`లక్కీ భాస్కర్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌

First Published | Oct 31, 2024, 1:42 PM IST

దుల్కర్‌ సల్మాన్‌, మీనాక్షి చౌదరి జంటగా నటించిన `లక్కీ భాస్కర్` సినిమాకి వెంకీ అట్లూరి దర్శకుడు. ఈ మూవీ దీపావళి కానుకగా నేడు విడుదల అయ్యింది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 
 

దుల్కర్ సల్మాన్‌ `మహానటి`తో తెలుగు ఆడియెన్స్ కి పరిచయమై `సీతారామం`తో  మన ఆడియెన్స్ కి దగ్గరయ్యాడు. తనకంటూ మంచి మార్కెట్‌ ఏర్పర్చుకున్నాడు. ఇటీవల `కల్కి 2898 ఏడీ`లో చిన్న పాత్రలో మెరిసి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు `లక్కీ భాస్కర్`తో తెలుగు హీరోగా నిలబడేందుకు వస్తున్నారు. ఈ మూవీకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించగా, ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది. నాగవంశీ, సౌయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా దీపావళి సందర్భంగా నేడు గురువారం(అక్టోబర్‌ 31)న విడుదలైంది. మరి ఈ సినిమా తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

కథః 
భాస్కర్‌(దుల్కర్‌ సల్మాన్‌) ముంబయిలోని మగధ ప్రైవేట్‌ బ్యాంక్‌లో క్యాషియర్‌గా వర్క్ చేస్తుంటాడు. రోజూ లక్షల్లో డబ్బు చూస్తున్నా, తన జీవితం మాత్రం పేదరికానికి, మధ్యతరగతికి మధ్య నలిగిపోతుంటుంది. దీనికితోడు అప్పులు.. ఫ్యామిలీని మేనేజ్‌ చేయడం కష్టంగానే ఉంటుంది. భార్య(మీనాక్షి చౌదరి)ని సరిగా చూసుకోలేకపోవడం, కొడుక్కి చిన్న చిన్నవి కూడా కోనివ్వలేకపోవడం, చెల్లి, తమ్ముడు కాలేజ్‌ ఫీజులు ఇలా అన్నీ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటాడు. అదే సమయంలో చుట్టాల్లో గౌరవం కూడా ఉండదు. అప్పుల వాళ్లు రోజూ ఇంటిమీదకొస్తూ పరువు తీస్తుంటారు. అయితే తాను ఎంతో సిన్సియర్ గా పనిచేస్తుంటాడు. బెస్ట్ ఎంప్లాయ్‌గా నాలుగు సార్లు అవార్డు కూడా అందుకుంటాడు. తన బ్రాంచ్‌ అసిస్టెంట్‌ మేనేజర్ రిటైర్డ్ అవుతాడు. ఈ సారి తనకు ప్రమోషన్‌ వస్తుందని ఆశపడతాడు. కానీ తనకు కాకుండా మరో వ్యక్తికి ప్రమోషన్‌ ఇస్తాడు. దీంతో బెంగాలీ మేనేజర్‌, తన బెంగాలీకే ప్రమోషన్‌ ఇచ్చారని అరుస్తాడు. మేనేజర్‌ తన తప్పులను బయటపెడతాడు. జీఎంకి కంప్లెయింట్‌ చేస్తానని బెదిరిస్తాడు. దీంతో చేసేదేం లేక కాళ్లబేరానికి వస్తాడు భాస్కర్‌. ఆ తర్వాత నుంచి రెట్టింపు జోష్‌తో పనిచేస్తుంటాడు. అదే సమయంలో తన అసలు గేమ్‌ స్టార్ట్ చేస్తాడు. బ్యాంక్‌లో ఎవరికీ తెలియకుండా ఆంటోనీ(రాంకీ)తో ఇంపోర్ట్, ఎక్స్ పోర్ట్ బిజినెస్‌లో పార్టనర్‌ అవుతాడు, అందుకు బ్యాంక్‌ డబ్బుని వాడుతుంటాడు. ఇలా భారీ స్థాయిలో డబ్బు సంపాదిస్తాడు, వేల నుంచి లక్షల్లో లాభాలు పొందుతారు. ఓ దశలో ఆంటోనీ తన వ్యాపారం వదిలేసి వెళ్లిపోతాడు. దీంతో భాస్కర్‌ కూడా సైలెంట్‌ అవుతాడు. అయితే హర్ష అనే స్టాక్‌ మార్కెట్‌ బిగ్‌ షాట్‌ మనుషులతో చేతులు కలిపి కోట్లలో దందా చేస్తుంటాడు. స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడి, హవాలా? బ్లాక్‌ మనీ ఇలా అనేక రకాలుగా డబ్బుని సంపాదిస్తుంటాడు. కానీ సడెన్‌గా ఓ ఝలక్‌ తగులుతుంది. మరి ఆ ఝలక్‌ ఏంటి? దీంతో భాస్కర్‌ మారాడా? ఫ్యామిలీతో గొడవలేంటి? మధ్యతరగతి మనిషిలా ఉండే భాస్కర్‌లో కోటీశ్వరుడు అయ్యాక వచ్చిన మార్పేంటి? ఆ బ్యాంక్‌లో చోటు చేసుకున్న స్కామ్‌ ఏంటి? దాన్నుంచి భాస్కర్‌ ఎలా బయటపడ్డాడు. ఈ మూవీ నేర్పిన గుణపాఠం ఏంటనేది మిగిలిన సినిమా. 

