`లవ్‌ రెడ్డి` మూవీ రివ్యూ, రేటింగ్‌

First Published Oct 17, 2024, 11:54 PM IST

దసరాకి వచ్చిన పెద్ద సినిమాలు డీలా పడ్డాయి. దీంతో ఈ వారం చిన్న సినిమాలు సందడి చేయడానికి వస్తున్నాయి. అందులో `లవ్‌ రెడ్డి` చిత్రం క్యూరియాసిటీని క్రియేట్‌ చేస్తుంది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 
 

దసరా పండగ అయిపోయింది. ఈ దసరా సీజన్‌ని ఉపయోగించుకున్న సినిమా ఒక్కటి కూడా లేదు. విజయదశమి సందర్భంగా వచ్చిన సినిమాలన్నీ ఈ పండగని వేస్ట్ చేశాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీంతో ఈ వారం చిన్న చిత్రాలు క్యూ కట్టాయి. కంటెంట్‌ బేస్డ్ చిత్రాలు వస్తున్నాయి. అందులో భాగంగా ఈ శుక్రవారం విడుదలవుతున్న చిత్రాల్లో `లవ్‌ రెడ్డి` మూవీ ఒకటి. టీజర్‌, ట్రైలర్లతో  క్యూరియాసిటీ క్రియేట్‌ చేసింది.

ఇందులో నూతన నటీనటులు అంజన్‌ రామచంద్ర, శ్రావణి రెడ్డి జంటగా నటించారు. స్మరన్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్‌ ఫిల్మ్స్  పతాకాలపై సునంద బి రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్‌ రెడ్డి, మదన్‌ గోపాల్‌ రెడ్డి, నాగరాజ్‌ బీరప్ప, ప్రభంజన్‌ రెడ్డి, నవీన్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

కథః 
నారాయణ రెడ్డి(అంజన్‌ రామచంద్ర)కి పెళ్లి అనేది పెద్ద సమస్యగా మారుతుంది. పెళ్లి చేయాలని పేరెంట్స్ ఫోర్స్ చేస్తుంటాడు. ఆయన రిజెక్ట్ చేస్తుంటాడు. ఈ క్రమంలో నారాయణ రెడ్డి ఓ పెళ్లి చూపులకు వెళ్తుంటే దివ్య(శ్రావణి రెడ్డి) అనే అమ్మాయిని చూసి ఫిదా అవుతాడు. ఆమె అందానికి పడిపోతాడు. ఆమె ఊహల్లోనే ఉంటాడు. ఆ పెళ్లి చూపుల్లో కూడా అమ్మాయిగా దివ్యనే ఊహించుకుని ఓకే చెబుతాడు.

ఆ తర్వాత ఆ అమ్మాయి ఫోటో చూసి షాక్‌ అవుతాడు. తాను ఓకే చెప్పింది ఈ అమ్మాయికా అని ఆశ్చర్యపోతాడు. ఎట్టకేలకు ఆ పెళ్లి క్యాన్సిల్‌ అవుతుంది. నారాయణ రెడ్డి మాత్రం దివ్య వెంటపడుతుంటాడు. ఆమెతో స్నేహం చేస్తాడు. దివ్య కూడా నారాయణ రెడ్డితో స్నేహంగానే ఉంటుంది. ఇద్దరూ చాలా క్లోజ్‌ అవుతారు. దీంతో మంచి సందర్భం చూసుకుని తన ప్రేమ విషయాన్ని చెబుతాడు నారాయణ రెడ్డి. కానీ ఆమె తిరస్కరిస్తుంది. మనసులో ఇష్టం ఉన్నా, పైకి మాత్రం రిజెక్ట్ చేస్తుంది. మరోవైపు దివ్య ఫాదర్‌కి ఈ విషయం తెలుస్తుంది.

