Slum Dog Husband Movie Review: `స్లమ్‌ డాగ్‌ హజ్బెండ్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌

First Published | Jul 29, 2023, 12:52 PM IST

కుక్కని పెళ్లి చేసుకోవడమనే కాన్సెప్ట్ తో వచ్చిన మూవీ `స్లమ్‌ డాగ్‌ హజ్బెండ్‌`. ఈ సినిమా నేడు విడుదలైంది. మరి అలరించిందా? లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

భారీ బడ్జెట్ చిత్రాల సంగతి అటుంచితే.. చిన్న సినిమాల్లో ఏదోక కొత్త అంశం లేకపోతే ప్రేక్షకులు ఆసక్తి చూపించడం లేదు. ఇందుకోసమే దర్శకులు, రచయితలు, నటులు ఇంట్రెస్టింగ్ గా కథలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే కుక్కను పెళ్లి చేసుకున్న కుర్రాడి కథగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ (Slum Dog Husband). కమెడియన్, స్టార్ నటుడు బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు (Sanjay Rao) హీరోగా నటించిన చిత్రమే ఇది. ఈయన గతంలో ‘ఓ పిట్ట కథ’ సినిమా చేశారు. కొంచెం గ్యాప్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించారు. ‘ఉయ్యాల జంపాల’ ఫేమ్ ప్రణవి మానుకొండ హీరోయిన్ గా నటించింది. అప్పి రెడ్డి, వెంకట్ రెడ్డి, అన్నపు రెడ్డి నిర్మాతలుగా మైక్ మూవీస్ బ్యానర్ పై రూపుదిద్దుకుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందనే విషయాలు రివ్యూలో (Slum Dog Husband Movie Review)తెలుసుకుందాం...
 

కథః
లక్ష్మణ్ (సంజయ్ రావు), మౌనిక( ప్రణవి మానుకొండ) పార్సిగుట్టలో ఉండే ప్రేమ జంట. రోజూ ఫోన్లల్లోనే రొమాన్స్ చేసుకుంటుంటారు. ఇంట్లో అమ్మ తిట్టడంతో పార్క్ లో రొమాన్స్ స్టార్ట్ చేస్తారు. అక్కడ పోలీసులు వస్తారు. అలా కాదని పోలీస్‌ సలహా మేరకు ఖాళీ బస్‌లో రొమాన్స్ కి రెడీ అవుతారు. అక్కడ కూడా పోలీసుల వచ్చి లచ్చిగాడిని అరెస్ట్ చేస్తారు. చితక్కొడతారు. పెళ్లి చేసుకోవాలని పోలీసు ఇచ్చిన సలహా మేరకు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతారు. వీరి పెళ్ళికి పుట్టిన తేదీలు అడ్డంకిగా మారతాయి. వీరిద్దరికీ వారి పుట్టిన రోజులు తెలియవు. దీనితో జాతకంలో ఏమైనా దోషం ఉంటే మీరిద్దరూ పెళ్లి చేసుకోవడం వల్ల కుటుంబ సభ్యులు మరణించే అవకాశం ఉందని పంతులు హెచ్చరిస్తారు. దోషం పోవడానికి చెట్టునో, జంతువునో డమ్మీ పెళ్లి చేసుకోవాలని సలహా ఇస్తారు. దీనితో లక్ష్మణ్ తన స్నేహితుడు యాదమ్మ రాజు సలహా మేరకు ఓ కుక్కని పెళ్లి చేసుకుంటాడు. వారం తర్వాత తన ప్రియురాలిని పెళ్లి చేసుకోవాలనేది ఆలోచన. మౌనికతో పెళ్ళికి రెడీ అవ్వగా ఆ కుక్క ఓనర్ లక్ష్మణ్ పై కేసు నమోదు చేస్తాడు. తన కుక్కని పెళ్లి చేసుకుని వదిలేసి మరో అమ్మాయితో పెళ్ళికి రెడీ అవుతున్నాడు అని కేసు పెడతారు. కుక్క అయినప్పటికీ పెళ్లి చేసుకున్నావు కాబట్టి విడాకులు తీసుకుని మరో వివాహానికి సిద్ధం కావాలంటారు. ఇది కోర్ట్ దాకా వెళ్తుంది. కుక్కతో జరిగిన పెళ్లి లచ్చిగాడి జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పింది? విడాకులు ఇచ్చి తన ప్రియురాలిని సొంతం చేసుకున్నాడా ? కుక్కతో పెళ్లి అంటూ లక్ష్మణ్ పై కుట్ర చేసింది ఎవరు ? అనేది మిగిలిన కథ. Slum Dog Husband Movie Review
 


