Bangarraju Review : నాగార్జున, నాగ చైతన్య ‘బంగార్రాజు’రివ్యూ

First Published | Jan 14, 2022, 2:45 PM IST

పండ‌గ సినిమాల్లో స్టార్స్  న‌టించిన సినిమా ఇదే కావ‌డం తో విడుద‌ల‌కి ముందే అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది.  ఈ చిత్రం ఎలా ఉంది? బంగార్రాజు పాత్రల్లో తండ్రీ తనయులు చేసిన హంగామా ఎలా ఉంది? త‌దిత‌ర విష‌యాలు రివ్యూలో  చూద్దాం!


ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న  సంక్రాంతి సీజ‌న్ రానే వ‌చ్చింది. ఊహించని విధంగా  ఈసారి భారీ చిత్రాలు రేసు నుంచి త‌ప్పుకుని.. ఒక మీడియం రేంజ్ మూవీ, దాంతోపాటు రెండు చిన్న సినిమాలు థియేట‌ర్ల‌లోకి దిగాయి. అందులో  ప్రేక్ష‌కుల దృష్టిని ప్ర‌ధానంగా ఎట్రాక్ట్ చేస్తోంది ఆ మీడియం రేంజ్ మూవీనే. ఆ సినిమా మరేదో కాదు. 2016 సంక్రాంతికి విడుద‌లై ఘ‌న‌విజ‌యం సాధించిన సోగ్గాడే చిన్నినాయ‌నాకు సీక్వెల్‌గా తెర‌కెక్కిన బంగార్రాజు మూవీ. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ రేసు నుంచి త‌ప్పుకోవ‌డంతో దీనిపై ఎక్సపెక్టేషన్స్ ఒక్క‌సారిగా పెరిగిపోయాయి. సోగ్గాడే చిన్నినాయ‌నాకు సీక్వెల్ కావ‌డం, సంక్రాంతికి ప‌ర్ఫెక్ట్ అనిపించే ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌లా క‌నిపిస్తుండ‌టం దీనికి బాగా క‌లిసొచ్చే అంశాలు. అవి ప్లస్ చేసుకుని బంగార్రాజు బరిలో రెచ్చిపోయాడా....సంక్రాంతి సినిమా అనిపించుకున్నాడా వంటి వివరాలు రివ్యూలో చూద్దాం. 


కథేంటి

‘సోగ్గాడే చిన్నినాయ‌నా’ క‌థ ఎక్కడితే శుభం కార్డు పడిందో..అక్కడే బంగార్రాజు క‌థ మొద‌ల‌వుతుంది. బంగార్రాజు తన కొడుకు రాము(నాగ్) జీవితాన్ని చక్కదిద్ది పైకి స్వర్గానికి స్టైయిట్ గా వెళ్లాడు. అక్కడ లైఫ్ ఎంజాయ్ చేస్తూంటే ఓ రోజు తన భార్య సత్తెమ్మ (రమ్యకృష్ణ) కూడా పైకి ప్రయాణం పెట్టుకుని వచ్చింది. ఆమె తన భర్త బంగార్రాజుతో  ఇక్కడ విశేషాలు చెప్తూ..తమ ఊళ్లో మనవడు చిన బంగార్రాజు(నాగచైతన్య) గురించి చెప్పుకుని వాపోతుంది. అతనో ప్లే బోయ్ లా మారాడని, లైఫ్ లో సీరియస్ గా ఏదీ తీసుకోకుండా ఎంజాయ్ చేస్తున్నాడని అంటుంది.


మరో ప్రక్క చిన్న బంగార్రాజు కు విలన్స్ వల్ల ప్రాణాలకు ముప్పు ఉంటుంది. దాంతో తప్పనిసరి పరిస్దితుల్లో యముడు ఫర్మిషన్ తో  మళ్లీ భూమి మీదకు వస్తాడు బంగార్రాజు. వచ్చి ఎలా సమస్యలను పరిష్కరించారు. చిన్న బంగార్రాజుకు నాగలక్ష్మి (కృతి శెట్టి) ఉన్న లవ్ స్టోరీ ఏమిటి..దానికున్న సమస్య ఏమిటి...చిన్న బంగార్రాజుని చంపాలనుకున్నది ఎవరు..ఎందుకు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
  

Bangarraju

విశ్లేషణ..

ఈ సినిమాని సోగ్గాడే చిన్ని నాయన కు సీక్వెల్ లేదా కంటిన్యూషన్ అనాలి. అయితే ఈ సినిమా మొదటి సినిమా అంత కిక్ ఇవ్వలేదనే చెప్పాలి. అందుకు కారణం...అప్పటికి ఆ పాత్ర...ప్రెజంటేషన్ కొత్త. ఇప్పుడు ఆ సినిమాకు రెట్టింపు ఇవ్వాలి. అదే ఇవ్వలేకపోయారు. దాంతో అదే స్దాయిలో కూడా లేదనిపించింది. అయితే కాసేపు నవ్వుకోవటానికి ఫర్వాలేదనిపిస్తుంది. ఫస్టాఫ్ కేవలం కథ సెటప్ కే స్కీన్ టైమ్ మొత్తం ఖర్చైపోయింది. సెకండాఫ్ లో అసలు కథలోకి వచ్చారు. అప్పటిదాకా ఎదో ఉందనిపించారు. పాటలు బాగున్నాయి కానీ కథా గమనానికి అడ్డుపడ్డాయి. స్క్రీన్ ప్లే ఫార్ములా ఎలిమెంట్స్ తో  చాలా ప్రెడిక్టబుల్ గా సాగటంతో  పెద్దగా ఏమీ అనిపించదు.
 

