`జనక అయితే గనక` సినిమా రివ్యూ, రేటింగ్‌

First Published Oct 12, 2024, 12:58 AM IST

సుహాస్‌ హీరోగా నటించిన `జనక అయితే గనక` మూవీ నేడు విడుదలైంది. కండోమ్‌ కంపెనీపై కేసు ప్రధానంగా సాగే ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 
 

సుహాస్‌ చిన్న సినిమాలకు పెద్ద హీరో. కంటెంట్‌ బేస్డ్ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. కంటెంట్‌ని నమ్మి, తనదైన సహజమైన నటనతో మెప్పిస్తున్నాడు. ఏడాదికి రెండు మూడు సినిమాలతో ఆడియెన్స్ ని అలరిస్తున్నాడు. ఇప్పటికే మూడు సినిమాలతో వచ్చిన ఆయన ఇప్పుడు `జనక అయితే గనక` అనే మరో సినిమాతో ఈ దసరాకి ఆడియెన్స్ ముందుకొచ్చాడు. సందీప్‌ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించిన ఈ మూవీని దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్‌ రెడ్డి, హన్సితా రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఇందులో సుహాస్‌కి జోడీగా సంగీర్తన హీరోయిన్‌గా నటించింది. మరి శనివారం (అక్టోబర్ 12)న విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

కథః 
మధ్యతరగతి ఫ్యామిలీకి చెందిన ప్రసాద్‌ (సుహాస్‌) చిన్నపాటి ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఆయన పేరెంట్స్, బామ్మ, భార్య(సంగీర్తన)తో కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. తక్కువ శాలరీ జాబ్‌ మానేసి ఎక్కువ శాలరీ ఇచ్చే వాషింగ్‌ మెషిన్‌ సర్వీస్‌ కంపెనీలో చేరతాడు. కానీ అందులో పనిభారంతో విసిగిపోతుంటాడు. మరోవైపు ఇంట్లో రోజూ బామ్మ పిల్లలంటూ విసిగిస్తుంది. తండ్రి(గోపరాజు రమణ) సైతం కొడుక్కి క్లాస్‌లు పీకడాలు చేస్తుంటాడు.

దీంతో అతను చేసిన మిస్టేక్‌ని ఎత్తిచూపుతూ ఆయన నోరు మూయిస్తుంటాడు ప్రసాద్‌. తన ఆర్థిక స్థోమత తక్కువగా ఉండటంతో తాను పిల్లలు ఏదిచ్చినా ది బెస్ట్ ఇవ్వాలని చెప్పి, తాను ఇవ్వలేని స్థితిలో ఉన్నాను కాబట్టి పిల్లలు కనడానికి ఇష్టపడడు. పిల్లలను కంటే కోటీ రూపాయలు ఖర్చు వస్తుందని చెప్పి భార్యకి సర్దిచెబుతుంటాడు. కానీ ఓ రోజు అనూహ్యంగా ప్రసాద్‌ భార్య నెలతప్పుతుంది. ఈ వార్తతో ఫ్యామిలీ అంతా హ్యాపీ. కానీ ప్రసాద్‌కి పెద్ద షాక్‌.

తాను కండోమ్‌ వాడినా అది ఎలా  జరిగిందనేది ఆలోచిస్తుంటాడు. బాధపడుతుంటాడు. లాభం లేదని కండోమ్‌ ఫెయిల్‌ అయ్యిందని చెప్పి ఆ కండోమ్‌ కంపెనీపై కోటీ రూపాయల నష్టపరిహారం కోసం దావా వేస్తాడు. మరి ఈ కేసు ఎలాంటి మలుపులు తిరిగింది? కోర్ట్ లో ఎలాంటి వాదనలు జరిగాయి? ఇందులో ప్రసాద్‌ ఫేస్‌ చేసిన అవమానాలేంటి?

తన ప్రెగ్నెన్సీ విషయంలో ఇంత రచ్చ చేసిన ప్రసాద్‌ భార్య ఎలాంటి నిర్ణయం తీసుకుంది? చివరికి ఈ కేసు ఎలాంటి మలుపులు తిరిగింది? వైద్యానికి, ఎడ్యూకేషన్‌కి ఉన్న లింకేంటి? ప్రసాద్‌ ఈ కేసులో గెలిచాడా? ఓడిపోయాడా? ఇంతకి తన భార్య ఎలా ప్రెగ్నెంట్‌ అయ్యిందనేది మిగిలిన కథ. 
 

