Ante Sundaraniki : నాని ‘అంటే సుందరానికీ’ రివ్యూ

First Published | Jun 10, 2022, 2:05 PM IST

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘అంటే సుందరానికీ’.  ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్  నిర్మించారు.  

Ante Sundaraniki


నాని సినిమాలంటే ఫ్యామిలీలకు భలే ఇష్టం. అందులోనూ ఫన్ కలిసిన సినిమా అంటే అది భలే భలే మొగాడివోయ్ రేంజి అని లెక్కేసుకుంటారు. ఇక  వివేక్ ఆత్రేయ న్యూ ఏజ్ జనరేషన్  డైరక్టర్ అని అతని గత సినిమాలు మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా చూస్తే అర్దమైపోతుంది. వీళ్ల కాంబినేషన్ అంటే పీక్స్ అని ఎక్సపెక్ట్ చేసేస్తారు. ఆ రకంగా ఇది భాక్సాఫీస్ కు ఫెరపెక్ట్ కాంబో.    రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా వస్తోన్న  ఈ సినిమాకు సంభందించిన ట్రైలర్‌ ఓ ఫన్ రైడ్‌లా ఆకట్టుకుంటోంది.మరి ఈ మూవీతో నాని బాక్సాఫీస్ దగ్గర మరో సూపర్ హిట్ అందుకుంటాడా లేదా, కథేంటి  అనే విషయాలు రివ్యూలో చూద్దాం.

కథేంటి

సత్  సంప్రదాయ  బ్రాహ్మణ కుటుంబానికి చెందిన  కుర్రాడు సుందర్ (నాని). ఎప్పుడూ జాతకాలు, హోమాలు, దోష పరిహారాలు అంటూ ఇంట్లో ఏదో ఒక కార్యక్రమం నడుస్తూంటుంది. చివరకు సుందర్ అమెరికా వెళ్తానంటేనూ కూడా ఒప్పుకునే పరిస్దితి ఉండదు. సముద్రాలు దాటి అమెరికా వెళ్లకూడదు, వెళ్తే ప్రాయశ్చిత్తం చేసుకోవాలనే సిట్యువేషన్.  మరో ప్రక్క  కాస్త అటూ ఇటూలో  అదే స్దాయిలో మత  సంప్రదాయం ఉన్న క్రిష్టియన్  ఫ్యామిలీకు చెందిన లీలా ధామస్  (నజ్రియా) . హిందువుల ప్రసాదం తీసుకోవడానికే ఇష్టపడరు వాళ్లు. అలాంటి కుటుంబాలనుంచి వచ్చిన వీళ్లిద్దరూ చిన్నప్పటినుంచి ఒకే స్కూల్ లో చదువుతూ ఒకరినొకరు స్నేహంగా ఉంటూ,  ఇష్టపడుతూంటారు. పెద్దయ్యాక మెల్లిగా  అది ప్రేమగా మారుతుంది. కానీ ఇద్దరి ఇళ్లల్లోనూ వేరే మతస్దులును తమ ఇంటికి అల్లుడు లేదా కోడలు గా  ఒప్పుకునే సిట్యువేషన్ లేదు. దాంతో ఇద్దరూ ఈ సమస్య నుంచి దాటటానికి  ఓ అబద్దం ఆడాలని ఫిక్స్ అవుతారు. 



ఆ అబద్దం ఏమిటంటే..హీరో ఇంట్లో తనకు ఇక పిల్లలు పుట్టరని, ఆ విషయం తెలిసినా  తన స్నేహితురాలు లీలా అనే అమ్మాయి పెళ్లి చేసుకుంటానందని చెప్తారు. సర్లే ఈ విషయం బయిటకు తెలిస్తే తన కొడుక్కు పెళ్లి కాదు కాబట్టి ఏ మతమైనా ఓకే అంటారని హీరో ఆలోచన. మరో ప్రక్క ఆమె ఇంట్లో తను గర్బవతిని అని చెప్దామని,అప్పుడు వేరే దారి లేక తమ మతం కాకపోయినా అందుకు కారణమైన వాళ్లకు ఇచ్చి పెళ్లి చేస్తారని ప్లాన్. ఇలా ఇద్దరూ తమ తమ ఇళ్లల్లో ధైర్యం చేసి అబద్దాలు చెప్తారు. కానీ ఆ అబద్దం మోయటం చాలా కష్టమైపోతుంది. ఆ అబద్దాల నుంచి రకరకాల సమస్యలు బయిలుదేరతాయి. అవేమిటి..చివరకు ఇద్దరి ఇళ్లల్లో వాళ్లు ఈ పెళ్లికి ఎలా ఓకే చేసారు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

