చిత్ర పరిశ్రమలోకి ఎప్పుడూ కొత్త టాలెంట్ వస్తూనే ఉంటుంది. కొత్తగా హీరోహీరో్యిన్ల నుంచి దర్శకుడు, టెక్నీషియన్ల వరకు వస్తూ తమ ప్రతిభని చాటుకుంటారు. అలాగే `కలియగం పట్టణంలో` చిత్రంతో కొత్త టాలెంట్ టాలీవుడ్‌కి పరిచయం అయ్యింది. విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన `కలియుగం పట్టణంలో` సినిమాకి రమాకాంత్ రెడ్డి దర్శకత్వం వహించడం విశేషం. నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ పతాకాలపై డాక్టర్ కందుల చంద్ర ఓబుల్‌రెడ్డి, జీ మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌లు నిర్మించారు. ఈ చిత్రం నేడు శుక్రవారం(మార్చి 29)న విడుదల అయ్యింది. మరి సినిమా ఎలా ఉందో, ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథః
నంద్యాలలో విజయ్, సాగర్(విశ్వ కార్తికేయ) కవల పిల్లలు. ఇందులో విజయ్ చాలా అమాయకుడు. రక్తం చూస్తేనే భయపడిపోతాడు. కానీ సాగర్ మాత్రం రక్తాన్ని ఇష్టపడుతుంటాడు. ఒక సైకోలా మారతాడు. తన కొడుకు ఇలా కావడాన్ని వారి తల్లిదండ్రులు మోహన్(దేవి ప్రసాద్), కల్పన(రూప లక్ష్మి) బాధపడతారు. సాగర్ వల్ల చాలా సమస్యలు వస్తాయని భావించి మెంటల్ ఆసుపత్రిలో చేర్పిస్తారు. విజయ్‌లోని మంచితనం చూసి తాను చదువుకునే కాలేజీలోని శ్రావణి(ఆయుషి పటేల్) అనే అమ్మాయి అతన్ని ఇష్టపడుతుంది. అయితే ఆమెలో మరో కోణం ఉంటుంది. ఆడవారిని వేధించే అబ్బాయిలంటే కోపం, వారిని అంతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తుంది. బయటకు మంచిగా ఉంటూనే కామాందులు, భార్యలను హింసలకు గురి చేసే వారిని గుర్తించి చంపేస్తుంది. నంద్యాలలో ఇలాంటి మర్దర్ కేసులు అవుతుండటంలో పోలీసులు రంగంలోకి దిగుతారు. పవర్ ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ పులి(చిత్రా శుక్లా) నంద్యాలలోకి వచ్చిన శ్రావణి ఇంట్లోకి వస్తుంది. ఈ ఇద్దరు బంధువులు. శ్రావణికి పిన్నినే పులి. పులి ఇన్వెస్టిగేషన్‌లో పలు షాకింగ్ విషయాలు తెలుస్తాయి. డ్రగ్స్ రాకెట్ బయటపడుతుంది. ఆ మాఫియాకి కారకులు ఎవరు? విజయ్, సాగర్‌లో ఎవరు మంచి వారు, ఎవరు సైకో, పట్టణంలో జరిగే హత్యలకు దీనికి కారణం ఏంటి? అలాగే ఎంతో మంది ఆడపిల్లలు ప్రెగ్నెంట్ కావడానికి కారకులు ఎవరు? దానికి కారణం ఏంటి? అనేది మిగిలిన కథ.
విశ్లేషణః
సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ కి ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్న సేపు థ్రిల్ చేసే అంశాలు, ఆ సస్పెన్స్, యాక్షన్ సీన్లు ఆకట్టుకునేలా ఉంటే సరిపోతుంది. ట్విస్ట్ లు సరిగ్గా పేలితే సినిమా హిట్టే, సస్పెన్స్, ట్విస్ట్ లు బాగా వర్కౌట్ చేసుకుంటే సినిమా మంచి ఆదరణ పొందుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చాలా వరకు ఇది సేఫ్ గేమ్ కూడా. ఇలాంటి మూవీస్‌లో కథ ముఖ్యం కాదు, స్క్రీన్‌ప్లేనే మెయిన్. అక్కడే దర్శకుడి టాలెంట్ ఏంటో బయటపడుతుంది. విషయం ఉందా లేదో తెలుస్తుంది. `కలియుగం పట్టణంలో` దర్శకుడు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని తీర్చిదిద్దారు. సస్పెన్స్ అంశాలను, ట్విస్ట్ లను బాగా ప్లాన్ చేసుకున్నాడు.