Latest Videos


విశ్లేషణః 

బ్యాంక్‌లో జరిగే స్కామ్‌లను బయటపెట్టే కథాంశంతో రూపొందిన చిత్రమిది. ఓ బ్యాంక్‌ ఎంప్లాయ్‌ కోట్లలో ఎలా స్కామ్‌ చేయగలడు, బ్యాంకుల్లో పెద్ద స్థాయిలోనూ ఎలాంటి స్కామ్‌లు చేస్తుంటారనేది, వాటిలో తెరవెనుక ఏం జరుగుతుందనేది `లక్కీ భాస్కర్‌` సినిమాలో చూపించారు దర్శకుడు వెంకీ అట్లూరి. పరిస్థితులు మంచి మనిషిని కూడా ఎలా స్వార్థపరుడిగా మార్చుతాయో చూపించే చిత్రమిది. డబ్బుతో వచ్చే గౌరవం, హోదా ఎలా ఉంటుందని, డబ్బు ఎంతగా ప్రభావితం చేస్తుందనేది ఈ సినిమాలో చూపించారు. ఇప్పటి వరకు చాలా మందికి సెన్సెక్స్, స్టాక్‌ మార్కెట్‌ గురించి పెద్దగా తెలియదు. ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. అయితే వీటి గురించి కామన్‌ ఆడియెన్ కి అర్థం కావడం కష్టం. అది అర్థం కావాలంటే మినిమమ్‌ డిగ్రీ చదవాలనే నానుడి ఉండేది. ఈ సినిమాలో మాత్రం అవేవీ అవసరం లేదు, సింపుల్‌గా చెప్పారు. చాలా నీట్‌గా చూపించారు. బ్యాంక్‌ అంశాలు, డబ్బుకి, ఫ్యామిలీ ఎమోషన్స్ కి ముడిపెట్టి తెరకెక్కించడం, డబ్బుకి మధ్యతరగతి జీవితానికి ముడిపెట్టిన విధానం బాగుంది. బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. ఇదే ఈ సినిమా విషయంలో దర్శకుడు వెంకీ అట్లూరి చేసిన తెలివైన పని. 
 