ఇక స్టోరీ లైన్ కూడా ప్రెష్ గా అనిపించదు. బంగార్రాజు కారెక్టర్‌లో సరసం ఉంది.  సరసమంటేనే బంగార్రాజుకు ఇష్టం. తాత పోలికలు కొడుక్కంటే ఎక్కువగా మనవడికి వస్తాయంటారు. ఆ పాయింట్ పట్టుకునే బంగార్రాజుని చేశారు. సోగ్గాడే లో కొడుకు జీవితాన్ని చక్కదిద్దిన నాగార్జున..ఇందులో మనవడు జీవితాన్ని ఓ పద్దతిలో పెట్టే ప్రయత్నం చేస్తాడు. సినిమా సెకండాఫ్ ప్రీ క్లైమాక్స్ దాగకా ఊపందుకోదు. అయితే లాస్ట్ మినిట్ లో వచ్చే క్లైమాక్స్  సీన్స్ ప్రాణం పోసాయి. నాగార్జున పాత్రను హైలెట్ చేయటం కోసం...అతని చుట్టు కథని నడపటం కోసం నాగచైతన్య పాత్రను డల్ చేసేసారు. నాగ్ పాత్ర ఆత్మలా రావటం కోసం నాగచైతన్య పాత్ర సమస్యలను ఎదుర్కోకుండా అలా చూస్తూండిపోవటమే స్క్రిప్టుకు సమస్యగా మారిందని చెప్పాలి. 


 టెక్నికల్ గా...

అనూప్ ఇచ్చిన పాటలు ఈ సినిమాకు ప్లస్..అలాగే వాటిని అంతే కలర్ ఫుల్ గా చిత్రీకరించారు. అలాగే బ్యాక్ గ్రౌైండ్ స్కోర్ కూడా బాగుది. మ్యూజిక్ డిపార్టమెంట్ పూర్తి న్యాయం చేసింది. ఇక ఈ సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ కెమెరా వర్క్. పల్లె అందాలను చక్కటి కలర్ స్కీమ్ లతో తెరకెక్కించారు. ఎడిటింగే సినిమా కు సడెన్ బ్రేక్ లు వేస్తూ సాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. రైటింగ్ విషయానికి వస్తే అద్బుతం కాదు కానీ ఓకే..ఓకే. స్క్రీన్ ప్లే మాత్రం చాలా ప్రిడిక్టబుల్ గా సాగింది. చాలా రొటీన్ టెంప్లేట్. ప్రజెంటేషన్ కూడా అంతంతమాత్రమే. డైలాగులు బాగున్నాయి. చూసే ప్రేక్షకులు మారనప్పుడు కథలు మాత్రం ఎందుకు మారాలి అని ఫిక్సై చేసిన సినిమా


నటీనటుల్లో .... నాగార్జున చాలా ఉత్సాహంగా కనపడ్డారు. నాగచైతన్య అలా ఓకే అన్నట్లు గా చేసుకుంటూ పోయారు. ఆ పాత్ర అలా చేసింది. ర‌మ్య‌కృష్ణ‌, కృతిశెట్టి పాత్ర‌లు బాగున్నాయి. నాగ‌ల‌క్ష్మి గా కృతి ఫెరఫెక్ట్. సంప‌త్ రాజ్‌, రావు ర‌మేష్, వెన్నెల కిషోర్‌, బ్ర‌హ్మాజీ, ఝాన్సీ, యముడిగా నాగబాబు వంటి సీనియర్స్...ఎప్పటిలాగే ఎక్కువ ,తక్కువ కాకుండా చేసుకుంటూ పోయారు. 


ఫైనల్ థాట్
చచ్చి స్వర్గానికి వెళ్లినా బంగార్రాజుకు తిప్పలు తప్పటం లేదు

Rating:2.5

---సూర్య ప్రకాష్ జోశ్యుల


ప్లస్ లు :
నాగ్ మాటల్లో యాస
పల్లె వాతావరణం
క్లైమాక్స్

నెగిటివ్ లు:

రొటీన్ కథనం
భావోద్వేగాలు లేకపోవటం
 
 

Bangarraju


ఎవరెవరు...
బ్యానర్స్ :  జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి.
నటీనటులు : అక్కినేని నాగార్జున, నాగ చైతన్య,  రమ్యకృష్ణ, కృతి శెట్టి, చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజి, వెన్నెల కిషోర్, ఝాన్సీ తదితరులు.
 స్క్రీన్ ప్లే :  సత్యానంద్
సంగీతం :  అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫర్ :  యువరాజ్
ఆర్ట్ డైరెక్టర్  : బ్రహ్మ కడలి
 కథ, దర్శకత్వం  : కళ్యాణ్ కృష్ణ
నిర్మాత :  అక్కినేని నాగార్జున
రన్ టైమ్:2hr 40 Mins
విడుదల తేదీ: 14 జనవరి,2021

Latest Videos

click me!