The Goat Life Movie Review: `ది గోట్‌ లైఫ్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌

First Published | Mar 28, 2024, 3:33 PM IST

`సలార్‌` సినిమాలో వరదరాజా మన్నార్‌గా అలరించిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ హీరోగా నటించిన మూవీ `ది గోట్‌ లైఫ్‌`. ఇది నేడు విడుదలైంది.  నిజ జీవితం ఆధారంగా రూపొందిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌.. `సలార్‌`లో వరధరాజా మన్నార్‌గా అలరించారు. ప్రభాస్‌, స్నేహితుడిగా మెప్పించాడు. తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యాడు. ఆయన హీరోగా `ది గోట్‌ లైఫ్‌`(ఆడుకాలం) చిత్రంలో నటించారు. మలయాళంలో రూపొందిన చిత్రమిది. తెలుగులో డబ్‌ చేసి రిలీజ్‌ చేస్తున్నారు. బ్లెస్సీ దర్శకత్వం వహించిన ఈ మూవీ రియల్‌ లైఫ్‌ స్టోరీతో తెరకెక్కించారు.`ఆడుకాలం` అనే పుస్తకం ఆధారంగా బ్లెస్సీ ఈ మూవీని రూపొందించారు. దాదాపు 16ఏళ్ల క్రితం ఈ సినిమా జర్నీ స్టార్ట్ అయ్యింది. ఆరేళ్ల క్రితం షూటింగ్‌ ప్రారంభించారు. సినిమా తీయడంలోనూ అలాంటి కష్టాలే అనుభవించారు. చివరికి అన్ని అడ్డంకులు తొలగించుకుని ఎట్టకేలకు విడుదలైంది. గురువారం(మార్చి 28)న ఈ మూవీ విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

కథః 
కేరళాకి చెందిన నజీబ్‌ మహమ్మద్‌(పృథ్వీరాజ్‌ సుకుమారన్‌) ఊర్లో కూలీపనులు చేసుకుంటూ జీవిస్తుంటాడు. ఆయనకు భార్య సైను(అమలాపాల్‌) తో సంతోషంగా గడుపుతుంటారు. గల్ఫ్‌ వెళ్లాలని, బాగా సంపాదించాలనే ఆశతో ఉంటాడు. అక్కడికి వెళ్లే అవకాశం ఉందని తెలియడంతో ఇళ్లు అమ్మి మధ్యలో ఉన్న బ్రోకర్‌కి 30వేలు ఇస్తాడు. అతను వేరే పేరుతో వీసాకి అప్లై చేస్తాడు. తీరా అరబ్‌ కంట్రీకి వెళ్లాక అక్కడ తమని పంపించిన వ్యక్తి ఫోన్‌ లిఫ్ట్ చేయడు, ఎక్కడికి వెళ్లాలో తెలియదు. తనతోపాటు హకీమ్‌(గోకుల్‌) కూడా వస్తాడు. ఎయిర్‌పోర్ట్ లోనే రోజు గడిచిపోతుంది. ఎవరిని అడగాలో తెలియదు, ఏం అడిగినా భాష సమస్య అవుతుంది. దీంతో ఓ అరబ్‌ సేట్‌ వచ్చిన వీరిని తీసుకెళ్లిపోతాడు. తాము అద్దాల మేడలు గల సీటీకి వెళ్తామని ఊహించుకుంటారు. కానీ అతను దూరాన ఏడారుల్లోకి తీసుకెళ్తాడు. అక్కడ నజీబ్‌ని కఫీర్‌(యజమాని) వద్ద గొర్ల కాపరిగా పెట్టుకుంటాడు. హకీమ్‌ని మరో చోటుకి కాపరిగా తీసుకెళ్తారు. అదంతా ఇసుక ఏడారి, నీళ్లు సరిగా ఉండవు, కొన్ని వాటర్‌నే చాలా పొదుపుగా వాడుకోవాలి. పడుకునే వసతి కూడా ఉండదు. 


