Happy Ending Review: `హ్యాపీ ఎండింగ్‌` మూవీ రివ్యూ..

First Published | Feb 2, 2024, 4:15 PM IST

శృంగార కోరికలను కంట్రోల్‌ చేసుకోవడమనే కాన్సెప్ట్ తో వచ్చిన మూవీ `హ్యాపీ ఎండింగ్‌`. ఈ శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో తెలియాలంటే `రివ్యూ` చూడాల్సిందే. 

బోల్డ్ కంటెంట్‌తో కూడిన చిత్రాలు ఇటీవల తెలుగులోనూ వస్తూ ఆదరణ పొందుతున్నాయి. అయితే సెన్సిబుల్‌ అంశాలను ఇంకా ఆడియెన్స్ సరిగ్గా రిసీవ్‌ చేసుకోలేకపోతున్నారు. కొంత గ్యాప్‌ మాత్రం కనిపిస్తుంది. `విక్కీ డోనర్‌` లాంటి కాన్సెప్ట్ నేపథ్యంలో వచ్చిన తెలుగు సినిమాలు పెద్దగా ఆడలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో కాన్సెప్ట్ తో `హ్యాపీ ఎండింగ్‌` మూవీ వచ్చింది. యష్‌ పూరి హీరోగా నటించారు. అపూర్వ రావు హీరోయిన్‌గా చేసింది. కౌశిక్‌ భీమిడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హమ్స్ టెక్‌ఫిల్మ్స్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మించాయి. ఈ మూవీ నేడు శుక్రవారం(ఫిబ్రవరి 2)ని విడుదలైంది.మరి యూత్‌ఫుల్‌, రొమాంటిక్‌ కామెడీగా వచ్చిన ఈ మూవీలో నిజంగా హ్యాపీ ఎండింగ్‌ ఉందా? ఆకట్టుకుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

కథః

శృంగార కోరికలకు కంట్రోల్‌ చేసుకోవడమనే కాన్సెప్ట్ తో వచ్చిన చిత్రమిది. ఇందులో హర్ష్‌(యస్‌ పూరి) స్కూల్‌ డేస్‌లో ఫ్రెండ్‌ ఒకరు సెక్స్ సినిమాల గురించి చెబితే ఇంట్రెస్ట్ తోటి అవి ప్రదర్శించే థియేటర్‌కి వెళ్తాడు. అక్కడికి రథేశ్వర్ స్వామిజీ(అజయ్‌ ఘోష్‌) కూడా వస్తాడు. అయితే ఆ టైమ్‌లో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలతో స్వామిజీని అందరు గుర్తుపడతారు. దీనికి హర్ష్‌ కారణమవుతాడు. దీంతో స్వామిజీ హర్ష్‌పై సీరియస్‌ అవుతాడు. ఆవేశంలో అతని శపిస్తాడు. భవిష్యత్‌లో నువ్వు ఏ అమ్మాయిని ఆ ఫీలింగ్‌తో తలుచుకున్నా, వాళ్లంతా చనిపోతారు. పెద్దయ్యాక కొన్ని సంఘటనలు కూడా జరుగుతాయి. దీంతో తన కోరికలను కంట్రోల్‌ చేసుకుంటాడు. అమ్మాయిలను ఆ దృష్టితో చూడడు. ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకునేందుకు రకరకాల యోగాలు, ఎక్సర్‌సైజ్‌లు చేస్తుంటాడు. ప్యాషన్‌ రంగంలో మేకప్‌ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న హర్ష.. అవని(అపూర్వ రావు) పెళ్లికి మేకప్‌ చేయాల్సి వస్తుంది. ఆమెకి పెళ్లి అంటే ఇష్టం లేదు. హర్ష్‌ చెప్పిన మాటలకు ఇన్‌స్పైర్‌ అయి పెళ్లిని క్యాన్సిల్‌ చేసుకుంటుంది. ఆ తర్వాత ఈ ఇద్దరు రెండు మూడు సార్లు యాదృశ్చికంగా కలుస్తారు. నాల్గో సారి కూడా తెలియకుండానే కలుస్తారు. దీంతో ఏదో తమ మధ్య ఉందని ఇద్దరు తరచూ కలుస్తుంటారు. ఇలా హర్ష్‌ ప్రేమలో పడిపోతుంది అవని. కానీ ఆమె అంటే ఇష్టం ఉన్నా తన సమస్య గుర్తొచ్చి సంకోచిస్తుంటాడు హర్ష్‌. మరి ఆమె ప్రేమని అంగీకరించాడా? ఆమెని పెళ్లి చేసుకున్నాడు, తన సమస్యని ఎలా ఎదుర్కొన్నాడు, దానికి పరిష్కారం దొరికిందా? లేదా ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగిలిన సినిమా. 
 

