RAM Rapid Action Mission Review : ‘రామ్’ మూవీ రివ్యూ!

First Published | Jan 26, 2024, 12:31 PM IST

గణతంత్ర దినోత్సం రోజున తెలుగు ప్రేక్షకుల ముందుకు దేశభక్తిని చాటే సినిమా వచ్చింది. ‘రామ్’ (RAM Rapid Action Mission) తో విడుదలైన చిత్రం ఎలా ఉందనే విషయాలను రివ్యూ తెలుసుకుందాం.

రిపబ్లిక్ డే 2024 సందర్భంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు దేశభక్తిని చాటి చెప్పే చిత్రం విడుదలైంది. అదే ‘రామ్’ (RAM).  ప్రతీ వారం కమర్షియల్ చిత్రాలు లెక్కలేనన్ని వస్తూనే ఉంటాయి. కానీ దేశ భక్తికి కమర్షియల్ అంశాలను జోడించి అందరినీ ఆకట్టుకునే చిత్రాలు తీయడం అంత సులువైన పనికాదు. తొలి ప్రయత్నంలోనే హీరో, దర్శక, నిర్మాతలు ‘రామ్’ సినిమాతో ఆ సాహసం చేశారు. పేట్రియాట్రిక్ జానర్‌లో తీసిన ఈ మూవీ ఈరోజు (జనవరి 26) విడుదలైంది. మరి ఈ చిత్రం కథ ఏంటీ? ఎలా ఉందనే? విషయాలను తెలుసుకుందాం. 

కథ :

మేజర్ సూర్య ప్రకాష్ (రోహిత్) దేశభక్తికి మారుపేరు. తనదేశం కోసం వీరమరణాన్ని పొందారు. హెచ్ఐడీ (హిందుస్థాన్ ఇంట్రాడిఫెన్) డిపార్ట్ మెంట్ లో జేబీ (భాను చందర్) అనే ఆఫీసర్ కు మేజర్ సూర్య ప్రకాష్ అంటే ఎంతో గౌరవం. గతంలో ఓ మిషన్ పై వీరిద్దరు టీమ్ తో వెళ్లినప్పుడు సూర్య ప్రకాష్ ప్రాణాలు కోల్పోతారు. ఆయనకి ఒక కొడుకు రామ్ (సూర్య అయ్యలసోమయాజులు) ఉన్నాడు. తండ్రి దేశంకోసం పోరాడి వీరమరణం పొందితే.. తను మాత్రం తమను పట్టించుకోలేదని తండ్రిపై ద్వేషం పెంచుకుంటాడు. దేశభక్తికి విరుద్ధంగా వ్యవహరిస్తుంటారు. ఎలాంటి లక్ష్యం లేకుండా అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. ఓ అధికారి కూతురు జాహ్నావి (ధన్య బాలకృష్ణ)ను ప్రేమిస్తాడు.


అయితే జేబీ మాత్రం తన పైఅధికారి సూర్య ప్రకాష్ లేని లోటును పూడ్చేందుకు తండ్రి స్థానంలో కొడుకును డిపార్ట్ మెంట్ లోకి చేర్చాలని ప్రయత్నిస్తాడు. తండ్రిపై, అతని వృత్తిపై కోపం పెంచుకున్న రామ్ ను జేబీ ఎలా డిపార్ట్ మెంట్ లోకి తీసుకొచ్చారు? దేశభక్తి అసలే లేని రామ్.. చివరకు దేశం కోసం ప్రాణాలిచ్చే వ్యక్తిగా ఎలా మారాడు? హీరోయిన్ జాహ్నవి ఎవరి కూతురు? ఎలాంటి పోరాటాలు చేశాడు? అసలు ర్యాపిడ్ యాక్షన్ మిషన్ అంటే ఏంటీ? అనేది మిగితా సినిమా......

విశ్లేషణ : 

‘రామ్’ సినిమాను దర్శకుడు వెండితెరపై ప్రజెంట్ చేసిన తీరు ఆకట్టుకుంది. స్క్రీన్ ప్లే కొత్త అనిపిస్తుంది. కోర్ పాయింట్ పాతదే అయినా.. ఆ పాయింట్ చుట్టూ అల్లుకున్న కథనం సరికొత్తగా ఉంటుంది. అయితే, ఉగ్రవాదం మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. బార్డర్ లోపల, సీక్రెట్ స్లీపర్స్ అంటూ ఇలా ఎన్నో కాన్సెప్టుల మీద సినిమాలు వచ్చాయి. కానీ దర్శకుడు ఈ చిత్రంలో కొత్త పాయింట్ ను టచ్ చేశారు. బ్యూరో క్రాటిక్ జిహాద్ అనే విషయాన్ని టచ్ చేయడంతో సినిమా కథ బలంగా మారింది. ముస్లిం ఆఫీసర్ పాత్రను పోషించిన సాయికుమార్‌ ఆ పాయింట్‌ను ఎఫెక్టీవ్ గా ప్రజెంట్ చేశారు. ప్రేక్షకులను కనెక్ట్ అయ్యేలా చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కోర్ పాయింట్ ను మదిలోనే ఉంచేలా సన్నివేశాలు సాగుతుంటాయి. కాకపోతే ఫస్ట్ హాఫ్‌ లో  కొన్ని సీన్లు రొటీన్‌గా ఉంటాయి. అయినా కథను నడిపించిన తీరు బాగుంటుంది. అలాగే కొన్ని చోట్ల రామ్, తన ఫ్రెండ్ కారెక్టర్ చేసిన సంభాష నవ్వులు పూయిస్తాయి. ముఖ్యంగా ప్రథమార్థంలో అల్లరి చిల్లరగా తిరిగే వ్యక్తి.. ఆఫీసర్‌గా మారే క్రమాన్ని చక్కగా చూపించారు.

ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ లోనే హీరో మారే సన్నివేశాలు ముగియడంతో సెకండాఫ్ కాస్తా సీరియస్ గా, ఎమోషనల్ గా సాగుతుంది. అలాగే హీరోయిన్ ధన్య బాలకృష్ణతో మనోడి లవ్ స్టోరీని కూడా చక్కగా చూపించారు. ప్రేమ కోసం తను మారడమే కాకుండా.. దేశం కోసం ఏం చేశాడనేది కూడా ఆకట్టుకుంటుంది. కొన్ని సీన్లు ప్రేక్షకులను కంటతడిపెట్టించేలా ఉంటాయి. ముఖ్యంగా  శుభలేక సుధాకర్ ద్వారా ఉగ్రవాదానికి, రాజకీయానికి ఉన్న కనెక్షన్, చరిత్రకి రాజకీయానికి ఉన్న కనెక్షన్‌ను చక్కగా చూపించారు. యాక్షన్ సీన్లు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ ను మాత్రం ప్రతి భారతీయుడు ఇష్టపడుతాడు. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి. ఇలా సినిమా ఆద్యంతం ఆసక్తికరంగానే ఉంటుంది. 

నటీనటులు : 

రామ్ పాత్రలో సూర్య అద్భుతంగా నటిస్తాడు. దేశభక్తి అంటే గిట్టని, అల్లరి చిల్లరగా తిరిగే ఓ కుర్రాడిలా కనిపించినప్పుడు.. దేశ భక్తితో ఎదిగిన ఓ సిన్సియర్ ఆఫీసర్‌గా ఉన్నప్పుడు చూపించే వ్యత్యాసం ఆకట్టుకుంటుంది. యాక్షన్, ఎమోషన్, కామెడీ ఇలా అన్ని యాంగిల్స్‌లోనూ సూర్య ఆకట్టుకున్నాడు. ఇక మొదటి సినిమా అన్న బెరుకు ఎక్కడా లేకుండా యాక్షన్ సీక్వెన్స్‌లోనూ కుమ్మేశాడు. రోహిత్ చాలా రోజులకు మంచి పాత్రలో కనిపించాడు. ఈ చిత్రానికి కనిపించిన రియల్ హీరోలా మారాడు. భానుచందర్ ఫుల్ ఎనర్జీ చూపించారు. సాయి కుమార్, శుభలేక సుధాకర్ తమ అనుభవాన్ని కనబరిచారు. హీరోయిన్ ధన్య బాలకృష్ణ అందంతో మెస్మరైజ్ చేసింది. తన పరిధిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. భాషా కామెడీ టైమింగ్ నవ్విస్తుంది. రవి వర్మ, మీనా వాసు, అమిత్ ఇలా మిగిలిన పాత్రలన్నీ చక్కగా సాగాయి. 

టెక్నికల్ టీమ్ : 

‘రామ్’ సినిమాలో టెక్నికల్ టీమ్ ఎంతలా కష్టపడిందో సినిమా చూస్తే అర్థమవుతోంది. ఆశ్రిత్ అయ్యంగార్ ఆర్ఆర్ అదిరిపోయింది. ధారన్ సుక్రి విజువల్స్ అద్భుతం. కెమెరా వర్క్ చాలా బాగుంది. డైలాగ్స్ హృదయాన్ని కదిలించేలా ఉంటాయి. ఆర్ట్, ఎడిటింగ్ అన్నీ చక్కగా కుదిరాయి. నిర్మాత పెట్టిన ఖర్చు తెరపై కనిపిస్తుంది. 

సినిమా : రామ్ (Ram ర్యాపిడ్ యాక్షన్ మిషన్)
నటీనటులు : సూర్య, ధన్య బాలకృష్ణ, భాను చందర్, సాయి కుమార్, రోహిత్, శుభలేక సుధాకర్
నిర్మాణ సంస్థ : దీపికా ఎంటర్ టైన్ మెంట్ మరియు ఓఎస్ఎం విజన్
నిర్మాత : దీపికాంజలి వడ్లమాని
దర్శకుడు : మిహిరామ్ వైనతేయ
సంగీతం : ఆశ్రిత్ అయ్యంగార్
సినిమాటోగ్రఫీ : ధారన్ సుక్రి
విడుదల తేదీ : 26 జనవరి 2024 

రేటింగ్ : 2.5

Latest Videos

click me!