`మస్తు షేడ్స్ ఉన్నయ్‌ రా` మూవీ రివ్యూ, రేటింగ్‌

First Published | Feb 23, 2024, 9:36 AM IST

కామెడీ నటుడు అభినవ్‌ గోమటం తనదైన కామెడీతో మెప్పించాడు పాపులర్‌ అయ్యాడు. ఇప్పుడు హీరోగా మారి `మస్తు షేడ్స్ ఉన్నయ్‌ రా` చిత్రంలో నటించాడు. ఈ సినిమా నేడు విడుదలైంది. ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

ఇప్పుడు కమెడియన్లు హీరోలుగా అలరిస్తున్న ట్రెండ్‌ నడుస్తుంది. అందులో భాగంగా సీరియస్‌గా కామెడీ చేస్తూ అలరిస్తున్న అభినవ్‌ గోమటం తాజాగా హీరోగా టర్న్ తీసుకున్నాడు. తను కూడా హీరోగా అలరించే ప్రయత్నంలో భాగంగా `మస్తు షేడ్స్ ఉన్నయ్‌ రా` అనే సినిమా చేశాడు. తను నటించిన గత మూవీ `ఈ నగరానికి ఏమైంది`లో ఆయన చెప్పిన పాపులర్‌ డైలాగే ఇది. ఆ డైలాగ్‌ పేరుతోనే సినిమా చేశాడు. తిరుపతి రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా వైశాలి రాజ్‌ నటించారు. అలీ రెజా, మెయిన్‌, నిళ‌గ‌ల్ ర‌వి, రాకెట్‌ రాఘవ, లావణ్య రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. తరుణ్‌ భాస్కర్‌ గెస్ట్ గా మెరిశాడు. కాసుల క్రియేటివ్‌ వర్క్స్ బ్యానర్‌పై భవాని కాసుల, అరీం రెడ్డి అండ్‌ ప్రశాంతి వి నిర్మించారు. ఈ మూవీ శుక్రవారం విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 
 

కథః
మనోహర్‌(అభినవ్‌ గోమటం)ని చిన్నప్పట్నుంచి బ్యాడ్‌ లక్‌ వెంటాడుతుంది. తన తండ్రి వారసత్వాన్ని పునికి పుచ్చుకుని పెయింటర్‌గా పనిచేస్తూ ఉంటాడు. కానీ దాన్ని అందరు చిన్న చూపు చూస్తారు. చివరికి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని మ్యారేజ్‌ రెడీ అవ్వగా అమ్మాయి కూడా ఇతని జాబ్‌ నచ్చక ప్రేమించిన వాడితో లేచిపోతుంది. ఊర్లో అందరూ తనని మరింతగా అవమానిస్తుంటారు. దీంతో లైఫ్‌లో ఏదైనా చేయాలని ఆలోచిస్తున్న క్రమంలో ఫ్లెక్సీల ప్రింటింగ్‌ ప్రెస్‌ పెట్టాలని నిర్ణయించుకుంటా. అందుకు పది లక్షలు అవుతుంది. లోన్‌ ద్వారా కొంత డబ్బు, తన నాన్న ఫ్రెండ్‌ ద్వారా మరికొంత డబ్బు సేకరించి సిటీలో ప్రింటింగ్‌ మిషన్‌కి ఆర్డర్‌ ఇస్తాడు. మరోవైపు ఊర్లో మామయ్య షాప్‌ రెడి చేస్తాడు. ఇక మిషన్‌ తీసుకురావాలని సిటీకి వెళ్లగా షార్ట్ సర్య్కూట్‌ జరిగి ఆ మిషన్లన్నీ కాలిపోతాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఈ విషయం ఊర్లో తెలిస్తే మరింత అవమానాలు ఎదుర్కోవల్సి వస్తుందని భావించి, ఆ కాలిపోయిన మిషన్‌తోనే ఇంటికి వెళ్తాడు. షాప్‌లో పెట్టి ఎమ్మెల్యే(తరుణ్‌ భాస్కర్‌) ద్వారా ఓపెనింగ్‌ చేయిస్తాడు. పని చేయని మిషన్‌తోనే వర్క్ మ్యానేజ్‌ చేస్తాడు. తనకు వచ్చిన ఫ్లెక్సీల ఆర్డర్‌లను సిటీలో ప్రింటింగ్‌ చేయించి అది ఎవరికి తెలియకుండా మ్యానేజ్‌ చేస్తుంటాడు. ఇలా మ్యానేజ్‌ చేయడం కష్టం అవుతుంది. రిపేర్‌ చేయిస్తే మరో ఐదు లక్షలు అవుతుందని మెకానిక్‌ చెబుతాడు. ఆ సమయంలోనే ఊర్లో పెద్ద జాతరకి 300 ఫ్లెక్సీల ఆర్డర్లు వస్తాయి. అది సెట్‌ అయితే తన మెషిన్‌ బాగు చేయించొచ్చని భావిస్తాడు మనోహర్‌. కానీ అంతలోనే తనకు చిన్నప్పట్నుంచి కెరీర్‌కి, లవ్‌కి ప్రత్యర్థిగా ఉన్న రాహుల్‌(అలీ రెజా) ఎంట్రీ ఇచ్చి తన భాగోతం బయటపెట్టాలనుకుంటాడు. మరి ఆ పని చేశాడా? 300 ఫ్లెక్సీ ప్రింటింగ్‌ చేయించగలిగాడా? లేక దొరికిపోయాడా? ఉమాదేవి(వైశాలి రాజ్‌)తో తన లవ్‌ ఎలాంటి మలుపులు తిరిగింది? చివరికి తన కెరీర్‌ ఎటు టర్న్ తీసుకుంది? అనేది మిగిలిన కథ. 

