
తెలుగు సినిమా చరిత్రను 'మల్లీశ్వరి ముందు.. మల్లీశ్వరి తర్వాత' అని విభజించడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 1951లో విడుదలైన ఈ అద్భుత కావ్యం.. కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, వెండితెరపై ఆవిష్కృతమైన ఒక స్వచ్ఛమైన కావ్య రసగుళిక. విజయా పిక్చర్స్ పతాకంపై నాగిరెడ్డి-చక్రపాణిల నిర్మాణ సారథ్యంలో, దర్శక రత్న బి.ఎన్. రెడ్డి మలచిన ఈ సినిమా ఎందరో దర్శకులకు, కళాకారులకు ఇప్పటికీ ఒక మార్గదర్శిగా నిలిచిపోతుంది. సీనియర్ ఎన్.టి.రామారావు, భానుమతిల అద్భుతమైన అభినయం, డి.వి. నరసరాజు కథనం, దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యం, సాలూరి రాజేశ్వరరావు సంగీతం కలగలిసి ఈ చిత్రాన్ని చిరస్మరణీయం చేశాయి.
విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణదేవరాయల పాలనా కాలంలో జరిగే ఒక అందమైన ప్రేమకథే 'మల్లీశ్వరి'. కాకాని గ్రామానికి చెందిన నాగరాజు (ఎన్.టి.ఆర్), మల్లీశ్వరి (భానుమతి) చిన్ననాటి నుండి ఒకరంటే ఒకరు ప్రాణంగా పెరుగుతారు. బావమరదళ్లైన వీరిద్దరి నడుమ చిగురించిన అనురాగం, పెరిగి పెద్దదయ్యాక గాఢమైన ప్రేమగా మారుతుంది. అయితే, మల్లీశ్వరి మేనత్త నాగమ్మ(ఋష్యేంద్రమణి) ఆమెకు రాజ్యసభలో 'రాజకన్య' హోదా లభిస్తే వచ్చే సంపదపై ఆశపడుతుంది.
అనుకోని పరిస్థితుల్లో రాయలవారి ఆస్థానానికి చెందిన అధికారులు మల్లీశ్వరిని విజయనగర రాజప్రసాదానికి 'రాజకన్య'గా ఎంపిక చేసి తీసుకెళ్తారు. ఆనాటి నిబంధనల ప్రకారం రాజకన్యగా ఎంపికైన స్త్రీ ఎవరినీ ప్రేమించకూడదు, వివాహం చేసుకోకూడదు. ఒకవేళ ఆ నిబంధన మీరితే మరణశిక్ష విధించబడుతుంది. తన మల్లీశ్వరిని దూరమైన నాగరాజు ఆమెను వెతుక్కుంటూ విజయనగరం చేరుకుంటాడు. శిల్పిగా మారి రాజప్రసాదంలోకి అడుగుపెడతాడు. అక్కడ వారిద్దరూ కలుసుకున్నారా? వారి ప్రేమ ఫలించిందా? శ్రీకృష్ణదేవరాయలు వారి ప్రేమను గుర్తించి ఏం చేశారు? అనేదే మిగిలిన కథ.
ఎన్టీఆర్ కెరీర్ ప్రారంభంలో వచ్చిన అతిముఖ్యమైన చిత్రాల్లో మల్లీశ్వరి ఒకటి. అమాయకత్వం, ప్రేమ, విరహం, ఆవేదనల సమ్మేళనంగా నాగరాజు పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు అద్భుతం. ముఖ్యంగా భానుమతితో పోటీపడి నటించారు. ఆమెకంటే వయసులో రెండేళ్లు చిన్నవాడైనా.. ప్రేమ సన్నీవేశాలు, ఆర్ స్క్రీన్ రొమాన్స్ లో అద్భుతం చేశాడు ఎన్టీఆర్. ప్రేమికుడిగా ఆయన చూపించిన అభినయం ఎన్టీఆర్ లోని మరో కోణాన్ని ఆవిష్కరించాయి.
భానుమతి చాలా సీరియస్ గా ఉంటుంది. కానీ ఈసినిమాలో మల్లీశ్వరిగా భానుమతి నటనను వర్ణించడానికి మాటలు చాలవు. స్వతహాగా నటి, గాయని అయిన ఆమె ఈ పాత్రకు సంపూర్ణ న్యాయం చేశారు. రాయలవారి కోటలో బంధీగా ఉన్నప్పుడు ఆమె ముఖంలో కనిపిచే వేదన, బావపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచే విధానం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఆమె పాడిన ప్రతి పాట అమృతంలా జాలువారింది.
శ్రీకృష్ణదేవరాయలుగా గుమ్మడి వెంకటేశ్వరరావు అద్భుతం చేశారు. ఆయన కెరీర్ బిగినింగ్ లో చేసిన ముఖ్యమైన పాత్రల్లో ఇది ఒకటి.ఈ పాత్రలో నటన రాజసంతో ఉట్టిపడుతుంది. ఇంకా లక్ష్మీరాజ్యం, తంగవేలు, సురభి కమలాబాయి, రమణారెడ్డి, ఋష్యేంద్రమణి లాంటి సీనియర్ తారాగణం తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు.