విశ్లేషణః 

`జాతిరత్నాలు`, `డీజే టిల్లు`, `మేమ్ ఫేమస్‌` వంటి సినిమాలు పెద్దగా స్టోరీ ఏం లేకుండానే కేవలం ఫన్నీ సీన్లతో సాగే మూవీస్‌. కేవలం స్క్రీన్‌ప్లే మీద, కామెడీ మీద రన్ అయి పెద్ద హిట్‌ అయ్యాయి. చిన్న కాన్సెప్ట్ ని ఫన్నీగా, ఆద్యంతం అలరించేలా తీసుకెళ్తే, ఆడియెన్స్ ని బోర్ కొట్టించకుండా ఎంటర్‌టైన్‌ చేస్తే చాలు సినిమా హిట్‌ అనే దానికి నిదర్శనంగా నిలిచిన చిత్రాలు.  అలాంటి జాబితాకి చెందినదే తాజాగా వచ్చిన `స్లమ్‌ డాగ్‌ హజ్బెండ్‌`. ఇందులో కుక్కని పెళ్లి చేసుకోవడం వల్ల హీరో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, దాన్నుంచి పడయపడేందుకు తాను చేసిన పనులేంటి, తన జీవితం ఎంతటి గందరగోళంగా మారిపోయిందనేది ఈ సినిమా కథాంశం. దాన్ని అంతే కామెడీగా, ఫన్నీవేలో తీసుకెళ్లాడు చిత్ర దర్శకుడు ఏ ఆర్‌ శ్రీధర్‌. హీరోహీరోయిన్ల మధ్య లవ్‌ ట్రాక్‌ని రొమాంటిక్‌గా చూపించారు. అదే సమయంలో బోల్డ్ గానూ తెరకెక్కించారు. సిల్లీ కామెడీతో నవ్వులు పూయించే ప్రయత్నం చేశాడు. ఆ విషయంలో సినిమా కొంత వరకు సక్సెస్‌ అయ్యిందని చెప్పొచ్చు.Slum Dog Husband Movie Review
 

ముఖ్యంగా ప్రారంభంలో హీరోహీరోయిన్ల మధ్య ఫోన్‌ కాల్‌ కన్వర్జేషన్‌ పిచ్చెక్కించేలా ఉంది. వాళ్లు మాట్లాడుకునే డబుల్‌ మీనింగ్‌ బూతు డైలాగులు కిర్రాక్‌ అనిపించేలా ఉంటాయి. వారి పాత్రలు, వారి డైలాగులు, వారి లవ్‌ అంతే క్రేజీగా ఉంటుంది. తీరని దాహంతో ఉన్న వాళ్లిద్దరు ఇంట్లో రొమాంటిక్‌గా ఫోన్లు మాట్లాడుకుంటే వాళ్ల అమ్మ చితకొడుతుంది. దీంతో పార్క్ కి వెళ్తారు, అక్కడ పోలీసులు అడ్డుకుంటారు. బస్‌ ఎక్కితే అదే అడ్డంకి ఈ క్రమంలో పుట్టే సహజమైన కామెడీ నవ్వులు పూయిస్తుంది. ఇలా కాదని పెళ్లి చేసుకోవాలనుకుంటే దోషం పేరుతో కుక్కని పెళ్లి చేసుకోవాలంటారు. కుక్కని పెళ్లి చేసుకుంటే ఊరి జనం మొత్తం నవ్వుతారు. ఈ సన్నివేశాలు ఫన్‌ వేలో తీసుకెళ్లిన తీరు బాగుంది. నవ్వులు విరిసేలా చేసింది. పాటలు, బీజీఎం సినిమాకి పెద్ద అసెట్‌గా చెప్పింది.