కఫీర్‌ చాలా టార్చర్‌ చేస్తుంటాడు. ఉండలేక పారిపోవాలనుకుంటాడు. కానీ వారి యజమానికి దొరికిపోతాడు. దెబ్బలు తింటాడు. తిండి లేక, నీళ్లు సరిగా లేక అనేక విధాలుగా స్ట్రగుల్‌ అవుతాడు. తాము అక్కడ నుంచి బయటపడటం సాధ్యం కాదని నిర్ణయించుకుని గొర్లు మెపుతూ ఉంటాడు. ఈ క్రమంలో తన ఫ్రెండ్‌ హకీమ్‌ కనిపిస్తాడు. ఇద్దరు కలుసుకుని కన్నీళ్లు పెట్టుకుంటారు. కలుసుకున్నందుకు సంతోషంగా ఫీలవుతారు. అక్కడ ఆఫ్రికన్‌ వ్యక్తి ఒకరు వీరికి తోడు అవుతాడు. అతనికి పారిపోయేందుకు దారి తెలుసని చెబుతాడు. దీంతో కఫీర్‌ ఇంట్లో పెళ్లి పనుల్లో ఉండగా ముగ్గురు కలిసి పారిపోతారు. మరి వందల వేల కిలోమీటర్ల ఏడారిలో వారి ప్రయాణం ఎలా సాగింది, నీళ్లు లేక, తిండిలేక కొన్ని రోజులపాటు ఎలా ఉండగలిగారు, ఇసుకలో ఎలా నడిచారు. ఈ క్రమంలో ఎంతటి నరకాన్ని అనుభవించారు. ముగ్గురుగా బయలు దేరి చివరికి నజీమ్‌ మాత్రమే ఎలా రాగలిగాడు, మిగిలిన ఇద్దరు ఏమయ్యారు. అసలేం జరిగింది? అనేది మిగిలిన కథ. 
 

విశ్లేషణః
నజీబ్‌ మహమ్మద్‌ అనే కేరళాకి చెందిన వ్యక్తి రియల్‌ లైఫ్‌ ఆధారంగా, అతను పడ్డ బాధలు, అక్కడి నుంచి తప్పించుకుని ప్రాణాలతో ఎలా బయటపడ్డాడు అనేది తన నిజ జీవితం ఆధారంగా `ఆడుకాలం`అనే పుస్తకాన్ని రాశారు. అది కేరళాలో బాగా సెల్లింగ్‌ బుక్‌. దీని ఆధారంగా ప్రముఖ దర్శకుడు బ్లెస్సీ ఈ మూవీని పృథ్వీరాజ్‌తో తెరకెక్కించారు. గల్ఫ్‌ వలసదారుల కష్టాలు, జీవనం కోపం పోరాటం నేపథ్యంలో మన తెలుగులో సినిమాలు వచ్చారు. సునీల్‌ కుమార్‌ రెడ్డి `గల్ఫ్‌` అనే చిత్రాన్ని రూపొందించారు. వారి బాధలను తెరకెక్కించారు. మరోవైపు ఇటీవల షారూఖ్‌ ఖాన్‌ నటించిన `డంకీ`కూడా అలాంటి కథతో వచ్చిన చిత్రమే. ఆ కోవకి చెందినదే `ది గోట్‌ లైఫ్‌` జర్నీ. సర్వైవల్‌ థ్రిల్లర్‌ మూవీ ఇది. నజీబ్‌ జీవితంలో ఎలాంటి కష్టాలు పడ్డాడు, అక్కడ ఎంతటి స్ట్రగుల్‌ అయ్యాడనేది ఈ మూవీలో కళ్లకి కట్టినట్టు చూపించారు. ప్రతి విషయాన్ని డిటెయిల్‌గా తెరపై ఆవిష్కరించారు. సినిమాటిక్‌గా కాకుండా నిజంగానే రియల్‌ లైఫ్‌ని ఇందులో రిఫ్లెక్ట్ చేసినట్టుగా సినిమాని తెరకెక్కించడం విశేషం. ఈ మూవీ ఇదే ప్లస్‌ అయితే, అదే మైనస్‌గా కూడా మారింది. 
 

