శర్వా ‘మనమే’ రివ్యూ

First Published | Jun 7, 2024, 1:10 PM IST

 ఫ్యామిలీలకు నచ్చేలా అనిపిస్తున్న ఈ చిత్రం కథేంటి, అసలు చూడదగ్గ సినిమాయేనా,...

Manamey


శర్వానంద్ వరసపెట్టి సినిమాలు అయితే చేస్తున్నాడు కానీ సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలం అయ్యింది. అప్పటికీ ప్రతీ సినిమాకు దాదాపు జానర్ మారుస్తూనే వస్తున్నాడు. అయినా భాక్సాఫీస్ కరణించటం లేదు. ఈ క్రమంలో రొమాంటిక్ కామెడీ జానర్ లోకి వెళ్లి చేసిన చిత్రం మనమే. ట్రైలర్స్ ఇంట్రస్టింగ్ గా అనిపించటంతో సినిమాపై బజ్ బాగానే క్రియేట్ అయ్యింది. ఫ్యామిలీలకు నచ్చేలా అనిపిస్తున్న ఈ చిత్రం కథేంటి, అసలు చూడదగ్గ సినిమాయేనా, శర్వానంద్ ని ఫ్లాఫ్ ల నుంచి బయిటపడేస్తుందా చూద్దాం.

స్టోరీ లైన్

ఓ జంట యాక్సిడెంట్ లో చనిపోతే తప్పనిసరిపరిస్దితుల్లో అనాధ అయిన వాళ్ల బాబుని  వాళ్ల స్నేహితులు చేరదీసి ఎలా పెంచారు.. ఆ క్రమంలో వాళ్లిద్దరు ఎలా ప్రేమలో పడి ఒకటయ్యారు అనే పాయింట్ తో తయారైన కథ ఇది. లండన్ లో కథ జరుగుతుంది. విక్రమ్(శర్వానంద్) ప్లే బాయ్ టైప్. కన్నుపడ్డ అమ్మాయి వెనుక పడుతూఎంజాయ్ చేసే ఓ పద్దతి పాడు లేని కుర్రాడు. ఇక సుభద్ర (కృతి శెట్టి) ప్రతీది పద్దతి ప్రకారం ఉండాలనుకునే అమ్మాయి. వీళ్ల స్నేహితులు అనురాగ్,శ్వేత ఓ యాక్సిడెంట్ లో చనిపోతారు. అయితే వాళ్లది లవ్ మ్యారేజ్ కావటంతో  వాళ్ల అబ్బాయి ఖుషీ భాధ్యతని వాళ్ల పేరెంట్స్ తీసుకోరు. అప్పుడు ఇంగ్లాండ్ ప్రభుత్వం అక్కడ రూల్ ప్రకారం ఆ బాబుని అక్కడ గవర్నమెంట్ అనాధగా ఆర్ఫనేజ్ లో వేయటానికి సిద్దపడుతుంది.  దాంతో ఆ భాధ్యతను విక్రమ్, సుభద్ర స్వీకరిస్తారు.
 



 అనాధ అయిన ఆ పిల్లాడికి వీళ్లు ఓ నాలుగు నెలల పాటు కేర్ టేకర్స్ గా ,పేరెంట్స్ గా ఉండాల్సి  వ్యవహరించాల్సి వస్తుంది. అప్పటిదాకా కేర్ ఫ్రీగా ఏ భాధ్యతలు లేకుండా బ్రతికిన వాళ్లిద్దరు ఒక్కసారిగా ఊహించని విధంగా కేర్ టేకర్స్ గా మారటంతో ఎడ్జస్ట్ కాలేకపోతారు. అందులోనూ ఇద్దరి మనస్తత్వాలు భిన్న ధృవాలు. అయినా ఎదురుగా చిన్న బాబు,వాడి అవసరాలు వాళ్లిద్దరిని గజి బిజిగా బిజీ చేసేస్తాయి. ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవటం, ఎత్తి పొడుచుకోవటం,భాధ్యతను భరించలేక బావురుమనటం చేస్తారు. ఈ క్రమంలో వీళ్లిద్దరూ ఎలా ఒకటి అయ్యారు,సుభద్ర చేసుకోవాల్సిన వ్యక్తి శివ (శివ కందుకూరి) క్యారక్టర్ ఏమిటి... అనేది కథనంతో సాగే కథ. 

