`లవ్‌ యూ రామ్‌` మూవీ రివ్యూ.. దర్శకుడు దశరథ్‌ నిర్మాతగా హిట్‌ కొట్టాడా?

First Published | Jul 1, 2023, 1:08 PM IST

`సంతోషం`, `మిస్టర్‌ పర్‌ఫెక్ట్` చిత్రాలతో దర్శకుడిగా అలరించిన దర్శకుడు దశరథ్‌.. నిర్మాతగా మారి `లవ్‌ యూ రామ్‌` చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. మరి సినిమా ఆడియెన్స్ ని అలరించిందా? నిర్మాతగా దశరథ్‌ సక్సెస్‌ అయ్యారా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

దర్శకుడు దశరథ్‌.. దర్శకుడిగా `సంతోషం`, `మిస్టర్‌ పర్‌ఫెక్ట్`, `సంబరం`, `స్వాగతం`, `గ్రీకు వీరుడు` వంటి చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ ని అలరించారు. చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రాలను అందించి, దర్శకుడిగా సత్తా చాటారు. తన ప్రత్యేకతని చాటుకున్నారు. అయితే ఆయన చివరగా చేసిన `గ్రీకు వీరుడు`, `శౌర్య` వంటి చిత్రాలు ఆడియెన్స్ ని అలరించలేకపోయాయి. దీంతో దర్శకుడిగా గ్యాప్‌ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు నిర్మాతగా మారారు. ఈ చిత్ర దర్శకుడు డీవై చౌదరితో కలిసి `లవ్‌ యూ రామ్‌` అనే సినిమాని నిర్మించారు. తనే కథ అందించారు. `నాట్యం` ఫేమ్‌ రోహిత్‌ బెహల్‌ హీరోగా, అపర్ణ జనార్థన్‌ కథానాయికగా నటించారు. ఈ సినిమాకి ప్రభాస్‌ విషెస్‌ అందించడం విశేషం. శుక్రవారం విడుదలైన సినిమా  ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్‌ అయ్యిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

కథః 

ఇండియాకి చెందిన రామ్‌(రోహిత్‌ బెహల్‌) నార్వీలో హోటల్‌ బిజినెస్‌ చేస్తుంటాడు. తను పక్కా కమర్షియల్‌. డబ్బు స్వార్థంలో ఉంటూ అన్ని విషయాలకు లెక్కలు కడుతుంటారు. చివరికి కాబోయే భార్య విషయంలోనూ కమర్షియల్‌గా ఆలోచిస్తాడు. తనకు వచ్చే భార్య తన కంపెనీలో ఓ ఫ్రీగా ఎంప్లాయ్‌ అవుతుందనే ఆలోచనతో పెళ్లికి సిద్ధపడతారు. కానీ చాలా సంబంధాలు తిరిగినా సెట్‌ కావు. చివరికి మిడిల్‌ క్లాస్‌ అమ్మాయి దివ్య( అపర్ణా జనార్థన్‌)ని పెళ్లికి చేసుకోవాలనుకుంటాడు. ఆమెది మిడిల్‌ క్లాస్‌ కావడంతో తాను చెప్పినట్టు ఆమె వింటుందనేది అతని ఆలోచన. కానీ దివ్యది పూర్తి భిన్నమైన మనస్తత్వం. రెడ్‌ క్రాస్‌ లో పనిచేస్తూ నలుగురుకి సహాయపడే వ్యక్తిత్వం ఆమెది. మరి ఫ్యామిలీని కూడా కమర్షియల్‌ కోణంలో చూసే రామ్‌ని దివ్య యాక్సెప్ట్ చేసింది. వీరి పెళ్లిలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలేంటి? రామ్‌కి, దివ్యకి మధ్య గతంలో ఉన్న రిలేషన్‌ ఏంటి? నార్వేలో హోటల్స్ సీఈవో పూర్ణాచారి(దర్శకుడు దశరథ్‌)కి వీరికి సంబంధం ఏంటి? చివరికి ఈ కథ ఎలాంటి మలుపులు తిరిగిందనేది మిగిలిన సినిమా. 