ఇరవై ఏళ్లు పెంచిన కూతురు తనని మోసం చేస్తుందని భావిస్తాడు. దీంతో ఆ ప్రేమకి అడ్డంకి క్రియేట్‌ చేసే ప్రయత్నాలు చేస్తాడు. అయితే అది తన కూతురు ద్వారానే ప్లాన్‌ చేస్తాడు. ఆమెని బ్లాక్‌ మెయిల్‌ చేస్తాడు. తనకు ప్రేమ కంటే, పరువే ముఖ్యమని భావించే దివ్య ఫాదర్‌.. ఆమెని ఏ రకంగా బ్లాక్‌ మెయిల్‌ చేశాడు? తన పరువు కోసం ఎంత దూరం వెళ్లాడు? నారాయణ రెడ్డి ప్రేమని దివ్య రిజెక్ట్ చేయడానికి అసలు కారణం ఏంటి? వీరి ప్రేమ చివరికి ఏ తీరం చేరింది? పెద్దలను ఎదురించి ఒక్కటయ్యారా? విడిపోయారా? ఫైనల్‌గా ముగింపు ఏంటనేది మిగిలిన కథ. 
 

Latest Videos


విశ్లేషణః 
పరువు హత్యల నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఒక్కో సంఘటన ఒక్కోలా ఉంటుంది. ప్రతి దాంట్లోనూ ఓ కొత్తదనం ఉంటుంది. ఓ సందేశం ఉంటుంది. పరువు కంటే ప్రేమ గొప్పదని చెప్పే సందేశం ఉంటుంది. సమాజం మారిపోతుంది, ఎంతో అభివృద్ధి చెందింది. కానీ ఇప్పటికీ కులమతాల అంతరాలు అలానే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అవి మరింతగా పెరిగిపోతున్నాయి.

రాజకీయాల కోసం నేతలు వాటిని మరింత ఎంకరేజ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇలాంటి కథలు కూడా ఎప్పుడూ ఇంట్రెస్టింగ్‌గానే ఉంటాయి. ఇప్పుడు పరువు హత్యల కథాంశంతోనే `లవ్‌ రెడ్డి` సినిమాని తెరకెక్కించారు దర్శకుడు స్మరన్‌ రెడ్డి. ఇందులో కొంత రియలిస్టిక్‌ అంశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. పరువు హత్యలంటే ఎక్కువ కులం, తక్కువ కులం అనేది మనకు మొదట గుర్తుకొస్తుంది.

కానీ అమ్మాయి, అబ్బాయిది ఒకే కులం అయినా, అందులోనూ పరువు అనే మ్యాటర్‌ కి ప్రయారిటీ ఇవ్వడమే ఇందులో ఇంట్రెస్టింగ్‌ ఎలిమెంట్‌, ఈ సినిమాలో హైలైట్‌ పాయింట్‌. కథగా ఇది కాస్త రొటీన్‌గానే అనిపించినా సినిమాని తెరకెక్కించిన తీరు విషయంలో మాత్రం దర్శకుడిని అభినందించాల్సిందే. ఆయనకిది తొలి మూవీ, అయినా గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ప్లేతో, ఆద్యంతం ఇంట్రెస్టింగ్‌గా కథనాన్ని నడిపించడం విశేషం. ఆ విషయంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడని చెప్పొచ్చు. `మరణం మనుషులకే కానీ మనసులకి కాదు..

ఈ ప్రపంచంలో పూడ్చిపెట్టలేనిది, పూడ్చినా సజీవంగా ఉండేది ప్రేమ ఒక్కటే` అనేది సినిమా ముగింపులో వచ్చే కొటేషన్‌. ఈ మాటకు తగ్గట్లుగానే సినిమా సాగుతుంది. పరువు ప్రతిష్ట అనే కీలకమైన అంశంతో  స్వచ్ఛమైన ప్రేమ కథగా దీన్ని తెరకెక్కించారు. ఈ సున్నిత‌మైన ప్రేమ‌క‌థ‌ను అంతే సహజంగా వెండితెరపై ఆవిష్కరించడం విశేషం.  
 