Latest Videos


విశ్లేషణః
`జనక అయితే గనక` సినిమా సబ్జెక్ట్ పరంగా చాలా సెన్సిటివ్‌ మ్యాటర్‌. దాన్ని ఇప్పటి జనాలకు అర్థమయ్యేలా చాలా సింపుల్‌ వేలో, జనాలకు కనెక్ట్ అయ్యే అంశాలు, ఫేస్‌ చేసే సమస్యల ప్రధానంగా చేసుకుని కథ చెబితే ఈజీగా కనెక్ట్ అవుతుంది. లేదంటే ఇలాంటి సినిమాలకు ఆడియెన్స్ నుంచి రివర్స్ ఎటాక్ ఉంటుంది. ఈ సినిమాలో దర్శకులు అన్నింటిని బ్యాలెన్స్ చేస్తూ రూపొందించడం విశేషం. సినిమాలో బలమైన కంటెంట్‌ ఉన్నా, కండోమ్ అనే పాయింట్ ఉన్నా, దాన్ని ఆద్యంతం ఫన్నీవేలో చూపించడం విశేషం.

ఇక్కడే దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. అయితే ఆ ఫన్‌ ఎంత వరకు వర్కౌట్‌ అయ్యిందనేది ఇక్కడ మెయిన్‌ థింగ్‌. ఇందులో కొంత వరకు మాత్రమే ఆ ఫన్‌ వర్కౌట్‌ చేయగలిగారు. ఫస్టాఫ్‌ అంతా రొటీన్‌ గా సాగుతుంది. సెకండాఫ్‌లో కండోమ్‌ కంపెనీపై కేసు వేయడంతో కథ కోర్ట్ చుట్టూ తిరుగుతుంది. కోర్ట్ రూమ్‌ డ్రామాగా మారుతుంది. మొదటి భాగంలో ప్రసాద్‌ ఫ్యామిలీని, వారి ఆర్థిక పరిస్థితిని ఎస్టాబ్లిష్‌ చేశాడు. అయితే దానికి ఫస్టాఫ్‌ మొత్తం తీసుకోవడం గమనార్హం. చెప్పిన విషయాలే చెబుతూ వచ్చాడు.

పైగా ప్రారంభంలోనే ఫ్యామిలీ డ్రామా రొటీన్‌గా అనిపిస్తుంది. ఇటీవల చాలా సినిమాల్లో ఇలాంటి డ్రామాలే ఉంటాయి. ఇందులోనూ అదే జరుగుతుంది. తండ్రి కొడుకులకు పడకపోవడం, బామ్మతో గొడవ పరమ రొటీన్‌గా మారిపోయింది. ఈ విషయంలో ఏమాత్రం కొత్తదనం చూపించలేకపోయాడు దర్శకుడు. అయితే తన భార్య ప్రెగ్నెంట్ అయితే,  ఆ ఖర్చు ఎంత అవుతుందనేది డైరెక్ట్ గా ఆసుపత్రికి వెళ్లి చూపించడం, స్కూల్స్, కాలేజీలకు వెళ్లి ఆ ఫీజుల వివరాలను తండ్రికి తెలియజేసే సన్నివేశాలు,

ఈ క్రమంలో వాళ్ల మధ్య కన్వర్జేషన్‌ ఫన్నీగా ఉంటుంది. మరోవైపు జాబ్‌ అయిపోయాక తన ఫ్రెండ్‌ కిశోర్‌(వెన్నెల కిశోర్‌)తో ఫ్యామిలీ విషయాలు షేర్‌ చేసుకోవడం, కిశోర్‌ తన పిల్లలతో ఎలా టార్చర్‌ అనుభవిస్తున్నాడో చూపించే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. వీరిద్దరి మధ్య కన్వర్జేషన్‌ కామెడీగా ఉంటుంది. 
 

ఇక సెకండాఫ్‌లో హీరో కండోమ్‌ కంపెనీపై కేసు వేయడం, కోర్ట్ లో వాదనలు, తన తరఫున కిశోర్‌ వాదించడం, ఆయనకు లా గురించికూడా తెలియకపోవడం, దీంతో తాను మ్యానేజ్‌ చేసే తీరు నవ్వులు పూయిస్తుంది. కోర్ట్ సీన్‌ హిలేరియస్‌గా నవ్వించడంతోపాటు వాదనలు చాలా సీరియస్‌గా సాగుతాయి. అంతటి సీరియెస్‌లోనూ ఫన్‌ జనరేట్‌ చేయడం ఈ సినిమా స్పెషల్‌. అయితే కోర్ట్ రూమ్‌ సన్నివేశాలు ఓకే, ఆ తర్వాత తన భార్యతో తనకు మధ్య గొడవ ఈ క్రమంలో భార్యని ఒప్పించి తీసుకురావడమనే సీన్లు కాస్త బోర్‌గా అనిపిస్తాయి.

