
స్టార్స్ లేకపోయినా చిన్న సినిమాలు చూడగలమా, ఇంట్రస్ట్ గా ఉంటాయా అంటే కొన్ని సార్లు అవుననే చెప్పాలి. కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే ఖచ్చితంగా చివరిదాకా కూర్చోబెట్టగలిగితే సినిమాలు చిన్నా,పెద్దా తేడా లేకుండా చూడగలం ఆ విషయం శ్రీమతి అనే ఈ చిత్రం నిరూపించింది.
తెలుగు కుర్రాడు శశిధర్ రెడ్డి పార్లపల్లి ( Sasidhar Reddy Parlapalli,) సినిమాపై ఫ్యాషన్ తో తనే నిర్మాతగా మారి చేసిన ఈ ప్రయత్నం కన్నడ ఆడియన్స్ ని మొదట అలరించింది. తెలుగులో రిలీజ్ చేయలేని పరిస్దితుల్లో యూట్యూబ్ లో పెడితే ఇక్కడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి జనం బాగా మాట్లాడటమే ఈ సినిమా సక్సెస్ అయ్యింది అనటానికి గుర్తు. అసలు ఈ సినిమా కథేంటి, చూడదగ్గ కంటెంట్ ఉన్న సినిమానేనా వంటి వివరాలు చూద్దాం.
స్టోరీ లైన్
జ్యోతి (జాన్వి రాయల) ఓ మధ్య తరగతి మహిళ. ఆమె భర్త కిషోర్ (ప్రశాంత్ ) బ్యాంక్ మేనేజర్. అయితే ఆమెకు ఒకటే లోటు పిల్లలు లేకపోవటం. అటు అత్తవారి వైపు నుంచి ప్రెజర్ ఉంటుంది. ఈ క్రమంలో భర్త తో కలిసి పిల్లలు పుట్టడం లేదని గైనాకాలజిస్ట్ ని కలవటంతో సినిమా మొదలవుతుంది. డాక్టర్ సలహా తీసుకున్న ఆమె ఇంటికి వచ్చాక, తన చిననాటి స్నేహితురాలు సవిత (రూపా రాయప్ప) నుంచి కాల్ రావటంతో ఆనందపడుతుంది. చాలా కాలం క్రితం కలిసిన ఆమె ఇప్పుడు టచ్ లోకి రావటం ఆనందం కలిగిస్తుంది. ఆమెను తన ఇంటికి తీసుకువస్తుంది.
సవితది లో మిడిల్ క్లాస్. భర్త, ఓ కొడుకు. ఆమె అప్పటికే సమస్యల్లో ఉంటుంది. జ్యోతి ఇంటిని, ఆమె బంగారం, డబ్బు చూసి ఆశ్చర్యపోతుంది. సంతోషపడుతుంది. అక్కడ నుంచి వాళ్లిద్దరూ తరుచుగా కలుస్తూంటారు. ఓ రోజు సవిత బాగా డల్ గా ఉండటం గమనించి విషయం ఏంటని జ్యోతి అడుగుతుంది. దాంతో సవిత తన కష్టాలు చెప్పుకుంటుంది.
తన నాయనమ్మకు ఒంట్లో బాగోలేదని, వెళ్లి చూడాలని ఉన్నా, వెళ్లలేని పరిస్దితి అంటుంది. అందుకు కారణం తనకు తన నాయనమ్మ ఇచ్చిన నగలు తాను తాకట్టు పెట్టడమే అంటుంది. ఇప్పుడు తన ఒంటిపై నగలు లేకపోతే ముందే బెంగ పెట్టుకుని నాయనమ్మ చనిపోతుంది అని చెప్తుంది. జ్యోతి కు ఎలా ఓదార్చలో అర్దం కాదు.
అయితే సవితే దానికి ఓ ఉపాయం చెప్తుంది. నువ్వు నాకు సాయిం చేయాలనుకుంటే ఓ ఐదు లక్షలు అప్పుగా ఇస్తే తాకట్టు పెట్టిన నగలు తెచ్చుకుంటానంటుంది. నా దగ్గర అంత డబ్బు లేదని జ్యోతి అంటే..అయితే నీ నగలు ఓ వారం రోజులు నాకు ఇవ్వు...బంగారం షాపులో నా నగలు తాకట్టు విడిపించి, ఆవిడను చూసి వచ్చాక ఇచ్చేస్తాను అంటుంది.
జ్యోతి మొదట ఒప్పుకోకపోయినా స్నేహ ధర్మం కోసం సానుభూతితో సరే అంటుంది. తన బంగారం ఇస్తుంది. దాన్ని తాకట్టు పెట్టి సవిత నగలు విడిపిస్తుంది. అయితే ఆ తర్వాత సవిత అసలు స్వరూపం తెలుస్తుంది. దాంతో అటు భర్తకు చెప్పలేక, ఆ ఐదు లక్షలు ఇవ్వలేక, సవితను పట్టుకోలేని పరిస్దితుల్లో జ్యోతి ఏం చేసింది. చివరకు ఏమైంది అనేది మిగతా కథ.
ఎలా ఉంది
చెప్పుకోవటానికి చిన్న స్టోరీ లైన్ అయినా ఇంట్రస్టింగ్ డైరక్టర్ నేరేట్ చేసారు. ఎక్కడా కొత్త దర్శకుడు సినిమా అనిపించదు. కథలోకి మొదటి పది నిముషాల్లోనే వచ్చి లాక్ చేసేయటంతో చివరి దాకా చూస్తాము. జ్యోతి పాత్ర మనకు తెలిసి ఉన్నదే, మన కుటుంబాల్లో చూసిందే అనిపిస్తుంది. అలా తెలియకుండానే కథలోకి వెళ్లిపోతాము. ఫస్టాఫ్ ఇంట్రస్టింగ్ నడిపిన దర్సకుడు సెకండాఫ్ కొద్దిగా లాగినట్లు అనిపిస్తుంది.
మళ్లీ క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ లో కథపూర్తిగా దారిలో పడుతుంది. ఈ కథ మనకు తెలిసిన వాళ్లదే అనిపించటం, జ్యోతి పాత్ర ఏమౌతుందా, సమస్య నుంచి ఎలా బయిటపడుతుంది అని మనలో ఆలోచన పుట్టించటంలో డైరక్టర్ పూర్తిగా సక్సెస్ అయ్యారు. టెక్నికల్ గా అధ్బుతం అని చెప్పలేం కానీ ఉన్నంతలో బాగుంది. ఆర్టిస్ట్ ల నుంచి మంచి ఫెరఫార్మెన్స్ రాబట్టారు. డైరక్టర్ కు మంచి బడ్జెట్ ఇస్తే మంచి సినిమా చేయగలడు అనిపించింది.
చూడచ్చా
నిరభ్యంతరంగా చూడచ్చు. ఇంట్రస్టింగ్ నేరేషన్. ముఖ్యంగా మహిళలకు బాగా నచ్చుతుంది.
ఎక్కడుంది
సినిమా యూట్యూబ్ లో శ్రీమతి అనే టైటిల్ తో ఉంది , ఉచితంగానే చూడవచ్చు.
,