తెలంగాణ కల్చర్‌ని ప్రతిబింబించే కథాంశంతో ఇటీవల సినిమాలు చాలా వస్తున్నాయి. చాలా రూట్ లెవల్‌లో తెలంగాణని ఆవిష్కరించే ప్రయత్నం జరుగుతుంది. `బలగం` సినిమా అలా వచ్చిందే, అది పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత వరుసగా తెలంగాణ యాస్, కల్చర్‌ని ప్రతిబింబించే సినిమాలు వస్తూనే ఉన్నాయి. తెలుగు సినిమాల్లో ఇదొక ట్రెండింగ్ ఎలిమెంట్‌గానూ మారింది.
ఈ క్రమంలో తాజాగా `లగ్గం` సినిమా కూడా ఆ కోవలో రూపొందిందే. ఇందులో సాయి రోనక్, ప్రగ్యా నగ్రా జంటగా నటించగా, రాజేంద్రప్రసాద్, రోహిణి, వడ్లామాని శ్రీనివాస్, రఘుబాబు, సప్తగిరి, చమ్మక్ చంద్ర, ప్రభాస్ శ్రీను, కృష్ణుడు, రచ్చ రవి, చిత్రం శ్రీను ఇతర పాత్రలు పోషించారు. రమేష్ చెప్పాల దర్శకత్వం వహించిన ఈ మూవీకి టీ వేణుగోపాల్ రెడ్డి నిర్మాత. ఈ సినిమా నేడు శుక్రవారం(అక్టోబర్ 25న) విడుదలైంది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కథః
సదానందం(రాజేంద్రప్రసాద్)కి కూతురు మానస(ప్రగ్యా నాగ్రా) ఉంటుంది. మానస అమ్మ చిన్పప్పుడే చనిపోతుంది. దీంతో ఆమె బాగోగులు అంతా సదానందం చూసుకుంటాడు. ఆమె పెద్దవుతుంది. పెళ్లి చేయాలనుకుంటాడు సదానందం. తన చెల్లి(రోహిణి) కొడుకు, మేనల్లుడు చైతన్య(సాయి రోనక్)కి తన కూతురిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. పెళ్లి సంబంధం ఓకే చేసే ముందు అల్లుడిని చూడాలనుకుంటాడు సదానందం. హైదరాబాద్‌కి వస్తాడు. చైతన్య సాఫ్ట్ వేర్ గా పనిచేస్తుంటాడు.
ఆయన జీతం, లగ్జరీ లైఫ్, కార్పొరేట్ ఆఫీసులో ఉద్యోగం చూసి ఫిదా అయిపోతాడు. తన మేనల్లుడికే కూతురుని ఇచ్చి లగ్గం(పెళ్లి) చేయాలనుకుంటాడు. రెండు కుటుంబాలు ఓకే అనుకుంటాయి. పెళ్లి పనులు కూడా ప్రారంభమవుతాయి. ఈ క్రమంలోనే పెద్ద షాక్. చైతన్య సాఫ్ట్ వేర్ ఉద్యోగం పోతుంది. ఈ వార్త అందరికి గుండెపగిలినంత పనవుతుంది. ముఖ్యంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న సదానందంకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో మానసతో చైతన్య వివాహం జరిగిందా? వీరిద్దరి మధ్య గొడవేంటి? సదానందం ఏం చేశాడు? వీరి లగ్గం ఎలాంటి మలుపులు తిరిగిందనేది మిగిలిన `లగ్గం` సినిమా కథ.
విశ్లేషణః
తెలుగు సినిమాల్లో పెళ్లి అంటే ఆంధ్రా కల్చరే కనిపిస్తుంది. చాలా సినిమాలు అక్కడ సాంప్రదాయాలను అద్దం పట్టేలానే సాగుతాయి. కానీ తెలంగాణ పెళ్లిళ్ల కల్చర్‌ని ఆవిష్కరించేలా సినిమాలు రాలేదనే చెప్పాలి. `ఫిదా` సినిమాలో కొంత టచ్ చేశాడు శేఖర్ కమ్ముల. చాలా మంది తెలంగాణ దర్శకులు కూడా ఆంధ్రా కల్చర్‌ని ప్రతిబింబించేలానే సినిమాలు చేయడం గమనార్హం.
ఈ క్రమంలో పక్కా తెలంగాణ మ్యారేజ్ ట్రెడిషన్ ని ఆవిష్కరిస్తూ `లగ్గం` సినిమాని రూపొందించారు. పెళ్లి తంతుని తెలంగాణలో లగ్గం అంటారు. సినిమా టైటిల్‌లోనే ఏం చెప్పాలనుకుంటున్నాడో, ఏం చూపించాలనుకుంటున్నాడో హింట్ ఇచ్చేశారు. ఎంతటి రూట్ లెవల్లో తెలంగాణలో జరిగే పెళ్లిని చూపించబోతున్నాడో అర్థం చేసుకోవచ్చు.
సాఫ్ట్ వేర్ అనేది ఒక క్రేజీ ఫీల్డ్. చాలా మంది తెలంగాణలో ఆయా రంగాన్ని చాలా గొప్పగా భావిస్తారు. తన కూతురుని సాఫ్ట్ వేర్‌కి ఇస్తామని కలలు కనేవాళ్లు చాలా మందే ఉన్నారు. వాళ్ల ఆశలు ఎలా ఉంటాయో ఇందులో కళ్లకి కట్టినట్టు చూపించారు. అదే సమయంలో సాఫ్ట్ వేర్‌లో ఉండే ప్రెజర్స్ ని కూడా చూపించారు.