మల్లీశ్వరి ఖాతాలో ఎన్నో రికార్డులు ఉన్నాయి. ఈసినిమా రిలీజ్ అయ్యి 75 ఏళ్లు గడిచినా.. మల్లీశ్వరి ప్రభావం నేటికీ సినీ అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది. ఈ మూవీ అప్పట్లో 13 కేంద్రాల్లో 71 రోజుల పాటు ఆడింది. మల్లీశ్వరి చైనాలో సబ్‌టైటిల్స్‌తో విడుదలైన తొలి తెలుగు చిత్రంగా రికార్డు సాధించింది. అంతే కాదు చైనాలో 100 రోజులు ఆడి తిరుగులేని రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమై, దేశ విదేశీయుల ప్రశంసలు పొందింది. ఈ చిత్రం తెలుగు చిత్రసీమకు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చింది. 1952లో పెకింగ్ (బీజింగ్) ఫిలిం ఫెస్టివల్, 9వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) లలో ప్రదర్శించబడి అంతర్జాతీయ వేదికలపై తెలుగు సినిమా స్థాయిని చాటిచెప్పిన మొదటి చిత్రంగా నిలిచింది.
తెలుగు చిత్రసీమలో బి.ఎన్. రెడ్డి స్థానం అపారమైనది. మల్లీశ్వరిని ఒక సినిమాగా కాకుండా ఒక శిల్పంగా చెక్కారు. కథనంలో ఎక్కడా అనవసరమైన సన్నివేశాలు లేకుండా, ప్రతి దృశ్యాన్ని ఒక చిత్రలేఖనంలా మలచడంలో ఆయన ప్రతిభ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. విజయనాగర వైభవాన్ని, ఆనాటి సాంస్కృతిక నేపథ్యాన్ని తెరపైకి తెచ్చిన విధానం ప్రశంసనీయం.
సాలూరి రాజేశ్వరరావు అందించిన సంగీతం ఈ చిత్రానికి వెన్నెముక. దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన సాహిత్యం తెలుగు భాషా సౌందర్యానికి అద్దం పడుతుంది. దేవులపల్లి ఈ సినిమాతోనే ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమాలో దాదాపు 17 పాటలు ప్రాణం పోశాయి. సినిమా విజయంలో ముఖ్య పాత్ర పోషించాయి. ప్రతి పాట కథలో భాగంగానే సాగుతుంది తప్ప ఎక్కడా విడిగా అనిపించదు. భానుమతి, ఘంటసాల గొంతుల నుండి జాలువారిన ఈ పాటలు దశాబ్దాలు గడిచినా నేటికీ శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి.
మార్కస్ బార్ట్‌లే అందించిన బ్లాక్ అండ్ వైట్ ఛాయాగ్రహణం ఒక అద్భుతం. వెన్నెల కాంతి, కోటలోని నీడలు, శిల్పాల అందాలను ఆయన కెమెరా బంధించిన తీరు హాలీవుడ్ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోదు. ముఖ్యంగా కోటలో జరిగే సన్నివేశాల్లో 'లైటింగ్' వాడిన విధానం అప్పట్లోనే ఒక ట్రెండ్ సెట్టర్.
మల్లీశ్వరి సినిమాలో ప్రధాన బలం ఎమోషనల్ కంటెంట్. ఎక్కడా అతిగా అనిపించే సంభాషణలు ఉండవు. భాష సరళంగా, వాడుకలో ఉంటూనే ఎంతో కావ్యత్మకంగా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ మూవీ అంతా పల్లెటూరి వాతావరణం, అమాయకమైన ప్రేమతో ఆహ్లాదకరంగా సాగితే, సెకండ్ హాఫ్ రాజప్రసాదంలో ఎమోషనల్ కంటెంట్ తో.. ఉత్కంఠను రేపుతుంది. రాయలవారి కాలం నాటి పరిస్థితులను, రాజకన్య వ్యవస్థను కథకు అనుసంధానించిన తీరు రచయిత డి.వి. నరసరాజు టాలెంట్ కు నిదర్శనంగా నిలుస్తుంది.
ఎన్టీఆర్-భానుమతి జంట నటన - వారి మధ్య కెమిస్ట్రీ.
సాలూరి-దేవులపల్లి కాంబినేషన్ అందించిన పాటలు, సంగీతం.
బి.ఎన్. రెడ్డి అద్భుతమైన దర్శకత్వ ప్రతిభ, ప్లానింగ్
మార్కస్ బార్ట్‌లే లైటింగ్ - ఫ్రేమింగ్స్
స్వచ్ఛమైన తెలుగు సంస్కృతి, విజయనగర వైభవాన్ని కళ్లకు కట్టిన తీరు.
మల్లీశ్వరి కేవలం ఒక వినోదాన్ని పంచే సినిమా మాత్రమే కాదు.. అది తెలుగు సినిమా సాధించిన ఒక గొప్ప సాంస్కృతిక విజయం. అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో సైతం ప్రదర్శించబడి విమర్శకుల ప్రశంసలు అందుకున్న తొలి తెలుగు చిత్రాలలో ఇది ఒకటి. ఎన్ని తరాలు మారినా, ఎన్ని టెక్నాలజీలు వచ్చినా 'మల్లీశ్వరి' అందించే అనుభూతిని ఏ సినిమా భర్తీ చేయలేదు. తెలుగు సినిమా గొప్పతనాన్ని, సంగీత సాహిత్యాల విలువను తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన సినిమా మల్లీశ్వరి. ఈమూవీ చూడాలి అనుకునేవారికి యూట్యూబ్ లో అందుభాటులో ఉంది.