Nandamuri Balakrishna, Daaku Maharaaj, movie Review
"ఎవరైనా చదవడంలో మాస్టర్స్ చేస్తారేమో, నేను చంపడంలో చేశా. ఐ డూ మాస్టర్స్ ఇన్ మర్డర్స్…" అంటూ బాలయ్య “డాకు మహారాజ్” సంక్రాంతి బరిలోకి దిగాడు. వరసపెట్టి బాలయ్య అఖండ, వీర సింహారెడ్డి భగవంత్ కేసరి హిట్స్ కొట్టి ఫామ్ లో ఉన్నాడు. దాంతో ఈ సినిమాకు మంచి అంచనాలే ఉన్నాయి.
అయితే సినిమాకు అనుకున్న స్దాయిలో సరైన బజ్ క్రియేట్ కాలేదు. దాంతో అభిమానుల్లో ఓ రకమైన టెన్షన్ క్రియేట్ అయ్యింది. ఈ పరిస్దితుల్లో వచ్చిన ఈ డాకు మహారాజ్ తో డెఫినెట్ గా రెండో హ్యాట్రిక్ కొట్టి జెండా ఎగరేసారా...అసలు ఈ డాకూ కథేంటి, దర్శకుడుగా బాబిని ఈ సినిమా మరో మెట్టు ఎక్కిస్తుందా, నిర్మాత నాగవంశీ ఈ సినిమాకు ఇచ్చిన హైప్ కు తగినట్లు ఉందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్
కథ 1996లో జరుగుతూంటుంది. మదనపల్లి హిల్ స్టేషన్ లో ఓ పెద్ద కోటీశ్వరుల కుటుంబం. ఆ కుటంబానికి చెందిన ఎస్టేట్ లీజుకు తీసుకుని అందులో అక్రమాలు చేస్తూంటారు లోకల్ పొలిటీషన్ (రవికిషన్). ఆ విషయం తెలిసి ఆ కుటుంబ పెద్ద అడ్డుపడితే ... ఆ కుటుంబంలోని ఓ పాపని వాళ్ళు టార్గెట్ చేస్తారు. ఆ పాప ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని ఒకరికి ఫోన్ రావడంతో ఆ చిన్నారి దగ్గరకు బాలయ్య బయిలుదేరతాడు. ప్రమాదంలో ఉందని ఫోన్ వచ్చిన ఆ పాప ఇంటిలో బాలయ్య డ్రైవర్‌గా చేరారు. తనను నానాజీగా పరిచయం చేసుకుంటాడు. అక్కడ పాపని కంటికి రెప్పలా కాపాడుతూంటాడు. ఆ కుటంబానికి దగ్గర అవుతూంటాడు.
మరో ప్రక్క ఎన్కౌంటర్ స్పెషలిస్టు స్టీఫెన్ రాజ్ (మలయాళ నటుడు షైన్ టామ్ చాకో) 'డాకు ఎక్కడ?' అని వెతుకుతూ ఎస్టేట్ గురించి తెలుసుకుంటాడు. ఇక పాపను, కుటుంబాన్ని రవికిషన్ ఏమీ చెయ్యలేకపోవటంతో, వాళ్ళను ఎలాగైనా అంతమొందించి, అక్కడ ఎస్టేట్ లో ఉన్న తమ మాల్ ని తీసుకెళ్లాలని ఠాకూర్( మెయిన్ విలన్ బాబీ డియోల్) ఎంట్రీ ఇస్తాడు. అప్పుడు బాబీడయోల్ కు బాలయ్య గురించిన ఓ నిజం తెలుస్తుంది.
అలాగే ఎన్కౌంటర్ స్పెషలిస్టు స్టీఫెన్ రాజ్ కు సైతం బాలయ్య ఎవరో తెలుస్తుంది. అతను మరవరో రాదు డాకూ మహారాజ్ అని గుర్తిస్తాడు. అసలు ఈ డాకూ మహారాజ్ ఎవరు...ఆ పాప కుటుంబానికి, అతనికి సంభందం ఏమిటి...ఆ స్దాయి వ్యక్తి ఓ డ్రైవర్ గా వాళ్ల ఇంట్లో చేరాల్సిన అవసరం ఏమిటి, బాబీ డయోల్ కు బాలయ్యకు మధ్య ఉన్న వైరం ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉంది
నేపధ్యం కొత్తదే కానీ కథ మాత్రం బాగా పాతది. అంతకు మించి స్క్రీన్ ప్లే మరీ రొటీన్ గా ఆ కథను ముందుకు తీసుకెళ్తూంటుంది. ఎక్కడా ఊహించని మలుపులు కనిపించవు. అయితే స్టైలిష్ గా నడపటం చాలా వరకూ కలిసొచ్చింది. అలాగే చాలా సీన్స్ అమితాబ్ షోలేలోతో పాటు కార్తి ‘ఖాకీ’ సినిమాని గుర్తుకు తెస్తూ సాగుతాయి. రైటింగ్ ఇంకాస్త బాగుండి, స్క్రీన్ ప్లే ఇంటెన్స్ తో సాగితే నెక్ట్స్ లెవిల్ లో ఉండేది. ఎక్సైటింగ్ అనేది కథా పరంగా ఎక్కడా కనపడదు.
ఒక సీన్ తర్వాత మరొకటి వరస పెట్టి వెళ్ళిపోతూంటాయి. కథ పరంగా పెద్దగా జరగేది ఏమీ ఉండదు. ఫస్టాఫ్ ...బాషా, సమరసింహా రెడ్డి స్క్రీన్ ప్లే ఫార్మెట్ లో వెళ్లిపోతుంది. సెకండాఫ్ లో ఊహించినట్లుగానే ప్లాష్ బ్యాక్ ఓపెన్ అయ్యి...బాలయ్య..డాకూ మహారాజ్ గా ఎలా మారాల్సి వచ్చిందో చెప్తుంది. ఆ ప్లాష్ బ్యాక్ లో విలన్ తో క్లైమాక్స్ ఫైట్ చేయించి ముగించేసారు. అయితే మేకింగ్ వాల్యూస్ వల్ల డీసెంట్ గా అనిపిస్తుంది.
