Tuck Jagadish Review
ఈ మధ్యకాలంలో ఏ రిలీజ్ కు ముందు జరగనంత ఎమోషనల్ డ్రామా ఈ సినిమాకు జరిగింది. ఓటీటిలో రిలీజ్ చేయటం పెద్ద తప్పు అన్నట్లుగా క్షమాపణలు,తప్పు చేసావంటూ వేలెత్తి చూపటాలు, మళ్లీ సారీ లు చెప్పుకోవడాలు ఇలా చాలా చిత్రాలు ఈ సినిమా కు జరిగాయి. ఏదైతేనేం అనుకున్నట్లుగా ఓటీటిలోనే సినిమా రిలీజైంది. టక్ చేసిన నాని మన ముందుకు వచ్చాడు. ఇన్ని విమర్శలు, భారీ అంచనాల నడుమ అమెజాన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన టక్ జగదీష్ ఎలా ఉన్నాడు? నచ్చాడా? నచ్చుబాటు చేసుకోవాలా? ఓటీటిలో చూస్తే చాలనిపించే సినిమానా లేక థియోటర్ ఎక్సపీరియన్స్ కోరుకునే మూవీనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
Tuck Jagadish Review
కథ
భూదేవిపురంఊరు అంటే భూమి తగాదాలుకు పెట్టింది పేరు. ఆ ఊరి పెద్ద,భూస్వామి ఆదిశేషు నాయుడు(నాజర్) . అదే ఊళ్లో రౌడీయిజం చేస్తూ భూములు కబ్జా చేసే రౌడీ లాంటి క్యారక్టర్ వీరేంద్రనాయుడు (డానియర్ బాలాజీ). సహజంగానే వీళ్లిద్దరికి పడదు. వీరేంద్రనాయుడు అన్యాయాలకు గ్రామస్దులు బలైపోకుండా ఆదిశేషు నాయుడు అండగా ఉంటాడు. అంతేకాదు ఓ టైమ్ లో ప్రజలను ఇబ్బందులను నుంచి తొలిగించేందుకు తన భూములకు కూడా ఇవ్వటానికి సిద్దపడతాడు. ఈ లోగా ఆయన అనారోగ్యంతో చనిపోతాడు.
Tuck Jagadish Review
చనిపోయే ముందు తన కుటుంబ బాధ్యతను చనిపోయే ముందు పెద్ద కొడుకు బోసుబాబు(జగపతిబాబు) కు అప్పగిస్తాడు. అయితే బోసుబాబు అంత మంచోడేం కాదు. ఆస్తి మొత్తం తనకే కావాలనే రకం. అందుకోసం అవసరం అయితే ఫ్యామిలీని ఫసక్ చేసేద్దామనుకుంటాడు. ముఖ్యంగా తన తమ్ముడు టక్ జగదీష్(నాని) ను చంపించేందుకు ప్రయత్నిస్తాడు. మరి టక్ జగదీష్ ఊరుకుంటాడా...
Tuck Jagadish Review
టక్ జగదీష్ ఎలాంటోడు అంటే...చిన్నప్పటి నుంచి విలేజ్ పాలిటిక్స్ చూస్తూ పెరిగి, పెద్దయ్యాక వాటిని ఫిక్స్ చేయటానికి ఎమ్మార్యో అవుతాడు. అదే ఊరికి వస్తాడు. ఊరి సమస్యలు, కుటుంబ సమస్యలను కలిపి పరిష్కరించాలనుకుంటాడు. పనిలో పనిగా విలన్ విలన్ వీరేంద్రనాయుడు అంతు చూడాలి. అంతేకాకుండా దాదాపు విలన్ లాంటి తన అన్న బోస్ ని సక్రమ మార్గాన పెట్టి రక్త సంభందం, ..ఆర్దిక సంభందం కన్నా గొప్పది అనిపించేలా చేయాలి. ఈలోగా తన పర్శనల్ లవ్ మ్యాటర్ .. ఆ ఊరి వి.ఆర్.వో గుమ్మడి వరలక్ష్మి (రీతూ వర్మ) నడపాలి.
