
ధనుష్.. ఇప్పుడు కోలీవుడ్ హీరో మాత్రమే కాదు, టాలీవుడ్ హీరోగానూ నిలబడుతున్నాడు. `సార్`, `కుబేర`తో ధనుష్‌కి తెలుగులో మంచి మార్కెట్, ఫాలోయింగ్ ఏర్పడింది. ఆయన ప్రతి సినిమా తెలుగులోనూ రిలీజ్ అవుతుంటుంది. ఇప్పుడు ఆయన `కర` అనే చిత్రంలో నటించారు. విఘ్నేష్ రాజా దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. మమితా బైజు హీరోయిన్‌గా నటించింది. కేఎస్ రవికుమార్, సూరజ్ వింజరమూడు వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్పై ఇషరి కె గణేష్ నిర్మించారు. దీన్ని విఘ్నేశ్వర ఎంటర్టైన్‌మెంట్స్ పతాకంపై సీహెచ్ సతీష్ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం నేడు గురువారం(ఏప్రిల్ 30)న విడుదలైంది. మరి మరోసారి ధనుష్‌కి హిట్ పడిందా? మూవీ ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం.
కరస్వామి(ధనుష్) ఒక దొంగ. టౌన్‌లో ఓ ఎమ్మెల్యే ఇంట్లో దొంగతనానికి పాల్పడి దొరికిపోతాడు. దీంతో పోలీసులు అరెస్ట్ చేసి చితకబాదుతారు. ఈ కేసుని డీఎస్‌పీ ప్రభాకరన్(సూరజ్ వింజరమూడు) డీల్ చేస్తాడు. తాను దొంగని పట్టుకున్నట్టుగా క్రెడిట్ కొట్టేయాలని ప్లాన్ చేస్తుంటాడు. కానీ స్టేషన్‌లోనే ఆ డీఎస్‌పీని కొట్టి పారిపోతాడు కరస్వామి. ఇక దొంగతనాలు చేయోద్దని నిర్ణయించుకుని ఇంటికెళ్లి తన భార్య సెల్లి (మమితా బైజు)తో కలిసి ఓ హోటల్‌లో పనిచేస్తుంటాడు. కానీ చాలీచాలని జీతంతో ఇళ్లు గడవడం కష్టమవుతుంది. దీంతో సొంతంగా మెస్ పెట్టాలనుకుంటారు. కానీ బ్యాంక్ వాళ్లు లోన్ ఇవ్వరు. లోన్ కావాలంటే భూమిపట్టా కావాలని అడగ్గా, ఆ పట్టా పేపర్స్ కోసం తన సొంతూరు వస్తాడు. తండ్రి కందస్వామి (కేఎస్ రవికుమార్) కొడుకుని చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు. అన్నీ మర్చిపోయి కొడుకుని చేరదీస్తాడు. కానీ భూమి అమ్మాలని ఫోర్స్ చేయగా, ఆ పేపర్స్ బ్యాంక్‌లో ఉన్నాయని, వాటిని తాకట్టు పెట్టి ట్రాక్టర్ లోన్ తీసుకున్నానని చెబుతాడు. యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్ షార్టేజ్ వచ్చి అవి పడా ఉంటాయి. పంటలు పండకపోవడంతో లోన్ కట్టలేరు. దీంతో భూమి జప్తు చేస్తారు. ఆ టైమ్‌లోనే కరస్వామి ఇచ్చిన షాక్‌కి కందస్వామి కన్నుమూస్తాడు. ఆయన్ని తమ భూమిలో సమాధి చేయడానికి బ్యాంక్‌లు ఒప్పుకోవు. అప్పుకడితేనే ఆ భూమిలో అంత్యక్రియలు నిర్వహించాలని కండీషన్ పెడతాయి. మరి ఆ లోన్ కట్టేందుకు కరస్వామి ఏం చేశాడు? రైతు బ్యాంకులు ఎలా మోసం చేస్తున్నాయి? బ్యాంక్‌లపై కరస్వామి చేసిన తిరుగుబాటు ఏంటి? అందులో సక్సెస్ అయ్యాడా? కరస్వామి లోన్ కట్టాడా? తండ్రిని తన భూమిలో అంత్యక్రియలు నిర్వహించాడా? ఈ సినిమాలో చూపించిన నిజాలేంటి? అనేది మిగిలిన కథ.
రైతుల సమస్యల నేపథ్యంలో రూపొందిన ఎమోషనల్ డ్రామా `కర`. బ్యాంకులు చేసే మోసాలను ఆధారంగా చేసుకుని దీన్ని రూపొందించారు. ప్రస్తుతం ఎంతో మంది రైతులను, అమాయకులను బ్యాంక్‌లు చేసే మోసాలను కళ్లకి కట్టినట్టు చూపించారు. ప్రధానంగా ట్రాక్టర్ లోన్స్ పేరుతో జరిగే మోసాలను ఇందులో ఆవిష్కరించారు. కానీ అటు ఇటుగా అన్ని రకాల లోన్లకి ఇలానే జరుగుతుందనేది నిజం. ఈ విషయంలో దర్శకుడు విఘ్నేష్ రాజాని అభినందించాల్సిందే. సినిమా మొదట దొంగతనం సీన్లతో ప్రారంభమవుతుంది. దొంగతనం చేసే అంశాలు, పోలీసు స్టేషన్ సీన్లు ఆకట్టుకుంటాయి. ఆ తర్వాత హీరో తన భార్యతో కలసి హోటల్‌లో పనిచేయడం, వారి దారుణమైన పరిస్థితిని ఆవిష్కరించిన తీరు బాగుంది. ఎమోషనల్‌గా ఉంటుంది. పేదవాళ్ల జీవితాలు ఎలా ఉంటాయనేది కళ్లకి కట్టినట్టు ఆవిష్కరించారు. ఆ తర్వాత హీరో సొంతూరు వెళ్లి పేరెంట్స్ ని కలిసినప్పుడు వచ్చే ఎమోషనల్ సీన్లు ఆద్యంతం భావోద్వేగానికి గురి చేస్తాయి. ఊర్లో రైతుల దీన పరిస్థితి, బ్యాంకుల అప్పులు, పంట నష్టం వంటి సీన్లు మన రియల్ లైఫ్ జీవితాలను కళ్ల ముందు కనిపించినట్టుగా ఉంటుంది. ఫస్టాఫ్ చాలా టైట్ స్క్రీన్ ప్లేతో సాగుతుంది. తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్స్ ఆద్యంతం కట్టిపడేస్తాయి. తండ్రి మరణంతో కొడుకు పడే వేదన, తన భూమిలోనే తండ్రిని పూడ్చలేని పరిస్థితి, బ్యాంకులు చేసే అన్యాయం ఎమోషనల్‌గా ఉంటాయి. ఇంటర్వెల్ హీటెక్కించేలా, ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్‌లో బ్యాంక్ లోన్ తీర్చడానికి హీరో పడే తపన, బాధ, అందుకోసం మళ్లీ ఆయన దొంగగా మారడం, ఈ క్రమంలో చోటు చేసుకునే పరిణామాలు ఉత్కంఠగా సాగుతాయి. నెక్ట్స్ ఏం జరుగుతుందనే ఆసక్తిని పెంచుతుంది. బ్యాంక్‌లకు, పోలీసులకు, హీరోకి మధ్య టామ్ అండ్ జెర్రీలా సాగే సీన్లు ఆద్యంతం రసవత్తరంగా ఉంటాయి. బ్యాంక్ రాబరీ సీన్లు సీట్ ఎడ్జ్ లా సాగుతాయి. క్లైమాక్స్ మరింత ఉత్కంఠకు గురిచేస్తుంది. అందులోనే కొన్ని ట్విస్ట్ లు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ ముగింపు బాగుంది. సినిమాలో ట్రాక్టర్ లోన్లు, విలన్ చివరికి ట్రాక్టర్ యాక్సిడెంట్‌తోనే చనిపోవడం, అదే సమయంలో మూవీలో కమల్ హాసన్ `తేవర్ మగన్` రిఫరెన్స్ సీన్లు, బ్యాంక్ లోన్లకి సంబంధించిన కొత్త యాంగిల్‌ని చూపించిన తీరు బాగుంది.