సినిమా ప్రధానంగా ఎంటర్‌టైనింగ్‌గా ప్రారంభమవుతుంది. పెళ్లి చూపుల సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. హీరో లవ్‌ రెడ్డిగా మారిన తర్వాత కథనం ఆసక్తికరంగా సాగుతుంది. అయితే తన ప్రేమను వ్యక్తం చేయడానికి హీరో చేసే ప్రయత్నం రొటీన్‌గా అనిపిస్తుంది. ఇందులో నారాయణ రెడ్డిని ఇష్టపడే స్వీటీ సీన్లు కొంతవరకు వినోదాన్ని పంచుతాయి.

అసలు నారాయణ రెడ్డిని దివ్య ప్రేమిస్తుందా లేదా? అనే విషయాన్ని సెకండాఫ్‌ వరకు సస్పెన్స్ ని క్రియేట్‌ చేసిన తీరు బాగుంది. ఇంటర్వెల్‌ సీన్ కూడా కొత్తగా ఉంది. ఆకట్టుకుంది. ఓవరాల్‌గా ఫస్టాఫ్‌ యావరేజ్‌గా సాగింది. సెకండాఫ్‌ ని మాత్రం బెటర్‌గా రాసుకున్నాడు. అంతే బెటర్‌గా తెరకెక్కించాడు. సరదాగా ఫన్నీగా సాగుతూ, ఆ తర్వాత సీరియస్‌గా టర్న్ తీసుకుంటుంది మూవీ. హాయిగా నవ్వుకునేలా సాగుతూ, సరికొత్త ప్రేమలోని మాధుర్యాన్ని పరిచయం చేస్తూ చివరికి గుండె బరువెక్కించేలా ముగిస్తుంది.

సినిమాలో లవ్‌ స్టోరీ మాత్రమే కాదు, ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా కీలక భూమిక పోషిస్తాయి. ఎమోషన్స్, స్వచ్ఛమైన ప్రేమ, పరువు కోసం చేసే ప్రయత్నాలు సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లాయి. ఫస్టాఫ్‌ ఫన్నీగా సాగినా, సెకండాఫ్‌ ఎమోషనల్‌గా రన్‌ అవుతుంది. ఇక క్లైమాక్స్ మాత్రం గుండెని బరువెక్కిస్తుంది. అదే ఈ సినిమాకి హైలైట్‌. చాలా వరకు ఫస్టాఫ్‌ బాగుండి, సెకండాఫ్‌ విషయంలో బోల్తా పడుతుంటారు మేకర్స్.

కానీ ఇందులో ఫస్టాఫ్‌ని యావరేజ్‌గా డీల్‌ చేసి, సెకండాఫ్‌ని దానికంటే బెటర్‌గా డిజైన్‌ చేసుకున్నాడు దర్శకుడు. అక్కడే అతను సక్సెస్‌ అయ్యాడు. ఏ ఆడియెన్స్ కి అయినా క్లైమాక్స్ బాగుంటే, ముందు చూసిందంతా మర్చిపోతారు. ఈ సినిమా విషయంలో మొదటి భాగం కంటే ద్వితీయార్థం బాగా డీల్‌ చేశాడు. అదే ఈ సినిమా సక్సెస్‌కి కారణమని చెప్పొచ్చు.

అయితే రొటీన్‌ స్టోరీ, ఫస్టాఫ్‌లో ఫన్‌ పెద్దగా వర్కౌట్‌ కాకపోవడం, లవ్‌ ట్రాక్‌ కూడా కాస్త స్లోగా సాగడంతో ఆ కిక్‌ మిస్‌ అయ్యింది. కానీ రెండో భాగంలో దాన్ని భర్తీ చేశారు. ఓవరాల్‌గా ఇది సరికొత్త ఎక్స్ పీరియెన్స్ ని అందించే మూవీ అవుతుంది. 
 