ఇలాంటి సర్వైవల్‌ థ్రిల్లర్‌ మూవీస్‌ని యదాతథంగా తెరకెక్కిస్తే బోర్‌ కొడుతుంది. ఆడియెన్స్ కి అంతగా కనెక్ట్ కాదు, మూడు గంటలు సినిమాని చూడటం కష్టమవుతుంది. ఈ మూవీ విషయంలో అదే జరిగింది. ఇదొక నజీబ్‌ కథ మాత్రమే కాదు, ప్రతి ఏడాది ఎంతో మంది ఇలా గల్ఫ్‌ కంట్రీస్‌కి పనికోసం వెళ్లి మిస్‌ అవుతుంటారు. సరైన విధంగా వెళ్లకి తప్పుడు వ్యక్తుల్లో పడి అమాయకులు బలవుతున్నారు. అలాంటి వారి కథే ఇది. దర్శకుడు దీన్ని సినిమాగా తెరకెక్కించడంలో సక్సెస్‌ అయ్యారు. కానీ ఆడియెన్స్ ని ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో మాత్రం సక్సెస్‌ కాలేదు. జీవితం ఎలా డ్రైగా ఉంటుందో, సినిమాని కూడా అంతే డ్రైగా రూపొందించారు. కమర్షియల్‌ ఎలిమెంట్లు లేవు. కామెడీ ఆశించడానికి లేదు. కాకపోతే ఫస్టాప్‌లో కాస్త లవ్‌, రొమాన్స్ ని చూపించి రిలీఫ్‌ కలిగించారు. కానీ సెకండాఫ్‌ మాత్రం మనుగడ కోసం పోరాటం మారిదిగా, ఇసుక ఎడారి నుంచి నడక సాగినట్టుగా సినిమా సాగుతూనే ఉంటుంది. దీనికితోడు ప్రతి డిటెయిలింగ్‌ కోసం ప్రయత్నించి బోర్‌ తెప్పించారు. సినిమా చాలా స్లోగా మారిపోతుంది. అయితే ఏడారుల్లో ప్రయాణం ఎంత నరకంగా ఉంటుందో కళ్లకి కట్టినట్టు ఆవిష్కరించారు. 
 

ఇలాంటి సినిమాల్లో ఎమోషన్స్ మెయిన్‌. కానీఈ సినిమాలో ఆ ఎమోషన్‌ ఆడియెన్స్ కి సరిగా అర్థం కాలేదు. కొన్ని అరబ్‌ డైలాగులుంటాయి. అవేంటో అర్థం కాదు. సబ్‌ టైటిల్స్ సరిగా లేవు. దీంతో ఆయా సీన్లతో ఆడియెన్‌ డిస్‌ కనెక్ట్ అవుతాడు. దీనికితోడు నజీబ్‌ స్ట్రగుల్‌ని చూపించాడు, అంత వరకు ఓకే, కానీ అదే విషయాన్ని పదే పదే చూపించడం బోరింగ్‌గా అనిపిస్తుంది. ఏడాదిలో ప్రయాణానికి సీన్లు కూడా ఒకేలా సాగుతాయి. ప్రతి ఐదు నిమిషాలకు సీన్లు ఒకేలా రిపీట్‌ అవుతాయి. నీటి కోసం పడే బాధల్లో హృదయాన్ని కదిలించే సీన్‌ ఉంటుంది. కానీ అందులో ఎమోషన్స్ అంతగా పండలేదు. ఫ్రెండ్‌ చనిపోయిన సీన్‌ కూడా ఆడియెన్స్ అంతగా రియాక్ట్ కాలేకపోతారు. అవి సీన్లుగానే కనిపిస్తాయి. ఈ విషయంలో దర్శకుడు కేర్‌ తీసుకోవాల్సింది. మధ్య మధ్యలో ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్లు పెడితే రిలీఫ్‌గా ఉండేది. అంతేకాదు, నజీబ్‌ వర్షెన్‌ మాత్రమే కాదు, వారి ఇంట్లో వారి స్ట్రగుల్‌ కూడా చూపిస్తూ బాగుండేది. కానీ ఆడియెన్స్ ని మాత్రం ఆ ఎడారుల్లోకి తీసుకెళ్లడంలో, హీరో పడే స్ట్రగుల్‌ని ఆడియెన్స్ కూడా ఫీలయ్యేలా చేయడంలో మాత్రం సక్సెస్‌ అయ్యాడు. ఇక ఇలాంటి మూవీస్‌ అవార్డులు చిత్రాలుగానే మిగిలిపోతాయి, తప్పితే ఆడియెన్స్ థియేటర్లలో చూడటం చాలా కష్టం. 
 

