రివ్యూః `కృష్ణగాడు అంటే ఒక రేంజ్‌`.. సినిమా ఎలా ఉందంటే?

First Published | Aug 3, 2023, 7:25 PM IST

ఈ వారం నాలుగైదు చిన్న సినిమాలు సందడి చేస్తున్నాయి. అందులో భాగంగా వచ్చిన మూవీ `కృష్ణగాడు అంటే ఒక రేంజ్‌`. నూతన నటీనటులు నటించిన ఈ మూవీ శుక్రవారం విడుదలవుతుంది. ముందుగా ప్రీమియర్స్ ప్రదర్శించారు. మరి సినిమా ఎలా ఉందంటే?
 

ఇటీవల చిన్న సినిమాల జోరు సాగుతుంది. ఈ సమ్మర్‌ మొత్తం తక్కువ బడ్జెట్‌ సినిమాలదే హవా. విజయాలు సాధించినవి కూడా ఆయా సినిమాలే ఎక్కువ. కాన్సెప్ట్ ని నమ్ముకుని నిజాయితీగా తీసిన సినిమాలు చాలా వరకు విజయాలు సాధించాయి. మంచి ప్రశంసలందుకోవడంతోపాటు కమర్షియల్‌గానూ సత్తా చాటాయి. ఈ వారం పెద్ద సినిమాలు లేకపోవడంతో మరోసారి చిన్న సినిమాలు పోటీ పడుతున్నాయి. అందులో భాగంగా నాలుగైదు ఈ శుక్రవారం రిలీజ్‌ అవుతున్నాయి. `కృష్ణగాడు అంటే ఒక రేంజ్‌` అందులో ఒకటి. రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ జంటగా నటించారు.  శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి బ్యానర్ పై పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. రాజేష్‌ దొండపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలయ్యింది. మరి ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

కథః 
కృష్ణ(రిష్వి తిమ్మరాజు) తండ్రి చిన్నప్పుడే చనిపోతాడు. దీంతో ఇంటి భారం తనపై పడుతుంది. తన మామతో కలిసి మేకలు కాస్తుంటాడు. ఓ ఫంక్షన్‌లో సత్య (విస్మయ శ్రీ) ఇతన్ని అమాయకత్వాన్ని చూసి ఇష్టపడుతుంది. మొదట్లో ఆటపట్టిస్తుంది. తన మంచి తనం చూసి ప్రేమిస్తుంది. ఆమెకి కృష్ణ కూడా పడిపోతాడు. ఊర్లో గాలిగా తిరిగే దయా (రఘు). అమ్మాయిలను, ఆంటీలను అల్లరి చేస్తుంటాడు. బ్లాక్ మెయిల్‌ చేసి వారిని లొంగదీసుకుంటాడు. ఈ క్రమంలో సత్యపై అతని చూపు పడుతుంది. కానీ ఆమె కృష్ణతో తిరుగుతున్న విషయం తెలిసి రగిలిపోతుంటాడు. ఎలాగైనా వారి ప్రేమని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తాడు. కృష్ణకి, దయాకి మధ్య గొడవ అవుతుంది. బాగా కొట్టుకుంటారు. ఈ క్రమంలో ఇల్లు లేదు, ఏం లేదంటూ  కృష్ణని అవమానిస్తాడు. దీంతో మూడు నెలలో ఇళ్లు కట్టి చూపిస్తా అని, సత్యని పెళ్లి చేసుకుంటా అని ఛాలెంజ్‌ విసురుతాడు. మరి తాను చేసిన ఛాలెంజ్‌పై కృష్ణ నిలబడ్డాడా? ఈక్రమంలో అతనికి దయా ఎలాంటి అడ్డంకులు సృష్టించాడు?, ఇందులో బీహార్‌ బ్యాచ్‌ కథేంటి? మల్లయ్య చేసే రౌడీయిజం ఏంటి? కృష్ణ తల్లికి ఏం జరిగింది? ఆ తర్వాత సినిమా కథ ఎలాంటి మలుపులు తిరిగిందనేది మిగిలిన కథ. 
 


