నాని ‘శ్యామ్ సింగ రాయ్’ రివ్యూ అండ్ రేటింగ్

First Published Dec 24, 2021, 1:23 PM IST

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంతో తెరకెక్కిన తాజా చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్స్‌గా నటించారు. ఈ మూవీలోనాని..  వాసు, శ్యామ్‌ సింగరాయ్‌ అనే రెండు విభిన్న పాత్రలు పోషించారు. 

Shyam Singha Roy

నాని సినిమా చూడటం అంటే ఫ్యామిలీలకు ఎప్పుడూ ఆసక్తే. సహజమైన నటన, ఆరోగ్యకరమైన ఫన్ బేస్ గా చేసుకుని తెరపై కొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తూంటాడు. అలాగని కొత్త జానర్స్ ట్రై చేయడని కాదు. జెంటిల్ మేన్, వి, టక్ జగదీష్ లాంటి సీరియస్ సినిమాలు అతని నుంచి వచ్చాయి. ఇప్పుడు మరోసారి  ‘శ్యామ్ సింగ రాయ్’అనే బెంగాళి పాత్రను భుజాలపై ఎత్తుకుని థియోటర్స్ లో దూకాడు. కొత్త గెటప్, సాయిపల్లవి లాంటి జోడితో సరికొత్తగా కనపడుతున్నాడు. ఈ లుక్స్ ...ప్రేక్షకులను ఆకట్టుకునే ట్రిక్సా లేక నిజంగానే సినిమాలో విషయం ఉందా..పునర్జన్మ చిత్రం అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎంతవరకూ నిజం ఉంది, అసలు ఈ కథ ఏంటి, కొత్త మేటరేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

Shyam Singha Roy

కథేంటి

ఇప్పటి చాలా మంది కుర్రాళ్లలాగే వాసు దేవ్ (నాని) కు సినిమాలంటే పిచ్చి. దాంతో తను చేస్తున్న సాప్ట్ వేర్ జాబ్ వదిలేసి...షార్ట్ ఫిల్మ్ చేసి సినిమా ఆఫర్స్ కోసం ట్రై చేస్తూంటాడు. అతని షార్ట్ ఫిల్మ్ లో చేసిన కీర్తి(కీర్తి శెట్టి)  తోటే ఓ ఫీచర్ ఫిల్మ్ చేసే అవకాసం వస్తుంది. అది కూడా హై సక్సెస్ అవుతుంది. హిందీలోనూ రీమేక్ ఆఫర్ వస్తుంది. ఈ ఆనందంలో ఉండగానే  ఓ ఊహించని  సమస్య చుట్టుముడుతుంది. అతని కథతో ఓ కాపీరైట్స్ సమస్యలో ఇరుక్కుంటుంది. వాసు చేసే కథలు యాజటీజ్ గా 1970 లలో శ్యామ్ సింగరాయ్ రాసిన కథగా ఉన్నాయని ఓ పబ్లిషర్ కోర్టుకెక్తుతాడు. 

Shyam Singha Roy

తనది ఒరిజనల్ కథే అంటారు వాసు. అదెలా సాధ్యం. ఎక్కడో బెంగాళ్ రాసిన కథను ఆయనెవరో చదివి స్క్రిప్టు రాసుకోవటం ఏమిటి ...అది సక్సెస్ అవటం ఏమిటి..అర్దం కాదు. ఈ విషయంలో  తన నిర్దోషత్వాన్ని ప్రూవ్ చేసుకోవాలి.ఈ క్రమంలో Clinical Hypnosis సాయింతో అతని గతం బయిటకు వస్తుంది. ఆ గతం ఏమిటి...అతని గతంలో వచ్చే  ఈ శ్యామ్ సింగరాయ్ ఎవరు ..అతని గురించి, ఆయన రాసిన  కథల గురించి తెలియకుండానే వాసుదేవ్ ఎలా వాటిని తన స్క్రిప్టుగా ఎడాప్ట్ చేసుకున్నాడు. అసలేం ఏం జరిగింది.. ఈ సినిమాలో  దేవదాసి  గా చేసిన సాయి పల్లవి పాత్ర ఏమిటి? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Shyam Singha Roy

