`800` మూవీ రివ్యూ, రేటింగ్‌..

First Published | Oct 5, 2023, 10:30 AM IST

800 వికెట్లు తీసి వరల్డ్ రికార్డ్ క్రియేట్‌ చేసిన ముత్తయ్య మురళీధరన్‌ జీవితం నేపథ్యంలో `800` పేరుతో బయోపిక్‌ని రూపొందించారు. ఈ నెల 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఇక ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించారు. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.  

స్పోర్ట్స్ బయోపిక్‌ చిత్రాలకు ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తుంది. గెలిచేందుకు వారు పడే బాధ, సంఘర్షణ, వారి జర్నీ ఇన్‌స్పైరింగ్‌గా ఉంటాయి. అందుకే ఆడియెన్స్ వాటిని చూసేందుకు ఇష్టపడుతుంటారు. క్రికెటర్స్ బయోపిక్స్ లో ఇప్పటికే `ఎంఎస్‌ ధోనీ`ది పెద్ద హిట్‌ అయ్యింది. కపిల్‌ దేవ్‌ బయోపిక్‌ `83`ప్రశంసలందుకుంది. ఇప్పుడు మరో బయోపిక్‌ వస్తుంది. శ్రీలంక స్పిన్‌ బౌలర్‌, టెస్ట్ క్రికెట్‌లో 800వికెట్లు తీసి వరల్డ్ రికార్డ్ క్రియేట్‌ చేసిన ముత్తయ్య మురళీధరన్‌ జీవితం నేపథ్యంలో `800` పేరుతో బయోపిక్‌ని రూపొందించారు. ఎంఎస్‌ శ్రీపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మూవీ ట్రైన్‌ మోషన్ పిక్చర్స్ పతాకంపైవివేక్‌ రంగాచారి నిర్మించగా శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్‌ తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. ఈ నెల 6న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించారు. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 
 

కథః

ముత్తయ్య మురళీధరన్‌ ది(మధూర్‌ మిట్టర్‌) తమిళనాడు నుంచి శ్రీలంకకి వలస వెళ్లిన ఫ్యామిలీ(శరణార్థులు). ముత్తయ్యకి చిన్నప్పట్నుంచి క్రికెట్‌ అంటే ఇష్టం, కసి, ప్యాషన్‌. గల్లీలోనూ క్రికెట్‌ ఆడేందుకు ఆరాటపడుతుంటారు. కానీ అక్కడ తమిళులపై కొందరు సింహాలియులు(శ్రీలంక) తరచూ దాడి చేస్తుంటారు. ఈ క్రమంలో తన తండ్రి బిస్కెట్ ఫ్యాక్టరీని కూడా కాల్చేస్తారు. అయినా తాను మాత్రం క్రికెట్‌ని వదల్లేదు. చర్చ్ లో ఫాదర్‌ సహకారంతో క్రికెట్‌ నేర్చుకుంటాడు. దానికి పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తాడు. క్రికెటర్‌గా ఎదిగే ప్రతి చోట అవమానాలు, అడ్డంకులు ఎదురవుతుంటాయి. ఎవరో ఒకరు ఏదో రూపంలో అడ్డంకులు క్రియేట్‌ చేస్తూనే ఉంటారు. అవమానిస్తూనే ఉంటారు. వాటిని దిగమింగుకుని, పడుతూ లేస్తూ క్రికెటర్‌గా ఎదుగుతాడు. అయితే ఇంటర్నేషన్‌ క్రికెట్‌ టీమ్‌కి సెలక్ట్ కావడానికి ఆయన ఎలాంటి స్ట్రగుల్‌ ఫేస్‌ చేశాడు, సెలక్ట్ అయినా, ఆడేందుకు ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదు? పై స్థాయిలో జరిగే చిన్న చూపేంటి? అంతర్జాతీయ క్రికెట్‌లో తన బౌలింగ్‌లో తలెత్తిన సమస్య ఏంటి? ఆయన కెరీర్‌ ఎందుకు వివాదంగా మారింది? దాన్ని ముత్తయ్య మురళీ ధరన్‌ ఎలా ఎదుర్కొన్నాడు. ఎందుకు తాను సడెన్‌గా రిటైర్‌మెంట్ ప్రకటించాడు? అనేది ఈ సినిమా కథ. 
 


విశ్లేషణః 

శ్రీలంక బౌలర్‌ ముత్తయ్య మురళీధరన్‌ బయోపిక్‌ కావడంతో ఆయన జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలు, బాధలు, సంఘర్షణ, క్రికెటర్‌గా ఎదిగేందుకు ఆయన ఎదుర్కొన్న ఆటుపోట్లని, అవమానాలను, క్రికెట్‌ కంటే దాని వెనకాల ఉండే పాలిటిక్స్ ని ఈ చిత్రంలో చూపించే ప్రయత్నం చేశారు. ఈ సినిమాలో ప్రధానంగా ముత్తయ్య మురళీధరన్‌ క్రికెట్‌ ఆట ఆడిన తీరు కంటే దాని వెనకాల ఎదుర్కొన్న సంఘర్షణనే హైలైట్‌ చేశారు. ఆయన పెయిన్‌ని వెండితెరపై ఆవిష్కరించారు. తన జీవితంలో చాలా వివాదాలున్నప్పటికీ, వాటిని లైటర్‌ వేలో టచ్‌ చేస్తూ, తనకు ఎదురైన అవమానాలను, వాటికి మురళీధరన్‌ తన బంతితో ఎలా సమాధానం చెప్పాడనేది ఇందులో చూపించారు. తమిళీయుడు శ్రీలంక వాసి కాదని, తమ దేశం విడిచి వెళ్లిపోవాలనే దాడుల పరిస్థితి నుంచి తాను శ్రీలంక వాడినే అని, తాను ఓ క్రికెటర్‌ని అని, దేశం గర్వించేలా ముత్తయ్య మురళీధరన్‌ ఎదిగిన తీరుని, ఈ జర్నీని ఇన్‌స్పైరింగ్‌గా తెరకెక్కించాడు. శ్రీలంక దేశానికి అంతర్జాతీయంగా కీర్తిని తెచ్చిపెట్టిన ఆటగాడిగా చూపించారు దర్శకుడు ఎం ఎస్‌ శ్రీపతి. 

సినిమా మొదటి భాగంలో చాలా తాను చిన్నప్పట్నుంచి క్రికెటర్‌గా ఎదిగిన జర్నీని, ఆయా అంశాలను చాలా డిటెయిల్‌గా చూపించారు. బ్రిటీష్‌ ఆటగాళ్ల నుంచి క్రికెట్‌ సౌత్‌కి ఎలా పాకిందో వివరించారు. అందులో ప్రధానంగా స్కూల్‌ దశ నుంచే ప్రాంతీయ వివక్షని ఫేస్‌ చేసిన తీరు హృదయాన్ని కదిలిస్తుంది. దాన్ని పంటికింద అదిమి పట్టుకుని తనకు అవమానం ఎదురైన ప్రతిసారి తన బంతితో సమాధానం చెప్పిన తీరు ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఎమోషనల్‌గా అనిపిస్తుంది. మరోవైపు స్టేట్‌ లెవల్స్ లో చేసే ర్యాంగింగ్‌, ప్రతి దశలో తనని అడ్డుకునేందుకు ఇతరులు ప్రయత్నాలు చేయడం వంటివి బాధాకరంగా అనిపిస్తాయి. అయితే తనకు అవమానాలు ఎదురైనట్టుగానే తనని వెన్ను తట్టి ముందుకు నడిపించే తోటి క్రికెటర్లు కూడా ఉన్నారని చెప్పే ప్రయత్నం చేశారు.  తాను జాతీయ స్థాయిలో తొలి ఆట ఆడేందుకు ఆరటపడుతుండగా, అనూహ్యంగా జరిగిన బాంబ్‌ బ్లాస్ట్ ఆయన కలలను చెదరగొడుతాయి. అంతేకాదు దేశ ద్రోహి అని, టెర్రరిస్ట్ లుగా ముద్ర వేసినప్పుడు ముత్తయ్య మురళీ ధరన్‌ ఎంతగా మదన పడ్డాడో, ఎంతో కుంగిపోయాడో వెండితెరపై కళ్లకు కట్టినట్టు ఆవిష్కరించాడు.
 

మరోవైపు అంతర్జాతీయ క్రికెట్‌కి సెలక్ట్ అయినా, ఆడే అవకాశం ఇవ్వకపోవడం, అక్కడ కూడా పాలిటిక్స్ చేయడం, మరోవైపు అంతర్జాతీయ క్రికెట్‌లో రాణిస్తున్న క్రమంలో అనూహ్యంగా ఆయన్ని పక్కన పెట్టడం, ఆస్ట్రేలియా తో ఆడేటప్పుడు ఏకంగా ఒకే టెస్ట్ మ్యాచ్‌లో 16 వికెట్లు తీసి వారిని దెబ్బకొట్టగా, దానికి ప్రతికారంగా, తన చేతి వాటం, విసిరే తీరునే ప్రశ్నించడం, దీనికి సంబంధించి ఆయన ఐసీసీ వద్ద పరీక్షని, తన నిజాయితీని నిరూపించుకునే తీరు, ఆయ సన్నివేశాలు ఉత్కంఠ భరితంగా అనిపిస్తాయి. హృదయాన్ని కదిలిస్తాయి. అయినా వాటిని ఓపికతో ఎదుర్కొని తాను తప్పు చేయలేదని, ఎవరినీ మోసం చేయడం లేదని చాటి చెప్పిన తీరు శెభాష్‌ అనిపిస్తుంది. ఆయా సందర్భాల్లో ముత్తయ్య మురళీధరన్‌ హుందాగా వ్యవహరించిన తీరు ఇన్‌స్పైరింగ్‌గా అనిపించడమే కాదు, ఓ గొప్ప ఆటగాడి లక్షణాన్ని చాటి చెబుతుంది. మరోవైపు ఎల్‌టీటీ నాయకుడితో ఆయన మాట్లాడిన తీరు, ఆ విషయంలో ఆయన తీసుకున్న స్టాండ్‌ వాహ్‌ అనేలా ఉంటుంది. చివరికి క్రికెట్‌కి ఎలాంటి సందర్భంలో రిటైర్ మెంట్‌ ప్రకటించాల్సి వచ్చిందో, అందుకు ఆయన ఎంత కుమిలిపోయాడు, ఎంత బాధపడ్డాడో ఆయా సీన్లు గుండెని బరువెక్కిస్తాయి. 
 

అయితే ముత్తయ్య మురళీధరన్‌ జీవితంలో చాలా వివాదాలు, పెయిన్‌ ఉంది. గెలుపు కంటే గెలుపు కోసం పడ్డ బాధే ఎక్కువగా ఉంటుంది. దాన్ని ఈ చిత్రంలో కాస్త లైటర్‌ వేలోనే టచ్‌ చేసినట్టు అనిపిస్తుంది. డిటేయిలింగ్‌ గా చెప్పే క్రమంలో ల్యాగ్‌ అనిపిస్తుంది. ఏ సినిమాకైనా ఎమోషన్‌, డ్రామా ముఖ్యం. ఇలాంటి బయోపిక్‌లో అవి ఇంకా ఎక్కువ అవసరం. కానీ ఇందులో ఆయా అంశాలపై దర్శకుడు అంత ఫోకస్‌ పెట్టలేదనపిస్తుంది. మరింత ఎంగేజింగ్‌గా తీయాల్సింది. ఎమోషన్‌ సినిమా అంతా క్యారీ కాలేదు. అది కొన్ని బ్లాక్‌లకే పరిమితం చేశారు. దీంతో సినిమా మొత్తం ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉండదు, సీన్లు చూస్తున్న ఫీలింగే కలుగుతుంది. డ్రామాలో డెప్త్ తగ్గింది, ఎమోషన్‌లో ఘాడత తగ్గింది. అవి మరింత పెట్టి ఉంటే సినిమా బాగుండేది. దీనికితోడు బీజీఎం కూడా కథకి, డ్రామాకి సరితూగేంతగా లేదు. అది కూడా కొంత మైనస్‌గా మారింది. ఎమోషన్స్, డ్రామాపై మరింత ఫోకస్ పెడితే ఫలితం ఇంకా బాగుండేది. మొత్తానికి ఇదొక నిజాయితీతో కూడిన ప్రయత్నమని చెప్పొచ్చు. 

నటీనటులుః 

ముత్తయ్య మరళీధరన్‌ పాత్రలో మధుర్‌ మిట్టల్‌ అదరగొట్టాడు. పాత్రలో జీవించేశాడు. సినిమా చూస్తున్నంత సేపు ముత్తయ్య మురళీధరన్‌నే చూస్తున్నామనే ఫీలింగ్‌ కలుగుతుంది. బాడీ లాంగ్వేజ్‌ నుంచి, ఆయన హవభావాలు, యాక్షన్‌, బౌలింగ్‌ వేసే తీరు అచ్చు గుద్దేశాడు. అదే సమయంలో ఎమోషనల్‌ సీన్లలోనూ అదరగొట్టాడు. కళ్లతోనే నటించి మెప్పించాడు. ఫేస్‌లోనే అన్ని ఎమోషన్స్ చూపించిన తీరు బాగుంది. ఆ తర్వాత నాజర్‌ పాత్ర ఆకట్టుకుంటుంది. ఆయన చేసుకుంటూ వెళ్లిపోయారు. నరేన్‌ సీన్లు కూడా బాగున్నాయి. ఇక ముత్తయ్య మురళీ ధరన్‌ పేరెంట్స్, బామ్మ కూడా బాగా చేశారు. అయితే మనకు తెలిసిన ఫేసులు లేకపోవడంతో ఆయా పాత్రలతో అంత ఈజీగా కనెక్ట్ కాలేం. ఇక అర్జున్‌ రణతుంగ పాత్రని హైలైట్‌గా చూపించారు. ఆ పాత్రలో నటుడు చాలా బాగా చేశాడు. మిగిలిన ఆర్టిస్టులు కూడా సహజంగా నటించారు. ముత్తయ్య గర్ల్ ఫ్రెండ్‌గా మహిమ కనిపించిన కాసేపు మెప్పించింది. 
 

టెక్నికల్‌గాః
ఇలాంటి ఎమోషనల్‌ మూవీస్‌లో సంగీతం పాత్ర కీలకం. బీజీఎం బ్యాక్‌ బోన్‌లా ఉండాలి. ఆ విషయంలో జిబ్రాన్‌ వంద శాతం న్యాయం చేయలేడనిపిస్తుంది. ఎమోషన్‌ని ఎలివేట్‌ అయ్యేలా ఆయన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ లేదు. పాటలన్నీ బ్యాక్‌ గ్రౌండ్‌లోనే వస్తుంటాయి కాబట్టి వాటిని ఇంకా బెటర్‌గా ఇవ్వాల్సింది. ఇక ఆర్డీ రాజశేఖర్‌ విజువల్స్ బాగున్నాయి. లావిష్‌గా, రిచ్‌గా ఉంటాయి. ముఖ్యంగా ముత్తయ్య పాత్రని, ఆయన హవభావాలను క్యాప్చర్‌ చేసిన తీరు బాగుంది. ఎడిటింగ్‌ పరంగా ఇంకా కేర్‌ తీసుకోవాల్సింది. ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌ బాగున్నాయి. దర్శకుడు శ్రీపతి చాలా విషయాలను డీటెయిలింగ్‌గా చూపించే ప్రయత్నం చేశాడు.  ఈ క్రమంలో బ్యాలెన్స్ మిస్‌ అయ్యాడు. అది కొంత లాగ్‌ ఫీలింగ్‌ అనిపిస్తుంది. ఆయన భావోద్వేగాలు, ముత్తయ్య ఎదుర్కొన్న సంఘర్షణ, బాధలను మరింత ఎలివేట్‌ అయ్యేలా తెరకెక్కించాల్సింది. అదే సమయంలో తెలిసిన కథనే చెబుతున్నట్టుగా ఉంది, ఇంకా కొత్త విషయాలు చూపిస్తే బాగుండేది. కొంత ఎంటర్‌టైన్‌మెంట్స్ కూడా ప్రయత్నం చేయాల్సింది. ఏదేమైనప్పటికీ హానెస్ట్ గా జీవిత కథని వెండితెరపై ఆవిష్కరించాడు.  

ఫైనల్‌గాః `800`.. లెజెండరీ క్రికెటర్‌ ముత్తయ్య మురళీధరన్‌ ఇన్‌స్పైరింగ్‌ జర్నీ..  

రేటింగ్‌ః 3

Latest Videos

click me!