 విశ్లేషణ

సాధారణంగా రొమాంటిక్ కామెడీలు లీడ్ పెయిర్ తమ ప్రేమకు వచ్చే అడ్డంకులును  ఎలా అధిగమించి ఒకటి అవుతారనే పాయింట్ చుట్టూ తిరుగుతూంటాయి. దాంతో అవి ఖచ్చితంగా ప్రెడిక్టబుల్ గా ఉంటాయి. అయితే ఆ ఇబ్బందులు ఎంత కొత్తగా ఉన్నాయి..లీడ్ పెయిర్ మధ్య జరిగే రొమాన్స్ ఏ స్దాయిలో   మ్యాజిక్ క్రియేట్ చేస్తుందనే దానిపై సినిమా సక్సెస్ రేటు ఆధారపడుతుంది. ఆ విధంగా చూస్తే ఈ సినిమాలో  రెండు వేర్వేరు కులాలు ప్రేమకు అడ్డం పడటం అనేది పాత పాయింట్ గా అనిపించినా , దాన్ని డీల్ చేసిన విధానం కొత్తగా ఉండటం కలిసొచ్చే అంశం. ముఖ్యంగా పెళ్లి కోసం ఇద్దరి ఇళ్లల్లోనూ అబద్దాలు చెప్పటం, అవి పెరిగి పెద్దవటం దర్శకుడు నమ్ముకుని ఈ సినిమా చేసారు. అయితే డిటేలింగ్ ఎక్కువైపోయింది. ఇంటర్వెల్ లో ట్విస్ట్ పెట్టుకుని అక్కడ దాకా సాగ తీసారు. 

Ante Sundaraniki Review


హీరో,హీరోయిన్  క్యారక్టర్స్, వారి ప్రపంచం ఎస్టాబ్లిష్ చేయటానికే ఫస్టాఫ్ మొత్తం పట్టేసింది. అసలు పాయింట్ లోకి  వెళ్లకుండా టీవి సీరియల్ గా సాగటం చాలా  ఇబ్బంది అనిపిస్తుంది. ఎంత బాగున్న మ్యాటర్  అయినా అసలు విషయంలోకి వెళ్లకుండా అక్కడక్కడే తిరిగితే ఆ పెప్ లో ఉన్న ఎట్రాక్షన్ మిస్ అవుతుంది. అదే జరిగింది. మంచిగా ఉందనుకుంటే ముంచేస్తున్నాడే అనిపిస్తుంది. అయితే సెకండాఫ్ లో అతను ట్రెజర్ పెట్టుకున్నాడు. 
 

Ante Sundaraniki Review


అయితే సెకండాఫ్ లో అసలు కథ కాంప్లిక్ట్ లోకి ప్రవేశిస్తుంది. లీడ్ పెయిర్ అబద్దం ఆడటం...దాన్ని నుంచి రకరకాల సమస్యలు ఉత్పన్నం కావటం..బయిటపడే ప్రయత్నం చేయటం దాన్నుంచి పుట్టిన కామెడీ బాగుంది. కానీ ఆ సీన్స్ కూడా లాగే ప్రయత్నం చేసారు. సెకండాఫ్ ని ఇంకాస్త ట్రిమ్ చేస్తే బాగుండేదేమో అనిపించింది. అయితే అక్కడక్కడా జెన్యూన్ గా కథ నుంచి పుట్టిన నవ్వులు ఉన్నాయి.  అయితే కొత్తగా ఏదో ట్రై చేయాలి,  చెప్పాలన్న తపన కనిపిస్తుంది. కామెడీ,ఎమోషన్స్ కొన్ని చోట్ల బాగానే వర్కవుట్ అయ్యాయి. మరో ప్లస్ పాయింట్ ఫార్ములా సీన్స్ వైపు వెళ్లకపోవటం. క్లాస్ గా ఉంటూనే నవ్వించే ప్రయత్నం చేసాడు. అవకాసం ఉన్నా నాటు సీన్స్ వైపు వెళ్లలేదు. క్లైమాక్స్ కూడా ఉన్నంతలో  బాగా సెట్ అయ్యింది. కాకపోతే బ్రాహ్మణ కుటుంబాల్లో ఇంకా  సముద్రం దాటితే ఏదో అయిపోతుందనే భ్రమల్లో ఉన్నవారు ఉన్నారా? ఈ రోజు చాలా బ్రాహ్మణ కుటుంబాలు ఇతర దేశాల్లో సెటిల్ అయ్యారు. వస్తున్నారు. వెళ్తున్నారు. ఇంకా  బారిస్టర్ పార్వతీసం నాటి సంప్రదాయంపై కామెడీ చేయాలనుకోవటం ఇబ్బందే. 