విశ్లేషణః

చిన్న సినిమాలకు కంటెంట్‌ ముఖ్యం. స్టార్‌ కాస్ట్ ఉండదు కాబట్టి, కథని నమ్ముకునే ముందుకు సాగాల్సి ఉంటుంది. కథే ఆడియెన్స్ ని థియేటర్‌ కి తీసుకురావాల్సి ఉంటుంది. అసలే ఆడియెన్స్ థియేటర్ కి వచ్చేందుకు మొగ్గు చూపడం లేదు. కాబట్టి మేకర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే రిజల్ట్ తేడా కొడుతుంది. నిర్మాతకి నష్టాలు తప్పవు. తాజాగా వచ్చిన `కృష్ణగాడు అంటే ఒక రేంజ్‌` సినిమా ఈ విషయంలో కొంత వరకు మాత్రమే సక్సెస్‌ అయ్యిందని చెప్పొచ్చు. కాకపోతే రొటీన్‌ స్టోరీనే ఎంచుకున్నారు. ఆ విషయంలో కొత్తదనానికి పెద్ద పీట వేయాల్సింది. 
 

సినిమా గ్రామీణ నేపథ్యంలో సాగుతూ ఆహ్లాదాన్ని పంచుతుంది. ఇందులో హీరో మేకలు కాయడం, ప్రేమలో పడటమనే సన్నివేశాలు చాలా కొత్తగా ఉంటాయి. దీనికితోడు హీరో క్యారెక్టరైజేషన్‌ ఇన్నోసెంట్‌గా, అమ్మాయి క్యారెక్టర్ డేర్‌గా పెట్టి కథపై, లవ్‌ స్టోరీపై ఆసక్తిని పెంచాడు. మరోవైపు చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తండ్రి పూర్తి చేయలేకపోయిన ఇంటిని పూర్తి చేయాలనే లక్ష్యంతో హీరో పాత్రని ఎమోషనల్‌గా ప్రారంభించిన తీరు ఆకట్టుకుంది. మొదటి భాగం.. పాత్రలని ఎస్టాబ్లిష్‌ చేయడానికి టైమ్‌ తీసుకున్నాడు దర్శకుడు. ఊర్లో జరిగే సన్నివేశాలతో సరదాగా తీసుకెళ్లాడు. క్రమ క్రమంగా కథపై ఆసక్తిని పెంచేలా చేశాడు. కథ రొటీన్ గానే ఉన్నా, స్క్రీన్‌ప్లే విషయంలో కొత్తదనం పాటించడం ఇక్కడ రిలీఫ్‌నిచ్చే అంశం. దీనికితోడు రిష్వి, విస్మయ ల మధ్య లవ్‌ స్టోరీ కొత్తగా ఉంటుంది.  
 