సినిమాగా చూసినప్పుడు మార్నింగ్‌ జాగింగ్‌కి వెళ్లిన భాస్కర్‌ని సీబీఐ వాళ్లు విచారణ కోసం బ్యాంక్‌కి తీసుకెళ్తారు. దీంతో తన స్టోరీ చెప్పడం ప్రారంభిస్తాడు భాస్కర్‌. సీఐజీ విచారణలో భాగంగా తన గతం చెప్పుకుంటూ వస్తారు. ప్రారంభంలో బ్యాంక్‌లో క్యాషియర్‌గా చిన్న ఉద్యోగం చేస్తుంటాడు, చాలీచాలనీ జీతంతో ఫ్యామిలీని నెట్టుకురావడం, వాళ్లు పడే బాధలు, ఇబ్బందులు వంటి వాటిని క్లారిటీగా చూపించారు. ఎమోషనల్‌గా దాన్ని కనెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. ప్రమోషన్‌ వస్తే, రెండు మూడు వేలు శాలరీ పెరిగితే అదే గొప్ప అనుకునే జీవితాలను కళ్లకి కట్టినట్టు చూపించారు. చిన్న చిన్న ఆనందాలు, బాధలు చూపిస్తూ ఆడియెన్స్ కి కనెక్ట్ చేశాడు. నెమ్మదిగా అసలు కథలోకి తీసుకెళ్లారు ఫస్టాఫ్‌ అంతా భాస్కర్‌ ఎలా ఉండేవాడు, ఎలా మారాడు? దానికి పేదరికం, అవమానం ఎలా తోడయ్యాయనేది ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. అవమానం తర్వాత భాస్కర్‌ అసలు గేమ్‌ స్టార్ట్ అవుతుంది. భాస్కర్‌ గేమ్‌ వేరే లెవల్‌ అనేలా సాగుతుంది. ఆయా అంశాలు రక్తికట్టేలా ఉంటాయి. సినిమా ప్రారంభం నుంచి ఇంటర్వెల్‌ వరకు అలా హై ఇస్తూ వెళ్తూనే ఉంది. కొన్ని చోట్ల ప్లాట్‌గా వెళ్తుంది, కొన్ని చోట్ల చిన్న చిన్న ట్విస్ట్ లతో ఆసక్తికరంగా, ఎంగేజింగ్‌గా నడుస్తుంది. ఇంటర్వెల్‌ ట్విస్ట్ అదిరిపోతుంది. గోవాకి వెళ్లే ఎపిసోడ్‌ హిలేరియస్‌గా అనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌లో భాస్కర్‌ జీవితంలో చోటు చేసుకున్న ఒడిదుడుకుల మాదిరిగానే సినిమా కథ కూడా కొంత రొటీన్‌గా అనిపిస్తుంది. ఇంకొంత స్లోగా అనిపిస్తుంది. నెక్ట్స్ ఏం జరుగుతుందో ఊహించేలా ఉంటుంది. దీంతో ట్విస్ట్ లు పెద్దగా కిక్‌ ఇవ్వలేకపోయాయి. మధ్యలో ఫ్యామిలీ ఎమోషన్స్ తో గుండెని బరువెక్కించారు. ఆ తర్వాత రెగ్యూలర్‌ ఫీలింగ్‌ని తెప్పిస్తుంది. బ్యాంక్‌ మోసం విషయంలో భాస్కర్‌ ఆడే ఆట అదిరిపోయింది. అయితే బ్యాంక్ లో మోసం, హర్ష ఎలిమెంట్లు వద్ద సినిమా ఫ్లో కాస్త డౌన్‌ అవుతుంది. కానీ క్లైమక్స్ ని మాత్రం హై ఇచ్చేలా చేశారు. ఫైనల్‌గా ఇచ్చిన ట్విస్ట్ అదిరిపోయింది. భాస్కర్లో బ్యాంక్‌ పెద్దలకు ఝలక్‌ ఇచ్చినట్టుగానే ఆడియెన్స్ కి ఇచ్చినట్టు ఉంటుంది. అయితే ఇలాంటి క్లిష్టమైన సబ్జెక్ట్ ని ఇంత సింపుల్‌గా డీల్‌ చేసే విషయంలో దర్శకుడిని అభినందించాల్సిందే. ఓవరాల్‌గా మాత్రం ఆద్యంతం ఎంగేజింగ్‌గా సాగే మూవీ అవుతుంది. 

