Mad Telugu Movie 2023 Review
ఈ మధ్యకాలంలో ఓ చిన్న చిత్రం టీజర్, ట్రైలర్ తో అటెన్షన్ గ్రాబ్ చేసింది అంటే అది మ్యాడ్ సినిమానే. వాటిని చూస్తే పక్కాగా యూత్ అంటే.. నేటితరం యువకుల అభిరుచిని టార్గెట్ చేసుకొని రూపొందించిన చిత్రంగా అనిపించింది.ఎన్టీఆర్ జూనియర్ బావమరిది నార్నే నితిన్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం #Mad ప్రీమియర్స్ వేసారు. కామెడీ బ్లాక్ బస్టర్ 'జాతి రత్నాలు' కంటే ఎక్కువ నవ్విస్తుందని నిర్మాత నాగవంశీ చెప్పిన ఈ సినిమా ఎలా ఉంది? సినిమా నిజంగానే నవ్వించిందా చూద్దాం.
స్టోరీ లైన్ :
ఇంజినీరింగ్ స్టూడెంట్స్ అశోక్ (నార్నే నితిన్), మనోజ్ (రామ్ నితిన్), డీడీ (సంగీత్ శోభన్). మొదటి రోజడు నుంచే వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అవుతారు. వీరితో పాటుగా లడ్డు అనే కుర్రాడు కూడా కలిసి తిరుగుతూంటాడు. అశోక్ ఇంట్రావర్ట్ ఉంటూంటాడు! అశోక్ ని జెన్నీ (అనంతిక సనీల్ కుమార్) ఇష్టపడుతుంది. అశోక్ కూడా మనస్సులో జెన్నీని ఇష్టడుతుంటాడు. కానీ ఒకరికొకరు చెప్పుకోరు. అదో లవ్ స్టోరీ. మరో ప్రక్క మనోజ్ కనిపించిన ప్రతీ అమ్మాయిని ఫ్లర్ట్ చేస్తూంటాడు. ఇలాంటి పులిహార కుర్రాడికి ... శృతి (శ్రీ గౌరీ ప్రియా రెడ్డి)కనపడ్డాక నిజంగానే ప్రేమలో పడతాడు. అయితే ఓ కారణంతో ఆమె అతన్ని దూరం పెట్టి యుఎస్ వెళ్లిపోతుంది. ఇక డీడీ ది మరో టైప్ . తనకు అమ్మాయిలు ఏ అమ్మాయిలు పడరు అని దూరంగా ఉంటూంటాడు.సింగిల్ లైఫే సో బెటర్ అని పాటలు పాడుతూంటాడు. అతనికి ఓ అజ్ఞాత ప్రేమికురాలు లాంటి ఓ అమ్మాయి లవ్ లెటర్ రాస్తుంది. అయితే ఆ అమ్మాయి ఎవరో రివీల్ కాదు. దాంతో ఆ అమ్మాయి ఎవరా అని వెతుకుతూంటాడు. ఇంతకీ ఎవరా అమ్మాయి అనేది ఓ షాక్ అయ్యే ట్విస్ట్ తో తెలుస్తుంది. ఆ ట్విస్ట్ ఏమిటి...అశోక్, జెన్నీలు ఒకరి మనస్సులో మాట మరొకరకు చెప్పుకున్నారా... మరో ప్రక్క మనోజ్ ప్రేమ కథలో అపార్దాలు తొలిగాయా...ఈ కథలో రాధ (గోపికా ఉదయన్) క్యారక్టర్ ఏమిటి... అన్న విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎనాలసిస్ ..
ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థుల జీవితాల్లో జరిగే చిలిపి, సరదా సంఘటనలు నేపథ్యంగా రూపొందే సినిమాలు ఎప్పుడూ ఇంట్రస్టింగ్ గానే ఉంటాయి. అక్కడ జరిగే టీజింగ్ లు, ర్యాంగింగ్ లు మనని కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్తాయి. కాలేజీల్లో చదువుతున్న వాళ్లకయితే తమ జీవితాలను,సరదాలను తెరపై చూసుకున్నట్లు ఉంటుంది. అయితే వాటిని అంతే అందంగా,న్యాచురల్ గా తెరకెక్కిస్తేనే అవన్నీ జరుగుతాయి. అ విషయంలో చాలా వరకూ దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. దానికి తోడు పూర్తి ఫన్ డైలాగులతో కథను ముందుకు తీసుకెళ్లటం ప్లస్ అయ్యింది. డబుల్ మీనింగ్ లా అనిపించినా కొన్ని డైలాగులు బాగానే పేలాయి. అలాగే ఈ సినిమా ముగ్గురు లవ్ స్టోరీ లు మాత్రమే చెప్పకుండా కాలేజీల్లో జరిగే ర్యాంగింగ్ లు, వేరే కాలేజీతో గొడవలు..ఆ గొడవకు కారణాలు..సీనియర్స్ ఎలా బిహేవ్ చేస్తూంటారు. వంటి విషయాలతో తెరకెక్కించారు. కథ, కథనం అంటూ వెతికితే ఏమీ అనిపించదు. జోక్ లకు నవ్వుతూ నెక్ట్స్ సీన్ లోకివెళ్లిపోవాలన్నట్లుగా స్క్రీన్ ప్లే రాసుకున్నారు.
Mad Movie Teaser
నిజానికి ఇలాంటి స్క్రీన్ ప్లే రాయటమే కష్టం. ఎందుకంటే అన్ని జోక్స్ పేలుతాయనే నమ్మకం ఉండదు. దానికి తోడు హీరో లక్ష్యం అంటూ ఉండదు. కథకో లక్ష్యం అది ఆడియన్స్ ని నవ్వించటమే..ఆ దిశగానే ప్రతీ సీన్ రిపీట్ కాకుండా బోరుకొట్టకుండా స్క్రీన్ ప్లే రెడీ చేసుకోవాలి. అదే చాలా వరకూ చేసారు. కానీ ఫస్టాఫ్ ని ఇంజినీరింగ్ మొదటి సంవత్సరంలో జరిగే పరిచయాలు,స్నేహాలు,ర్యాగింగ్స్ లపై దృష్టి పెట్టారు. సెకండాఫ్ లోనూ అదే ఫన్ ని మెయింటైన్ చేసారు. కాకపోతే కాస్త ఎమోషన్ ని కూడా కథలోకి తీసుకొస్తే బాగుండేది. బూతు డైలాగులు కాస్త తగ్గిస్తే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఆప్షన్ అయ్యేది. అయితే దర్శక,నిర్మాతలు ఫుల్ క్లారిటీగా ఉన్నట్లున్నారు తమ టార్గెట్ ఆడియన్స్ ఎవరో..వాళ్లకు ఏమి కావాలో. ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ ని కోసం యాక్షన్ సీక్వెన్స్ పెట్టారు. హీరోయిజం ఎలివేషన్ సీన్స్ ఉంచారు. అవే సినిమాలో కలిసినట్లు అనిపించలేదు.
MAD REVIEW
నటీనటుల ఫెరఫార్మెన్స్ ..
ఈ సినిమాలో దాదాపు అందరూ కొత్తవాళ్లే. అయితే అందరూ తగ్గేదేలే అన్నట్లు ఫెరఫార్మ్ చేసారు. ముఖ్యంగా డీడీ, లడ్డు పాత్రలు చేసినవాళ్లు బాగా కనెక్ట్ చేయగలిగారు. డీడీగా సంగీత్ శోభన్ కామెడీని బాగా చేసాడు. అశోక్ గా నార్నే నితిన్ స్క్రీన్ ప్రెజన్స్ బాగుంది.ఈజ్ ఉంది. అమ్మాయి కనపడితే ప్లట్ చేసి పడేసే పాత్రలో రామ్ నితిన్ అనే కుర్రాడు కూడా ఫెరఫెక్ట్ సింక్ అయ్యేలా ఆ పాత్ర చేసారు. హీరోయిన్స్ శ్రీ గౌరీ, ప్రియా రెడ్డి, ఆనంతిక లకు చెప్పుకోదగినంత స్పేస్ లేదు. కానీ ఉన్నంతలో చేసుకుంటూ వెళ్లారు. రఘుబాబు వంటి సీనియర్స్ సినిమాని బ్యాలెన్స్ తప్పకుండా మోసారు. లడ్డూ పాత్రలో నటించిన కుర్రాడు కామెడీ సైడ్ బిజీ అవుతాడనిపిస్తోంది. మిగతా కుర్రాళ్లలో బాగా చేసిన వాళ్లు ఉన్నారు కానీ కొత్తవాళ్లు కావటంతో ఫలానా అని గుర్తు పెట్టుకుని చెప్పలేము.అనుదీప్ కనపడిన కాసేపు మంచి రెస్పాన్స్ వచ్చింది.
