`ముఖ్య గమనిక` మూవీ రివ్యూ

First Published | Feb 24, 2024, 9:49 AM IST

మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ సపోర్ట్ చేసిన `ముఖ్య గమనిక` చిత్రంపై ఆసక్తి ఏర్పడింది. మరి శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఆ రేంజ్‌లో ఆకట్టుకుందా? లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

ఫిబ్రవరి నెలాఖరు కావడంతో స్టూడెంట్స్ అంతా పరీక్షలతో బిజీగా ఉంటారు. దీంతో పెద్ద సినిమాలు రిలీజ్‌ కావు. అలాంటి సాహసం కూడా చేయరు. దీంతో చిన్న చిత్రాల జోరు సాగుతుంటుంది. తాజాగా ఈ శుక్రవారం కూడా చిన్న చిత్రాలు చాలానే విడుదలవుతున్నాయి. అందులో భాగంగా ఈ శుక్రవారం ఐదారు సినిమాలు రిలీజ్‌ కాబోతున్నాయి. అందులో భాగంగా వచ్చిన మూవీ `ముఖ్య గమనిక`. దీనికి విశ్వక్‌ సేన్‌ సపోర్ట్ చేయడం విశేషం. ఆయనతోపాటు చాలా మంది బిగ్‌ స్టార్స్ ప్రమోషన్స్ లో హెల్ప్ చేశారు. విరాన్‌ ముత్తంశెట్టి, లావణ్య, ఆర్యన్‌, చిత్రం భాష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకి వేణు మురళీధర్‌ వి దర్శకుడు. శివిన్‌ ప్రొడక్షన్స్ పతాకంపై రాజశేఖర్‌, సాయి కృష్ణ నిర్మించారు. శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 
 

కథః 
సదాశివ పేటలో ఓ సీఐ హత్యకు గురవుతారు. ఆ కేసుని పోలీసులు కప్పేస్తారు. కట్‌ చేస్తే ఏడాది తర్వాత ఆ సీఐ కొడుకు విరాన్‌(విరాన్‌ ముత్తంశెట్టి) కానిస్టేబుల్‌గా తండ్రి పనిచేసిన పోలీస్‌ స్టేషన్‌కే వెళ్తాడు. గత సీఐ కొడుకు అని తెలిసి ప్రస్తుతం సీఐ విరాన్‌ ని ఇబ్బంది పెడుతుంటాడు. తరచూ కోప్పడుతుంటాడు. దీంతో ఇక తన తండ్రి హత్యకు కారణం ఏంటి? ఎలా చనిపోయాడు అనేది తెలుసుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలో మరో వ్యక్తి(ఆర్జే పురుషోత్తం) మిస్సింగ్‌ కేసు అదే పోలీస్‌ స్టేషన్‌కి వస్తుంది. అతను కూడా తన తండ్రి చనిపోయిన రోజే మిస్‌ అవుతాడు. ఆ కేసుకి, తన తండ్రి కేసుకి సంబంధం ఉందని భావించిన విరాన్‌ కేసుని పర్సనల్‌గా విచారిస్తుంటాడు. అందులో భాగంగా ఆర్జే పురుషోత్తం ఇంటికి వెళ్తాడు. ఆయన భార్యని విచారిస్తాడు. దీంతో ఆమె తమ జీవితంలో జరిగిన గతాన్ని వెల్లడిస్తుంది. మరి ఆమె చెప్పిన గతం ఏంటి, ఆమె లైఫ్‌లో ఉన్న మరో వ్యక్తి ఎవరు? ఆ కేసుకి, విరాన్‌ తండ్రి మరణానికి ఉన్న లింకేంటి? ఈ కేసులో ఎస్పీకి ఉన్న సంబంధం ఏంటి? సోషల్‌ మీడియాని రాంగ్‌ వేలో వాడితే ఎలాంటి అనర్థాలు వస్తాయి? విరాన్‌ విచారణలో ఎలాంటి విసయాలు బయటపడ్డాయనేది మిగిలిన కథ. 
 


విశ్లేషణః
ఇదొక మర్డర్‌ మిస్టరీ. కొన్ని థ్రిల్లింగ్‌ ఎలిమెంట్లతో, మరికొన్ని ట్విస్ట్ లు, టర్న్ లతో సాగుతుంది. సినిమాలో ప్రధానంగా రెండు కథలుంటాయి. ఒకటి ఒక సీఐ మర్డర్‌ కేసు, రెండోది సోషల్‌ మీడియా వల్లే జరిగే అనర్థాలను ఇందులో చూపించారు. ఫేస్‌ బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియని వ్యక్తుల  పరిచయం ఫ్యామిలీని ఎలాంటి చిక్కుల్లో పడేస్తుందో తెలియజేసే ప్రయత్నం చేశారు. సినిమాగా ఇదొక మంచి సందేశం ఇచ్చే మూవీ అవుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం సమాజంలో సిటీ కల్చర్స్ లో ఎక్కువగా ఇలాంటి సోషల్‌ మీడియా పరిచయాలు, అక్రమ సంబంధాలు కుటుంబాలను నాశనం చేస్తుంది, ఫ్యామిలీని రోడ్డున పడేలా చేస్తాయని, వాటికి టెంప్ట్ అయితే తమ జీవితమే చిక్కుల్లో పడుతుందని తెలియజేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం జనరేషన్‌కి కనెక్ట్ అయ్యే కథతో ఈ మూవీని తెరకెక్కించడం విశేషం. ఆ విషయంలో దర్శకుడు వేణు మురళీధర్‌ని అభినందించాల్సిందే. 
 

