Idli Kottu Movie Review: ఇడ్లీ కొట్టు మూవీ రివ్యూ, రేటింగ్‌.. ధనుష్‌ దర్శకుడిగా సక్సెస్ అయ్యాడా?

Published : Oct 01, 2025, 02:15 PM IST

Idli Kottu Movie Review: ధనుష్‌, నిత్యా మీనన్‌ జంటగా నటించిన `ఇడ్లీ కొట్టు` మూవీ నేడు బుధవారం విడుదలైంది. ధనుష్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆడియెన్స్ ని ఆకట్టుకుందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

PREV
17
`ఇడ్లీ కొట్టు` మూవీ రివ్యూ, రేటింగ్‌

ధనుష్‌ చివరగా `కుబేర` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఈచిత్రం డీసెంట్‌ హిట్‌ని అందుకుంది. ఆ తర్వాత ఇప్పుడు `ఇడ్లీ కొట్టు` అనే చిత్రంతో రాబోతున్నారు. తమిళంలో రూపొందిన `ఇడ్లి కడై` అనే చిత్రానికిది తెలుగు అనువాదం. ఇందులో ధనుష్‌కి జోడీగా నిత్యా మీనన్‌, షాలినీ పాండే నటించారు. అయితే ఈ చిత్రానికి ధనుష్‌ దర్శకుడు కావడం విశేషం. ఇందులో మనకు తెలిసిన అరుణ్‌ విజయ్‌, సముద్రఖని, సత్యరాజ్‌, రాజ్‌ కిరణ్‌, పార్థిబన్‌ వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని డాన్‌ పిక్చర్స్, వండర్‌ బార్‌ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. ధనుష్‌ కూడా ఓ నిర్మాత. దసరా కానుకగా ఈ చిత్రం ఒక్క రోజు ముందుగానే నేడు బుధవారం( అక్టోబర్‌ 1న) విడుదల అయ్యింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో సినిమా ఆకట్టుకునేలా ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. ఈ మూవీని హైదరాబాద్‌లోని ఏఏఏ థియేటర్‌లో వీక్షించాను. తమిళ మూవీ కావడం, పెద్దగా ప్రమోషన్స్ లేకపోవడంతో బజ్‌ లేదు. థియేటర్‌ వద్ద పెద్దగా సందడి లేదు. మరి సినిమా అయినా ఆకట్టుకుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

27
`ఇడ్లీ కొట్టు` మూవీ కథ ఏంటంటే?

