SVP: మహేష్ బాబు `స‌ర్కారు వారి పాట‌` రివ్యూ

First Published | May 12, 2022, 12:21 PM IST


  పరశురామ్‌ దర్శకత్వంలో మహేశ్‌ నటించిన చిత్రం ‘సర్కారువారి పాట’(Sarkaru Vaari Paata). రెండున్నరేళ్ల కిందట ‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్రంతో అలరించిన మహేష్ బాబు నుంచి వచ్చిన తాజా చిత్రం ఇది.

Sarkaru Vaari Paata Twitter Talk


“నా ప్రేమను దొంగలించగలవు. నా స్నేహాన్ని దొంగలించగలవు కానీ నా డబ్బులు దొంగలించ లేవు!” అంటూ సూపర్ స్టార్ వచ్చేసారు. ‘సరి లేరు నీకెవ్వరు’ సినిమా తర్వాత మహేష్ నుంచి మరో ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్టైనర్ మన ముందుకు వచ్చింది.  సూపర్ స్టార్ మహేష్ అభిమానులు, ఈ  సినిమా రిలీజ్ ని ఓ వేడుకగా మార్చేశారు. తెలుగు రాష్ట్రాల్లో, పొరుగు రాష్ట్రాల్లో, విదేశాల్లో.. ఎక్కడ చూసినా ఒకటే సందడి. మహేష్ కుమార్తె సితార ఓ పాటలో మెరవడం, కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించడం ‘గీత గోవిందం’ అనే సూపర్ హిట్ తర్వాత దర్శకుడు పరశురామ్ చేస్తున్న సినిమా కావడం.. ఇలా ‘సర్కారు వారి పాట’కు చాలా సూపర్ ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిన్నటినీ ఈ సినిమా ఎలా బాలెన్స్ చేసింది. ‘సర్కారు వారి పాట’ సినిమా కథా కమామిషు ఏంటి.? సినిమా  ఏ స్దాయి విజయం సాధిస్తుంది?  వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

Sarkaru Vaari Paata Twitter Talk

కథేంటి?

మహేష్ చిన్నప్పుడే అతని తల్లి,తండ్రులు బ్యాంక్ నుంచి తాము తీసుకున్న అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటారు. ఆ తర్వాత పదిహేనేళ్లకు మహేష్ పెరిగి పెద్దయ్యాక అప్పులు చేసేవాళ్లు కన్నా  ఇచ్చేవాళ్లు గొప్ప అని  అమెరికాలో ‘మహి ఫైనాన్స్ కార్పోరేషన్’అని పెట్టి వడ్డీ వ్యాపారం చేస్తూంటాడు. ఎంత ఎలాంటివాడినైనా నిలదీసి అప్పు వసూలు చేయగల సమర్దుడు అనిపించుకుంటాడు. అక్కడే కళావతి( కీర్తి సురేష్)  పరిచయం అవుతుంది. ఆమె గాంబ్లింగ్ కు ఎడిక్ట్ అయ్యి డబ్బులు అవసరం అవుతాయి. పరిస్దితులు పీకలు మీదకు రావటంతో  తన బ్యాక్ గ్రౌండ్  గురించి అబద్దమాడి తనను తాను చాలా మంచిదానిగా ఎస్టాబ్లిష్ చేసుకుని చదువుకోసం అని  ...మహేష్ నుంచి అప్పు తీసుకుంటుంది. ఆ తర్వాత కొద్ది రోజులుకే ఆమె గురించి అసలు నిజం తెలుసుకున్న మహేష్ ఆమె తండ్రి రాజేంద్రనాధ్ (సముద్రఖని) నుంచి డబ్బులు వసూలు చేయటానికి ఇండియా బయిలుదేరతాడు. ఇక్కడకు వస్తున్న  మహేష్ ఎయిర్ పోర్ట్ లో నదియాను చూస్తాడు. ఆమెకో సమస్య ఉంటుంది. అది   ఇండియాలో  ప్రస్తుతం ఉన్న  ఓ  బర్నింగ్ ప్లాబ్లమ్  తో లింక్ అయ్యి ఉంటుంది. దాంతో ఆ సమస్య పరిష్కారం కోసం చూస్తే దానికి కూడా సముద్ర ఖని తోనే లింక్ ఉంటుంది. దాంతో అతనిపై  పోరాటం ప్రారంభిస్తాడు. అసలు ఆమె సమస్య ఏమిటి... ఆ బర్నింగ్ ఇష్యూ ఏమిటి...... ఎలా పోరాటం చేసాడు, చివరకు ఏం చేసాడు...కళావతి తండ్రి నుంచి డబ్బులు వసూలు చేసాడా అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 