సినిమాని తీసుకెళ్ళిన తీరు బాగుంది. స్క్రీన్‌ ప్లే బాగా రాసుకున్నాడు. రొమాన్స్, అందులోనే చిన్న కామెడీని మేళవించి సీరియస్‌గా సాగే కథలోనే కుర్రాళ్ల చేత హో ఏసుకునేలా చేశాడు. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్ట్ లు బాగున్నాయి. కానీ కథనాన్ని ఇంట్రెస్టింగ్‌గా తీసుకెళ్లడంలో మాత్రం దర్శకుడు తడబడ్డాడు. సినిమా స్లో నెరేషన్‌, క్లోజప్‌ షాట్‌లు కొంత సీరియల్‌ని తలపించేలా ఉంటాయి. అదే సమయంలో ల్యాగ్‌ గా అనిపిస్తుంది. సినిమాలో మెయిన్‌ ఎమోషన్‌ క్యారీ అవలేదు. తండ్రి మరణంతో హీరో ఎలా కుంగిపోయాడు, తండ్రి మరణానికి కారణం ఏంటో తెలుసుకునే విషయాలకు సంబంధించిన ఎమోషనల్‌ మిస్‌ అయ్యింది. హీరోలో ఆ ఎమోషన్‌ కనిపించదు. అలాగే నటీనటులు కూడా సెట్‌ కాలేదు. చాలా వరకు తాము నటిస్తున్నామనే విషయం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. సహజంగా నటించలేకపోయారు. కథని అంతే ఫీల్‌తో, ఎమోషన్‌తో దర్శకుడు తీసుకెళ్లలేకపోయాడు. ఆర్టిస్టుల నటన నేచురల్‌ ఫీల్‌ని మిస్‌ చేయడంతో సినిమాపై ఆసక్తి తగ్గిపోతుంది. సినిమాలో మంచి ట్విస్ట్ లు ఉన్నా అవి తెరపై పండలేదు. ట్విస్ట్ లు అనే ఫీలింగ్‌ లేకుండానే వచ్చిపోవడంతో ఆయా సీన్లు తేలిపోయాయి. దీంతో ఆ కిక్‌ ఆడియెన్స్ మిస్‌ అవుతాడు. ఈ ఆ విషయాల్లో దర్శకుడు మరింత కేర్‌ తీసుకోవాల్సింది. అదే సమయంలో అనుభవ లేమి కనిపిస్తుంది. 
 

నటీనటులు..
విరాన్‌ ముత్తం శెట్టి లుక్‌ వైజ్‌గా బాగుంది. తొలి సినిమా అయినా ఫర్వాలేదు. కానీ ఎక్స్ ప్రెషన్స్ విసయంలో ఇంకా ట్రైన్‌ కావాల్సి. బాడీ లాంగ్వేజ్‌ కూడా ఫ్రీ కావాల్సింది. అయితే ఆయన పాత్ర పెద్దగా లేకపోవడం మైనస్‌. మరోవైపు హీరో పాత్ర కంటే ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడే ఎక్కువగా ఉంది. అందులోని పురుషోత్తం పాత్రనే హీరో అనేలా తెరకెక్కించడం పెద్ద మైనస్‌. ఆ ఎపిసోడ్‌ని అంతగా లాగకుండా ఉండాల్సింది. ఆయనకు జోడీగా లావణ్య కాసేపు మెరిసింది. అలరించింది. ఫ్లాష్‌ బ్యాక్‌లో ఆర్యన్‌, చిత్రం భాష, ఇతర ఆర్టిస్టులు ఓకే అనిపించారు. కానీ బాగా మెప్పించలేకపోయారు. సినిమాకి అనుభవం ఉన్న ఆర్టిస్ట్ లను తీసుకుంటే బాగుండేది.

 టెక్నీషియలు..

ఇక మ్యూజిక్‌ ఓకే. కిరణ్‌ వన్నె సంగీతం, బీజీఎం బాగానే ఉంది. అదే కాస్త ఎంగేజ్‌ చేస్తుంది. కెమెరా వర్క్ బాగున్నాయి. క్లోజప్‌ షాట్‌లు, ఆ సమయంలో వచ్చే బీజీఎం చూస్తుంటే సీరియల్స్ ని తలపిస్తుంటుంది. ఆయా విషయాల్లో కేర్‌ తీసుకోవాల్సింది. దర్శకుడు మంచి కథని రాసుకున్నాడు. కానీ దాన్ని తెరపైకి తీసుకురావడంలో తడబడ్డాడు. ఓవరాల్‌గా సినిమా సందేశం బాగుంది. టేకింగ్‌, ఆర్టిస్ట్ ల నటన కూడా బాగుంటే అదిరిపోయేది. 

ఫైనల్‌గాః సోషల్‌ మీడియా రాంగ్‌ గా వాడేవారికి `ముఖ్యగమనిక`.
 
నటీనటులు :
విరాన్ ముత్తంశెట్టి, లావణ్య, ఆర్యన్, చిత్రం భాష తదితరులు.

టెక్నీషియన్స్ :
బ్యానర్ : శివిన్ ప్రొడక్షన్స్
ప్రొడ్యూసర్స్ : రాజశేఖర్ మరియు సాయి కృష్ణ
మ్యూజిక్ డైరెక్టర్ : కిరణ్ వెన్న
ఎడిటర్ : శివ శర్వాణి
డిఓపి మరియు డైరెక్టర్ : వేణు మురళీధర్. వి
 

Latest Videos

click me!