`విడుదల 2` మూవీ రివ్యూ, రేటింగ్‌.. విజయ్‌ సేతుపతి విశ్వరూపం చూపించాడా?

First Published | Dec 20, 2024, 1:03 PM IST

గతేడాది వచ్చిన `విడుదల` పెద్ద హిట్‌ అయ్యింది. దానికి పార్ట్ 2గా ఇప్పుడు `విడుదల 2` వస్తుంది. విజయ్‌ సేతుపతి, సూరి, మంజు వారియర్‌, అనురాగ్‌ కశ్యప్‌ నటించారు. వెట్రి మారన్‌ రూపొందించిన ఈచిత్రం తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

విజయ్‌ సేతుపతి ఇటీవల `మహారాజా` సినిమాతో అదరగొట్టాడు. ఇప్పుడు `విడుదల 2`తో వస్తున్నారు. గతేడాది వచ్చిన `విడుదల`కి ఇది రెండో పార్ట్. టాలెంటెడ్‌ దర్శకుడు వెట్రిమారన్ రూపొందించిన చిత్రమిది. ఇందులో విజయ్‌ సేతుపతి కి జోడీగా మంజు వారియర్‌ నటించారు. సూరీ మరో హీరో పాత్రని పోషించారు. అనురాగ్‌ కశ్యప్‌ కీలకపాత్రలో నటించారు. ఈ మూవీ నేడు శుక్రవారం(డిసెంబర్‌ 20న) విడుదలైంది. మరి తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్‌ అయ్యిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

కథః
ప్రజా దళం నాయకుడు పెరుమాల్‌(విజయ్‌ సేతుపతి)ని కానిస్టేబుల్‌ కుమరేషన్‌(సూరి) పట్టుకోవడంతో పోలీసులు అతన్ని తీసుకుని అడవిలోకి వెళ్తారు. అడవి దాటి టౌన్‌కి వెళ్తుండగా దారిలో పోలీసులకు తన స్టోరీ చెబుతాడు పెరుమాల్‌. అప్పట్లో తమ గ్రామాల్లో భూస్వాములు, అగ్రవర్ణాల ఆగడాలు ఎలా ఉండేవనేది, తాను ఎందుకు ఈ దళ నాయకుడు కావాల్సి వచ్చిందనేది వివరిస్తాడు. తమ ప్రాంతంలో భూస్వాములు కూలీ చేసే వారి భార్యలను అనుభవించాలని ప్రయత్నిస్తుంటారు. వారిని ఎదురిస్తాడు పెరుమాల్‌. భూస్వామిని అంతం చేస్తాడు. దీంతో అతనిలోని ధైర్యాన్ని అంతా మెచ్చుకుంటారు. ఇది అక్కడి కమ్యూనిస్టులకు, వారి నాయకుడు కేకే(కిశోర్‌)కి తెలుస్తుంది. ఆయన కమ్యూనిస్ట్ రాజకీయ తరగతులు నిర్వహిస్తూ ఉద్యమాన్ని నడిపించే నాయకుడు. ఆయన ప్రసంగాలకు ఆకర్షితుడై నాయకుడిగా మారతాడు పెరుమాల్‌. మొదట చక్కర ఫ్యాక్టరీలో కార్మికులు చనిపోవడంతో యాజమాన్యం చేసిన కుట్రని బయటపెడతాడు. కార్మికులను ఐక్యం చేసి యూనియన్‌ స్థాపిస్తాడు. ఇది తట్టుకోలేని భూస్వాములు, ఫ్యాక్టరీ యాజమాన్యులు దీనికి కారణమైన కేకేని హత్య చేస్తారు. దీంతో మరింతగా రెచ్చిపోయిన పెరుమాల్‌ భూస్వాములను అందరిని చంపేస్తారు. ఈ సంచలనంగా మారుతుంది. దీంతో పెరుమాల్‌ ప్రభుత్వానికి, పోలీసులకు టార్గెట్‌ అవుతాడు. అక్కడినుంచి పెరుమాల్‌ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తారు. అనంతరం ఏం జరిగింది? పెరుమాల్‌ మహాలక్ష్మి(మంజు వారియర్‌)కి ఎలా పరిచయం అయ్యింది? ఇంతకి మహాలక్ష్మి ఎవరు? వీరి ప్రేమ కథ ఏంటి? పెరుమాల్‌ని పట్టుకుని అడవిలో వెళ్తుండగా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. రైలు ప్రమాదానికి అసలు కారణం ఎవరు? ఈ జర్నీలో పెరుమాల్‌ .. కుమరేషన్‌ వంటి కొందరు పోలీసుల్లో తెచ్చిన మార్పేంటి? పెరుమాల్‌ లో వచ్చిన మార్పేంటి? పెరుమాల్‌ అరెస్ట్ లో ప్రభుత్వం ఇచ్చిన ట్విస్ట్ ఏంటి? అనేది మిగిలిన కథ. 
 