విశ్లేషణ

కథగా చెప్పాలంటే శ్యామ్ సింగరాయ్ అనే పాత్ర తప్పిస్తే కొత్తదనం ఏమీ కనిపించదు. అయితే ఆ పాత్రను పరిచయం చేైయటానికి తీసుకున్న ఎత్తుగడ చాలా  కొత్తగా,నేచురల్ గా ఉంది.  ఇదే దర్శకుడు తీసిన టాక్సీవాలా సినిమాలో ఎలాగైతే నేచరుల్ గా జరిగే సీన్స్ తో కథలోకి తీసుకెళ్తాడో..అదే విధంగా ఇక్కడా అదే టెక్నిక్ వాడతాడు. అదే ఈ కథకు ప్లస్ అయ్యింది.  అయితే  స్క్రీన్ ప్లే తెలుగులో వచ్చే రెగ్యులర్  ద్విపాత్రాభినయం సినిమాలను అనుసరిస్తూ సాగుతుంది. రీసెంట్ గా వచ్చిన అఖండ తరహాలోనే ఫస్టాఫ్ అంతా మొదటగా వచ్చే వాసు పాత్రతో నడిపించి ఆ పాత్రను సమస్యలో పడేసి..ప్రధాన పాత్ర శ్యామ్ సింగరాయ్ కు లీడ్ ఇస్తూ... సెటప్ ఏర్పాటు చేసారు. ప్రీ ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి  శ్యామ్ సింగరాయ్ కు ఎంట్రి తీసుకుంటారు. ఆ తర్వాత సెకండాఫ్ మొత్తం శ్యామ్ సిగరాయ్ పాత్రే చుట్టూ కథ తిరిగి మళ్లీ ప్రీ క్లైమాక్స్ మొదట పాత్ర వాసు దగ్గరకు వస్తుంది. శ్యామసింగరాయ్ పాత్రే గురించే మనం తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఈ స్క్రీన్ ప్లే ఇబ్బంది ఏమీ అనిపించదు.
 

Shyam Singha Roy


  వాసుకి తన గతం గురించి తెలుసుకునే ప్రాసెస్ లోనే ప్రేక్షకులకు ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారో అది ఇచ్చేస్తారు.  అయితే ఇంటర్వెల్ దాకా శ్యామ్ సింగరాయ్ పాత్ర కోసం నడపాలి కాబట్టి కథగా ఏమీ కదలిక కనపడదు. ఫిల్మ్ మేకర్ గా నాని పడే స్ట్రగుల్, కీర్తితో లవ్ స్టోరీ చుట్టు తిరిగుతుంది. సెకండాఫ్ లోనే అసలు కథ మొదలవుతుంది. అయితే అలా చేయటం మన తెలుగు సినిమాల్లో కామనే కాబట్టి  నిరాశపడం.

Shyam Singha Roy

ఇక  శ్యామ్ సింగరాయ్ ప్రజల హక్కుల కోసం పోరాటం.. సాయి పల్లవితో లవ్ సీన్స్, విప్లవ రచయితగా మారి ,దేవదాసీలకు విముక్తి కలిగించిన తీరు ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి. ఆనాటి రోజుల్లోకి మనలని తీసుకెళ్లి  ఓ కొత్త సినిమాటెక్ ఎక్సపీరియన్స్ ఇస్తాడు. శ్యామ్ సింగ్ రాయ్ పాత్రను ఇంటెన్స్ తో నడిపటంతో ఎక్కడా బోర్ కొట్టదు. అయితే కొన్ని లాగ్ సీన్స్ టెంపోని పడేసే ప్రయత్నం చేసాయి. శ్యామ్ సింగరాయ్ పాత్రకు ఇచ్చే ముగింపు..ఇంకాస్త బలంగా ఉంటే ఖచ్చితంగా క్లైమాక్స్ నెక్ట్స్ లెవిల్ లో ఉండేది.  ఫన్ విషయానికి వస్తే ఫస్టాఫ్ లో షార్ట్ ఫిల్మ్ మేకింగ్ టైమ్ లో కొంత ఫన్ మనకు అందుతుంది.