నటీనటులుః 
దుల్కర్‌ సల్మాన్‌ వన్‌ మ్యాన్‌ షో అని చెప్పాలి. విభిన్నమైన ఎక్స్ ప్రెషన్స్ తో అదరగొట్టాడు. ఎక్కడ `మహానటి`, `ఎక్కడ సీతారామం`, ఎక్కడ `లక్కీ భాస్కర్‌` అనేలా ప్రతి సినిమాకి వేరియేషన్‌ చూపిస్తూ ప్రతి పాత్రని రక్తికట్టి ఆకట్టుకుంటున్నారు. అలరిస్తున్నారు. ఇందులోనూ నటుడిగా ఆయన రెచ్చిపోయి చేశాడని చెప్పొచ్చు. మనీ గేమ్‌లో ఆయన ఆడే ఆట, ఆ సమయంలో ఆయన నటన అదిరిపోయింది.ఓ రకంగా మ్యాజిక్ చేశాడు దుల్కర్‌. ఇక ఆయన భార్య పాత్రలో మీనాక్షి చౌదరి ఉన్నంతలో మెప్పించింది. ఇల్లాలుగా ఆమె బాగానే చేసింది. సీబీఐ అధికారికగా సాయికుమార్‌ తన మెరుపులు మెరిపించారు. హైపర్‌ ఆదిని సరిగ్గా వాడుకోలేకపోయారు. రాంకీ గారు ఉన్న కాసేపు అయినా అదరగొట్టారు. సచిన్‌ ఖేడ్కర్‌ తనకు యాప్ట్ అయిన పాత్రలో మెప్పించారు. బాలనటుడు రిత్విక్‌ కూడా ఆకట్టుకున్నాడు. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయి. 
 

టెక్నీషియన్లుః 
సినిమాకి జీవీ ప్రకాష్‌ సంగీతం అందించారు. తన మ్యూజిక్‌తో సినిమాని అలా పరుగులు పెట్టించారు. పాటలు ఇప్పటికే హిట్‌. ఇక ఇందులో ఆర్ఆర్‌తో మ్యాజిక్ చేశాడు. కానీ చాలా చోట్లు ఎలివేషన్లకి ఆర్‌ఆర్‌ ఇచ్చే కిక్‌ సరిపోలేదు. ఎమోషనల్‌ సీన్లలో అదిరిపోయింది. నిమిష్‌ రవి కెమెరా వర్క్ సూపర్బ్ గా ఉంది. ఫ్రేముల కలర్‌ పీరియడ్‌ లుక్‌ ని ప్రతిబింబిస్తుంది. అలాగే ఆర్ట్ వర్క్ మరో స్పెషల్‌ ఎట్రాక్షన్. ఎడిటర్‌ ఇంకాస్త్ షార్ప్ చేయాల్సింది. నిర్మాతలు ది బెస్ట్ ఇచ్చారు. దర్శకుడు వెంకీ అట్లూరి తన సినిమా సినిమాకి చూపిస్తున్న వేరియేషన్‌ అదిరిపోయింది. ఈ సినిమా చాలా చోట్లు ఊహించేలా ఉన్నా, ఆడియెన్స్ ని ఎంగేజ్‌ చేసేలా కథనాన్ని నడిపించిన తీరు బాగుంది. ఎప్పటిప్పుడు చిన్న చిన్న ట్విస్ట్ లతో ఆడియెన్స్ కి హైప్‌ ఇస్తూనే ఉన్నాడు. మరోవైపు లాజికల్‌గా చాలా అంశాలపై వర్క్ చేశాడు. ఆ కేర్‌ బాగా తీసుకున్నట్టు అనిపిస్తుంది. డైలాగ్‌లు సినిమాకి మరో బలం. చాలా వరకు డైలాగులు నార్మల్‌గానే ఉన్నా, ఆ సిచ్చువేషన్‌లో ఆయా డైలాగులు వచ్చినప్పుడు వాటి వాల్యూ పెరిగిపోయింది. దర్శకుడు వెంకీ సినిమా కోసం చాలా శ్రమించాడు, చాలా కేర్‌ తీసుకున్నారని అర్థమవుతుంది. అయితే  ఆడియెన్స్ కి ఇది కనెక్ట్ అయ్యేదాన్ని బట్టి సినిమా రేంజ్‌ తెలుస్తుంది. 

ఫైనల్‌గాః భాస్కర్‌ తో గేమ్‌ అంటే మామూలుగా ఉండదు. ఫ్యామిలీ అంతా చూసే క్లీన్‌ ఫిల్మ్. 

రేటింగ్‌ః 3 

click me!