నటీనటులుః

సినిమా మొత్తం నజీబ్‌ పాత్ర చుట్టూనే సాగుతుంది. ఆయన పాత్ర ప్రధానంగానే సాగుతుంది. ఆ పాత్రలో పృథ్వీరాజ్‌సుకుమారన్‌ జీవించారు. పాత్రకి ప్రాణం పోశాడు. తనే స్వయంగా అలాంటి స్ట్రగుల్‌ అయినట్టుగా ఆయన నటన ఉండటం విశేషం. ఆయనే స్వయంగా ఆ బాధలు పడ్డాడా అని ఆడియెన్స్ ఫీలయ్యేలా చేశాడు. అద్భుతమైన నటనతో మెస్మరైజ్‌ చేశాడు.  అంతేకాదు రెండు మూడు వేరియేషన్స్ చూపించడంతోపాటు ఆయన బాడీ ట్రాన్ఫర్మేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌ అని చెప్పొచ్చు. పృథ్వీరాజ్‌ నటన గురించి ఇంకా చెప్పాల్సి వస్తే అవార్డులకు మించిన యాక్టింగ్‌. హకీమ్‌ పాత్రలో గోకుల్‌ ఫర్వాలేదనిపించాడు. అమలా పాల్‌ గ్లామరస్‌గా కనిపించింది. ఉన్నంత సేపు తనదైన నటనతో మెప్పించింది. ఆమె ఎపిసోడ్‌ ఆకట్టుకునేలా ఉంటుంది. ఆఫ్రికన్‌ వ్యక్తి పాత్ర కూడా అద్భుతంగా చేశాడు. పృథ్వీరాజ్‌ తర్వాత అతని నటన మెప్పించిందని చెప్పొచ్చు. మిగిలిన పాత్రలు ఓకే అనిపించారు. 
 

టెక్నీషియన్లుః 
టెక్నీకల్‌గా ఈ మూవీ చాలా బాగుంది. మ్యూజిక్‌ అదిరిపోయింది. కొన్నిసార్లు సైలెన్స్ కూడా ఎంత గాంభీర్యంగా ఉంటుందో చూపించారు. ఏఆర్‌ రెహ్మాన్‌ పాటలు హృదయాన్ని కదిలించేలా ఉంటాయి. బిజీఎం సినిమాకి తగ్గట్టుగా ఉంది. అందులో కలిసిపోయింది. కానీ ప్రత్యేకం అనిపించలేదు. రసూల్‌ పూకుట్టి సౌండ్‌ డిజైన్‌ ప్రత్యేకంగా నిలుస్తుంది. సునీల్‌ కేఎస్‌ కెమెరా వర్క్ సూపర్‌. విజువల్‌ వండర్‌లాతీశారు. ఆయన పెట్టిన కొన్ని ఫ్రేమ్స్ అద్భుతంగా ఉన్నాయి. విజువల్‌ రొమాన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక దర్శకుడు బ్లెస్సీ కథని, కథగా తెరకెక్కించాడు. సినిమాటిక్‌ లిబర్టీ తీసుకోకపోవడం మైనస్‌గా మారింది. ఇదొక ఆర్ట్ ఫిల్మ్ లా మారిపోయింది. ఆడియెన్స్ ని అలరించేలా, ఎమోషనల్‌గా మూవీని తీస్తే బాగుండేది. కానీ వారు పడ్డ కష్టాన్ని మాత్రం అభినందించాల్సిందే. ఇది ఎంతో మందికి వలస వెళ్లి వారికి సందేశాత్మక మూవీ అవుతుంది.

ఫైనల్‌గాః `ది గోట్‌ లైఫ్‌` నజీబ్‌ నిజ జీవితానికి మరో ప్రాణం పోసిన మూవీ. అవార్డులు వస్తాయి, కానీ రివార్డులు కష్టం. 
రేటింగ్‌ః 2.5

నటీనటులు - పృథ్వీరాజ్ సుకుమారన్, హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే తదితరులు. 

ఎడిటర్ - శ్రీకర్ ప్రసాద్
సినిమాటోగ్రఫీ - సునీల్ కేఎస్
సౌండ్ డిజైన్ - రసూల్ పూకుట్టి
మ్యూజిక్ - ఏఆర్ రెహమాన్
పీఆర్ ఓ - జీఎస్ కే మీడియా
నిర్మాణం - విజువల్ రొమాన్స్
దర్శకత్వం - బ్లెస్సీ
 

Latest Videos

click me!