స్టైలిష్ గా యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ చేయటం ఉన్నంతలో కలిసొచ్చింది. ఫస్టాఫ్ అలా అలా నడిచిపోయినా సెకండాఫ్ లో స్ట్రాంగ్ గా స్టోరీ నేరేషన్ ఉంటుందేమో అని ఎక్సపెక్ట్ చేస్తే అక్కడా అలా అలా లాగించేసారు. ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఏదో పెద్ద బ్యాంగ్ ఉంటుందేమో అనుకుంటే అదీ కనపడదు. గెటప్ కు, లుక్ కు సరపడ డ్రామా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు.
సీతారాం అనే సివిల్ ఇంజినీర్ డాకూ మహారాజ్ గా మారటానికి రీజన్ జస్టిఫై అయ్యింది కానీ ఇంతకు ముందు చాలా సార్లు చూసిందే ఊహించిందే కావటంతో కిక్ ఇవ్వలేకపోయింది. మెయిన్ విలన్ బాబీ డయోల్ పాత్ర కూడా బాగా రొటీన్ గా డిజైన్ చేయటంతో అదీ ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. ఇక కమల్ హాసన్ విక్రమ్, రజనీ జైలర్ ని దృష్టిలో పెట్టుకుని కొన్ని ఎపిసోడ్స్ డిజైన్ చేసారా అనిపిస్తుంది చూస్తూంటే. ఓవరాల్ జస్ట్ ఓకే స్క్రిప్టుని స్టైలిష్ మేకింగ్ తో కవర్ చేసే ప్రయత్నం చేసారు.
టెక్నికల్ గా ...
పెద్ద బ్యానర్, పెద్ద హీరో సినిమా కాబట్టి టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ ఉన్నాయి. దర్శకుడు బాబీ పూర్తిగా స్టైలిష్ మేకింగ్, విజువల్ క్వాలిటీ మీదే దృష్టి పెట్టారు,మిగతావి పట్టించుకోలేదు. పాటలు సోసోగా ఉన్నాయి. దబిడి దబిడి సాంగ్ కు ఉన్నంతలో మంచి రెస్పాన్స్ వచ్చినట్లే.
విజయ్ కార్తీక్ కెమెరా వర్క్ సినిమాకు పెద్ద ప్లస్. ఓ రకంగా అదరకట్టాడని చెప్పాలి. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ... అనిరిధ్ కి పోటీ ఇచ్చేలా కొన్ని చోట్ల సాగింది. ఎడిటింగ్ మరింత షార్ప్ గా చేయవచ్చేమో అనిపించింది. మరీ ముఖ్యంగా ఫస్టాఫ్ ఇంకా పూర్తి కాదు. రిపీట్ గా సీన్స్ వస్తున్న ఫీల్ వచ్చినప్పుడు.
అయితే బాబీ డయోల్ ఇంట్రడక్షన్ సీన్ ఎడిటింగ్ బాగా చేసారు. అటు బాలయ్యను ఇటు, బాబీడయోల్ ని చూపుతు. బెస్ట్ ఎగ్జిక్యూషన్. ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాగా ఖర్చు పెట్టారని రిచ్ విజువల్స్ చెప్తూన్నాయి.
కేవలం రైటింగ్ సినిమాని నెక్ట్స్ లెవిల్ కు వెళ్లకుండా వెనక్కి లాగేసింది ప్రతీసారి. నందు- భాను రాసిన మాస్ డైలాగులు కొన్ని బాగా పేలాయి. థియేటర్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. నటీనటుల్లో బాలయ్య, బాబి డయోల్ మాత్రమే బాగా హైలెట్ అయ్యారు. కీ క్యారక్టర్ చేసిన పాప కూడా బాగా చేసింది.
ప్లస్ లు
బాలయ్య కొత్త గెటప్
స్టైలిష్ విజువల్స్
తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్
ప్రొడక్షన్ వాల్యూస్
మైనస్ లు
రొటీన్ గా సాగిన కథ, కథనం
హీరోయిన్స్ పాత్రలకు అసలు ప్రయారిటీ ఇవ్వకపోవటం
ఇంట్రవెల్ డిజైన్ చేసిన స్దాయిలో క్లైమాక్స్ లేకపోవటం
ఫైనల్ థాట్
బాలయ్య వంటి స్టార్డమ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సీనియర్ హీరోకు కొత్త కథ చేయలేమని, కేవలం కొత్త గెటప్ దాకానే ఫిక్స్ అయ్యినట్లున్నారు. అలాగే మనకు సంభందం లేని రాజస్దాన్ నేపధ్యం , నీళ్ల సమస్య వంటివి ప్రధానమైన కథగా రాసుకోవటం ..నార్త్ ఇండియా మార్కెట్ కోసమా అనిపిస్తుంది. అక్కడ సరిగ్గా ప్లాన్ చేసి రిలీజ్ చేస్తే మనకన్నా బాగా మనకన్నా బాగా ఆడే అవకాసం ఉంది.
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2.75
తెర వెనక..ముందు
తారాగణం: నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా, టామ్ చాకో, సత్య,
సంగీతం: తమన్ ఎస్
సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్
ఎడిటర్: నిరంజన్ దేవరమానే, రూబెన్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
డైరెక్షన్: బాబీ కొల్లి
విడుదల తేది: 12-1-2025