Latest Videos


విశ్లేషణః
మన ఇండియాలో సెక్స్‌ రిలేటెడ్‌ అంశాలను బహిరంగంగా చర్చించేందుకు ఆసక్తి చూపించరు. తెలియని సంకోచం ఉంటుంది. జనరల్‌గా డిస్కషన్‌కే పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వరు. అలాంటిది సినిమాలు తీస్తే కచ్చితంగా ఆ అనాసక్తి కనిపిస్తుంది. కానీ అలాంటి సినిమాలు తీయడం అంటే సాహసమే చెప్పాలి. జనాల్లో ఉన్న అపోహల్ని పోగొట్టే ప్రయత్నం అభినందనీయమే. కానీ వాటికి థియేటర్ల ఆదరణ లభిస్తేనే ఆ ప్రయత్నం ఫలిస్తుంది. ఆ మధ్య `ఏక్‌ మినీ కథ` అంటూ ఇలాంటిదే ఓ ఓటీటీ మూవీ వచ్చింది. తక్కువ బడ్జెట్‌లో వచ్చి ఉన్నంతలో బాగానే ఆదరణ పొందింది. ఇప్పుడు శృంగార కోరికల్ని అనచుకోవడం, స్వామిజీ శాపంతో అమ్మాయిలకు దూరంగా ఉండటం అనే కాన్సెప్ట్ తో తాజాగా `హ్యాపీ ఎండింగ్‌` మూవీ వచ్చింది. ఇందులో స్వామిజీ హీరోని ఆ కోరికలతో అమ్మాయిలను ఊహించుకుంటే, ఆ ప్రయత్నం చేస్తే వాళ్లు చనిపోతారని చెప్పడం ఇందులో మెయిన్‌ పాయింట్. దీంతో హీరో ఎవరినీ తలచుకోకుండా, తననో తాను కంట్రోల్‌ చేసుకుంటూ అనేక ఇబ్బందులు పడుతూ ఉంటాడు. 
 

ఈ ఫీలింగ్స్ ని కంట్రోల్‌ చేసుకునే విధానంలో, ఆయన పడే స్ట్రగుల్స్ లో నుంచి ఫన్‌ క్రియేట్‌ చేయాలని, ఈ సినిమాతో ద్వారా చేసిన ప్రయత్నం. అయితే దీన్ని ఫన్నీ వేలో మంచి సందేశాన్ని అందించాలని రూపొందించారు. చివర్లో అసలు అపోహలకు సంబంధించిన సందేశాన్ని ఇవ్వాలనుకున్నారు. దీంతో ప్రారంభం నుంచి ఫన్‌ వేలో తీసుకెళ్లారు. కొంత రొమాంటిక్‌ టచ్‌ ఇస్తూనే హీరో సమస్యని గుర్తు చేస్తూ, అతను పడే బాధల్లో నుంచి ఫన్‌ ని జనరేట్‌ చేయాలని ప్రయత్నించారు. ఆ విషయంలో టీమ్‌ ప్రయత్నం కొంత వరకు మాత్రమే కనెక్టింగ్‌గా అనిపించింది. ఇలాంటి సినిమాల్లో సహజమైన, సిచ్యూవేషనల్‌ కామెడీ బాగా పండాలి, అప్పుడే ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుంది. లేదంటే బెడిసి కొడుతుంది. `హ్యాపీ ఎండింగ్‌`లో కొంత వరకు జరిగింది అదే అని చెప్పాలి. ఫన్‌ సినిమా మొత్తం క్యారీ కాలేదు. 
 

