష ప్రవీణ్ సంగీతం అందించారు. తెలంగాణ సంస్కృతి, జానపద సంగీత ప్రభావంతో పాటలను రూపొందించారు. పాటలు అలరించాయి. కొరియోగ్రఫీ కూడా ఆకట్టుకుంది. ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా చేయాల్సింది. నిర్మాణ విలువలకు కొదవలేదు. క్వాలిటీగా తెరకెక్కించారు. నిర్మాతల ప్యాషన్ కనిపిస్తుంది.
చంద్రుడిపైకి వెళ్లాలనే నలుగురు గ్రామీణ యువకుల కలను కామెడీ, అడ్వెంచర్‌తో ముడిపెట్టి తెరకెక్కించిన ప్రయత్నం బాగుంది. కొత్త ప్రయత్నంగా చెప్పొచ్చు. కొత్త తరహా కాన్సెప్ట్ ని ఇష్టపడేవారికి నచ్చుతుంది.
రేటింగ్ : 2.5