పెళ్లి చేసుకున్నాక విడాకుల కోసం సెకండాఫ్‌లో కోర్ట్ చుట్టూ తిరగడం, కోర్ట్ లో ఫేమస్‌ లాయర్లు సప్తగిరి, బ్రహ్మాజీ మధ్య వాదనలు, జడ్జ్ ఫిష్‌ వెంకట్‌ చిరాకులు, ఆయన ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ మరింత నవ్వించేలా చేస్తాయి. ఆ కేసు నుంచి బయటపడేందుకు హీరో చేసే కొంటె పనులు సైతం ఫన్‌ జనరేట్‌ చేస్తాయి. అయితే ఈ కామెడీ అక్కడక్కడ వర్కౌట్‌ అయ్యింది. జెన్యూన్‌గా చేసినా, తెరపై అంతగా వర్కౌట్‌ కాలేదు. హీరోహీరోయిన్ల మధ్య కర్వర్జేషన్‌ మాత్రం హైలైట్గా నిలుస్తుంది. అయితే సినిమా ఫన్‌ వేలో సాగుతూనే సమాజంలో మూడనమ్మకాలకు సంబంధించిన చేసే పనులను ప్రశ్నించేలా ఉంది. ఓ సెటైర్లు వేసేలా ఉంటుంది. ప్రజల నమ్మకాలు, ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు చేసే హడావుడు వంటి వాటిని ఫన్నీవేలో చూపించారు. చివరగా క్లైమాక్స్ ని ఎమోషనల్‌గా మార్చేశారు. మనుషులు అంతా స్వార్థంతో ఉంటారని, జంతువులే నిజంగా ప్రేమిస్తాయని, విశ్వాసంతో ఉంటాయని చెప్పిన తీరు బాగుంది. లవర్స్ మధ్య సీన్లు కూడా ఫీల్‌గుడ్‌గా అనిపిస్తాయి. కాకపోతే కథనంపై మరింత దృష్టిపెడితే ఇంకా బాగుండేది. చాలా సీన్లు చాలా సిల్లీగా అనిపిస్తాయి, లాజిక్ లెస్‌గానూ ఉంటాయి, కొన్ని చిరాకు తెప్పించే సీన్లు కూడా ఉన్నాయి.  ఫ్యామిలీ ఆడియెన్స్ కి ఎక్కడం కష్టం. కానీ మాస్‌ ఆడియెన్స్ కి, మాస్‌ టీనేజర్లకి, లవర్స్ కి బాగా నచ్చుతుంది. వారు ఖచ్చితంగా కొన్ని సీన్లకి బాగా ఎంజాయ్‌ చేస్తారు.

నటీనటులుః 
లచ్చిగాడు పాత్రలో సంజయ్‌ రావు ఫర్వాలేదనిపించాడు, ఇంకా బాగా చేయాల్సింది. తన పాత్ర స్థాయి మేరకు ఆయన నటన రీచ్‌ కాలేకపోయిన ఫీలింగ్‌ కలుగుతుంది. మౌనిక పాత్రలో ప్రణవి ఇరగ్గొట్టింది. అమ్మాయి మరింత క్రేజీగా చేసింది. ఆమె డైలాగులు, యాక్టింగ్‌ మెప్పిస్తుంది. హీరోని డామినేట్‌ చేస్తుంది. యాదమ్మ రాజు కామెడీ హైలైట్‌గా నిలుస్తుంది. వీరితోపాటు సంజయ్‌ రావు అమ్మ పాత్ర, అలాగే ప్రణవి నాన్నగా చేసిన మురళీధర్‌ గౌడ్‌ పాత్రలు మెప్పిస్తాయి. కారుమంచి రఘు చాలా గ్యాప్‌తో అలరించారు. బ్రహ్మాజీ, సప్తగిరి, ఫిష్‌ వెంకట్‌ అలరించారు. కుక్క హోనర్‌ వేణు పొలసాని సైతం మెప్పించాడు. ఆయన పాత్ర ద్వారే సినిమా కీలక మలుపు తీసుకుంటుంది. మిగిలిన నటులు సహజమైన నటనతో మెప్పించారు. Slum Dog Husband Movie Review
 

టెక్నీషియన్లుః 
దర్శకుడు ఏఆర్‌ శ్రీధర్‌.. `స్లమ్‌ డాగ్‌ హజ్బెండ్‌`తో మంచి ప్రయత్నం చేశాడు. సహజమైన కామెడీని పండించే ప్రయత్నం చేశాడు. జెన్యూన్‌ అటెంప్ట్ అని చెప్పొచ్చు. అదే సమయంలో నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా సినిమాని క్రేజీగానూ తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. ఆయన పూరీ వద్ద వర్క్ చేయడంతో ఆ ఇంపాక్ట్ ఆయనపై ఉంది, అది సినిమాల్లోనూ కనిపించింది. అదే సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. కాకపోతే కామెడీ విషయంలో ఇంకా వర్క్ చేయాల్సింది. చాలా చోట్ల బలవంతమైన సీన్లు పెట్టిన ఫీలింగ్ అవుతుంది. అది బలవంతపు కామెడీకి దారితీసింది. కెమెరా వర్క్ బాగుంది. రిచ్‌గా ఉంది. ఎడిటింగ్‌ ఫర్వాలేదు. నిడివి రెండు గంటలే కావడం సినిమాకి కలిసొచ్చే అంశం. ఇక మ్యూజిక్‌ సినిమాకి పెద్ద అసెట్‌. మాస్‌ బీట్స్ అదిరిపోయాయి. థియేటర్లలో మారుమోగిపోయాయి. ఇకపై ప్రతి పెళ్లిలోనూ అవి మారుమోగుతాయి. రెట్రో సాంగ్‌ మరో హైలైట్‌ అవుతుంది. భీమ్స్ సిసిరోలియో బీజీఎం దుమ్ములేపింది. పాటలు, బీజీఎంలో తన బెస్ట్ ఇచ్చాడు భీమ్స్. నిర్మాణ విలువులు బాగున్నాయి. ఈ సినిమాకి తమ బెస్ట్ ఖర్చు చేశారు. Slum Dog Husband Movie Review
 

ఫైనల్‌గాః ఒక సెక్షన్‌ యూత్‌, మాస్‌ ఆడియెన్స్ ఎంజాయ్‌ చేసే మూవీ. 

రేటింగ్‌ః 2.5

నటీనటులు : సంజయ్ రావు, ప్రణవి మానుకొండ, బ్రహ్మాజీ, సప్తగిరి, 'ఫిష్' వెంకట్,  మురళీధర్ గౌడ్, వేణు పొలసాని తదితరులు
ఛాయాగ్రహణం : శ్రీనివాస్ జె రెడ్డి
సంగీతం :  భీమ్స్ సిసిరోలియో
సహ నిర్మాతలు : చింతా మెర్వాన్, సీహెచ్ చైతన్య పెన్మత్స, నిహార్ దేవెళ్ల
నిర్మాత : అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి
రచన, దర్శకత్వం : ఏఆర్ శ్రీధర్
 

Latest Videos

click me!