మరోవైపు తెలంగాణలో పెళ్లిళ్ల తంతు ఎలా ఉంటుంది, మ్యారేజ్ చేయాలనుకున్నప్పుడు ఫ్యామిలీ ఎలా కలిసి మాట్లాడుకుంటారు. అబ్బాయిని చూడటం కోసం ఏం చేస్తారు? మాట ముచ్చట ఎలా చేసుకుంటారు, పప్పు అన్నం కార్యక్రమాలు, లగ్గం పెట్టుకోవడం ఇలా అన్నింటిని చూపించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా రిలేషన్స్ కి ప్రయారిటీ ఇచ్చారు.
మేనత్త, మేనకోడలు, మేనల్లుడు అనే బంధాలు, చెల్లి, అన్న అనే అనుబంధాలు, మేనరికం పెళ్లిళ్లలో ఉండే సెంటిమెంట్లు, ఎమోషన్స్, పంతాలు, పట్టింపులను ఇందులో డిటెయిల్‌గా చూపించడం విశేషం. ఫస్టాప్‌లో కథని ఎస్టాబ్లిష్ చేయడానికి, రిలేషన్స్ ని బాగా చూపించే క్రమంలో కొంత ల్యాగ్ అన్న ఫీలింగ్ కలుగుతుంది. మధ్య మధ్యలో ఫ్యామిలీ ఎమోషన్స్ తో గుండె బరువెక్కించారు. ఇక సెకండాఫ్ పెళ్లికి ముందు జరిగే తంతు, సడెన్‌గా జాబ్ పోతే పెళ్లి విషయంలో పెద్దలు పడే ఇబ్బందులు, అలకలు, అమ్మాయి అబ్బాయి మధ్య మనస్పర్థాలు వీటి చుట్టూ తిరిగే డ్రామా రక్తికట్టేలా ఉంటుంది. ఎమోషనల్ సీన్లు సినిమాకి బలం.
అందులోనూ కొంత ఫన్నీ ఎలిమెంట్లు రిలీఫ్‌నిచ్చే అంశాలు. ఇక ఫైనల్‌గా అమ్మాయి పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్లేందుకు ప్రిపేర్ అయ్యే సందర్భంలో వచ్చే పాట గుండెని బరువెక్కిస్తుంది. క్లైమాక్స్ ఎమోషనల్‌గా అనిపిస్తుంది. అయితే సాఫ్ట్ వేర్ జాబ్‌లో ఉండే ప్రెజర్, బాస్‌ల తీరుని మరీ టూమచ్‌గా చూపించారనిపించింది.
రైతుల గురించి చెప్పే విషయాలు బలంగా చూపించలేకపోయారు. ఫస్టాఫ్‌లో చాలా సన్నివేశాలు లైటర్ వేలో ఉంటాయి. వాటిలో డెప్త్ లేదు. మరోవైపు తెలంగాణ యాస కూడా పండలేదు. ఇవి ఇబ్బంది పెట్టే అంశాలు. మధ్య మధ్యలో సాగదీతగా అనిపిస్తుంది. వీటిపై ఫోకస్ పెడితే మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా నిలిచేది.
నటీనటులుః
సాయి రోనక్ హీరోగా మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. పాత్రకి యాప్ట్ గా నిలిచాడు. తనదైన నటనతో మెప్పించాడు. నటుడిగా తనకు మంచి పేరు తెచ్చే పాత్ర అవుతుంది. మానస పాత్రలో ప్రగ్యా నాగ్రా తెలంగాణ అమ్మాయిగా కనిపించింది. కట్టుబొట్టు, ఆమె తీరు యాప్ట్ గా అనిపించింది. ఉన్నంతలో బాగా చేసింది. రాజేంద్రప్రసాద్ అమ్మాయి తండ్రిగా అదరగొట్టాడు. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అయితే తెలంగాణ యాస సరిగా పలకలేకపోయాడు. ఆయన ఒరిజినాలిటీ కనిపిస్తుంది. రోహిణి జీవించేసింది. మిగిలిన కమెడియన్లు నవ్వించే ప్రయత్నం చేశారు. కానీ చాలా మంది ఆర్టిస్ట్ లకు తెలంగాణ యాస సెట్ కాలేదు. దీంతో సహజత్వం మిస్ అయ్యింది. నటన పరంగా బాగా చేశారని చెప్పొచ్చు.
టెక్నీషియన్లుః
సినిమాకి చరణ్ అర్జున్ సంగీతం అందిస్తే, మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. పాటలు బాగున్నాయి. బీజీఎం కూడా ఆసక్తికరంగా ఉంది. సినిమాకి ఈ రెండు హైలైట్‌గా నిలిచాయి. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకు మరో ఆకర్షణగా నిలిచింది. ప్రతి ఫ్రేమ్ కలర్‌ఫుల్‌గా, చాలా సహజంగా ఉన్నాయి. విలేజ్ అందాలను బాగా చూపించారు. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటింగ్ ఫర్వాలేదు. ఇంకా కట్ చేయాల్సింది. ల్యాగ్ సీన్ల వద్ద కత్తెరకి పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. రాజీపడకుండా చేశారు.
దర్శకుడు రమేష్ చెప్పాల మంచి కథని ఎంచుకున్నాడు. కానీ దాన్ని మరింత గ్రిప్పింగ్‌గా రాసుకోవాల్సింది. తెలంగాణకి యాప్ట్ గా నిలిచే ఆర్టిస్ట్ లను ఎంచుకుంటే బాగుండేది. ఎమోషన్స్, ఫన్ విషయంలో, అలాగే సాఫ్ట్ వేర్ ఉండే ప్రెజర్‌కి సంబంధించిన కొన్ని విషయాలను చూసుకుంటే ఇంకా బాగుందేది.