
'ఊహలు గుసగుసలాడే’ ,‘జో అచ్యుతానంద’ ఈ రెండు అవసరాల శ్రీనివాస్ రచననుంచి వచ్చిన సినిమాలు. ఆ సినిమాలు చూసిన వారికి..అవసరాలపై ఓ అభిప్రాయం ఏర్పడుతుంది.అవసరాల శ్రీనివాస్ నటించిన లేదా రచించిన లేదా డైరక్షన్ చేసిన సినిమా అంటే ఖచ్చితంగా అందులో మాట్లాడుకోవాల్సిన మ్యాటర్ ఉంటుంది. కావాల్సిన ఫన్ ఉంటుంది...ఇదీ సగటు ప్రేక్షకుడు నిశ్చితాభిప్రాయం. ఆయన రచించి, నటించిన చిత్రం ఇది. అందులోనూ ఫన్నీ కాన్సెప్టు అవసరమైన మ్యాటర్ ఉంటుందని ఎక్సపెక్ట్ చేస్తాం. ఆ ఎక్సపెక్టేషన్స్ ని అవసరాల అందుకున్నారా..అసలు ఈ చిత్రం కథేంటి,బట్టతల బాబుగా అవసరాల ఏ మేరకు మెప్పించాడో చూద్దాం.
గొత్తి సూర్యనారాయణ (అవసరాల శ్రీనివాస్) ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తూంటాడు. తన కోలిగ్ అంజలి(రుహానీ శర్మ)తో ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతన్ని ఇష్టపడుతుంది. అంతా సవ్యంగా నడుస్తోంది..సూర్య నారాయణ జీవితం నెక్ట్స్ లెవిల్ కు వెళ్ళబోతోంది అనుకున్న సమయంలో సూర్యనారాయణ గురించిన ఓ తట్టుకోలేని నిజం బయిటపడుతుంది.నిలదీస్తుంది. బ్రేకప్ కు వెళ్లిపోతుంది.
ఏదైతే తాను ఇన్నాళ్లు మ్యానేజ్ చేస్తూ వచ్చాడో ఆ నిజం బయిటపడటంతో సూర్యనారాయణ తట్టుకోలేకపోతాడు. ఇంతకీ ఆ నిజం ఏమిటి అంటే అతనకి ఉన్నది నిజమైన జుట్టు కాదు. సూర్యనారాయణది బట్టతల. విగ్ తో ఇన్నాళ్లూ మ్యానేజ్ చేసాడు. ఇప్పుడు ఆ విగ్ సీక్రెట్ తెలిసిపోయి విడిపోయిన ఆ జంట మళ్లీ ఒక్కటి ఎలా అయ్యారు. అసలు విగ్ ఎందుకు పెట్టుకున్నాడు సూర్యనారాయణ అనే విషయాలు తెరపై సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
కొత్త కాన్సెప్టులతో ఖచ్చితంగా సినిమాలు రావాలి. అయితే ఆ కాన్సెప్టు ఎక్కడో విన్నట్లు లేదా చూసినట్లు అనిపించకూడదు. అవసరాల తాజా చిత్రం ‘101 జిల్లాల అందగాడు’ ట్రైలర్ చూడగానే మనకు బాలీవుడ్ హిట్ మూవీ ‘బాల’గుర్తు వచ్చేయటం మన తప్పు కాదు..మన జ్ఞాపకశక్తికి నిదర్శనమూ కాదు. ఆ హిందీ సినిమా అందరికు గుర్తుండిపోయే కాన్సెప్టుతో రెడీ అవ్వటమే అందుకు కారణం. అయితే మరి ఈ సినిమాకు ..సదరు హిందీ చిత్ర రాజానికి పోలిక ఉందా అంటే ఖచ్చితంగా ఉంది అని చెప్పాలి. అయితే ఆ సినిమా ఈ సినిమా ఒకటి కాదు..కానీ ఒకటే. సోల్ ఐడియాని తీసుకుని అల్లుకున్న కథ అనిపిస్తుంది.. తెలుగులో కొన్ని కొత్త సీన్స్ ఉన్నాయి.
