`మార్టిన్‌` మూవీ తెలుగు రివ్యూ, రేటింగ్‌

First Published | Oct 11, 2024, 7:01 PM IST

యాక్షన్‌ హీరో అర్జున్‌ మేనల్లుడు ధృవ సర్జా హీరోగా నటించిన మూవీ `మార్టిన్‌`. ఏ పీ అర్జున్‌  దర్శకుడిగా, అర్జున్‌ కథ, స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రం నేడు శుక్రవారం(అక్టోబర్‌ 11)న విడుదలైంది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 
 

యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ తెలుగులో బాగా పాపులర్‌. తెలుగు హీరోగానే రాణిస్తున్నారు. ఆయన మేనల్లుడు ధృవ సర్జాని కూడా తెలుగు ఆడియెన్స్ కి అలవాటు చేస్తున్నారు. ఆయన గత చిత్రాలు కూడా తెలుగులో రిలీజ్‌ అయ్యాయి. కానీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు. ఇప్పుడు మరో మూవీ `మార్టిన్‌`తో ఈ దసరాకి వచ్చారు. ఈ మూవీకి అర్జున్‌ కథ, స్క్రీన్‌ ప్లే అందించడం విశేషం. ఏ పీ అర్జున్‌ దర్శకత్వం వహించగా, ఉదయ్‌ కే మెహతా నిర్మించారు. ఇందులో ధృవ సర్జాకి జోడీగా వైభవి శాండిల్య హీరోయిన్‌గా చేసింది. శుక్రవారం(అక్టోబర్‌ 11)న విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 
బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

కథః

అర్జున్‌(ధృవ సర్జా) పోర్ట్ లో కస్టమ్ ఆఫీసర్ గా పనిచేస్తాడు. ఆయన మార్టిన్‌ అనే మాఫియా గ్యాంగ్‌స్టర్‌ని పట్టుకునేందుకు పాకిస్తాన్‌ కి వెళ్తాడు. అక్కడ లోకల్‌ మాఫియాతో జరిగిన గొడవలో గాయపడతాడు. దీంతో పోలీసులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్తారు. పెద్ద క్రిమినల్‌గా ట్రీట్‌ చేస్తుంటారు. అయితే అందులో డాక్టర్‌ మాఫియాతో కలిసి అర్జున్‌కి గతం గుర్తుకు రాకూడదని ఇంజెక్షన్స్ ఇస్తారు. దీంతో గతం మర్చిపోయిన అర్జున్‌ ని పోలీసులు అరెస్ట్ చేసి ఓ పెద్ద జైలులో ఉంచుతారు. కానీ అర్జున్‌ ని తట్టుకోవడం వాళ్లకి కూడా సాధ్యం కాదు.

భారీ పర్సనాలిటీతో ఉండే అర్జున్‌ ఖైదీ విలన్లని సైతం మట్టికరిపిస్తాడు. అనంతరం జైలు నుంచి తప్పించుకుని బయటకు వెళ్తాడు. తాను ఎవరు? తన వెంట విలన్లు ఎందుకు పడుతున్నారనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాడు. అందులో భాగంగా తనని మార్టిన్‌ మనుషులు వెంటాడుతున్నారని తెలుసుకుంటాడు. అంతేకాదు అతని వల్ల తన ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి కూడా థ్రెట్‌ ఉందని తెలుసుకుని వాళ్లని కాపాడుకోవాలని, తాను ఎవరో, తాను పాకిస్తాన్‌ ఎందుకు వెళ్లాడో తెలుసుకోవాలనుకుంటాడు.

ఇండియా వచ్చి ఫ్రెండ్‌ పరశురామ్‌ ని కలవగా, తనముందే అతన్ని చంపేస్తారు మార్టిన్‌ మనుషులు. అనంతరం బాక్సర్‌గా ఉన్న మరో ఫ్రెండ్‌ వివేక్‌ని కూడా చంపేస్తారు. నెక్ట్స్ టార్గెట్‌ తన కాబోయే భార్య ప్రీతి(వైభవి శాండిల్య) అని తెలుసుకుని ఆమె వద్దకు వెళ్తాడు. కానీ తనకు గతం గుర్తులేదనే విషయాన్ని  ఆమెకి చెప్పకుండా దాస్తాడు. మార్టిన్‌ని బయటకు రప్పించడం కోసం ప్రీతిని బయటకు తీసుకువెళ్తాడు. ఓ మార్కెట్‌లో వీళ్లని రౌండప్‌ చేస్తారు మార్టిన్‌ మనుషులు. వాళ్లని అర్జున్‌ ఎదుర్కొంటాడు.

కానీ అక్కడే అసలు ట్విస్ట్. మార్కెట్‌లో విలన్లతో ఫైట్‌ చేసింది అర్జున్‌ కాదు మార్టిన్‌(ధృవ సర్జా) అని తెలుస్తుంది. మరి అర్జున్‌ ఏమయ్యాడు? మార్టిన్‌ అక్కడికి ఎలా వచ్చాడు? మార్టిన్‌ అసలు టార్గెట్ ఎవరు? ఇందులో స్మగ్లర్‌ ఎవరు? అర్జున్‌ని మార్టిన్ ఎందుకు చంపాలనుకుంటాడు? మార్టిన్‌ని అర్జున్‌ ఎందుకు పట్టుకోవాలనుకుంటాడు?. దీనికి మెడికల్‌ మాఫియాకి, అక్రమ ఆయుధాల రవాణాకి ఉన్న సంబంధం ఏంటనేది మిగిలిన కథ. 
 

Latest Videos


విశ్లేషణః
యాక్షన్‌ హీరో అర్జున్‌ యాక్షన్‌ సినిమాలతో స్టార్‌ హీరోగా ఎదిగారు. ఆయన నటించిన చాలా సినిమాల్లో దేశభక్తి అనేది కామన్ పాయింట్ గా ఉండేది. దేశ కోసం పోరాడటం, పోలీస్‌గానో, సైనికుడిగానో, ఇలా పాత్ర ఏదైనా అందులో కామన్‌ పాయింట్‌ దేశభక్తి, దేశ రక్షణ అనే అంశాలుండేవి. అప్పట్లో అవి బాగా సేలబుల్‌ కంటెంట్‌గా ఉండేవి. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్‌ మారింది. దేశభక్తి అనేది ఔట్‌డేటెడ్‌ కంటెంట్‌. ఎందుకంటే దీనిపై ఇప్పటికే రావాల్సిన దానికి మించిన సినిమాలు వచ్చాయి.

దేశభక్తిని మేకర్స్ టూ మచ్‌గా క్యాష్‌ చేసుకున్నారు. ఇప్పుడు అది వర్కౌట్ కావడం లేదు. ఇలాంటి టైమ్‌లో అర్జున్‌ మేనల్లుడు ధృవ సర్జా `మార్టిన్‌` సినిమా చేయడం విశేషం. ఇది పూర్తి యాక్షన్‌ మూవీ. దేశభక్తి బ్యాక్‌ డ్రాప్‌లోనే కథ నడుస్తుంది. అయితే ఈ చిత్రానికి అర్జున్‌ కథ, స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. తనలాగా మేనల్లుడిని సైతం యాక్షన్‌ హీరోగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని అర్థమవుతుంది.

 కథ బ్యాక్‌ డ్రాప్‌ దేశ భక్తి, మెడికల్‌ మాఫియా, అక్రమ ఆయుధాల రవాణా అనే పాయింట్లు ఉన్నా, అది అంతర్లీనంగా సాగుతుంది, తప్పితే అది మెయిన్‌ కాదు. పూర్తిగా యాక్షన్‌ మూవీగా దీన్ని తెరకెక్కించడం విశేషం. ఇంకా చెప్పాలంటే యాక్షన్‌ కోసం అందులో ఈ కథని రాసుకున్నట్టుగా అనిపిస్తుంది.

ఈ సినిమా చూస్తున్నంత సేపు ఒకదాని తర్వాత మరోటి యాక్షన్‌ సీన్లు తప్పితే అంతకు మించి మరేమీ ఉండవు. ఫస్టాఫ్‌ మొత్తం  యాక్షన్‌ సీన్లతోనే లాగించారు. అందులో ధృవ సర్జా విరోచితమైన యాక్షన్‌ని మెయిన్‌గా చేసి రూపొందించారు. ఈ విషయంలో కొంత `కేజీఎఫ్‌`ని ఫాలో అయ్యారు. ఎలివేషన్లు, హీరోయిజం గురించి చెప్పడం అంతా ఆ మూవీని పోలీ ఉంటుంది.  

ఫస్టాఫ్‌ ఇంటర్వెల్‌ ట్విస్ట్ తర్వాత అసలు కథేంటనేది పరిచయం చేశారు. ఈ లెక్కన మొదటి భాగంలో కథలేదు. మార్టిన్ ఎవరు? అర్జున్‌ వెంట ఎందుకు పడుతున్నాడు? ఇంతకి అర్జున్‌ ఎవరనే సస్పెన్స్ తోనే ఫస్టాఫ్‌ అంతా నడుస్తుంది. దీంతో ఏం జరుగుతుందో అర్థం కాదు. ఇక రెండో భాగం స్టార్ట్ అయ్యాక అర్జున్‌ పాత్రని రివీల్‌ చేశారు. పోర్ట్ లో కస్టమ్‌ అధికారిగా పనిచేసే అర్జున్‌ పాకిస్థాన్‌ ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనేది చూపించారు. అయితే అందులో క్లారిటీ లేదు.

వెనుక సీన్లు ముందు రావడమో, ముందు సీన్లు వెనుక వచ్చాయా? అనేలా ఆ తర్వాత కథని రివీల్‌ చేయడం గమనార్హం. అయితే అది ఏమాత్రం అర్థమయ్యేలా లేదు. తాను పనిచేసే పోర్ట్ లో మెడికల్‌ మాఫియాకి చెందిన కంటెయినర్లని అర్జున్‌ సీజ్‌ చేయడంతో దాని వెనకాల ఉన్న వ్యక్తులు ఎంట్రీ ఇవ్వడంతో కథ ముందుకెళ్తుంది. కానీ రెండు పాత్రల్లో ఎవరు మార్జిన్‌, ఎవరు అర్జున్‌ అనేది క్లారిటీగా చూపించలేకపోయాడు. జస్ట్ వాయిస్‌ రూపంలో తేడా పెట్టి, ప్రస్తుతం జరిగే కథ, ఫ్లాష్‌ బ్యాక్‌ కథని చెబుతూ కన్‌ఫ్యూజ్‌ క్రియేట్‌ చేశాడు.

ఇక టైమ్‌ దొరికితే యాక్షన్‌ ఎపిసోడ్‌ పెట్టి కథని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశాడు. అది ఆడియెన్స్ కి చిరాకు తెప్పిస్తుంది. దీనికితోడు యాక్షన్‌ ఎపిసోడ్లు కూడా హెవీగా ఉంటాయి. చాలా లౌడ్‌గా ఉంటాయి. బీజీఎం టూ లౌడ్‌ అయిపోయింది. దీంతో ఆడియెన్స్ కి ఇరిటేషన్‌ పీక్‌లో కనిపిస్తుందని చెప్పొచ్చు. కథని ఎలా నడిపించాలో అర్థం కాక కన్‌ఫ్యూజ్‌ అయినట్టుగా ఉంటుంది. ముగింపులోనూ స్పష్టత లేదు. ఓవరాల్‌గా సినిమా ధృవ సర్జా యాక్షన్‌ మాత్రమే చేయగలడు, ఇంకేమీ చేయలేడనేలా సినిమా సాగింది. 
 

నటీనటులుః 
అర్జున్‌ పాత్రలో, మార్టిన్‌ పాత్రలో ధృవ సర్జా అదరగొట్టాడు. పాత్రల్లో వేరియేషన్‌ బాగుంది. అది కేవలం యాక్షన్ సీన్లకే పరిమితం. ఆయా సీన్లలో ఆయన ఎక్స్ ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్‌, భారీ పర్సనాలిటీతో ఆయన చేసే యాక్షన్‌ సీన్లు అదిరిపోయాయి. ఆయా సీన్లలో ధృవ ది బెస్ట్ చేశాడు. రెండు పాత్రల్లో డైలాగ్‌ వేరియేషన్‌ ఓకే, కానీ నటనలో కనిపించలేదు.

కానీ ఇలాంటి కొత్త తరహా, భారీ యాక్షన్‌ చేయడం మామూలు కాదు, ఆ విషయంలో మెచ్చుకోవల్సిందే. ఇక ప్రీతిగా వైభవి శాండిల్య ఉన్నంతలో మెప్పించింది. ఇంకా ఇందులో చెప్పుకోదగ్గ పాత్రలు లేవు. అన్నీ అలా వచ్చి ఇలా పోయేవే. సినిమా మొత్తం యాక్షన్‌ ప్రధానంగా సాగడంతో నటన గురించి చెప్పుకోవడానికి ఏం ఉండదు. ఇందులో అదే జరిగింది. మిగిలిన పాత్రలు ఉన్నంతలో ఓకే అనిపించాయి.  
 

టెక్నీషియన్లుః
`మార్టిన్‌`కి మణిశర్మ సంగీతం అందించారు. ఆయన పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాకి బీజీఎం హైలైట్‌. యాక్షన్‌ మూవీ కావడంతో రవి బన్సూర్‌ తన మార్క్ క్రేజీ బీజీఎంతో సినిమా స్థాయిని పెంచే ప్రయత్నం చేశారు. అయితే అది శృతి మించింది. బీజీఎం ఓవర్‌డోస్‌లో అనిపిస్తుంది. సౌండ్‌ టూ మచ్‌గా ఉంటుంది. అసలే యాక్షన్‌, దానికి ఈ సౌండ్‌ మరింత చిరాకు పెట్టిస్తుంది.

అది పెద్ద తలనొప్పిగా ఉంటుంది. సత్య హెగ్డే కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ గ్రాండియర్‌గా ఉన్నాయి. ఎడిటింగ్‌ పరంగా చాలా కేర్‌ తీసుకోవాల్సింది. చాలా సీన్లు ఒకదానికొక్కటి పొంతన లేకుండా ఉన్నాయి. కథ పరంగా చిన్న పాయింట్‌. దానికి యాక్షన్‌ దట్టించి తీశారు. దర్శకుడు యాక్షన్‌ సీన్లని బాగానే డీల్‌ చేశాడు. అంటే యాక్షన్‌ కొరియోగ్రాఫరే ఈ సినిమాకి అసలైన డైరెక్టర్‌ అని చెప్పొచ్చు.

యాక్షన్‌ సీన్లు అదిరిపోయాయి. చాలా కొత్తగా ఉన్నాయి. ఏపీ అర్జున్‌ ఏం చేయలేకపోయాడని అర్థమవుతుంది. అర్జున్‌ స్క్రీన్‌ ప్లే కూడా క్లారిటీ లేదు. సీన్లని కట్‌ కట్ అనేలా ఉన్నాయి. ఎంతో అనుభవం ఉన్న అర్జున్‌ కూడా కథని లైట్‌ తీసుకోవడం, స్క్రీన్‌ప్లేని ఇంత కన్‌ఫ్యూజన్‌ గా డీల్‌ చేయడం విచాకరం. అదే ఈ సినిమాకి పెద్ద మైనస్‌. 

ఫైనల్‌గాః ఆడియెన్స్ పై ధృవ సర్జా దండయాత్ర. 
రేటింగ్‌ః2
 

click me!