Latest Videos


విశ్లేషణః 
లవ్‌ స్టోరీస్‌ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. కానీ ప్రేమ ఎప్పటికీ సజీవమే. మనుషుల మధ్య ప్రేమ ఉన్నంత వరకు ప్రేమ కథలకు తిరుగులేదు. కాకపోతే వాటిని ఎంత కొత్తగా, ఎంత రక్తికట్టించేలా, ఎంతటి ప్రాక్టికల్‌గా తెరకెక్కిస్తారనేది ముఖ్యం. ఇలాంటి సినిమాలకు ప్రేమలోని ఫీల్‌, అలాగే ఎమోషన్స్, దానికితోడు నేటి ఆడియెన్స్ కోరుకునే వినోదం మేళవింపుగా సినిమాలు చేస్తే కచ్చితంగా ఆదరణ పొందుతాయి. భిన్నమైన ప్రేమకథలకు ఎప్పుడూ తిరుగులేదు. `లవ్‌ యూ రామ్‌` సినిమాలో కూడా అలాంటి డిఫరెంట్‌ కంటెంట్‌ని చూపించే ప్రయత్నం చేశారు చిత్ర దర్శకుడు డీ వై చౌదరి, ఈ సినిమాతో నిర్మాతగా మారిన దర్శకుడు దశరథ్‌. నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా ఈ చిత్రాన్ని మలిచారు. అయితే ఇందులో హీరో క్యారెక్టరైజేషన్‌ని కమర్షియల్‌గా, సెల్ఫిష్‌గా చూపించి డిఫరెంట్‌గా చేసే ప్రయత్నం చేశారు. 

ఇద్దరు భిన్నమైన మనస్తత్వాల మధ్య ఎప్పుడూ కీచులాటలు లాంటివి జరుగుతూనే ఉంటాయి. అది చూసే వారికి కామెడీగా ఉంటుంది. ఈ సినిమా కూడా అలానే సాగుతుంది. అయితే దానికి ఎమోషనల్‌ టచ్‌ ఇచ్చారు. అది ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. కాకపోతే కథగా ఇది కొత్తదేం కాదు, తర్వాత ఏం జరుగుతుందనేది ఊహించేలా ఉటుంది. కానీ దీన్ని నడిపించిన తీరు మాత్రం కొత్తగా ఉంటుంది. ఆద్యంతం కామెడీ మేళవింపుతో తీసుకెళ్లారు. దీంతో రొటీన్‌గా  సాగినా కామెడీ నవ్వులు పూయిస్తుంది. ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్‌ చేస్తుంది. చూస్తున్నంత సేపు బోర్‌ లేకుండా చేస్తుంది. ఈ సినిమాకి అదే పెద్ద అసెట్‌. ఇంటర్వెల్‌లో ఉండే ట్విస్ట్, చిన్న చిన్న మలుపులు కూడా ఆకట్టుకునేలా, ఆసక్తిరేకెత్తించేలా ఉన్నాయి. కానీ సెకండాఫ్‌లో మాత్రం ఎమోషనల్‌ డోస్‌ ఎక్కువైంది. కామెడీ తగ్గింది. దీంతో కొంత డల్‌ అనే ఫీలింగ్‌ కలుగుతుంది. సెకండాఫ్‌ని కూడా సరదాగా తీసుకెళ్లి, క్లైమాక్స్ లో ఎమోషనల్‌ టచ్‌ ఇచ్చి ఉంటే సినిమా అదిరిపోయేది. ఆ విషయంలో దర్శకుడు మరింత కేర్‌ తీసుకోవాల్సింది. కథని మరింత గ్రిప్పింగ్‌గా తీసుకెళ్తే బాగుండేది. అయినప్పటికి ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే ఎంజాయ్‌ చేసేలా ఉంటుంది. మంచి టైమ్‌ పాస్‌ మూవీ అని చెప్పొచ్చు. 
 