కానీ విద్యా వ్యవస్థ, ప్రైవేట్‌ స్కూల్స్ దోపిడి గురించి చెప్పిన విషయాలు బాగున్నాయి. కామెడీతోపాటు ఆలోచింప చేసేలా ఉన్నాయి. ఆసుపత్రుల మోసానికి సంబంధించి కూడా వివరించే ప్రయత్నం చేశాడు. ప్రాక్టికల్‌గా మనం రెగ్యూలర్‌గా ఫేస్‌ చేసే అంశాలను ఇందులో చూపించడంతో అవి అందరికి కనెక్ట్ అవుతాయి. అయితే బెస్ట్ బెస్ట్ అంటూ చేసే హడావుడి కాస్త ఓవర్‌గా అనిపిస్తుంది. కేసు విషయంలో వాదోపవాదనలకు సంబంధించి కూడా చాలా లాజిక్స్ మిస్‌ అయ్యాయి.

కొన్ని రొటీన్‌ సీన్లు సైతం సినిమాకి మైనస్‌గా మారాయి. చాలా సన్నివేశాలు ఉన్నా, వాటిని టచ్‌ చేస్తూ వెళ్లి బ్ర కాకపోతే సినిమాలో డైలాగులు బాగున్నాయి. పిల్లలకు సంబంధించి తల్లి ఇక్కడ(కడుపులో) మోస్తుంది, మనం ఇక్కడ(బుర్రలో) మోస్తాం అని వెన్నెల కిశోర్‌ చెప్పే డైలాగ్‌ అదిరిపోయింది. జాబ్‌ తో విసిగిపోయే సన్నివేశాలు చాలా మందికి కనెక్ట్ అవుతాయి. ఓవరాల్‌గా కొన్ని మైనస్‌లు, లాజిక్‌ లేని సీన్లని, ఫస్టాఫ్‌ రొటీన్‌ సీన్లని పక్కన పెడితే ఈ మంచి టైమ్‌ పాస్ మూవీ అని చెప్పొచ్చు. 
 

నటీనటులుః 
ప్రసాద్‌ పాత్రలో సుహాస్‌ బాగా చేశాడు. తనకిది బాగా సెట్‌ అయ్యే పాత్రలో జీవించాడు. రియాలిటీని చూపించాడు. నటుడిగా సుహాస్‌ ఎలా ఇరగదీస్తాడో తెలిసిందే. ఇందులోనూ తనదైన యాక్టింగ్‌తో మెప్పించాడు. భార్య పాత్రలో సంగీర్తన సైతం దించేసింది. భార్యగా ఒదిగిపోయింది. ప్రసాద్‌ తండ్రిగా గోపరాజు రమణది యాప్ట్ రోల్‌. ఈ రోల్‌ సింపుల్‌గా చేసేశాడు. భామ్మగా చేసిన నటి ఆకట్టుకుంది. నవ్వించింది. అదరగొట్టింది.

ఫ్రెండ్‌గా వెన్నెల కిశోర్‌ మెప్పించాడు. ఇలాంటి కామెడీ పాత్రలు పడితే రెచ్చిపోతాడు. ఇందులోనూ రెచ్చిపోయి ఆకట్టుకున్నాడు. లాయర్‌గా మురళీ శర్మ మెప్పించాడు. మరో లాయర్‌గా ప్రభాస్‌ శ్రీను పాత్ర ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. జడ్జ్ గా రాజేంద్రప్రసాద్‌  మిగిలిన నటీనటులు సైతం బాగా చేశారు. 
 

టెక్నీషియన్లుః 
సినిమా టెక్నీకల్‌గా బాగుంది. సాయి శ్రీరాము కెమెరా వర్క్ రిచ్‌గా ఉంది. విజయ్‌ బుల్గానిన్‌ సంగీతం ఆకట్టుకునేలా ఉంది. పాటల వినసొంపుగా ఉన్నాయి. బీజీఎం సైతం అంతే కూల్ గా ఎంటర్‌టైనింగ్ గా సాగింది. ప్రొడక్షన్‌ పరంగా బాగానే తీశారు. రాజీపడలేదని అర్థమవుతుంది. ఇక దర్శకుడు సందీప్‌ రెడ్డి బండ్ల సినిమాని నడిపించిన విధానం బాగుంది.

కథ పరంగా ఇది చాలా సెన్సిటివ్‌ మ్యాటర్. కొన్ని ఆలోచింప చేసే సన్నివేశాలు పెట్టడం విశేషం. కథలో చాలా ఎమోషన్స్ ఉంటాయి. కానీ వాటిని సినిమాల్లో క్యారీ చేయలేకపోయారు. పాయింట్‌గా సినిమా బాగున్నా, ఎగ్జిక్యూషన్‌లో చిన్న చిన్న లోపాలని సరి చేసుకుంటే సినిమా అదిరిపోయేది. అయినా సినిమాలో ఫన్‌ బాగా నవ్విస్తుంది. సందేశం ఆలోచింపచేస్తుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ కి కూడా కనెక్ట్ అవుతుంది. 

ఫైనల్‌గాః  `జనకా అయితే గనక` ఈ పండక్కి నడిపోయే మూవీ. మంచి ఫన్‌ రైడ్‌. 

రేటింగ్‌ః 2.75
 

click me!