ఈ మూవీ కథ పరంగా చాలా క్లిష్టమైన స్టోరీ. చాలా డిఫరెంట్ అంశాలు ముడిపడి ఉంటాయి. రెండు స్టోరీస్ జరుగుతుంటాయి. హీరో పాత్ర స్టోరీ వేరు, హీరోయిన్ యాంగిల్ వేరు. ఈ రెండింటికి ముడిపెట్టిన తీరు, విషయంలో దర్శకుడు టేకింగ్ కి అభినందనలు తెలిపాలి. మొదటి భాగంలో హీరోయిన్ పాత్రలోని రెండు కోణాలను బయటపెట్టాడు. ఆమె లవర్‌గా, మగాళ్లని సైలెంట్‌గా లేపేసే డేరింగ్ లేడీగా, అలాగే పోలీస్ ఆఫీసర్ పులి విలన్లని ఆటకట్టించే పవర్‌ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్‌గా ఈ రెండు పాత్రలను హైలైట్ చేస్తూ సినిమాని రన్ చేశాడు. ఇంటర్వెల్‌కి చిన్న ట్విస్ట్ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించేలా చేశాడు. ఇక సెకండాఫ్‌లో మాత్రం పూర్తి హీరో పాత్రని తీసుకున్నారు. విజయ్, సాగర్ పాత్రలను తికమక చేసి అతనిలోని మరో కోణాన్ని బయటపెట్టాడు. ఆ ట్విస్ట్ అదిరిపోయేలా ఉంటుంది. ఇలా ఫస్ట్ ఆఫ్‌లో హీరోయిన్ పాత్రల్లోని ట్విస్ట్ లు, సెకండాఫ్‌లో హీరోపాత్రల్లోని ట్విస్ట్ లు సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్లు. దీనికితోడు చివరికి క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ కూడా బాగుంది. దీనికి సీక్వెల్ కూడా ప్రకటించడం విశేషం.
అయితే కథ చాలా పెద్దది, దాన్ని అర్థమయ్యేలా చెప్పడంలో కొంత తడబాటు కనిపిస్తుంది. కొంత క్లమ్జీగానూ ఉంటుంది. మరోవైపు ఫస్టాఫ్ చాలా వేగంగా సాగుతుంది. ఫన్నీ సీన్లతోపాటు గ్లామర్ డోస్ గట్టిగానే ఉంటుంది. వెంటవెంటనే వచ్చే ట్విస్ట్ లు ఆశ్చర్యపరుస్తాయి. కానీ సెకండాఫ్‌లో మాత్రం ఆ వేగం తగ్గిపోయింది. హీరో పాత్రలోని మరో కోణం బయటపెట్టే సీన్లు చాలా సాగదీతగా రొటీన్‌గా అనిపిస్తాయి. బోర్ తెప్పించేలా ఉంటాయి. అక్కడ దర్శకుడు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సింది. హీరో మొటివ్, హీరోయిన్ మోటివ్‌కి సింక్ కుదరలేదు. ఇది కన్ ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. క్లైమాక్స్ కూడా మరీ సాగదీసినట్టుగా ఉంటుంది. అక్కడ కూడా క్లారిటీ మిస్ అయ్యింది. ఈ విషయాల్లో దర్శకుడు మరింత ఫోకస్ పెడితే కచ్చితంగా అలరించే మూవీ అవుతుందని చెప్పొచ్చు. మొత్తంగా కలియుగంలో ఏమైనా జరగొచ్చు అనేది చూపించాడు. సందేశం ఇచ్చే ప్రయత్నం చేశాడు.
టెక్నీషియన్లుః
టెక్నీకల్‌గా సినిమా బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ పాటలతోపాటు అర్ అర్ సినిమాకి ప్లస్. బీజీఎం కొన్ని చోట్ల భారీ సినిమాలను తలపిస్తుంది. బోయపాటి శ్రీను చరణ్ సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. మాటలు కొన్ని చోట్ల మెప్పిస్తాయి. ఆలోచింపజేస్తాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటర్ మరింత కేర్ తీసుకోవాల్సింది. కటింగ్ విషయంలో క్లారిటీ మిస్ అయ్యింది. దర్శకుడు రమాకాంత్‌రెడ్డి మంచి పాయింట్‌ని తీసుకున్నాడు. కానీ స్క్రీన్‌ప్లేని సరిగ్గా రాసుకోలేకపోయాడు. రెండు కథలను కలిపే దగ్గర కన్ ఫ్యూజ్ అయ్యాడు. కానీ ఓవరాల్‌గా మాత్రం విషయం ఉందని అర్థమవుతుంది.
నటీనటులుః
విజయ్‌గా, సాగర్‌గా రెండు వేరియేషన్స్ ని చూపించడంలో విశ్వ కార్తికేయ మెప్పించాడు. ఇన్నోసెంట్‌గా, కోపంగా, ఇలా డిఫరెంట్ షేడ్స్ చూపిస్తూ మెప్పించాడు. ఎక్స్ ప్రెషన్స్ విషయంలో ఇంకా బెటర్‌మెంట్ చూపించాల్సింది. ఆయనకు జోడీగా ఆయుషి పటేల్ బాగా చేసింది. రెండు వేరియేషన్స్ చూపించి అదరగొట్టింది. ఆమెతోపాటు పోలీస్ ఆఫీసర్‌గా చిత్ర శుక్లా సీరియస్ పాత్రలో మెప్పించింది. వాహ్ అనిపించింది. దేవి ప్రసాద్, రూప లక్ష్మితోపాటు ఇతర పాత్రదారులు ఓకే అనిపించారు. పాత్రల పరిధి మేరకు నటించారు.
ఫైనల్‌గాః `కలియుగం పట్టణం`లో కొంత వరకు మెప్పించే క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్.
రేటింగ్‌ః 2.5