అలాగే మరీ హిందీ సినిమా గుర్తు రాకూడదని పడ్డ జాగ్రత్తలు కనిపిస్తాయి. ఆ ప్రాసెస్ లో సినిమా డల్ అయ్యిపోయిన వైనం, పండాల్సిన కొన్ని కామెడీ సీన్స్ లు మిస్ ఫైర్ అవటమూ అర్దమవుతుంది. అలాగే ఇలాంటి స్టోరీలైన్ కు ఎవరు స్క్రీన్ ప్లే రాసినా ట్రీట్మెంట్ చేసినా దాదాపు ఒకే రకమైన సీన్స్ వస్తాయి. వాటిని తప్పించటం అంటే సహజంగా వచ్చే సన్నివేశాలను వద్దనుకోవటమే. అందుకేమో ఈ సినిమా చూస్తే ఇంకా చేయచ్చు కదా మధ్యలో వదిలేసారేంటి అనిపిస్తుంది. వదులుగా లూజు ముడి వేసినట్లు అనిపిస్తుంది కాంప్లిక్ట్. ఎలాగో హీరో,హీరోయిన్స్ కలవకపోరు..అందుకు బట్టతలా..కట్టుకున్న బట్టలు అడ్డం రావు అని అరకొరగా సినిమాలు చూసే ప్రేక్షకుడుకి కూడా స్పష్టంగా తెలుసు.
మరి అలాంటప్పుడే కదా...మన సత్తా చూపించాలి. అదే ఇక్కడ మిస్సైందనిపిస్తుంది. స్క్రిప్టులో పండాల్సిన ఎమోషన్, ఫన్ లేవు. చాలా ప్లాట్ గా కథ,కథనం నడిచాయి. అలాగే తెలిసిన కథని కొత్తగా చెప్పాలంటారు. కానీ ఇక్కడ చాలా ప్రెడిక్టబుల్ గా చెప్పాలి. జోక్ లు అక్కడక్కడా పండాయి. ఇంటర్వెల్ కు ముందు ఏదో జరుగుతోంది అనిపించింది. కానీ సెకండాఫ్ లో ఏమీ జరగలేదు.
కామెడీకు మరీ ఇంత క్యాజువల్ ఎప్రోచ్ పనికిరాదేమో అని డౌట్ వచ్చేలా చాలా సీన్స్ ఉన్నాయి. ఏదైమైనా కాంప్లిక్ట్ లో బలం లేనప్పుడు ఎంత మంచి డైలాగులు రాసుకున్ననా, ఎన్ని కొత్త సీన్స్ కలవరించినా ఫలితం పేడతక్కడే. ఫస్టాఫ్ ఎంటర్టైన్మెంట్ గా ఉంది. సెకండాఫ్ ఎమోషనల్ టర్న్ తీసుకున్నారు. క్లైమాక్స్ లో మనం ముందు మనకు నచ్చాలి.. ఎదుటివాడికి కాదు అని చెప్పే ప్రయత్నం చేసారు. అది బాగుంది.
ఇలాంటి సినిమాలకు ప్లస్ గా నిలవాల్సింది డైలాగ్స్. అవి ఈ సినిమాలో చాలా బాగున్నాయి. సంగీతం జస్ట్ ఓకే అనిపించింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సోసోగా ఉంది. సినిమాటోగ్రఫీ అద్బుతం అని చెప్పలేం కానీ బాగుంది. ఎడిటర్ కాస్త ల్యాగ్ లు తీసేసి స్పీడు పెంచితే బాగుండేది. మరింత స్పీడుగా కథ పరుగెత్తాలి. అవసరాల ట్రేడ్ మార్క్ కనపడింది కానీ గత చిత్రాల స్దాయిలో అయితే లేదు. సీన్స్ పండినట్లుగా సినిమా పండలేదు.
నటీనటుల్లో ..
అవసరాల అదరకొట్టాడు.ఇవ్వటానికి బట్టతల తప్ప ఏమి లేనపుడు ఎందుకు కన్నట్టమ్మ’ అంటూ గొత్తి సూర్యనారాయణ పాత్రలో అవసరాల శ్రీనివాస్ చెప్పిన డైలాగ్.. బట్ట తల వల్ల బాధపడే వారి బాధలను కళ్లకు కట్టినట్లు అనిపిస్తుంది. రుహాని శర్మ అర్బన్ అమ్మాయి పాత్రలో కనిపించింది. గుర్తుండిపోదు కానీ అలా నడిచిపోయింది. రోహిణి, రమణ భరద్వాజ్ వంటి కొన్ని పాత్రలు పర్వాలేదనిపించాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
బట్టతల మనుష్యులకే కాదు ..ఒక్కోసారి స్క్రిప్టుకు కూడా వచ్చేస్తుంది.
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating: 2.5/5
నటీనటులు : అవసరాల శ్రీనివాస్, రుహానీ శర్మ, రోహిని, రాకెట్ రాఘవ తదితరులు
నిర్మాతలు : శిరీష్, రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి
కథ: అవసరాల శ్రీనివాస్
దర్శకత్వం : రాచకొండ విద్యాసాగర్
సంగీతం : శక్తికాంత్ కార్తీక్
విడుదల తేది : సెప్టెంబర్ 3, 2021