ఇక మధ్యలో బీహార్‌ గ్యాంగ్‌ వార్తలు, కుక్కర్‌ అమ్మేవారి గొడవ, మల్లయ్య రౌడీయిజం, ఊర్లో దయా  అల్లరి, ఏ పనీ పాట తిరిగే ముగ్గురు తాగుబోతు బ్యాచ్‌ ల కథని సస్పెన్స్ లో పెడుతూ  కథనంపై ఆసక్తిని క్రియేట్ చేశారు. మరోవైపు ప్రేమలో సంఘర్షణ, ఇంటి పరిస్థితి, అమ్మ అనారోగ్యం వంటి కష్టాలతో కూడిన సంఘర్షణ ఆద్యంతం నాటకీయంగా సాగే కథనం ఆడియెన్స్ ని ఎంగేజ్‌ చేస్తుంది. తర్వాత ఏం జరుతుందనే ఉత్కంఠకి గురి చేస్తుంది. సెకండాఫ్‌ మొత్తం గొడవలు, ప్రేమ కోసం పోరాటం వంటి అంశాలపై ఫోకస్‌ పెట్టారు. అవి కొంత ఎమోషనల్‌గా అనిపిస్తాయి. అదే సమయంలో కొంత బోరింగ్ ని కూడా తెప్పిస్తుంటాయి. ఈ కష్టాలు కామనే అనే ఫీలింగ్‌ కలుగుతుంది. క్లైమాక్స్ ఉత్కంఠభరితంగా సాగుతుంది. నెక్ట్స్ ఏం జరుగుతుందనేది ఉత్కంఠ రేకెత్తిస్తుంది. చివర్లో ఇచ్చిన ట్విస్ట్ కొంత వరకే కిక్కిచ్చింది. కానీ బక్కపలుచని హీరోకి అంత పెద్ద ఫైట్ సీన్లు పెట్టడం, విలన్లు అతన్ని ఎంత కొట్టినా రియాక్ట్ అవుతున్న తీరు కాస్త అసహజంగా అనిపిస్తుంది. ఆ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది. రియాలిటీకి ప్రయారిటీ ఇస్తే బాగుండేది. మొత్తంగా ఇదొక రెగ్యూలర్‌ కమర్షియల్‌ మూవీలా అలరిస్తుందని చెప్పొచ్చు.

నటీనటులుః 
కృష్ణ పాత్రలో రిష్వి చాలా బాగా చేశాడు. పాత్రకి యాప్ట్ గా నిలిచాడు. ఇన్నోసెంట్‌గా, బెరుకుగా కనిపించి, ఆ తర్వాత ప్రేమ కోసం తిరగబడే పాత్రలో మెప్పించాడు. అప్‌ కమ్మింగ్‌ కుర్రాడైనా బాగా చేశాడు. విస్మయ శ్రీ పాత్ర హైలైట్‌గా నిలుస్తుంది. చాలా అనుభవం ఉన్న అమ్మాయిలా నటించింది. ఆమె నటన బాగుంది.  రఘు, స్వాతి పొలిచర్ల, సుజాత, వినయ్ మహదేవ్ వంటి వారు కీలక పాత్రలు పోషించి మెప్పించారు. సినిమాకి సపోర్ట్ గా నిలిచారు. 
 

టెక్నీషియన్లుః 
సినిమాకి సంగీతం, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ హైలైట్ గా నిలిచాయి. పాటలు వినసొంపుగా ఉన్నాయి. బీజీఎం మాత్రం బ్యాక్‌ బోన్‌లా నిలిచింది. సాబు వర్గీస్‌ మంచి మ్యూజిక్‌ అందించారు. సంగీతం సినిమా స్థాయిని పెంచేలా ఉంది. ఎస్‌కే రఫీ సినిమాటోగ్రఫీ ఉన్నంతలో బాగుంది.ప్లజెంట్‌ ఫీలింగ్‌ని తెప్పిస్తుంది. ఎడిటింగ్‌ సాయిబాబు తలారి ఇంకాస్త కత్తెరకి పనిచెప్పాల్సింది. దర్శకుడు కొత్త కథని ఎంచుకోవడంలో విఫలమయ్యారు. కానీ స్క్రీన్‌ప్లే కొత్తదనం చూపించే ప్రయత్నం చేశాడు. కాకపోతే ఇంకా కంటెంట్‌పై వర్క్ చేయాల్సింది. సస్పెన్స్ ని మెయింటేన్‌ చేయడంలో సక్సెస్‌ అయ్యాడు, కానీ ఏం జరగబోతుందో అర్థమయ్యేలా ఉండటం మైనస్‌గా చెప్పొచ్చు. మొత్తంగా ఓ మంచి ప్రయత్నమని చెప్పొచ్చు. నిర్మాతలు పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత సినిమా రేంజ్‌కి తగ్గట్టుగా రాజీపడకుండా నిర్మించారు.

ఫైనల్‌గాః `కృష్ణగాడు అంటే ఒక రేంజ్‌` టైమ్‌ పాస్‌ మూవీ. 

రేటింగ్‌ః 2.5
 

Latest Videos

click me!