Shyam Singha Roy


దేవదాసి వ్యవస్ద లో లోపాలను ఎత్తిచూపుతూ వచ్చిన సినిమాలు మనకు తక్కువే. 1971లో శోభన్ బాబు, కాంచన నటించిన కల్యాణ మంటపం లో దేవదాసి వ్యవస్దను స్పశించారు. ఆ తర్వాత జోగినిలపై ఓ సినిమా వచ్చింది. మరికొన్ని మధ్యలో వచ్చినా ముద్ర వేయలేకపోయాయి. చాలా కాలం తర్వాత అసలు ఈ తరం వారు చాలా వరకూ దేవదాసి వ్యవస్ద ఒకటి ఉందని మర్చిపోయిన సమయంలో బెంగాళ్ లో ఉన్న దేవదాసి వ్యవస్దని బేస్ చేసుకుని ఈ సినిమా వచ్చింది. అలాగని ఈ సినిమా మొత్తం అదే పాయింట్ మీద నడవదు. ఆ పాయింటే కీలకమైన నడిపిస్తుంది. 

Shyam Singha Roy


ఎవరీ దేవదాసీలు

ఎందరో అమాయిక స్త్రీల కన్నీటి గాథ దేవదాసి వ్యవస్థ.  దేవ అనగా దేవుడు, దాసి అనగా సేవలు చేసేవారు.   ఈ దేవదాసీ వ్యవస్ద...భారత దేశమంతా(ఇంకా చెప్పాలంటే ప్రపంచమంతా) విస్తరించిన సామాజిక సమస్య. ఈ వ్యవస్థ భూస్వామ్య వ్యవస్థ యొక్క అవశేషం.  గుడి లోని దేవుడి ఉత్సవాలలో నాట్య సేవ చేస్తూ జీవితాంతం అవివాహిత గానే ఉండే స్త్రీలు వీళ్లు. మత సంబంధిత వ్యభిచారం ఇది. మన పాత తెలుగు సినిమాలు కొన్నిటిలో ఈ దేవదాసిల ప్రస్దావన కనపడుతుంది. 1988 లో స్వర్గీయ నందమూరి తారక రామారావుగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ దురాచారాన్ని మన తెలుగు రాష్ట్రాలలో నిషేధించారు.
 


ఎవరెలా చేసారంటే..
 
నాని నటన గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి. అతన్ని నాచులర్ స్టార్ అనటం సబబు అనిపిస్తుంది. కామెడీ సినిమాలు కన్నా ఇలాంటి కాన్సెప్టు సినిమాల్లో చేయటమే నానికి కరెక్ట్. అలాగే వర్తమానం, గతంలో వచ్చే రెండు పాత్రలను డిఫరెంట్ షేడ్స్ లో విభిన్నంగా ఆవిష్కరించటం అతని ప్రతిభే. ఆనాటి బెంగాళ్  సమాజంలోని జాడ్యాలపై పోరాటం చేసే శ్యామ్ సింగరాయ్ ..నాని ని తప్ప మరొకరుని ఊహించుకోలేం అన్నట్లు కనిపించాడు. 

 సాయి పల్లవి ప్రత్యేకంగా చెప్పకునేదేముంది.  తనను తాను వదిలేసి మైత్రేయి అనే దేవదాసిగా మారిపోయింది.  కృతి శెట్టి బాగుంది కానీ సాయి పల్లవి నటన ముందు తేలిపోయింది..సినిమా పూర్తయ్యాక అసలు గుర్తే ఉండదు. మిగతా పాత్రల్లో చేసిన సీనియర్స్ తమ పాత్రలకు న్యాయం చేసారు.
 

టెక్నికల్ ఫెరఫార్మెన్స్...

