శ్రీకాంత్ అడ్డాల 'పెదకాపు' రివ్యూ

First Published | Sep 29, 2023, 1:37 PM IST


   1982లో ఎన్టీఆర్  పార్టీ పెట్టినపుడు  దాదాపు 294 మందిని కొత్తవారిని ఎంపిక చేశారు. అప్పుడు వచ్చిన రాజకీయ సమీకరణాల నేపధ్యంలో, కొన్ని సంఘటన ఆధారంగా ఫిక్షన్ ని జోడించి చేసిన కథ ఇది. 
 

Pedda Kapu -1 Movie Review


మొదటి నుంచి  దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల సినిమా అంటే ఫ్యామిలీ సెంటిమెంటే. అయితే ఆయన  పూర్తిగా యాక్షన్ టర్న్ తీసుకుని చేసిన విలేజ్ డ్రామా ఇది. చాలా బలమైన సామజిక అంశాన్ని స్పృశించినట్టు సీన్లు, డైలాగులు తో ట్రైలర్ వదిలారు. అలాగే ఒక కులాన్ని ఉద్దేసిస్తున్నట్లుగా  పెదకాపు టైటిల్ పెట్టడం కూడా ఉన్నంతలో సినిమాపై కొంత బజ్ క్రియేట్ కావటానికి కలిసివచ్చింది. అయితే అసలు ఈ సినిమా కథ ఏమిటి...అనురాగ్ కశ్యప్ తీసిన గ్యాంగ్స్ అఫ్ వసేపూర్ టైప్ లో ఫిల్మ్ ఉంటుందని జరిగిన ప్రచారంలో నిజం ఉందా, ఈ టైటిల్ పెట్టడానికి కథ పరంగా కారణమేమిటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 

Srikanth Addala Peddha Kapu 1


స్టోరీ లైన్

అది 1980..  రాజమండ్రి దగ్గరలోని ఓ లంకగ్రామం.అప్పుడే అన్నగారు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి జనాల్లోకి వెళ్తున్న సమయం. ఆ లంక గ్రామాన్ని ఇద్దరు పెత్తందార్లు లాంటి పెద్ద మనుష్యులు  సత్యరంగయ్య (రావు రమేష్) బయన్న (  అడుకాలం నరేన్) ఏలుతున్నారు. ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడదు. తమ అధికారం కోసం ఎంతమందిని అయినా బలిపెట్టడానికైనా రెడీ అన్నట్లు ఉంటారు..అప్పుడప్పుడూ బలి పెడుతూంటారు. హింస వారి ఆయుధం. ఇక   పెదకాపు (విరాట్ కర్ణ) తన అన్నయ్యతో  కలిసి రావు రమేష్ దగ్గర అనుచరుడుగా పని చేస్తుంటారు. తన యజమాని  సత్యరంగయ్య కోసం  పెదకాపు అన్న జైలుకి వెళ్తాడు.  అయితే జైలుకు  వెళ్ళిన అతను మాయమైపోతాడు.  అతను ఏమయ్యాడు?  అప్పుడు అతని తమ్ముడు పెదకాపు...ఏం చేసాడు, సత్యరంగయ్య, బయన్న లపై ఎందుకు యుద్దం ప్రకటించాడు? ఆ తర్వాత సీన్ లోకి వచ్చిన  కన్నబాబు ( శ్రీకాంత్ అడ్డాల)ఎవరు... సెకండాఫ్ లో కథను మలుపు  అక్కమ్మ ( అనసూయ)  పాత్ర ఏమిటి... వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  
 