Latest Videos


విశ్లేషణః
నటుడు అభినవ్‌ గోమటం.. కామెడీ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. `ఈ నగరానికి ఏమైంది` చిత్రంలో `మస్తు షేడ్స్ ఉన్నయ్‌ రా, అబ్బా.. కమల్‌ హాసన్‌` అనే డైలాగ్‌ అతని లైఫ్‌నే మార్చేసింది. ఆ డైలాగ్‌ ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంటుంది. సినిమాలో ఆ సీన్‌, అతను చెప్పే విధానం అంతగా పేలింది. అలా ఆ సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు అభినవ్‌. ఆ తర్వాత హీరో ఫ్రెండ్‌గా అనేక సినిమాలు చేశాడు. ఇటీవల కామెడీ నటులు హీరోలుగా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. అందులో భాగంగానే అభినవ్‌ కూడా హీరోగా టర్న్ తీసుకున్నాడు. అయితే బలమైన కథతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఉంటే బాగుండేది. లేదంటే తన బలమైన కామెడీతో కూడిన సినిమా చేసినా అదిరిపోయేది. కానీ ఆయన ఓ చిన్న కాన్సెప్ట్ బేస్డ్ మూవీ చేశాడు. ఓటీటీ కాన్సెప్ట్ లతో వచ్చాడు. ఓ ఫ్లెక్సీ ప్రింటింగ్‌ ప్రెస్‌ చుట్టూ తిరిగే కథతో `మస్తు షేడ్స్ ఉన్నయ్‌ రా` అనే చిత్రం చేశాడు. ఈ సినిమా కథ చాలా సింపుల్‌.. పెయింటర్‌.. ఫ్లెక్సీ ప్రింటింగ్‌ ప్రెస్‌ పెట్టి లైఫ్‌లో సక్సెస్‌ కావాలనుకుంటాడు. అప్పుడైనా తనకు గౌరవంగా అమ్మాయిని ఇచ్చేందుకు ముందుకు వస్తారని భావిస్తాడు. అందుకోసం ఆయన పడే స్ట్రగుల్‌, మధ్యలో లవేంటనేది సినిమా. 
 

పాయింట్‌ చాలా చిన్నది, దాన్ని ఎంటర్‌టైనింగ్‌గా, ఉత్కంఠభరితంగా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఆ విషయంలో కొంత వరకు సక్సెస్‌ అయ్యాడు. సినిమా మేకింగ్‌ క్వాలిటీ ఉంది. టెక్నీకల్‌గా బాగుంది. మ్యాటర్‌ లేని సీన్లని కూడా ఎలివేట్‌ చేయగలిగాడు. కానీ కంటెంట్‌లో విషయం లేదు. అదే సినిమాకి నెగటివ్‌గా మారింది. బలమైన కథని, ఎమోషన్‌తో సినిమా చేసి ఉంటే అదిరిపోయేది. ప్రారంభం నుంచి కథ చాలా లైటర్‌ ఎమోషన్స్ తో సాగుతుంది. రొటీన్‌ సీన్లతో సహనాన్ని పరీక్షించేలా ఉంటుంది. అభినవ్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌ పెట్టాలనుకోవడం, ఆ తర్వాత ఫోటో షాప్‌ నేర్చుకోవాలనుకోవడం, అక్కడ హీరోయిన్‌ పరిచయం ఆమెతో కలిసి ట్రావెల్‌ చేసే సన్నివేశాలు రెగ్యూలర్‌గానే అనిపిస్తాయి. మొదటి భాగం మొత్తం ఈసీన్లు చుట్టూతే నడుస్తుంది. సెకండాఫ్‌లో ప్రింటింగ్‌ ఆర్డర్లు, సిటీకి వెళ్లి తీసుకురావడంతో సాగిపోతుంది. అయితే ప్రింటింగ్‌ ప్రెస్‌ ప్రారంభం నుంచి అందరు ఇది పనిచేస్తుందా? అన్నట్టుగానే, ముందే తమకు తెలుసు అన్నట్టగానే అనుమానంతో చూడటం అతకలేదు. కానీ దాని రిలేటెడ్‌ మధ్య మధ్యలో వచ్చే ఫన్‌ ఫర్వాలేదనిపిస్తుంది. కానీ అభినవ్‌ నుంచి ఆశించిన స్థాయిలో లేదు. 
 

మరోవైపు ప్రింటింగ్‌కి సంబంధించిన సమస్యని మధ్యలో రివీల్‌ చేయోచ్చు, కానీ దాన్ని కవర్‌ చేసే ప్రయత్నం ఇబ్బందిగానే ఉంటుంది. ప్రింటర్స్ రిపేర్‌ రావడం సహజం, మధ్యలో ఏదో సమయంలో చెప్పొచ్చు. కానీ దాన్ని తెలియకుండా మరీ ఓవర్‌గా మ్యానేజ్‌ చేయడమనేది సహజంగా లేదు. ఆయా సీన్లు వర్కౌట్‌ కాలేదు. ఈ విషయంలో కొంత అతి డ్రామా చూపించాడు. పైగా మధ్యలో హీరోయిన్‌తో లవ్‌ ట్రాక్‌ కూడా సరిగ్గా చూపించలేకపోయాడు. అలీ రెజా పాత్రని సరిగ్గా వాడుకోలేకపోయాడు. వాళ్ల నాన్న సిటీలో పెద్ద సంపన్నుడిగా చూపించాడు, కానీ తను ఊర్లో ప్రింటింగ్‌ ప్రెస్‌ పెట్టాలనుకోవడం కూడా అతకలేదు. ఇలా చాలా లాజిక్స్ ని వదిలేశారు. కానీ క్లైమాక్స్ కి వచ్చేసరికి ఉత్కంఠగా మార్చేశాడు. ఏం జరుగుతుందో అనే సస్పెన్స్ క్రియేట్‌ చేయగలిగాడు. ఆడియెన్స్ ని సీట్‌ ఎడ్జ్ లో కూర్చోబెట్టగలిగాడు. అక్కడ దర్శకుడు తన టాలెంట్‌ని చూపించాడు. చివరి అర్థగంట ఆద్యంతం ఉత్కంఠభరింతగా తీసుకెళ్లి కాస్త రిలీఫ్‌నిచ్చాడు. కథ విషయంలో కూడా అంతే సీరియస్‌గా వర్క్ చేస్తే బాగుండేది. 
 

నటీనటులుః
మనోహర్‌ పాత్రలో అభినవ్‌ గోమటం మెప్పించాడు. ఆయన పాత్రలో కామెడీ మిస్‌ అయ్యింది. కానీ ఎమోషన్స్ ని బాగా ప్రదర్శించాడు. లవ్‌ సీన్లలో ఇంకా బాగా చేయాల్సింది. సినిమాలో హీరో అని కాకుండా మనలో ఒకడిగా ఆ పాత్రని చేసిన తీరు బాగుంది. హీరోయిన్‌గా వైశాలి మెప్పించింది. క్యూట్‌గా అలరించింది. లవ్‌ ఎపిసోడ్‌ని ఇంకా బాగా చూపించాల్సింది. కాస్త నెగటివ్‌ టచ్‌ ఉన్న పాత్రలో అలీ రెజా మెప్పించాడు. ఫ్రెండ్‌ శివ పాత్రలో మోయిన్‌ మెప్పించాడు. అలాగే తమకు సపోర్ట్ గా నిలిచే పాత్రలో నిళ‌గ‌ల్ ర‌వి ఆకట్టుకున్నాడు. రాకెట్‌ రాఘవ, లావణ్య రెడ్డి, చ‌క్ర‌పాణి ఆనంద్‌, సూర్య‌ పాత్రలు ఓకే అనిపిస్తాయి. 
 

టెక్నీకల్‌గాః
టెక్నికల్‌గా సంజీవ్‌ టి సంగీతం బాగుంది. వినసొంపుగా ఉంది. సిద్‌ శ్రీరామ్‌ పాట అలరిస్తుంది. శ్యాముల్‌ అబే నేపథ్య సంగీతం కూడా మెప్పిస్తుంది. అదే సినిమాని ఎంగేజ్‌ చేస్తుంది. సిద్ధార్త స్వయంభూ కెమెరా వర్క్ అదిరింది. సినిమాకి రిచ్‌ లుక్‌ రావడంతో, విజువల్‌ అందంగా కనిపించడంలో ఆయన పనితనం కనిపించింది. ఆర్ట్ వర్క్ కూడా బాగుంది. ఎడిటర్‌ స్లో సీన్లని కట్‌ చేయాల్సింది. దర్శకుడు తిరుపతి ఎంచుకున్న కథ బాగలేదు. కానీ ఆయన టేకింగ్‌, తీసిన తీరు ఫర్వాలేదు. మంచి కథని ఎంచుకుని సినిమా చేసి ఉంటే తన పనితనం ఎలివేట్‌ అయ్యేది. ఇక నిర్మాతలు ప్రొడక్షన్‌ పరంగా రాజీపడకుండా నిర్మించారని ప్రతి సీన్‌లోనూ తెలుస్తుంది.  

ఫైనల్‌గాః `మస్తు షేడ్స్ ఉన్నయ్‌ రా` టైమ్‌ పాస్‌ మూవీ. 
రేటింగ్‌ః 2.5/5
 

click me!