విలన్‌గా తెలుగులో పాపులర్ అయిన సోనూ సూద్ కరోనా సమయంలో అనేక మందికి సహాయం అందించి రియల్ హీరో అనిపించుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన విలన్‌గా సినిమాలు తగ్గించారు. ఇటీవల తెలుగులో `ఆచార్య`లో మెరిశారు. ఇక ఇప్పుడు ఆయన దర్శకుడిగా మారారు. హీరోగా ఆయనే సినిమాని రూపొందించారు. నిర్మాతగానూ మారి `ఫతే` అనే చిత్రాన్ని హిందీలో తెరకెక్కించారు.
ఇందులో సోనూ సూద్‌కి జోడీగా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్‌గా నటించింది. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ రూపొందిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా నేడు శుక్రవారం(జనవరి 10)న విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? దర్శకుడిగా సోనూ సూద్ మెప్పించాడా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథః
ఫతే (సోనూ సూద్) విలేజ్ లో డైరీ ఫామ్ నిర్వహిస్తుంటారు. పాత ఇంట్లో ఒంటరిగా ఉంటాడు. కింద నిమృత్ కౌర్ అనే అమ్మాయి ఫ్యామిలీ ఉంటుంది. ఫతే కి భోజనం, టీ పంపిస్తుంటుంది. ఫతే పై అభిమానాన్ని చూపిస్తుంటుంది. ఆమె సెల్ ఫోన్ షాప్ నిర్వహిస్తుంటుంది. లోన్ ఆప్ ఓపెన్ చేస్తే అందులో మనీ కట్ అవుతుంది. వాళ్ళ ఫాదర్ ని సైబర్ క్రైమ్ నేరస్తులు వేధిస్తుంటారు.
దీంతో అతను సూసైడ్ చేసుకుంటాడు. అంతే కాదు అమృత అమ్మాయి కూడా కిడ్నాప్ చేస్తారు. దీంతో రంగంలోకి దిగుతాడు ఫతే. సైబర్ నేరగాళ్లు ఎవరు ఉన్నారో వెలికి తీసే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో ఖుషీ శర్మ (జాక్వెలిన్ ఫెర్నాండేజ్) సహాయం తీసుకుంటాడు. ఇంతకీ ఫతే ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఖుషీ శర్మని కాపాడాడా? సైబర్ నేరస్థులను అంతం చేశాడా? ఆ తర్వాత ఏం జరిగిందనేది సినిమా.
విశ్లేషణః
విలన్‌గా మెప్పించిన సోనూ సూద్.. ఇటీవల సినిమాలు తగ్గించారు. చాలా సెలక్టీవ్‌గా చేస్తున్నారు. తాజాగా ఆయనే దర్శకుడిగా మారి `ఫతే` సినిమాని రూపొందించడం విశేషం. ఈ మూవీని లోన్ యాప్‌ల మోసాలు, వాటిపేరుతో సైబర్ మాఫియా అమాయక జనాలను ఎలా మోసం చేస్తుంది, ఎంతగా దోచుకుంటున్నారనేదాన్ని ఇందులో చూపించారు సోనూ సూద్.
మంచి సందేశాత్మక మూవీని చాలా కమర్షియల్ వేలో, ఇంకా చెప్పాలంటే హాలీవుడ్ స్టయిల్‌లో రూపొందించారు. సోను సూద్‌కిది దర్శకుడిగా తొలి సినిమా అయినా, ఆయన ది బెస్ట్ టెక్నికల్ వ్యాల్యూస్‌తో, బ్రిలియంట్ గా ఈ మూవీని తెరకెక్కించారు. ఇండియా కంటెంట్ హాలీవుడ్ మేకింగ్ లా ఉందీ చిత్రం.
మనవైన ఎమోషన్స్ కి హాలీవుడ్ టచ్ ఇస్తే ఎలా ఉంటుందో ఈ మూవీ అలానే ఉంటుంది. ఇదొక సరికొత్త ప్రయత్నమని చెప్పొచ్చు. అయితే మేకింగ్ హాలీవుడ్ స్టయిల్‌లో స్క్రీన్ ప్లే చాలా స్లోగా సాగుతుంది. జాన్‌వీక్, జేమ్స్ బాండ్, యానిమల్ వంటి పలు సినిమాలను తలపించేలా మూవీని రూపొందించారు. అంతేకాదు తన పాత్రని కూడా అదే స్థాయిలో డిజైన్ చేశాడు సోనూ సూద్.
యాక్షన్ సీన్లు పైన పేర్కొన్న సినిమాలను తలపించినా అదిరిపోయాయి. వాటిని డిజైన్ చేసిన తీరు బాగుంది. అలాగే స్క్రీన్ ప్లే నడిపించిన తీరు బాగుంది. కానీ చాలా స్లో ఉంది. డ్రామాని ఎస్లాబ్లిష్ చేయడం కోసం కొన్ని సీన్లు, అత్యంత బ్రిలియెంట్ గా మరికొన్ని సీన్లు ఉండటంతో మనకు ఎక్కడం కష్టమనే చెప్పాలి. బోర్ తెప్పిస్తుంటుంది. ఫస్టాఫ్ చాలా స్లోగా ల్యాగ్‌గా అనిపిస్తుంది.