peda kapu


విశ్లేషణ

బ్రహ్మోత్సరం భీబత్సమైన ఫ్లాఫ్ ...దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలని బాగా భయపెట్టినట్లుంది. మహేష్ బాబు ఎంత ధైర్యం చెప్పినా ఆయన మనస్సు మాత్రం మనం ఇంక ఇలాంటి సినిమాలకు దూరంగా ఉండాలనే మాట చెప్పినట్లుంది. దాంతో కృత్రిమమైన సెట్స్, శృతిమించిన ప్రేమానురాగాలకు స్వస్ది చెప్పి రా,రస్టిక్ కంటెంట్ వైపు ఆయన మరిలారు. మరీ ముఖ్యంగా నారప్ప (అసురన్ రీమేక్) అందుకు దారి చూపించినట్లుంది. ఈ క్రమంలో నారప్ప కు రంగస్దలం కలిపి  వండినట్లున్న ఈ సినిమాని వదిలారు. అయితే ఇలాంటి కథలకు ప్రస్తుతం ఫామ్ లో ఉన్న హీరోలు దొరకటం కష్టం. అందుకే భారీ బడ్జెట్ పెట్టగల లాంచింగ్ కు రెడీగా ఉన్న హీరోతో సినిమా చేసారు. భిన్న కులవర్గాల పోరులో అగ్ర వర్ణాలు సామాన్యుల మధ్య జరిగే పోరు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో కోర్ థీమ్ గా తీసుకున్నారు.    అణచివేత, ఘర్షణల నేపథ్యంలో  హీరో క్యారెక్టర్ ఆర్క్ ఒక సామాన్యుడి నుండి ఇద్దరు శక్తివంతమైన వ్యక్తులకు వ్యతిరేకంగా అతను చేసే పోరాటంగా ప్రయాణం సాగుతుంది. ఇది మనకు తక్కువ కానీ తమిళంలో ఆల్రెడీ సక్సెస్ అవుతున్న ఫార్ములా. ఐడియా దగ్గర నుంచి అంతాబాగానే ఉంది కానీ అందుకు తగ్గ  కథ,రేసీగా పరుగెత్తే స్క్రీన్ ప్లే ను మాత్రం చేసుకోలేదు. కొన్ని   బోల్డ్ సీన్స్,  హింస, రక్త పాతం, స్ట్రాంగ్ డోస్ తో కూడిన  డైలాగులతో సినిమాని లాగేసే ప్రయత్నం చేసారు. అందుకు మంచి టెక్నీషియన్స్ ని,ఆర్టిస్ట్ లను  బోర్డ్ లోకి తెచ్చారు. అయితే రక్తపాతంలో వాళ్లంతా తడిసి ముద్దయ్యారు. మెల్లిమెల్లిగా సినిమా గ్రాఫ్ తో పాటు డోస్  పెంచుకుంటూ పోయారు. 
 

Pedda Kapu -1 Movie Review


దాంతో సెకండాఫ్ తో సహా మొత్తం  చూసాక ఫస్టాఫ్ డీసెంట్ గా ఉందనిపిస్తుంది. అయితే శ్రీకాంత్ అడ్డాల విషయం ఉన్న దర్శకుడు. దాంతో అక్కడక్కడా మెరుపులు మెరుస్తాయి. ముఖ్యంగా ఇంట్రవెల్ సీన్స్ మంచి హై ఇచ్చేలా డిజైన్ చేసారు. అయితే ఎమోషన్ తో అంతకు ముందు సినిమాల్లో ఆడుకున్న ఆయన ఇక్కడ పెద్ద ప్రయారిటి ఇవ్వరు. రంగస్దలం లో రంగమ్మత్త మాదిరిగానే ఇక్కడ అనసూయను అక్కమ్మ పాత్రలో చూపించి కథను మలుపు తిప్పుతాడు. అయితే మలుపు అయితే తిరుగుతుంది కానీ అక్కడ నుంచి తర్వాత ఏం జరుగుతుందో ఇట్టే తెలిసిపోతుంది. ఇక ఇంట్రవెల్ అంత దుమ్ము రేపారు కదా ..క్లైమాక్స్ ఏ రేంజిలో ఉంటుందో అంటే జస్ట్ ఓకే అన్నట్లు సెకండ్ పార్ట్ కు లీడ్ ఇస్తూ ముగుస్తుంది. ఒకే పార్ట్ గా కన్ఫూజింగ్ లేకుండా కథ రాసుకుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. అయితే కొత్త కుర్రాడిపై బడ్జెట్ వర్కవుట్ కాదని సెకండ్ పార్ట్ కోసం స్లో నేరేషన్ లో నడుపుతూ ఈ కథనం ఎంచుకున్నట్లున్నారు. సీన్స్ వస్తూంటాయి వెళ్తూంటాయి కానీ డ్రామా బిల్డప్ కాదు.   సీతమ్మ వాకిట్లో , కొత్త బంగారు లోకం వంటి సినిమాల్లో సీన్స్ నడిపిస్తాయి. కానీ ఇలాంటి వైలెన్స్ సినిమాల్లో ఎంగేడింగ్ గా డెప్త్ గా హ్యూమన్ ఎమోషన్స్ తో నడిచే  డ్రామానే కనెక్ట్ చేయగలగాలి.  అది అంతగా జరగలేదు.  ప్రి క్లైమాక్స్ లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ని ఎలివేట్ చేస్తూ సీన్స్ ఉంటాయి. అప్పటి టీడీపి హవాను పూర్తి స్దాయిలో  చూపెడుతూ చూపెట్టినా ఆ అభిమానులు ఖచ్చితంగా కనెక్ట్ అయ్యేవారు. అయితే సెకండ్ పార్ట్ కోసం  ఆ సీన్స్  దాచి ఉంచారేమో.  ఎలక్షన్స్ ముందు ఆ సెకండ్ పార్ట్ వస్తే పార్టీ ప్రచారానికి కూడా ఆ సీన్స్ ఉపయోగపడతాయి. 
 