 
విశ్లేషణ

ఎమోషన్ కనెక్ట్ కానప్పుడు ఎంత కలర్ ఫుల్ సినిమా అయినా మనది కానట్లుగానే కనిపిస్తుంది. టెక్నికల్ గా అన్ని జాగ్రత్తలు తీసుకున్నా స్క్రిప్టు దగ్గర సైడ్ అయ్యిపోతే సమస్య అక్కడే మొదలైపోతుంది. ఇలాంటి కథలకు ఫన్ ఎంత ముఖ్యమో ఎమోషన్ బాలెన్స్ చేయటం అంతే ముఖ్యం. లేకపోతే ఏదో కాసేపు నవ్వుకున్నాం...అంతే అన్నట్లు అనిపిస్తుంది. అదే ఈ సినిమాకు జరిగింది.  రొమాంటిక్ కామెడీ జానర్ లో సాగే ఈ కథ పూర్తి ట్రీట్మెంట్ పై ఆధారపడి తయారు చేసుకున్నది. అలాగే ఈ కథ ‘Life As We Know It’ అనే హాలీవుడ్ చిత్రం నుంచి ఎత్తుకొచ్చింది. ఈ హాలీవుడ్ కథకు ఇక్కడి మన ఇండియన్ ఎమోషన్స్ కలిపి వండే ప్రయత్నం చేసారు. అందులో కొంతభాగం బాగానే సక్సెస్ అయ్యారు. ఫస్టాఫ్ ఫన్ తో లాగేసారు. 


కానీ సెకండాఫ్ కు వచ్చేసరికి పూర్తిగా డ్రాప్ అయ్యిపోయింది. లైటర్ వీన్ లో సాగే ఆ కథలో కాస్త బలమైన భావోద్వేగాలు కలపాలనే దర్శకుడు ప్రయత్నం పూర్తి స్దాయిలో ఫలించలేదు. సెటప్ ద్వారానే సెట్ అయ్యింది. మెయిన్ క్యారక్టర్స్ రాతలోనే కాస్త కన్ఫూజన్ ఉంది. శర్వా క్యారక్టర్ ఫస్టాఫ్ లో ఒకలా సెకండాఫ్ లో మరోలా కనిపిస్తాడు. హీరో పాత్రను డైరక్టర్ తనకు కావాల్సినట్లు మార్చేసుకున్నాడు. దాంతో సినిమాకు  అసలైన కాంప్లిక్ట్స్ పార్ట్  పై ఆ ఇంపాక్ట్ పడింది. అప్పటికీ  హీరో ఫ్రెండ్ చనిపోవడానికి అతడి బిజినెస్ పార్ట్‌నర్ కారణం అని హీరోహీరోయిన్ తెలుసుకోవడం, ఫ్రెండ్ మరణంతో మూతపడిన రెస్టారెంట్‌ని హీరోహీరోయిన్ కలిసి మళ్లీ సక్సెస్ చేయడం లాంటి సీన్స్ బాగానే రాసుకున్నారు. కానీ అసలైన ఎమోషన్స్ ని బిల్డ్ చేయలేకపోయారు.


పిల్లాడి పెంపకంలో వచ్చే సమస్యల్లోంచి పుట్టే ఫన్, ఆ క్రమంలో లీడ్ పెయిర్ మనస్సులో ప్రేమ మొలకెత్తటం అనే కార్యక్రమం జరగాలి. అదే స్క్రీన్ ప్లే ప్రకారం జరుగుతూ వచ్చినా ప్రెడిక్టబుల్ సీన్స్ బ్యూటీని చెడకొట్టేసాయి. ఇలాగే జరుగుతుందని తెలిసినా కొత్తదనమే రొమాంటిక్ కామెడీలకు ఆయువు పట్టుగా నిలుస్తుంది. ఇక సినిమాలో వచ్చే సీరత్ కపూర్ సీన్స్ అయితే విసుగెత్తించేసాయి. అలాగే రాహుల్ రవీంద్రన్ నెగిటివ్ క్యారక్టర్ కూడా బలంగా నిలబడలేదు.మేకింగ్ పరంగా బాగున్నా రైటింగ్ వైపు నుంచి సపోర్ట్ లేదు. ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బ్లాక్ కథకు కావాల్సిన కామెడీని,ఇంటెన్స్ ని ఇవ్వలేకపోయాయి.  అయితే సాధ్యమైన మేరకు శర్వానంద్ తన నటనతో సినిమాని లాగి లోపాలు కనపడనివ్వకుండా చేసాడు. 