రెండో భాగం మాత్రం చాలా వేగంగా సాగుతుంది. సైబర్ నేరస్థుల భరతం పట్టేందుకు ఫతే రావడంతో ఆయన వేసే ఎత్తులు క్యూరియాసిటీగా ఉంటాయి. ట్విస్టులు ఆకట్టుకుంటాయి. కానీ వాహ్ అనిపించేలా లేవు. సింపుల్‌గా తేల్చేశారు. సోనూ సూద్ యాక్షన్ లుక్‌లో ఆకట్టుకున్నారు. ఆయన పాత్రకు పెద్దగా డైలాగులు లేవు. ఎక్స్ ప్రెషన్స్ తోనే మెప్పించారు.
అయితే ఇందులో చాలా లాజిక్ లు వదిలేశారు. సోనూ సూద్ గతం ఏంటనేది చూపించలేదు. ఎందుకు సింపుల్ లైఫ్ జీవిస్తున్నాడనేది చూపించలేదు. రా వంటి ఏజెన్సీలో పనిచేసినట్టుగా అనిపిస్తుంది. కొన్ని సీన్లు అలా పెట్టారు. కానీ వాటి నేపథ్యం కూడా చూపించలేదు. అవన్నీ మిస్టరీగా ఉంటాయి.
సెకండాఫ్ ఫాస్ట్ గా రన్ అవుతుంది. ఎమోషన్స్ కి ప్రయారిటీ ఇవ్వాల్సింది. మరోవైపు లోన్ యాప్‌ల మోసాలు, సైబర్ మాఫియా ఆగడాల వల్ల సాధారణ ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారనేది మరింత బలంగా చూపించాల్సి ఉంది. దీంతో ఆయా సీన్లు తేలిపోయినట్టుగా అనిపిస్తుంది. నేల విడిచి సాము చేసినట్టు అనిపిస్తుంది.
నటీనటులుః
ఫతేగా సోను సూద్ వన్ మ్యాన్ షో చేశారు. ఆయన చాలా సెటిల్డ్ యాక్టింగ్‌తో, స్టయిలీష్ యాక్టింగ్‌తో మెప్పించారు. నటుడిగా చాలా పరిణతి చూపించారు. విలన్‌గా క్రూరంగా కనిపిస్తాడో, హీరోగా అంతకంటే బాగా చేసి మెప్పించాడు. అదరగొట్టాడు. దర్శకత్వం వహిస్తూ, నిర్మిస్తూ, హీరోగా నటించడం అంటే మామూలు విషయం కాదు, పెద్ద సాహసమనే చెప్పాలి. ఆయన ఈ మూడు విషయాల్లోనూ సక్సెస్ అయ్యారనే చెప్పాలి.
ఇక ఆయనకు సహాయం చేసే అమ్మాయిగా జాక్వెలిన్ మెప్పించారు. బలమైన పాత్రలో నటించింది. సైబర్ మాఫియా లీడర్లు సత్య ప్రకాష్, రాజాలుగా విజయ్ రాజ్, నజీరుద్దీన్ షాలు అదరగొట్టారు. నిమృత పాత్రలో శివ జ్యోతి అలరిస్తుంది. మిగిలిన పాత్రధారులు ఓకే అనిపించారు.
టెక్నీకల్‌గాః
టెక్నీకల్‌గా `ఫతే` చాలా బ్రిలియంట్ ఫిల్మ్. కెమెరా వర్క్ వేరే లెవల్. అలాగే మ్యూజిక్ సినిమాకి పెద్ద అసెట్. జాన్ స్వేవర్త్ ఎడూరి, హన్స్ జిమ్మర్ బీజీఎం, యోయో హానీ సింగ్, షబ్బీర్ అమ్మద్, హరూన్ గావిన్, వివేక్ హరిహరణ్, రోనీ అంజలిపాటలు బాగున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటింగ్ ఇంకా స్పీడ్ చేయాల్సింది.
దర్శకుడు సోనూ సూద్ ఒక హై స్టాండర్డ్స్ మూవీని అందించడంలో సక్సెస్ అయ్యారు. అయితే మన ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా చేయడంలో సక్సెస్ కాలేకపోయారు. ఆయనలో మంచి దర్శకుడు ఉన్నాడనే విషయాన్ని తెలియజేశారు.
ఫైనల్‌గా ః `జాన్ వీక్`, `జేమ్స్ బాండ్` వంటి చిత్రాలను తలపించే మూవీ. మన ఆడియెన్స్ కి ఎంత వరకు ఎక్కుతుందనేదే డౌట్.
రేటింగ్‌ః 2.5