Ante Sundaraniki Review


నచ్చినవి?

 నాని లో స్పాంటినిటి, ఇప్రవైజేషన్, ఫన్ సైడ్
 బ్యాక్ గ్రౌండ్  స్కోర్

నచ్చనవి?
స్లోగా నడవటం
స్టోరీ లైన్ చిన్నది..సినిమా పెద్దది
సోసోగా ఉన్న పాటలు 

టెక్నికల్ గా...


దర్శకుడుగా వివేక్ ఆత్రేయపై పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తిగా కాదు కానీ కొంతవరకూ  నిలబెట్టుకున్నాడు. సింపుల్ గా ఉన్న లైన్ ని తీసుకుని దాన్ని తనదైన స్టైల్ ట్రీట్మెంట్ తో కొత్తగా ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేసారు. అయితే డిటేలింగ్ తక్కువ ఇస్తే బాగుండేది.   ఇలాంటి రొమాంటిక్ కామెడీ సినిమాలకు కావల్సిన స్దాయిలో సాంగ్స్ లేవు. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ఫెరఫెక్ట్ గా వర్కవుట్ అయ్యింది. విజువల్స్ మాత్రం క్లాస్ గా నీట్ గా కళ్లకు ఇంపుగా ఉన్నాయి. సినిమాటోగ్రాఫర్ పూర్తి న్యాయం చేసారు. పెద్ద బ్యానర్ కు తగ్గ స్దాయిలో ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. ఎడిటింగ్ విషయానికి రెగ్యులర్ కంప్లైంటే..ఇంకాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. లెంగ్త్ తగ్గిస్తే ఇంకా క్రిస్ప్ గా ఉండేది. డైలాగులు, కథా విస్తరణ విషయంలో డైరక్టర్ మిగతా టెక్నీషియన్స్ కు పోటీ పడ్డారు. అదే అతని బలం.
 


ఫెరఫార్మెన్స్ లు పరంగా చూస్తే నాని, నజ్రియా గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఇద్దరూ ఇద్దరే. ఇలాంటి క్యారక్టర్స్ దొరికితే నమిలి అవతలపారేస్తారు. ఇక నరేష్, నదియా,రోహిణి,రాహుల్ రామకృష్ణ వంటి సపోర్టింగ్ కాస్ట్ ఫెరఫెక్ట్ గా సెట్ అయ్యింది. వీళ్లలో  ప్రత్యేకంగా నరేష్ గురించే చెప్పుకోవాలి. నరేష్, నాని మధ్య వచ్చే ఫన్నీ సీన్స్ సెకండాఫ్ ని అలా పట్టుకుని నిలబెట్టేసాయి. నదియా,రోహిణి లను ఎమోషన్స్ రైజ్ చేయటానికి వాడుకున్నారు. స్పెషల్ పాత్రలో కనిపించే అనుపమా పరమేశ్వరన్..స్పెషల్ గానే ఉంది. హర్షవర్దన్ చాలా కాలం తర్వాత గుర్తుండిపోయే పాత్రను చేసారు. 


ఫైనల్ థాట్

అంటే..అక్కడక్కడా నవ్వాము లెండి... అది సరిపోతే బాగుందనిపిస్తుందండి

--సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2.5


బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
నటీనటులు: నాని, నజ్రియా ఫహద్, నదియా, నరేష్, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ తదితరులు.
సంగీతం: వివేక్ సాగర్
సినిమాటోగ్రాఫర్: నికేత్ బొమ్మి
ఎడిటర్: రవితేజ గిరిజాల
ప్రొడక్షన్ డిజైన్: లతా నాయుడు
పబ్లిసిటీ డిజైన్: అనిల్ & భాను
రన్ టైమ్: 2 గంటల 56 నిముషాలు
రచయిత, దర్శకుడు: వివేక్ ఆత్రేయ
నిర్మాతలు: నవీన్ యెర్నేని & రవిశంకర్ వై

విడుదల తేదీ: జూన్ 10, 2022

Latest Videos

click me!