ఒక విలేజ్‌లో శివ కేశవ(రాజ్‌ కిరణ్‌) తన ఇడ్లీ కొట్టుని నమ్ముకుని బతుకుతుంటాడు. ఆ ఊర్లో ఇడ్లీ టేస్ట్ జిల్లాలోనే ఫేమస్‌. ఎంతో భక్తితో, ప్రేమతో తన ఇడ్లీ కొట్టుని నడిపిస్తుంటారు శివ కేశవ. ఆయన కొడుకు మురళీ(ధనుష్‌) తండ్రి అడుగుజాడల్లోనే పెరుగుతాడు. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చేస్తాడు. సాంప్రదాయ పద్ధతిలో టిఫిన్స్ చేయడం రిస్క్ తో కూడిన పని అని, మెషిన్స్ తో ఇడ్లీ చేయాలంటాడు. కానీ వాటితో చేస్తే మనుషులతో చేసిన టేస్ట్ రాదు. తాను స్వయంగా పిండిరుబ్బి చేస్తేనే ఆ రుచి వస్తుందని శివ కేశవ నమ్ముతాడు. ఆ మెషిన్లతో ఇడ్లీని చేయడం, బిజినెస్‌ని విస్తరించడం వద్దని చెబుతాడు. దీంతో తాను ఇక్కడ ఉండి ఎదగలేనని భావించిన మురళీ పట్నం వెళ్తాడు. అనేక కంపెనీల్లో పనిచేస్తూ చేస్తూ, చివరికి బ్యాంకాక్‌ బేస్డ్ స్టార్‌ హోటల్‌లో మేనేజర్‌గా పనిచేస్తుంటాడు. ఆ కంపెనీ హెడ్‌ విష్ణువర్థన్‌(సత్యరాజ్‌) కూతురు మీరా(షాలినీ పాండే)ని ప్రేమిస్తాడు. ఈ ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ముహూర్తం కూడా ఫిక్స్ అవుతుంది. గెస్ట్ అందరికి ఇన్వెటేషన్‌ పంపిస్తారు. పెళ్లికి ఇంకా కొన్ని రోజులే ఉంటుంది. ఓ రోజు సడెన్‌గా ఊరు నుంచి తండ్రి చనిపోయినట్టు మురళీకి ఫోన్‌ వస్తుంది. దీంతో వెంటనే ఊరికి వస్తాడు. తండ్రి కార్యక్రమాలు పూర్తి చేసి అన్ని సర్దుబాటు చేసి మళ్లీ బ్యాంకాక్‌ వెళ్లాలని భావించే క్రమంలోనే తల్లి కూడా చనిపోతుంది. దీంతో మరింతగా కుంగిపోతాడు మురళీ. తండ్రి జ్ఞాపకాలు వెంటాడుతుంటాయి. ఓ వైపు పెళ్లి టైమ్‌ దగ్గరపడుతుంది. మీరా ఒత్తిడి తెస్తుంటుంది. ఇంకోవైపు ఇడ్లీ కొట్టు వదిలి వెళ్లొద్దనే తండ్రి జ్ఞాపకాలతో సతమతవుతుంటాడు. అతనికి మరదలు కళ్యాణి(నిత్యా మీనన్‌) ఉంటుంది. ఆమె మురళీ చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు. అప్పట్లోనే వీరిద్దరికి లవ్‌ ట్రాక్‌ కూడా ఉంటుంది. మురళీ ఇంటిని విడిచి వెళ్లొద్దని మనసులో అనుకుంటుంది. మీరా ఫ్యామిలీ నుంచి ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో వారికి నో చెబుతాడు. పెళ్లి వాయిదా వేయమంటాడు మురళీ. దీంతో మండిపోయిన విష్ణువర్థన్‌ కొడుకు అశ్విన్‌(అరుణ్‌ విజయ్‌) చెల్లి, తండ్రి బాధని చూడలేక మురళీ అంతు చూడాలని ఇండియా వస్తాడు. మరి అశ్విన్‌ ని మురళీ ఎలా ఎదుర్కొన్నాడు? విష్ణువర్థన్‌ ఫ్యామిలీతో సహా ఎందుకు మురళీ ఇంటికి రావాల్సి వచ్చింది? వీరి మధ్య గొడవ ఎలాంటి పరిణామాలకు దారితీసింది. మురళీ ప్రియురాలి కోసం తన ఫ్యామిలీకి, ఊరికి సెంటిమెంట్‌ అయిన ఇడ్లీ కొట్టుని వదిలేశాడా? లేక ప్రియురాలిని వదిలేశాడా? ఆ తర్వాత ఈ కథ ఎలాంటి మలుపులు తీసుకుందనేది మిగిలిన సినిమా.