అయితే మెయిన్‌గా ఇందులో సంఘర్షణ పాయింట్‌ ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా చెప్పడంలో కొంత విఫలమయ్యారు. దీంతో ఆ అంశంతో ఆడియెన్స్ క్యారీ కాలేని పరిస్థితి. మధ్యలోకి వెళ్లే సరికి అర్థం కాక కన్‌ఫ్యూజన్‌ ఏర్పడుతుంది. దీనికితోడు స్లో నెరేషన్‌. కథ ఎంతకు ముందుకు సాగదు, అవే సీన్లు రిపీట్‌ అవుతుంటాయి. ఇది సహనాన్ని పరీక్షించేలా ఉంటాయి. ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు. అంతో ఇంతో టాక్సీవాలా విష్ణు కామెడీ నవ్వులు పూయిస్తుంది. అదే సినిమాలో రిలీఫ్‌ అంశం. మిగిలినవి అన్నీ బోరింగ్‌గా సాగతాయి. దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్‌ బాగున్నా, దాన్ని ఎగ్జిక్యూట్‌ చేయడంలో సక్సెస్‌ కాలేకపోయాడు. సినిమా ఆసాంతం ఫన్నీగా తీసుకెళ్లి, చివర్లో అసలు విషయం చెప్పి, ట్విస్ట్ లాంటిది పెడితే బాగుండేది. అలాగే రొమాంటిక్‌ సీన్లు, బోల్డ్ సీన్లు పెట్టినా ఆడియెన్స్ కొంత ఎట్రాక్ట్ అయ్యేవారు. అవి కూడా లేకపోవడం కొంత నిరాశకి గురి చేస్తుంది.
 

నటీనటులుః
హర్ష్‌ పాత్రలో యష్‌ పూరి బాగా నటించారు. రొమాంటిక్‌ గా కనిపించాడు. బాడీలో రొమాన్స్ ఉంది, కానీ సినిమాలో లేకపోవడం గమనార్హం. లవర్‌ బాయ్‌ పాత్రలకు బాగా సూట్‌ అవుతాడనిపించింది. ఆయనకు మంచి ఫ్యూచర్‌ ఉంది. ఇక హీరోయిన్ అపూర్వ రావు కూడా చాలా బాగా చేసింది. తొలి సినిమా అయినా చాలా సెటిల్డ్ గా చేసింది. అజయ్‌ ఘోస్‌ ఓకే అనిపించాడు. విష్ణు కామెడీ నవ్వులు పూయిస్తుంది. ఝాన్సీ కూడా ఫర్వాలేదనిపించింది. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయి. 
 

టెక్నీషియన్లుః 
`హ్యాపీ ఎండింగ్‌` మ్యూజిక్ బాగుంది. చాలా డీసెంట్‌గా ఉంది. అయితే అది ఎలివేట్‌ అయ్యేలా మాత్రం లేదు. కెమెరా వర్క్ చాలా బాగుంది. రీచ్‌ లుక్‌ కనిపిస్తుంది. ప్రతి ఫ్రేము అందంగా ఉంది. ఎడిటింగ్‌ పరంగా చాలా కటింగ్‌ చేయోచ్చు. ఇక దర్శకుడు కౌశిక్‌ సినిమాని సరిగా డీల్ చేయడంలో తడబడ్డాడు. అనుభవ లేమి కనిపిస్తుంది. సాహసమైన కథని ఎంచుకోవడంలో చూపించిన డేర్‌, కథని అంతే బాగా అలరించేలా తీయడంలో మాత్రం సక్సెస్‌ కాలేకపోయాడు. ఎంటరైనింగ్‌గా చెప్పడంలో ఆయన దృష్టి పెట్టాల్సింది. 


ఫైనల్‌గాః `హ్యాపీ ఎండింగ్‌` అనిపించలేకపోయింది. ఎంచుకున్న కాన్సెప్ట్ ని అభినందించాలి. 
 

click me!