విశ్లేషణః
`విడుదల` మొదటి భాగం కుమరేషన్‌ జర్నీని, ఆయన లవ్‌ స్టోరీని, పెరుమాల్‌ని పట్టుకునేందుకు ఆయన చూపించిన ధైర్యసాహసాలను చూపించారు. రెండో పార్ట్ పూర్తిగా పెరుమాల్‌ జర్నీప్రధానంగా సాగుతుంది. ఆయన ప్రజాదళం నాయకుడిగా మారిన తీరుని, మారడానికి దారి తీసిన పరిస్థితులను, భూస్వాముల ఆగడాలను కళ్లకి కట్టినట్టు చూపించారు. చాలా రియలిస్టిక్‌గా తెరకెక్కించారు. మరోవైపు కమ్యూనిస్ట్ ఉద్యమాలు ఎలా ఉంటాయి, వారి ఆలోచలు, వారి పంథా, వారి సిద్ధాంతం ఏం చెబుతుందనేది ఇందులో చర్చించారు దర్శకుడు వెట్రిమారన్‌. పోలీసులు వ్యవస్థలోని లోపాలను, అధికారుల స్థాయిలో జరిగే వాస్తవ పరిస్థితులను, అదే సమయంలో నక్సల్స్, కమ్యూనిస్ట్ ఉద్యమకారులు చేసే పోరాటం, వారి ఎత్తుగడలను, పోరాడే క్రమంలో తమ జీవితాలను త్యాగం చేయడం, కుటుంబాలను, భార్యబిడ్డలను త్యాగం చేయడం, ప్రాణాలు అడ్డుగా పెట్టి అన్యాయంపై చేసే పోరాటాన్ని ఇందులో చాలా స్పష్టంగా, లోతుగా చూపించారు. అదే ఈ సినిమా బలం. హైలైట్‌ పాయింట్‌ కూడా. ఎలాంటి పరిస్థితులు మనిషిని మార్చేస్తాయి. ఉద్యమాల వైపు ఆకర్షించబడతాయనేది బాగా చూపించారు. పేదలను, అణగారిన ప్రజలను పోలీసులు, ప్రభుత్వాలు ఎలా బలి చేస్తాయి. బలి తీసుకుంటాయి. ఎలా వాడుకుంటాయనేది కూడా బాగా చూపించాడు దర్శకుడు. ప్రారంభ ఎపిసోడ్లు, క్లైమాక్స్ బాగా ఆకట్టుకుంటాయి.
 

కథని, కథనాన్ని చాలా రా గా, చాలా రియాలిటీకి దగ్గరగా చూపించడం ఈ మూవీలో గొప్పతనం. అయితే ఇందులోనూ విజయ్‌ సేతుపతి, మంజు వారియర్‌ మధ్య ప్రేమని హుందాగా చూపించిన తీరు బాగుంది. ఇంతటి సీరియస్‌  ఫిల్మ్ లోనూ కామెడీ ఎలిమెంట్లని జోడించడం చాలా సాహసమే. కష్టం కూడా. కానీ అడవిలో పెరుమాల్‌ ప్రయాణంలో ఆయా అంశాలను మేళవించిన తీరుకి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే. సినిమా క్రిటికల్‌గా అభినందించేలా ఉన్నా, కమర్షియల్‌ ఫార్మాట్‌లో చూస్తే ఇప్పటి తరానికి ఎంత వరకు అర్థమవుతుందనేది ప్రశ్న. సినిమాలో వాడిన పదజాలం, కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఇప్పటి తరానికి కనెక్ట్ కావడం కష్టం. అదే సమయంలో సినిమాని చాలా స్లోగా నడిపించడం పెద్ద మైనన్‌. మధ్య మధ్యలో ఫన్‌, ట్విస్ట్ లు, మలుపులు ఉన్నా స్లోగా సాగడంతో ఆసక్తి తగ్గుతుంది. స్క్రీన్‌ప్లే గ్రిప్పింగ్‌గా చేయాల్సింది. మరోవైపు అటు పోలీసు ఎత్తుగడలు, ఇటు పెరుమాల్‌ టీమ్‌ ఎత్తుగడలు అంత ఈజీగా అర్థం కాకపోవడం కూడా మైనస్‌గా చెప్పొచ్చు. ఇలాంటి సినిమాల్లో ఎమోషన్స్, సంఘర్షణ చాలా ముఖ్యం. అది ఇందులో తగ్గింది. ఆడియెన్స్ ఆ ఇంటెన్సిటీని ఫీల్‌ కాలేకపోతారు. అయితే ఇప్పటి తరానికి కూడా ఆనాటి పరిస్థితులను కళ్లకి కట్టినట్టు చెప్పేప్రయత్నం బాగుంది. రియాలిటీకి దగ్గరగా చూపించిన తీరు అభినందనీయం. 
 