37
ఇడ్లీ కొట్టు మూవీ విశ్లేషణ

మనకు పూర్వీకుల నుంచి వచ్చే వృత్తి, సాంప్రదాయపనులపై ఒక సెంటిమెంట్‌ ఉంటుంది. వాటిని వదల్లేము. అందులో తెలియని ఆనందం, ఎమోషన్‌ ఉంటుంది. ఓ రకంగా అవి మన రూట్స్ ని గుర్తు చేస్తుంటాయి. అలాంటి చిత్రమే `ఇడ్లీకొట్టు`. తాతల కాలం నుంచి హీరో కుటుంబానికి సెంటిమెంట్‌గా వస్తోన్న ఇడ్లీ కొట్టు చుట్టూ తిరిగే కథ ఇది. మనిషిగా ఎదగడం కోసం పట్నాలకు వెళ్లి, ఒకరి వద్ద ఉద్యోగం చేస్తూ, మనల్ని మనం మర్చిపోతూ ఒకరి బాగు కోసం మనం పరుగులు పెట్టే ఈ కాలంలో మనకు నచ్చిన, మనసుకి ఆనందాన్ని కలిగించే పనులు చేయాలని, కన్న ఊరిని, నమ్ముకున్న వృత్తిని వదిలేయవద్దని చెప్పే చిత్రం. కథగా ఇది మంచి సెంటిమెంట్‌, ఎమోషన్స్ ఉన్న స్టోరీ. దర్శకుడు, హీరో ధనుష్‌ అప్పుడప్పుడు పుట్టిన ఊరికి వెళ్లినప్పుడు తాను చూసిన రియలిస్టిక్‌ అంశాలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. సినిమాని ఆద్యంతం భావోద్వేగభరింతంగా తెరకెక్కించారు. ప్రారంభంలో తమ ఇడ్లీ కొట్టు నేపథ్యాన్ని, దాని కోసం తండ్రి పడే శ్రమని, అందులోనే ఆయన పొందే సంతృప్తిని ఎస్లాబ్లిష్‌ చేశారు. కొడుకు తమ వ్యాపారాన్ని విస్తరించాలని, తమకు ఉన్న పేరుని వాడుకుని ఎదగాలని ప్రయత్నిస్తే, తండ్రి మాత్రం తమకు సెంటిమెంట్‌గా భావించే పని అని, తాను చేస్తేనే అందులో సంతృప్తి అని, కానీ తమ పేరుని వాడుకుని వ్యాపారం చేయడాన్ని ఆయన ఒప్పుకోకపోవడం, ఈ క్రమంలో అటు తండ్రికి, ఇటు కొడుక్కి మధ్య సంఘర్షణని ఆవిష్కరించారు. అదే సమయంలో ఊరిని వదిలి పట్నం వెళ్లి ఓ స్టార్‌ హోటల్‌లో మేనేజర్‌గా చేస్తూ, హోనర్స్ కింద పనివాడిలా బతుకుతూ తనని తాను కోల్పోయిన హీరో మనస్తత్వాన్ని ఆవిష్కరించారు. మనసులో తెలియని వెలితితోనే పెళ్లికి ఒప్పుకోవడం వంటివి హీరో పాత్రలోని సంఘర్షణని తెలియజేస్తుంది. అదే సమయంలో తల్లిదండ్రుల మరణంతో ఆయనలో కలిగిన బాధని, వారిని చూసుకోలేకపోయామనే ఎమోషన్స్ తో ఫస్టాఫ్‌ అంతా సాగుతుంది. తమని అవమానించాడని, అందరిలో తమ పరువు తీశాడని రగిలిపోయే కార్పొరేట్‌ వాళ్ల మనస్తత్వాలను ఇందులో చూపించారు. సెకండాఫ్‌ లో హీరో, విలన్‌ మధ్య గొడవల చుట్టూ సాగుతుంది. ఈగోలు, అసూయలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయనేది, ఎంత పెద్దవాడినైనా ఎలా దిగజారేలా చేస్తాయనేది ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.

47
ఇడ్లీ కొట్టులో హైలైట్స్, మైనస్‌లు

సినిమాలో మెయిన్‌గా మన సంప్రదాయమైన వృత్తులను, సెంటిమెంట్లని మర్చిపోకూడదని చెప్పే ప్రయత్నం చేశారు. ఎమోషనల్‌గా బాగా ఆవిష్కరించారు. ప్రారంభంలో తన ఇడ్లీ కొట్టు కోసం తండ్రి పడే బాధని, కష్టాన్ని, అందులోనే ఆయన సంతోషాన్ని ఎమోషనల్‌గా చూపించిన తీరు బాగుంది. ఇక పేరెంట్స్ చనిపోయినప్పుడు హీరోపడే బాధ సైతం ఎమోషనల్‌గా ఉంటుంది. మధ్య మధ్యలో చిన్న చిన్న కామెడీతో సీరియస్‌గా సాగే సీన్ల నుంచి కొంత రిలీఫ్‌నిచ్చారు. హీరోకి, హీరోయిన్‌ అన్నతో గొడవని క్రియేట్‌ చేసి కథలో కాన్‌ఫ్లిక్ట్ ని ఎస్టాబ్లిష్‌ చేసే ప్రయత్నం బాగుంది. మెయిన్‌గా ఎమోషనల్‌గా సినిమాని తెరకెక్కించిన తీరు బాగుంది. నిత్యా మీనన్‌తో ధనుష్‌ సీన్లు ఆకట్టుకుంటాయి. విలేజ్‌కి సంబంధించిన మనుషులు, వారి ప్రేమలను ఆవిష్కరించిన తీరు బాగుంది.