Pedda Kapu -1 Movie Review


ఎవరెలా చేసారు

కొత్త కుర్రాడు  కత్తి బాగానే పట్టాడు కానీ...అందుకు తగ్గ ఎమోషన్ ని మనలో పుట్టించలేకపోయాడు. అలాగే  కొన్ని చోట్ల ఆ బరువు ని మోయలేకపోయాడనిపించింది. చూడ్డానికి బాగున్న ఈ కుర్రాడు డిక్షన్, డబ్బింగ్ జాగ్రత్తపడితే తెలుగు తెరకు మరో యాక్షన్ హీరో దొరికినట్లే. హీరోయిన్ ప్రగతి శ్రీవాస్తవ లుక్స్ బాగున్నాయి కానీ చేయటానికి కథలో స్కోప్ లేదు. శ్రీకాంత్ అడ్డాల సినిమాల్లో రావురమేష్ పాత్రకు ప్రత్యేకమైన స్కోప్ ఉంటుంది. ఈసారి ఉంది. అనసూయ కూడా ఈ సినిమాలో మంచి క్యారక్టర్. కొంతకాలం గుర్తుంటుంది. తణికెళ్ల భరణి, నాగబాబు, అనసూయ, ఈశ్వరి రావు వంటి సీనియర్స్ ఎప్పటిలా  చేసుకుంటూ పోయారు. నటుడుగా కీలకమైన పాత్రలో కనిపించిన శ్రీకాంత్ అడ్డాల మాత్రం కొత్తగా ఉన్నారు..డిఫరెంట్ గా తనను తాను ప్రెంజెంట్ చేసుకున్నారు.

Pedda Kapu -1 Movie Review


టెక్నికల్ గా 

ఇది పూర్తిగా ఛోటా కె నాయుడు  సినిమా. ఆయన విజువల్స్ తో విశ్వరూపం చూపించారు.   మిక్కీ జె మేయర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చినట్లుగా పాటలు ఇవ్వలేదు.  మార్తాండ్ కె వెంకటేష్ సీన్స్ లో వేగం పెంచి ఉంటే బాగుండేది. ఇక యాక్షన్ డైరెక్టర్ పీటర్ హెయిన్స్  చాలా రోజులు తర్వాత గుర్తుండిపోయే ఫైట్స్‌ ఇచ్చారు.  స్క్రీన్ ప్లే ఇంకాస్త పరుగెడితే సినిమా రూపు,రేఖలు వేరేగా ఉండేవి. డైలాగులు బాగున్నాయి. దర్శకుడుగా శ్రీకాంత్ అడ్డాల  ఈ సినిమా కు అయినా స్లో నెరేషన్ ఫాలో అవ్వటం మాని కొంత స్పీడ్ ని పాటించాల్సింది.   జిఎం శేఖర్ ఆర్ట్ వర్క్ మనలని ఎనభైల్లోకి తీసుకెళ్తుంది. అఖండ స్దాయి ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమాలో కనిపిస్తాయి. 

Pedda Kapu -1 Movie Review

నచ్చేవి

అదిరిపోయే విజువల్స్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
కొత్త కుర్రాడి ఫెరఫార్మెన్స్ 

 నచ్చనవి
విపరీతమైన హింస
సరైన డ్రామా లేకపోవటం
ఎమోషన్స్ వైపు కథ నడపకపోవటం
ఎప్పటిలాగే శ్రీకాంత్ అడ్డాల తన ట్రేడ్ మార్క్ స్లో నెస్

Pedda Kapu -1 Movie Review

 
ఫైనల్ థాట్

శ్రీకాంత్ అడ్డాల చేత అప్పట్లో 'రంగస్దలం' కు వెర్షన్ రాయించి, అది వాడక అలా ఉండి పోతే ఇప్పుడు బయిటకు తీసి తెరకెక్కించినట్లుంది.  ఏదైమైనా ఈ సినిమా సెకండ్ పార్ట్ చూస్తే కానీ  పెదకాపుని.. పెద్ద తోపు అనలేని పరిస్దితి.   
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating: 2.25/5 
 

Pedda Kapu -1 Movie Review


బ్యానర్: ద్వారకా క్రియేషన్స్
నటీనటులు: విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ, రావు రమేష్, నాగబాబు, తనికెళ్ల భరణి, బ్రిగడ సాగ, రాజీవ్ కనకాల, అనసూయ, ఈశ్వరి రావు, నరేన్ తదితరులు.
 సంగీతం :  మిక్కీ జె మేయర్
డీవోపీ : చోటా కె నాయుడు
ఎడిటర్:  మార్తాండ్ కె వెంకటేష్
ఫైట్స్: పీటర్ హెయిన్స్
కొరియోగ్రాఫర్:  రాజు సుందరం
ఆర్ట్:  జిఎం శేఖర్
రన్ టైమ్:  2 Hr 29 Mins
రచన, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల
నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి
విడుదల తేదీ : 29, సెప్టెంబర్ 2023.

Latest Videos

click me!