నటీనటులు పర్‌ఫెర్మెన్స్ః
నారాయణరెడ్డి పాత్రలో అంజన్‌ రామచంద్ర చాలా బాగా చేశాడు. హీరోగా ఆయన కొత్త సినిమా అయినా అదరగొట్టాడు. పాత్రలో ఇన్‌ వాల్వ్ అయి చేశాడు. ఎక్కడ కొత్త కుర్రాడు అనే ఫీలింగ్‌ కలిగించలేదు. ఇక దివ్య పాత్రలో శ్రావణి రెడ్డి సైతం ఆకట్టుకుంది. చాలా సెటిల్డ్ యాక్టింగ్‌తో మెప్పించింది. ఈ ఇద్దరి పాత్రలే సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయి. హీరోని ఇష్టపడే స్వీటీ పాత్రలో జ్యోతి మదన్‌ ఆకట్టుకుంది. నవ్వులు పూయించింది. హీరోయిన్‌ కి తండ్రిగా నటించిన ఆర్టిస్ట్ మాత్రం అదరగొట్టాడు. ఆయన యాక్టింగ్ సైతం ఆకట్టుకునేలా ఉంది. ఇతర పాత్రల్లో నటించిన నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.  
 

టెక్నీషియన్ల పనితీరుః 
సినిమా టెక్నీకల్‌గా బాగుంది. ఒక చిన్న సినిమాకి ఈ రేంజ్‌ టెక్నికల్‌ సపోర్ట్ ఉండటం మామూలు విషయం కాదు. ఇందులో హైలైట్‌ పాయింట్‌ ఈ టెక్నికల్‌ అంశాలుగా చెప్పొచ్చు. ప్రిన్స్ హెన్ని సంగీతం సినిమాకి బ్యాక్‌ బోన్‌గా నిలుస్తుంది. పాటలు చాలా బాగున్నాయి. పెద్ద సినిమాల రేంజ్‌లో ఉంటూనే లవ్‌ స్టోరీలోని గాఢతని, స్వచ్చమైన ప్రేమని తెలియజేసేలా ఉన్నాయి. దీనికితోడు బీజీఎం సైతం ఆకట్టుకుంది. చాలా చోట్ల సన్నివేశాలు ఎలివేట్‌ కావడంలో దాని పాత్ర ఎంతో ఉంది. చాలా సీన్లకి బీజీఎంతోనే ప్రాణం పోశాడు సంగీత దర్శకుడు.

కెమెరా వర్క్ సైతం బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ రిచ్‌గా ఉంది. కోటగిరి వెంకటేశ్వరరావు దీనికి ఎడిటింగ్‌ చేయడం విశేషంగా చెప్పొచ్చు. తన అనుభవాన్ని చూపించారు. నిర్మాణ విలువలు కూడా రిచ్‌గా ఉన్నాయి. ఇక దర్శకుడు సినిమాకి హైలైట్‌. ఆయన ఓ సాహసోపేతమైన కథని ఎంచుకోవడమే కాదు, దాన్ని అంతే బాగా వెండితెరపై ఆవిష్కరించడం కూడా గొప్ప విషయం.

ఇంట్రెస్టింగ్‌గా, ఎంగేజింగ్‌గా తీసుకెళ్లిన తీరు, లవ్‌ స్టోరీలోని ఆ ఫ్రెష్‌నెస్‌ని చూపించిన తీరు బాగుంది. ఇక ఎమోషన్స్ కి ప్రయారిటీ ఇస్తూ, సినిమాకి ముగింపు పలికిన తీరు ఆకట్టుకుంటుంది. దర్శకుడు టెక్నీకల్‌గా ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నాడనేదానికి ఈ మూవీ అద్దం పడుతుంది. రొటీన్‌ స్టోరీ, ఫస్టాఫ్‌ని మరింత గ్రిప్పింగ్‌గా తీయడం వంటి చిన్న చిన్న మైనస్‌లు పక్కన పెడితే ఇది సరికొత్త ఎక్స్ పీరియెన్స్ తోపాటు ఎంటర్‌టైన్‌ చేసే మూవీ అవుతుంది.  

ఫైనల్‌గాః `లవ్‌ రెడ్డి` సరదాగా అలరిస్తూనే గుండెని బరువెక్కించడంతోపాటు. పరువు హత్యల కథని సరికొత్తగా ఆవిష్కరించే మూవీ.
రేటింగ్‌ః 2.75

click me!