సినిమా స్లోగా సాగుతుంది. కథలో ఇంటెన్సిటీని, ఎమోషన్స్ ని క్యారీ చేయడం కోసం స్లోగా నడిపించినట్టు ఉంటుంది. బ్యాంక్ రాబరీ సీన్లు రిపీట్‌గా అనిపిస్తాయి. కథ అక్కడక్కడే తిరిగినట్టుగా ఉంటుంది. కథ సీరియస్‌గా సాగడంతో డ్రై ఫీల్ తెప్పిస్తుంది. పోలీసుల విచారణ కూడా లాజిక్ లెస్‌గా ఉంటుంది. అంతగా ఆకట్టుకోలేదు. కొన్ని సీన్లు ఊహించేలా ఉంటాయి. రైతుల సమస్యలకు సంబంధించి మరింత బాగా చూపించాల్సింది. అందులోని ఎమోషన్స్ ని బలంగా చూపిస్తే ఇంకా బాగుండేది.
కరస్వామిగా ధనుష్ అదరగొట్టాడు. సినిమా ప్రారంభం నుంచే ఆయన పాత్రలో జీవించారు. మనకు ఎక్కడా ధనుష్ కనిపించడు. అంతే సహజంగా, అంతే బాగా చేసి మెప్పించాడు. దొంగగా చాలా ఇంటెన్స్, ఎమోషన్స్ ఉన్న పాత్రలో అదరగొట్టాడు ధనుష్. ఆయన భార్య పాత్రలో మమితా బైజు డీ గ్లామర్ లుక్‌లో కనిపించింది. రియాలిటీకి దగ్గరగా ఆమె పాత్ర ఉంది, ఉన్నంతసేపు అందరి దృష్టి తనవైపు తిప్పుకుంది. తండ్రి కందస్వామి పాత్రలో కేఎస్ రవికుమార్ నటన అదిరిపోయింది. ఆయన పాత్రలోని ఎమోషన్స్ కదిలిస్తాయి. ఎమోషన్స్ కి గురి చేస్తాయి. పోలీస్ ఆఫీర్‌గా సూరజ్ వింజరమూడు అదరగొట్టారు. ప్రారంభంలో ఆయన పాత్ర సీరియస్‌గా ఉంటుంది. తర్వాత కొంత ఫన్నీగా ఉంటుంది. బ్యాంక్ మేనేజర్ గా జయరాం అదరగొట్టారు. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయి.
థెని ఈశ్వర్ కెమెరా వర్క్ బాగుంది. విజువల్‌గా 1990ని తలపించేలా ఉంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం ఫర్వాలేదు. బీజీఎం ఆకట్టుకునేలా ఉంది. శ్రీజిత్ సారంగ్ ఎడిటింగ్ ఇంకా షార్ప్ చేయాల్సింది. దర్శకుడు విఘ్నేష్ రాజా ఎంచుకున్న కథ బాగుంది. దాన్ని అంతే ఎమోషనల్‌గా, అంతే ఎంగేజింగ్‌గా తెరకెక్కించారు. బ్యాంక్ లోన్ల విషయంలో జరిగే అన్యాయాలకు సంబంధించిన అంశాలను కళ్లకి కట్టినట్టు చూపించారు. ముల్లుని ముల్లుతోనే తీయాలనే కాన్సెప్ట్ బాగుంది. ఇంకా షార్ప్ గా, ఎంగేజింగ్‌గా, ఎమోషనల్‌గా తీసుకెళ్తే సినిమా అదిరిపోయేది. కానీ అందరు తెలుసుకోవాల్సిన అంశాలు ఇందులో చాలా ఉన్నాయి. ఒక సామాజిక స్పృహ కలిగిన మూవీ `కర` అని చెప్పొచ్చు.
రైతు సమస్యలు, లోన్ల పేరుతో బ్యాంకులు చేసే అన్యాయాలను కళ్లకి కట్టినట్టు చూపించిన మూవీ `కర`. మంచి ఎమోషనల్ డ్రామా.
రేటింగ్: 3