MAD REVIEW
టెక్నికల్ గా ..
దర్శకుడు మాగ్జిమం అందరూ కొత్త వాళ్లు అయినా ఎక్కడా తడబడకుండా మంచి ఫెరఫార్మెన్స్ రాబట్టి..జోక్ లు పేలేలా చేసారు. ఇది ఓ రకంగా కత్తిమీద సామే. ఆ విషయంలో డైరక్టర్ వంద శాతం సక్సెస్ అయ్యినట్లే. ఇక నిర్మాత చిన్న సినిమా అనుకోకుండా టెక్నికల్ గా మంచి స్టాండర్డ్స్ తో రూపొందించారు. శామ్‌దత్ సైనుదీన్, దినేష్ కృష్ణన్ సినిమాటోగ్రఫీ సినిమాకు రిచ్ లుక్ తెచ్చింది. ఎడిటర్ నవీన్ నూలిని కూడా ఎక్కడా ల్యాగ్ లేకుండా పరుగెత్తించారు. భీమ్స్ సిసిరోలియో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చారు. పాటల్లో రెండు బాగున్నాయి. అయితే అవి బయిట విన్నంతగా థియేటర్ లో చూసేటప్పుడు అనిపించలేదు. నిర్మాత బాగా నమ్మినట్లున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో రాజీ పడలేదు.
MAD REVIEW
నచ్చినవి:
ఫస్ట్ టైమ్ డైరక్షన్ అయినా సీనియర్ లా అనిపించటం
పంచ్ డైలాగ్స్
ప్రెష్ నెస్
సంగీత్ శోభన్
నచ్చనవి :
అక్కడక్కడా వచ్చే బూతు డైలాగులు
MAD REVIEW
ఫైనల్ థాట్
హ్యాపీడేస్, త్రీఇడియట్స్ ని ఫన్ వెర్షన్ లో చెప్తే ఎలా ఉంటుంది..అనుకుని చేసినట్లు ఉన్న ఈ సినిమా కాలేజీ కుర్రాళ్లకు పడితే టైటిల్ తగ్గట్లే మ్యాడ్ నెస్ తో థియేటర్స్ ఊగుతాయి. ఎందుకంటే టార్గెట్ ఆడియన్స్ వాళ్లే కాబట్టి.
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2.75
MAD REVIEW
బ్యానర్: సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్యూన్ ఫోర్ సినిమాలు
నటీనటులు: నార్నే నితిన్, సంగీత శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరి ప్రియారెడ్డి, అనంతిక సానిల్ కుమార్, గోపికా ఉద్యాన్, రఘుబాబు, రచ్చ రవి, మురళీధర్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, ఆంథోని తదితరులు
మ్యూజిక్: భీమ్స్ సిసిరోలియో
ఎడిటర్: నవీన్ నూలి
డీవోపీ: షాందత్ సాయినుద్దీన్, దినేష్ కృష్ణన్ బీ
ఆర్ట్: రామ్ అరసవిల్లి
స్క్రీన్ ప్లే: ప్రవీణ్ పట్టు, ప్రణయ్ రావు తక్కలపల్లి
ఫైట్ మాస్టర్: కరుణకరన్
రచన, దర్శకత్వం: కల్యాణ్ శంకర్
సమర్పణ: ఎస్ నాగవంశీ
నిర్మాతలు: హారికా సూర్యదేవర, సాయి సౌజన్య
విడుదల తేదీ: 06, అక్టోబర్ 2023