సినిమా మెయిన్‌గా భావోద్వేగాల సమాహారంగా తెరకెక్కించిన ఆ ఎమోషన్స్ అన్ని సందర్భాల్లో క్యారీ కాలేదు. దీంతో సినిమా డ్రైగా సాగుతుంది. విలేజ్‌లో, ఇడ్లీలు చేసే సమయంలోనూ ఫన్‌కి స్కోప్‌ ఉన్నా, దాన్ని సరిగా వాడుకోలేకపోయారు. దీంతో ఆయా సీన్లు తేలిపోయాయి. కథగా ఇది చాలా చిన్న పాయింట్‌. ఎంతసేపు ఆ ఇడ్లీకొట్టు, తండ్రి సెంటిమెంట్‌ అనేదాని చుట్టే తిప్పడంతో అది ఎక్కువ సేపు ఎంగేజ్‌ చేయలేకపోయింది. మరోవైపు విలన్‌ కి సంబంధించిన అవమానాలను ఎస్లాబ్లిష్‌ చేయలేదు. దీంతో వారి పెయిన్‌ అనేది కనెక్ట్ కాలేదు. ఆయా సీన్లు తేలిపోయాయి. కమర్షియాలిటీ కోసం క్రియేట్‌ చేసినట్టుగానే ఉందికానీ, వాటిలో జీవం లేదు. హీరో వదిలేయాలనుకున్నా, విలన్‌ అతన్ని వెంటాడాలనుకోవడం, ఈగో సమస్య అనేది కూడా బలంగా చూపించలేకపోయారు. సినిమా నెక్ట్స్ ఏం జరగబోతుందనేది అర్థమయ్యేలా ఉంది. ఒక సీన్‌ తర్వాత మరో సీన్‌ పేర్చుకుంటూ వెళ్లినట్టుగా ఉంది. ఒక ఫార్మాట్‌ని ఫాలో అయినట్టుగా ఉంది. సెకండాఫ్‌ ఒడిదొడుకులకు లోనయ్యింది. క్లైమాక్స్ కూడా సింపుల్‌గా తేల్చేశారు. అక్కడ ఓ వైపు సముద్రఖని పాత్రతో, మరోవైపు అరుణ్‌ విజయ్‌ పాత్రతో సంఘర్షణని తీవ్రం చేయాలనుకున్నా, ఆ స్థాయి భావోద్వేగాలు పండలేదు. దీంతో క్లైమాక్స్ తేలిపోయింది. సినిమా కథ చిన్న పాయింట్‌, దాన్ని రెండున్నగంటలపాటు లాగే ప్రయత్నం కొంత బోర్‌ ఫీలింగ్‌ని తెప్పిస్తుంది. అదే సమయంలో సినిమాలో ఎగ్జైటింగ్‌ సీన్లు లేవు. వాహ్‌ ఫ్యాక్టర్స్ లేవు. ఓపికతో చూడాల్సిన పరిస్థితి వస్తుంది. థియేటర్‌ ఎక్స్ పీరియెన్స్ ఇవ్వగలిగే అంశాలు `ఇడ్లీ కొట్టు`లో లేకపోవడం గమనార్హం. ఓటీటీలో చూడదగ్గ మూవీ.