నటీనటులుః
పెరుమాల్‌గా విజయ్‌ సేతుపతి నటన అద్భుతం. ఇలాంటి రా గా సాగే పాత్రల్లో ఆయన రెచ్చిపోతారు. ఇందులోనూ మరోసారి రెచ్చిపోయారు. నక్సల్‌గానే కనిపించాడు. పెరుమాల్‌ పాత్రలో జీవించారు. మంజు వారియర్‌తో సాగే ప్రేమ సన్నివేశాల్లోనూ తన నటన, ఇన్నోసెంట్‌ బాగుంది. సినిమాని మోసేశాడు. ఇక మహాలక్ష్మిగా మంజు వారియర్‌ అదరగొట్టింది. ఆమె పాత్ర మరో సర్‌ప్రైజింగ్‌ ఎలిమెంట్‌. కుమారేషన్‌గా సూరి ఇందులో పాత్ర పరిధి తగ్గింది. చాలా వరకు సైలెంట్‌గానే కనిపిస్తాడు. కానీ ఎమోషనల్‌గా బాగా చేశాడు. క్లైమాక్స్ లో తన ట్విస్ట్ బాగుంది. ఉద్యమ నాయకుడు కేకే గా కిశోర్‌ పాజిటివ్‌ రోల్‌లో మెప్పించాడు. డీఎస్పీగా గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు. ఇక మిగిలిన నటులు చాలా మంది బాగా చేశారు. తమ వంతు ప్రాణం పోశారు. చాలా సహజంగా చేశారు. 
 

టెక్నీకల్‌గాః
సినిమా టెక్నికల్‌ గా బాగుంది. ఆర్‌ వేల్‌రాజ్‌ కెమెరా వర్క్ సినిమాకి హైలైట్‌. ఇలాంటి సినిమాని షూట్‌ చేయడం పెద్ద ఛాలెంజ్‌. ఈ విషయంలో కెమెరామెన్‌ని అభినందించాల్సిందే. ఎడిటింగ్‌ పరంగా చాలా బాగా చేయోచ్చు. ఆర్‌ రామర్‌ ఈ విషయంలో విఫలమయ్యాడు. ఇళయరాజా సంగీతం బాగుంది. బీజీఎంలో, పాటల్లో కమ్యూనిస్ట్ ఫ్లేవర్‌ కనిపిస్తుంది. ముఖ్యంగా ఆర్‌ఆర్‌ చాలా బాగుంది. సినిమాకి అది మరో అసెట్‌ అవుతుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు  వెట్రీ మారన్‌ ఇలాంటి రా కంటెంట్‌తోనే తన ప్రత్యేకతని చాటుకుంటున్నారు. ఇప్పుడు మరోసారి తన మార్క్ ని చూపించారు. మరింత రా గా సినిమాని తెరకెక్కించాడు. అయితే ఇది తమిళ ఆడియెన్స్ కి కొంత వరకు కనెక్ట్ అవుతుంది. కానీ మన తెలుగు ఆడియెన్స్ కి ఇంతటి రా నెస్‌ అవసరం లేదు. తీసుకోలేరు. స్లోగా కథని నడిపించే విషయంలోనూ ఆయన జాగ్రత్త పడాల్సింది. అయితే చెప్పాలనుకున్న కథలోని సోల్‌, ఎమోషన్స్ మిస్‌ అవుతాయనే ఉద్దేశ్యంతో ఆయన ఇలా నడిపించినా, ఇప్పటి ఆడియెన్స్ కి ఇది ఎక్కడ కష్టంగానే ఉంటుంది. పెరుమాల్‌పాత్ర ద్వారా ఆయన ఇచ్చిన క్లారిటీ, కుమరేషన్‌ పాత్ర ద్వారా ఆయన రియాలిటీని చెప్పిన తీరు బాగుంది. ఇంతటి రియాలిటీగా కథని చెప్పే విషయంలో ఆయన్ని అభినందించవచ్చు. 
 

ఫైనల్‌గాః వ్యవస్థలోని లోపాలను ఆవిష్కరించే చిత్రం. ప్రభుత్వాలు, పోలీసులు అమాయకులను ఎలా బలి తీసుకుంటారనేది తెలిపే చిత్రం. ఉద్యమ నాయకుడి స్పూర్తిని తెలిపే చిత్రం. 
రేటింగ్‌ ః 2.75
 

Latest Videos

click me!