Sarkaru Vaari Paata Twitter Talk

 
విశ్లేషణ

 'సర్కారు వారి పాట' కథలో చాలా డెప్త్ ఉంటుంది.. ఎంటర్టైన్మెంట్ కూడా చాలా బాగా కుదిరింది. వచ్చే ఐదేళ్లలో ఈ రేంజ్ స్టోరీ మళ్లీ రాదు.  'త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు పూరి జగన్నాథ్ కలిసి రాస్తే ఎలా ఉంటుందో ఆ రేంజ్ లో పరశురామ్ రాసాడు  ఇలా ఈ సినిమా కథ గురించి రిలీజ్ కు ముందు చాలా చెప్పారు. అయితే ఆ స్దాయి అయితే కొంచెము కూడా కనపడదు. స్టోరీ లైన్  చాలా థిన్ గా ఉండి....తేలిపోటంతో సరైన  ట్రీట్మెంట్ సెట్ కాలేదు. పరుశరామ్ తన బలం అయిన ఫన్ డైలాగులను ఫస్టాఫ్ లో పేల్చుకుంటూ పోయాడు. సెకండాఫ్ లో అసలు కథ చెప్పాల్సి వచ్చేసరికి ఇబ్బంది పడిపోయాడు. అలాగని సెకండాఫ్ ని ఫన్ తో నడిపితే ఏ అల్లరి నరేష్ సినిమా అయ్యిపోతుందనో అనుకున్నట్లున్నారు. అదీ మిక్స్ చేయలేదు. దాంతో సినిమా అటు ఇటూ కాకుండా ఇబ్బంది పడింది. 

Sarkaru Vaari Paata Twitter Talk


 విజయ్ మాల్యా, అదానీ వంటి వారు బ్యాంక్ లును మోసం చేసి పారిపోతే...మనం వాళ్ల అప్పులు కడుతున్నాం.  వాళ్లను చూసి చూడకుండా వదిలేసే ప్రభుత్వాలు...మనల్ని మాత్రం చివరి పది పైసలు లోన్ తీర్చేదాకా వేపుకుతింటాయి.  ఈ మేసేజ్ ని మనం చాలా సార్లు ఫేస్ బుక్ పోస్ట్ లలో, వాట్సప్  లలో చూసి, చదివి ఉంటాం. దాన్నే తీసుకుని కథ అల్లు కున్నారు. అందులో తప్పేమీ లేదు కానీ ...కథ పై పైన కాకుండా ...లోపలికి వెళ్తే బాగుండేది.

చెప్పే కథలో కన్విక్షన్ కనపడదు. ఈ కథ ...నదియా పాత్ర ని సేవ్ చేయటానికా లేక మిడిల్ క్లాస్ కుటుంబాలను సేవ్ చేయటానికా అన్నది క్లారిటీ ఇవ్వరు. మహేష్ గత చిత్రం సరిలేరు నీకెవ్వరు ని ఈ స్క్రీన్ ప్లే గుర్తు చేస్తుంది. అక్కడ మిలిట్రీ నుంచి వచ్చిన మహేష్...విజయశాంతి సమస్య చూసి...అందులోకి వస్తాడు. దాన్ని పరిష్కరించటం కోసం విలన్ పై యుద్దం ప్రకటిస్తాడు. ఇక్కడ కూడా అమెరికా నుంచి వచ్చిన మహేష్ ...నదియా  సమస్యను చూసి ఆ పాత్రను పరిష్కరించటానికి సముద్ర ఖనిపై యుద్దం ప్రకటిస్తాడు. అయితే ఇందులో సరిలేరు నీకెవ్వరులో ఉన్నంత కన్విక్షన్, క్లారిటీ ఉండదు.

ఎంటర్టైన్మెంట్,మెసేజ్..మధ్యలో యాక్షన్ ..ఈ మూడు పూర్తిగా కలవలేదు. ఇలాంటి సీరియస్ సమస్యను మరీ అంత కామెడీ చేయటంతో డెప్త్ లోకి వెళ్లలేదనే ఫీల్ వస్తుంది. ఇలాంటి వీక్ స్టోరీ ఉన్న సినిమాని మహేష్ తనదైన టిపికల్ కామెడీ టైమింగ్ తో మోసాడు. డైరక్టర్ కూడా అదే కోరుకున్నాడేమో.  ఎక్కువగా మహేష్ పై డిపెండ్ అయ్యిపోయారు. అలాగే ఇలాంటి భారీ కాన్వాస్ ఉన్న కథలు ఎత్తుకున్నప్పుడు ..విలన్ పాత్ర లోకల్ గా చిన్న వ్యక్తిని చూపెడితే..ఏం సరిపోతుంది..ఏ విజయమాల్యా లాంటి పాత్రను ఎత్తుకుంటే నిలబడేదేమో...

Sarkaru Vaari Paata Twitter Talk

బాగున్నవి :

మహేష్ బాబు కామెడీ టైమింగ్ 
ఫస్టాఫ్
పాటలు
  
బాగోలేనివి: 

మహేష్ స్టామినాకు తగిన కథను ఎంచుకోకపోవటం
స్క్రీన్ ప్లే కూడా అంత ఇంట్రస్టింగ్ గా ఉండకపోవటం
బ్యాంకింగ్ సిస్టమ్ పై ఉపన్యాసాల మాదిరి డైలాగులు

Sarkaru Vaari Paata Twitter Talk

టెక్నికల్ గా ...