Tuck Jagadish Review
ఇలా బోలెడు పనులు టోకుగా తన భుజాలపై పెట్టుకున్న జగదీష్ వాటిని మోయగలిగాడా...అందుకు ఏ వ్యూహం అనుసరించాడు.. విడిపోయిన కుటుంబంను ఎలా కలిపాడు.. భూదేవిపురంలో భూ తగాదాలు లేకుండా ఎలా చేశాడు,మధ్యలో మేనకోడలు చంద్రమ్మ(ఐశ్వర్య రాజేష్) మేటర్ ఏమిటి, అసలు బోస్,జగదీష్ సొంత అన్నదమ్ములేనా, అన్నిటికన్నా ముఖ్యంగా జగదీష్ ఆ టక్ చేయటం వెనక ఉన్న కారణం ఏమైనా ఉందా వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
Tuck Jagadish Review
ఎలా ఉంది
కొన్ని సినిమాల్లో అసలు సమస్య లేక హీరో ఏం చేయాలో అర్దం కాక బిక్క చచ్చిపోయి చూస్తూంటాడు. ఈ సినిమాలో సమస్యల సుడిగుండంలో చిక్కుకుని ఊపిరి ఆడనట్లుగా ఉంటాడు మన టక్ జగదీష్. అతను ముందు టార్గెట్ లే టార్గెట్ లు. ఒక దాని తర్వాత మరొక సమస్య తీర్చుకుంటూ పోవాల్సిందే. ఇది స్క్రిప్టు పరంగా పెద్ద టాస్కే. ఇంట్రస్ట్ తగ్గకూడదు. ఈ సినిమానే పెద్ద సమస్యగా చూసేవాడికి అనిపించకూడదు. అయితే ఇందుకోసం పాత సినిమాల రిఫరెన్స్ తీసుకున్నట్లున్నారు. అప్పట్లో వచ్చిన శివరామరాజు సినిమా బాగా గుర్తు వస్తుంది. వస్తే వచ్చిందిలే ఈ జనరేషన్ లో దాన్ని పనిగట్టుకుని చూసేదెవరు అని సరిపెట్టుకుంటే...అసలు సమస్య అంతా ఎమోషన్స్ తెరపై కనపిస్తూంటాయి కానీ మనకు సినిమాతో ఎమోషన్ కనెక్షన్ ఏర్పడకపోవటంతో వస్తుంది. అందుకు కారణం బాగా ఫార్ములా రాసుకున్న ట్రీట్మెంట్ తో నడిచే సీన్స్. దానికి తోడు చూసేవారికి ఎక్కడ అర్దం కాదో అనే భయమో ఏమో కానీ ప్రతీ విషయం విడమర్చిచెప్పుకొచ్చారు.
Nani Tuck Jagadish Review
అలాగే కొన్ని విషయాలకు మరీ పాత రోజుల్లోకి వెళ్ళిుపోయారు. ఉదాహరణకు మేనకోడలకు ఓ చిన్న రిమోట్ ఇచ్చి.. `నీకు బాధొచ్చినప్పుడు బల్బు వెలిగించు` అని చెప్పటం వంటివి...ఈ సెల్ ఫోన్ రోజుల్లో ఏంటిరా అనిపిస్తుంది. అయితే అదే మేనకోడలు తో అనుబంధం, ప్రేమ మనకు నచ్చుతుంది. మన ఇళ్లలో జరిగినట్లే అనిపిస్తుంది. అలాగే మరీ పెదబాబు,ఘర్షణ,బలరామకృష్ణులు లాంటి సినిమాలు గుర్తు వస్తాయనుకున్నాడో ఏమో కానీ నాజర్ కు ఇద్దరి భార్యలు, జగపతిబాబు, నాని సవతి కొడుకులు అనే విషయం కేవలం డైలాగులుతో లేపేసారు. విజువల్ గా ఎస్టాబ్లిష్ చేయలేదు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఫ్యామిలీ సబ్జెక్ట్ ను నాని మార్క్ కాస్త ఎంటర్ టైన్మెంట్ కలిపితే బాగుండేది. అలా చేయకుండా పూర్తిగా ఎమోషనల్ గా యాక్షన్ సన్నివేశాలతోనే నడిపించేందుకు ప్రయత్నించాడు. అయితే నాని నిజాయితో కూడిన ఫెరఫార్మెన్స్, డైరక్టర్ టక్ జగదీష్ పాత్రను మన ఫ్యామిలీలో ఒకడిగా అనిపించాలని చేసిన సీన్స్ కొన్ని బాగా నచ్చుతాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ సీన్స్ సాగతీసిన ఫీలింగ్ రాకుండా ఉంటే బాగుండేది.