నాని సినిమాని ఈ స్దాయిలో తీస్తారని ఊహించము. అప్పటి కలకత్తా వాతావరణం, కాళీ మాత విగ్రహం లు చూస్తూంటే ఇంత ఖర్చు పెట్టారా అనిపిస్తుంది. అదే సమయంలో ఆర్ట్ డిపార్టమెంట్ వర్క్ కూడా హైలెట్ అవుతుంది. ఇంక నానిని ..శ్యామ్ సింగరాయ్ గా చూపించే పనిని మేకప్ డిపార్టమెంట్ వారు సమర్దవంతంగా పూర్తి చేసారు. సినిమాటోగ్రాఫర్ సను జాన్ వర్గేసేని వర్క్ ఈ సినిమాకు కేరాఫ్ ఎడ్రస్. దర్శకుడు రాహుల్ విజువల్స్ , విజువలైజేషన్ ఎప్పటికప్పుడు మనని ఆశ్చర్యపరుస్తాయి . ప్లాష్ బ్యాక్ సీన్స్ ని క్లాస్ గా మన కళ్లలో ఇంకిపోయేలా ఫ్రేమ్ లని ఎంచుకున్నాడు. ఎమోషన్స్ ని కూడా బాగా పండించాడు. ఇక   మిక్కీ జే మేయర్ ఇచ్చిన పాటలు ఓకే కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం భీబత్సం.  ప్రొడక్షన్ డిజైన్ అవినాష్ కొల్లాకు స్పెషల్ గా మెన్షన్ చేసుకోవాలి. ఎడిటింగ్ బాగుంది. డైలాగులు ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి.  ప్రొడక్షన్ వాల్యూస్ లావిష్ గా ఉన్నాయి. విజువల్ స్టోరీ టెల్లింగ్ అనే పదానికి ఈ సినిమా చాలా వరకూ న్యాయం చేసింది. మల్టిప్లెక్స్ ప్రేక్షకులకు బాగా నచ్చే విధంగా  ఉందీ నేరషన్ స్టైల్.
 

ప్లస్ పాయింట్స్:
నాని నటన
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
సినిమాటోగ్రఫీ
 
మైనస్ పాయింట్స్:

సెకండాఫ్ లో కొన్ని లాగ్ సీన్స్
వీక్ క్లైమాక్స్
స్లో పేస్ నేరేషన్
లెంగ్త్ 
 

Shyam Singha Roy


ఫైనల్ థాట్

ఎవరైనా గతంలోని రైటర్స్ లిటరేచర్.. ఎత్తేసి సినిమా చేసి ఇరుక్కుంటే....తను ఆ రైటర్ కు పునర్జన్మ వెర్షన్  అని చెప్పి బయిటపడచ్చు అనే ఐడియా బాగుంది.

సూర్య ప్రకాష్ జోశ్యుల

Rating: 2.75/5

Shyam Singha Roy

ఎవరెవరు..
నటీనటులు:
నాని, సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్‌, రాహుల్ ర‌వీంద్ర‌న్‌, ముర‌ళీ శ‌ర్మ‌, అభిన‌వ్ గోమ‌టం

టెక్నికల్ టీమ్:
డైరెక్ట‌ర్‌: రాహుల్ సాంకృత్యాన్‌
ప్రొడ్యూస‌ర్‌: వెంక‌ట్ ఎస్‌. బోయ‌న‌ప‌ల్లి
బ్యాన‌ర్: నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్‌
ఒరిజిన‌ల్ స్టోరీ: స‌త్య‌దేవ్ జంగా
మ్యూజిక్‌: మిక్కీ జె. మేయ‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: స‌ను జాన్ వ‌ర్ఘీస్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: అవినాష్ కొల్లా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ఎస్‌. వెంక‌టర‌త్నం (వెంక‌ట్‌)
ఎడిటింగ్‌: న‌వీన్ నూలి

రన్ టైమ్ : 2 గంటల 37 నిమిషాలు
రిలీజ్ డేట్ : 24 డిసెంబర్ 2021
 

click me!