డైరక్టర్ గా పరుశురామ్ ...తన గత చిత్రం గీతా గోవిందం స్దాయి మ్యాజిక్ అయితే చేయలేకపోయారు. ఫన్,రొమాంటిక్ సీన్స్ డీల్ చేసినట్లుగా విలన్ ట్రాక్ ని రన్ చేయలేకపోయారు. మహేష్  స్ట్రెంత్ లను పరిశీలించి..వాటినే ఫాలో అయ్యే ప్రయత్నం చేసారు. అలాగే ఇంట్రడక్షన్ సీన్ నుంచీ కూడా టిపికల్ తెలుగు హీరో ఎలివేషన్సే ఫాలో అవుతూ వచ్చారు. అది కొంతవరకూ కలిసొచ్చింది. అయితే ఈ స్కీమ్స్ కొత్తదనాన్ని దూరం పెట్టేస్తాయని మర్చిపోయారు. ఇక సాంగ్స్ ని చాలా బాగా తీసారు.

ఇక స్టార్స్  సినిమాల్లో  నెంబర్ వన్  టెక్నీషియన్స్ పనిచేస్తారు. కాబట్టి టెక్నికల్ గా రిచ్ గా,సౌండ్ గానే ఉంటాయి. అయినా   చెప్పుకోవాలి అనుకుంటే ఈ సినిమాలో సూపర్ గా అనిపించేది మది కెమెరా వర్క్.  మహేష్ స్టైలింగ్.  పాటలు ఇప్పటికే పెన్నీ పెన్నీ,  'కళావతి' , 'మా మ మహేష్'  జనాల్లోకి వెళ్ళిపోయాయి. తెరపైనా అవి బాగున్నాయి. ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. తమన్ ఆ విషయంలో సూపర్ సక్సెస్. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ..తమన్ ఈ మధ్య సినిమాలకు ఇస్తున్న స్దాయిలో అయితే లేదు. ఫైట్స్ బాగున్నాయి. కానీ నెక్ట్స్ లెవిల్ లో అయితే లేవు.  VFX వర్క్ ...ఫస్టాఫ్ లో వచ్చే బీచ్ ఫైట్ లో తేలిపోయినట్లు అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ కు వంక పెట్టేదేమీ ఉంది.

Sarkaru Vaari Paata Twitter Talk


ఎవరెలా చేసారు...


మహేష్‌బాబు అయితే సూపర్ హ్యాండ్సమ్ లుక్ లో చూపించారు.  ఎంట్రీ కి అభిమానుల ఈలలు గోలలతో థియేటర్ మార్మోగిపోతోంది..మహేష్ వయసు పెరుగుతోందో, తగ్గుతోందో అర్థం కావడంలేదనిపిస్తుందనే కామెంట్స్ వినపడుతున్నాయి.  అలాగే ఫైనాన్స్ కంపెనీ అధినేతగా మహేష్  యాక్షన్ బ్లాక్.. హీరోయిజం ఎలివేషన్ బాగుంది. పాటల్లో అయితే మహేష్ అభిమానులకి కన్నుల పండగే.. డాన్స్ మూమెంట్స్ కొత్తగా వున్నాయ్. కాసినోలో అల్ట్రా మోడ్రన్ బ్యూటీలా కళావతి పాత్రలో కీర్తి సురేష్ బాగుంది. హీరో హీరోయిన్ల మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా పండింది. కళావతి సాంగ్ లో అయితే మహేష్, కీర్తి సురేష్.. ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. ఈ ఇద్దరి నడుమ వెన్నెల కిశోర్ తనదైన స్టయిల్లో కామెడీ పండించాడు.

Sarkaru Vaari Paata Review


ఫైనల్ గా....

 మహేష్ బాబు సినిమాకు కూడా కథ ఉండాలి. అదీ ఇంట్రస్టింగ్ గా చెప్పగలగాలి అనే విషయం మర్చిపోకూడదని గుర్తు చేస్తుంది.

---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating: 2.75
 

Sarkaru Vaari Paata Review

 
బ్యానర్స్: మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్

నటీనటులు:  మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్రఖని,నదియా, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, తనికెళ్ల భరణి తదితరులు 
సంగీతం: తమన్
సినిమాటోగ్రఫీ: ఆర్ మధి
ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్
ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్
ఫైట్స్: రామ్ లక్ష్మణ్
లైన్  ప్రొడ్యూసర్: రాజ్ కుమార్
 సీఈవో: చెర్రీ
రన్ టైమ్: 2 గంటల 40  నిముషాలు
వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్: యుగంధర్
రచన‌, దర్శక‌త్వం: పరుశురామ్ పెట్లా
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట
విడుదల తేదీ: 12, మే 2022
 

Latest Videos

click me!