57
ఇడ్లీ కొట్టు మూవీలో నటీనటుల పర్‌ఫెర్మెన్స్

మురళీ పాత్రలో ధనుష్‌ ఒదిగిపోయారు. ఇంకా చెప్పాలంటే జీవించాడు. చాలా సెటిల్డ్ గా నటించాడు. మరీ హీరోయిజానికి పోకుండా ఆయన సెటిల్డ్ గా చేసిన తీరు బాగుంది. ఆయనే సినిమాకి ప్రధాన బలం. కాకపోతే ఆయన పాత్రలోని ఎమోషన్స్ ఆశించిన స్థాయిలో పండకపోవడమే మైనస్‌. ఇక తండ్రి పాత్రలో రాజ్‌ కిరణ్‌ బాగా చేశారు. ఆయన పాత్రలోని ఎమోషన్స్ ని బాగా వర్కౌట్‌ అయ్యాయి. సినిమాకి ఆయన మరో బలం అని చెప్పొచ్చు. కళ్యాణిగా నిత్యా మీనన్‌ పాత్రలో జీవించింది. ఆద్యంతం కట్టిపడేసింది. విలేజ్‌ లో ఉండే అమ్మాయిగా అదరగొట్టింది. ఆ గడుసు, ఆ ప్రేమ, ఆ గయ్యాలితనం బాగా చూపించి ఆకట్టుకుంది. మీరాగా షాలినీ పాండే ఉన్నంతలో బాగానే చేసింది. విష్ణువర్థన్‌ పాత్రలో సత్యరాజ్‌ సైతం ఆకట్టుకున్నారు. ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన కొడుకుగా నెగటివ్‌ రోల్‌లో అరుణ్‌ విజయ్‌ బాగా చేశాడు. యాప్ట్ గా అనిపించాడు. కాకపోతే ఆయన పాత్రని సరిగ్గా మలచలేకపోయారు. సముద్రఖని పాత్ర కూడా కాసేపు అలరిస్తుంది. పోలీస్‌ అధికారిగా పార్థిబన్‌ అదరగొట్టారు. ఆయన పాత్రలోని షేడ్స్ ఆకట్టుకుంటాయి. మిగిలిన పాత్రధారులు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారని చెప్పొచ్చు.

67
ఇడ్లీ కొట్టులో టెక్నీషియన్ల పనితీరు

సినిమాకి జీవి ప్రకాష్‌ కుమార్‌ అందించిన సంగీతం బాగుంది. పాటలు అలరించేలా ఉన్నాయి. బీజీఎం కూల్‌గా ఉంది. మధ్య మధ్యలో తన ప్రభావం చూపించే ప్రయత్నం చేశారు. కాకపోతే సీన్లు బలంగా లేకపోవడంతో ఆర్‌ఆర్‌ ప్రభావం కనిపించలేదు. కిరణ్‌ కౌశిక్‌ కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ కూల్‌గా ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రసన్న జీకే ఎడిటింగ్‌ ఫర్వాలేదు. అయితే సీన్లు చాలా చోట్ల కట్‌ కట్‌ గా ఉన్నాయి. దీంతో సన్నివేశాల మధ్య ఎమోషన్స్ క్యారీ కాలేకపోయింది. నిర్మాణ విలువలకు కొదవలేదు. దర్శకుడు ధనుష్‌ విలేజ్‌ స్థాయిలో భావోద్వేగాలను, అక్కడి మనుషులు ఎమోషన్స్ ని ఆవిష్కరించే ప్రయత్నం అభినందనీయం. ఇడ్లీకొట్టు అనేది చాలా మందికి ఒక ఎమోషన్. అలాగే ఏ వృత్తిలో ఉన్న వారికి ఆయా వృత్తి, ఆ ఊరు ఎమోషన్‌. మనం ఎక్కడికి వెళ్లినా అది వెంటాడుతూనే ఉంటుంది. ఇందులో ఆ ఎమోషన్‌ కొంత వరకే క్యారీ అయ్యింది. చాలా చోట్ల మిస్‌ ఫైర్‌ అయ్యింది. రాజ్‌ కిరణ్‌ పాత్ర వరకు ఆ ఎమోషన్‌ పండింది. ధనుష్‌ కి అది అంతగా క్యారీ కాలేకపోయింది. అదే ఇందులో మైనస్‌. అది పండితే మంచి ఎమోషనల్‌ రోలర్‌ కోస్టర్‌గా ఈ మూవీ ఉండేది.

77
ఫైనల్‌ నోట్‌

`ఇడ్లీ కొట్టు` ఎమోషనల్‌గా మిస్‌ ఫైర్‌. 

రేటింగ్‌ః 2.25

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories