Mangalya Balam Review: టాలీవుడ్ చరిత్రలో ఫస్ట్ 100 డేస్ సినిమా.. ఏఎన్నార్, సావిత్రి రొమాంటిక్ మూవీ, 'మాంగల్య బలం' రివ్యూ

Published : Aug 23, 2026, 11:19 AM IST

Mangalya Balam Review: తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో 100 రోజుల వేడుకను జరుపుకున్న తొలి మూవీ 'మాంగల్య బలం'. ఏఎన్నార్ - సావిత్రిల కాంబినేషన్‌లో వచ్చిన ఈ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాకు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా రివ్యూ చూస్తే..

PREV
16
ఏఎన్నార్ - సావిత్రి హిట్ కాంబినేషన్

అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి కాంబినేషన్‌లో వచ్చిన అద్భుతమైన కుటుంబ కథా చిత్రం 'మాంగల్య బలం' (1959). ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో, అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై దుక్కిపాటి మధుసూదనరావు నిర్మించిన ఈ చిత్రం తెలుగు సినీ చరిత్రలోనే ఒక క్లాసిక్‌గా నిలిచిపోయింది. ఆశాపూర్ణాదేవి రాసిన ‘అగ్నిపరీక్ష’ నవల ఆధారంగా బెంగాలీలో వచ్చిన ‘అగ్నిపరీక్ష’ సినిమాకు ఇది అధికారిక రీమేక్.

26
మాంగల్య బలం కథ విషయానికి వస్తే..

చిన్నతనంలోనే సాంప్రదాయాల ప్రకారం కుటుంబాల మధ్య సరదాగా జరిగే పెళ్లితో, పాఠశాల వయసులోనే సరోజ (సావిత్రి), చంద్రం (ANR) ఒకే బంధంతో ముడిపడతారు. అయితే, కుటుంబాల మధ్య వచ్చిన విభేదాల వల్ల వీరు విడిపోతారు. పెద్దయ్యాక ఈ విషయం తెలియని సరోజ, కాలేజీ రోజుల్లో మళ్లీ చంద్రంతో ప్రేమలోపడుతుంది. అయితే, తాను చిన్నప్పుడే వేరొకరిని పెళ్లి చేసుకున్నాననే నింద తనపై ఉందని తెలుసుకుని ప్రేమను త్యాగం చేయడానికి సిద్ధపడుతుంది. చివరికి వారిద్దరి చిన్ననాటి పెళ్లి బంధం, ప్రస్తుత ప్రేమ ఒక్కటేనని తెలుసుకునే క్రమంలో సాగే ఎమోషనల్ స్టోరీ 'మాంగల్య బలం'.

అద్భుతమైన స్క్రీన్ ప్లే, సెంటిమెంట్‌తో ఈ మూవీ ఆడియన్స్ మనసు దోచేస్తుంది. ఊహ తెలియని వయసులో బంధం, ఆ తర్వాత కాలేజీలో కలుసుకుని తెలియకుండానే ప్రేమించుకోవడం, వారి ప్రేమకు మధ్యలో సమస్యలు రావడం.. ఇలా కథ ఎక్కడా బోర్ కొట్టించకుండా వరుస ట్విస్టులతో అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు.

36
ఏఎన్నార్ - సావిత్రి నటన

ఈ సినిమాలో దిగ్గజ నటులంతా నటించారు. ఎవరి నటనకూ వంక పెట్టడానికి లేదు. మరీ ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు చంద్రం పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్లు నటించారు. ప్రేమికుడిగా రొమాంటిక్ సన్నివేశాల్లో ఎంత మెప్పించారో, క్లైమాక్స్ సీన్స్‌లో ఎమోషన్స్‌ను అంతే అద్భుతంగా పండించారు.

ఇక మహానటి సావిత్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది? ఆమె నటన వర్ణనాతీతం. ఎమోషనల్ సీన్స్‌లో ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించారు. సంతోషం, బాధ, ప్రేమ.. అన్ని భావాలను కళ్లలోనే పలికించారు. వీరిద్దరితో పాటు ఎస్.వి. రంగారావు గంభీరమైన ప్రదర్శన ఇవ్వగా, సూర్యకాంతం, రమణారెడ్డి, రేలంగిల హాస్య సన్నివేశాలు కథలోని బరువును తగ్గించి ప్రేక్షకులను ఆద్యంతం అలరిస్తాయి.

46
సాంకేతిక వర్గం (టెక్నికల్ టీమ్)

ఎక్కడో బెంగాలీలో తీసిన సినిమాను తెలుగులోకి తీసుకువచ్చి, మన నెటివిటీకి తగ్గట్టు కథను మార్చిన తీరు అద్భుతం. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు కథను నడిపించిన తీరు, స్క్రీన్‌ప్లేను ఇప్పటి తరం ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేసే విధంగా తీర్చిదిద్దిన విధానం మెప్పించింది.

ఈ సినిమాకు తన సంగీతంతో ప్రాణం పోసిన మాస్టర్ వేణు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన అందించిన పాటలు చిత్రానికి అతిపెద్ద పిల్లర్. "ఆకాశవీధిలో అందాల జాబిలి", "వాడిన పూలే వికసించెనే" పాటలు ఇప్పటికీ శ్రోతలను మైమరిపిస్తాయి. ఇక ఆచార్య ఆత్రేయ రాసిన సంభాషణలు ప్రతి సన్నివేశానికి ప్రాణం పోశాయి.

56
తెలుగు సినిమా చరిత్రలో రికార్డు

తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలోనే తొలిసారిగా ఈసినిమా 100 రోజుల వేడుకను ఓపెన్ గ్రౌండ్‌లో వేలాదిమంది అభిమానుల మధ్య నిర్వహించారు. విజయవాడలోని మునిసిపల్ హైస్కూల్ గ్రౌండ్స్‌లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి అధ్యక్షతన ఈ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. 1959 జనవరి 7న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వెండితెర వెలుగులు విరజిమ్మి 'సిల్వర్ జూబ్లీ' (25 వారాలు) జరుపుకుంది. అంతేకాకుండా 6వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో 'మెరిట్ సర్టిఫికెట్' (Certificate of Merit) కైవసం చేసుకుంది.

ఒక్క రోజులో సాంగ్ షూటింగ్ - ఆదుర్తి సమయస్ఫూర్తి

ఊటీ షూటింగ్ సమయంలో వర్షాలు, మబ్బుల వల్ల వరుసగా కొన్నిరోజులు సూర్యకాంతి సరిగ్గా రాలేదు. ప్రతికూల వాతావరణంలో కూడా ఆదుర్తి సుబ్బారావు పట్టువదలకుండా కేవలం ఒకే ఒక్క రోజులో "వాడిన పూలే వికసించెనే" అనే ఐకానిక్ పాట చిత్రీకరణను పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఆచార్య ఆత్రేయ రాసిన మాటలు ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి. సూర్యకాంతం నోటి వెంట వచ్చిన "యేనాటికైనా మీరు మీరు ఒకటే, నేనేగా పరాయిదాన్ని", రమణారెడ్డి వాడిన "ఇహపోతే.." అనే సంభాషణలు ఆ కాలంలో విశేష ప్రజాదరణ పొందాయి.

66
ప్లస్ - మైనస్ పాయింట్స్

ప్లస్ పాయింట్స్:

ANR, సావిత్రి జోడీ కెమిస్ట్రీ మరియు నటన

కాలాతీతమైన మధురమైన పాటలు

కుటుంబ సమేతంగా చూడదగ్గ బలమైన ఎమోషన్స్

మైనస్ పాయింట్స్:

నేటి తరం ప్రేక్షకులకు కథనంలో కొంత నెమ్మదనం అనిపించవచ్చు

కాలం మారినా చెరిగిపోని అద్భుతమైన ప్రేమ, కుటుంబ విలువలతో కూడిన 'మాంగల్య బలం' ప్రతీ ఒక్కరూ తప్పక చూడాల్సిన తెలుగు సినిమా.

Read more Photos on
click me!

Recommended Stories