Nani Tuck Jagadish Review
బాగున్నవి
నాని నటన,
ఫ్యామిలీ సీన్స్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
బాగోలేనివి
సాగతీసినట్లుగా ఉన్న స్క్రీన్ ప్లే
స్లో గా నడిచే సెకండ్ హాఫ్
నాని నుంచి ఆశించే ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ లేకపోవడం
క్లైమాక్స్ మరీ డల్ గా అనిపించటం.
Nani Tuck Jagadish Review
టెక్నికల్ గా ...
తమన్ పాటలు పెద్దగా కిక్ ఇవ్వలేదు. ఫరవాలేదనిపించాయి. పెద్ద తెరపై చూస్తే ఏమన్నా అనిపించేదేమో. ఇక్కడ స్కిప్ చేయాలనిపించింది. మెలోడి ఒకటి బాగుంది. ఇక సినిమాకి గోపి సుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సోసోగా అనిపించింది. అప్పట్లో ఎస్ ఏ రాజ్ కుమార్ ని గుర్తు చేస్తూ సాగింది. ప్రసాద్ మురెళ్ల సినిమాటోగ్రఫీ ....ఆయన నుంచి ఎక్సపెక్ట్ చేసే అవుట్ ఫుట్ అయితే కాదు. అయితే పల్లె అందాలను సహజంగా చూపించాడు.ఎడిటింగ్ ..స్క్రీన్ ప్లేకు తగ్గట్లు గా లేదు. ఉండుంటే మరింత హై వచ్చి ఉండేది. డైలాగులు నాచురల్ గా బాగున్నాయి ప్రొడక్షన్ వేల్యూస్ బాగున్నాయి.
Nani Tuck Jagadish Review
నటీనటుల్లో
నాని ఎప్పటిలాగే సినిమా మొత్తం తానై కనిపించి మోసే ప్రయత్నం చేసాడు. దాంతో ఇతర కాస్టింగ్ కు ప్రాముఖ్యత లేకుండా పోయింది తెర నిండా జనం కనిపిస్తున్నా ఎవరూ సరిగ్గా ఎస్టాబ్లిష్ కారు. హీరోయిన్స్ రీతూ వర్మ మరియు ఐశ్వర్య రాజేష్ లు తన ప్రయత్నం తాము చేసారు. ఐశ్వర్యా రాజేష్ వంటి ఆర్టిస్ట్ కు ఇంకాస్త సీన్ ఇచ్చి ఉంటే బాగుండేది. బోసుబాబు గా జగపతి బాబు ఆ పాత్ర కు పూర్తిగా న్యాయం చేయలేక పోయాడేమో అనిపించింది. క్యారక్టర్ లో వేరియేషన్స్ ఉన్నా విలన్ క్రిందే కనపడతాడు. తిరుమల నాయుడుగా తిరువీర్ బాగా చేసాడు. రావు రమేష్, నరేష్ ప్రత్యేకంగా చెప్పుకుదేముంది. తమ పరిధి మేర చేసుకుంటూ వెళ్లిపోయారు.
Nani Tuck Jagadish Review
ఫైనల్ థాట్
నాని ని కొత్త ఇమేజ్ కోసం ట్రై చేయాలనుకున్నప్పుడు కథ,కథనం కూడా కొత్తగా ఉండేలా చూసుకుంటే బాగుండేది
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating: 2.5/5
Tuck Jagadish Review
ఎవరెవరు..
నటీనటులు: నాని, రీతూవర్మ, ఐశ్వర్య రాజేశ్, జగపతిబాబు, డానియల్ బాలాజీ, నరేశ్, రావు రమేశ్, ప్రవీణ్ తదితరులు;
సంగీతం: తమన్, గోపీ సుందర్(నేపథ్య సంగీతం);
సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల;
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి;
బ్యానర్: షైన్ స్క్రీన్ ప్రొడక్షన్స్;
నిర్మాత: సాహు గారపాటి, హరీశ్ పెద్ది;
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శివ నిర్వాణ;
విడుదల: అమెజాన్ ప్రైమ్ వీడియో
రన్ టైమ్: 2 గంటల 23 నిముషాలు
విడుదల తేదీ: సెప్టెంబర్ 10, 2021