Manamey

ఎవరెలా చేసారు

శర్వా  కామెడీ టైమింగ్,ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్  ఈ సినిమాకు ఉన్న పెద్ద ప్లస్ పాయింట్. అలాగే ‘బేబమ్మ’ తర్వాత హీరోయిన్ కృతి శెట్టికి అలాంటి ఫెరఫార్మెన్స్ ఉన్న రోల్ పడలేదు. కానీ ‘మనమే’ తో కొంతవరకూ ఆ లోటు తీరిపోతుంది. ఇక సీరత్ కపూర్, శివ కందుకూరి సోసోగా ఉన్నాయి పాత్రలు. ఇక బాబుగా చేసిన డైరక్టర్ కొడుకు మాస్టర్ విక్రమ్ ఆదిత్య బాగా చేసారు. వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ ఫన్ బాగానే ఉంది.


టెక్నికల్ గా చూస్తే

ఇలాంటి సినిమాలకు అవసరమైన పాటల కన్నా డోస్ కాస్త ఎక్కువగానే ఉంది. పాటల కొరియోగ్రఫీ ,విజువల్స్ బాగున్నాయి. సినిమాటోగ్రాఫర్స్ వర్క్ ప్రత్యేకంగా కనపడుతుంది. అలాగే ఆర్ట్ డైరక్టర్ కూడా బాగా కష్టపడ్డారు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ఇంకాస్త ట్రిమ్ చేసి ఉంటే సీన్స్ లో ల్యాగ్ బాగా తగ్గేది కదా అనిపిస్తుంది. పీపుల్స్ మీడియా వారి ప్రొడక్షన్ వాల్యూస్ కు వంక పెట్టడానికి లేదు. బాగా లావిష్ గా తీసారు.  సినిమా రన్ టైం 2 గంటల 35 నిమిషాలు ఎక్కువనే ఫీలింగ్ వచ్చింది. డైలాగులు మాత్రం బాగున్నాయి. కొన్ని బాగా పేలాయి.

హైలెట్స్ 

శర్వానంద్ ఫన్ 
రిచ్ విజువల్స్
అక్కడక్కడే పేలే జోక్స్
 వెన్నెల కిషోర్ సీన్స్

మైనస్ లు

తెలిసిన కథ,కథనం
ప్రెడిక్టుబుల్ గా సాగే సీన్స్
పాటలు
రన్ టైమ్
 

ఫైనల్ థాట్

ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసిన ఈ సినిమా మ ల్టిప్లెక్స్ జనాలకు బాగా నచ్చుతుంది.  వీకెండ్ కు కాలక్షేపాన్ని ఇస్తుంది. అయితే అదీ ఎక్కువ ఎక్సపెక్ట్ చేయకుండా ఉంటేనే సుమా.

Rating:2.5

---సూర్య ప్రకాష్ జోశ్యుల 
 

Manamey


బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

నటీనటులు: శర్వానంద్, కృతి శెట్టి, విక్రమ్ ఆదిత్య, వెన్నెల కిషోర్, శీరత్ కపూర్, శివ కందుకూరి తదితరులు.

డైలాగ్స్: అర్జున్ కార్తిక్, ఠాగూర్,  వెంకీ
సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్
డీవోపీ: విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ VS
ఎడిటర్: ప్రవీణ్ పూడి
ఆర్ట్: జానీ షేక్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: కృతి ప్రసాద్,  ఫణి వర్మ
అసోసియేట్ ప్రొడ్యూసర్: ఏడిద రాజా

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్

విడుదల తేదీ: 07,జూన్ 2024

Latest Videos

click me!