నటీనటులుః 
హీరో రోహిత్‌ బెహల్‌..రామ్‌ పాత్రలో బాగా చేశాడు. పాత్రకి బాగా సెట్‌ అయ్యాడు కూడా. ఎక్స్ ప్రెషన్స్, నటన పరంగానూ మెప్పించింది. ఆయన హవభావాలు ఆకట్టుకునేలా ఉంటాయి. దివ్య పాత్రలో అపర్ణా జనార్థన్‌ యాప్ట్ గా నిలిచింది. సహజంగా చేసింది. పల్లెటూరి అమ్మాయిలా కనిపించి ఆకట్టుకుంది. సెంటిమెంట్‌, ఎమోషన్స్ సీన్స్‌ లో బాగా చేసింది. ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఇక ఈ సినిమాతో దర్శకుడు దశరథ్‌ నిర్మాతగా మారడమే కాదు, నటుడిగానూ మారారు. ఆయన హోటల్స్ సీఈవో పాత్రలో అదరగొట్టారు. ముఖ్యంగా కామెడీని పండించారు. సినిమాకి ఆయన పంచ్‌ల కామెడీ హైలైట్‌గా నిలుస్తుంది. తనలోని కొత్త యాంగిల్‌ని పరిచయం చేశారని చెప్పొచ్చు. నటుడిగానూ ఆయనకు మంచి ఫ్యూచర్‌ ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బెనర్జీ, కాదంబరి కిరణ్‌, ప్రదీప్‌లు తమ పాత్రలు పరిధి మేరకు మెప్పించారు. 
 

టెక్నీషియన్లుః 

దర్శకుడు డీవై చౌదరి దర్శకుడిగా సినిమాని తీసిన విధానం బాగుంది. చిన్న పాయింట్‌ని రెండున్నర గంటలపాటు ఆడియెన్స్ ని మెప్పించేలా చేయడంలో ఆయన సక్సెస్‌ అయ్యారు. కానీ కథపై మరింత వర్క్ చేయాల్సింది. సెకండాఫ్‌ విషయంలో మరింత కేర్‌ తీసుకోవాల్సింది. ఫస్టాఫ్‌ లాగానే తీసుకెళ్తే ఇంకా బాగుండేది. ప్రవీణ్‌ వర్మ రాసిన మాటలు ఆకట్టుకునేలా, ఆలోచింప చేసేలా ఉన్నాయి. సాయి సంతోష్‌ కెమెరా వర్క్ బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ రిచ్ గా ఉంది. వేదా అందించిన పాటలు వినసొంపుగా ఉన్నాయి. ఓ ఫ్రెష్‌ ఫీలింగిస్తాయి. ఎడిటింగ్‌ పరంగా కొంత కేర్‌ తీసుకోవాల్సిందే. అనవసర సీన్లు తీసేస్తే క్రిస్పీగా ఉండేది. ప్రొడక్షన్ పరంగానూ క్వాలిటీగా ఉంది. 

ఫైనల్‌గా ః ఓ డిఫరెంట్‌ ఫ్రెష్‌ లవ్‌ స్టోరీ. టైమ్‌ పాస్‌ మూవీ అవుతుంది.

రేటింగ్‌ః 2.5

నటీనటులు : రోహిత్ బెహల్, అపర్ణా జనార్దన్, బెనర్జీ, దశరథ్, ప్రదీప్, కాదంబరి కిరణ్, కార్టూనిస్ట్ మాలిక్, డివై చౌదరి తదితరులు
కథ : కె. దశరథ్
మాటలు : ప్రవీణ్ వర్మ
ఛాయాగ్రహణం : సాయి సంతోష్
సంగీతం : కె. వేదా
నిర్మాత : కె. దశరథ్, డీవై చౌదరి 
దర్శకత్వం : డీవై చౌదరి
 

click me!