Gargi Movie Telugu Review: `గార్గి` మూవీ రివ్యూ.. సాయిపల్లవి విశ్వరూపం

First Published | Jul 15, 2022, 6:16 AM IST

ఇటీవల `విరాటపర్వం`తో తెలుగు ఆడియెన్స్ ని అబ్బురపరిచిన సాయిపల్లవి తాజాగా `గార్గి` సినిమాతో వస్తోంది. మరో బలమైన కంటెంట్ ఉన్న చిత్రంతో ఆమె శుక్రవారం ఆడియెన్స్ ముందుకొస్తుంది. గౌతమ్‌ రామచంద్రన్ దర్శకత్వం వహించిన `గార్గి` మూవీ జులై 15న విడుదలైంది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

లేడీ పవర్‌ స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది సాయిపల్లవి. నేచురల్‌ అందం, సహజమైన నటనతో ఆకట్టుకుంటూ తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. అద్బుతమైన నటన, డాన్సులు ఆమె సొంతం. అందుకే ఈ అమ్మడికి భారీ ఫాలోయింగ్‌. హీరోయిన్లలో ఒక్కటే పీస్‌, రేర్ పీస్‌ సాయిపల్లవి. రొటీన్‌కి భిన్నమైన సినిమాలు, పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటుంది. స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. ఇటీవల `విరాటపర్వం`తో మెప్పించిన ఆమె మరో బరువైన పాత్రతో, బరువైన కథతో వచ్చింది. ఆమె లేటెస్ట్ గా నటించిన `గార్గి` చిత్రం నేడు శుక్రవారం(జులై 15) విడుదలైంది.గౌతమ్‌ రామచంద్రన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో(Gargi Movie Review) తెలుసుకుందాం. 
 

కథః 

న్యాయం కోసం పోరాడే ఓ టీచర్‌ కథే `గార్గి`. సాయిపల్లవి(గార్గి పాత్ర) సినిమాలో ఓ స్కూల్ టీచర్‌. తన కుటుంబమే ప్రపంచంగా బతుకుతున్న అమ్మాయి. తండ్రి ఆర్‌ఎస్‌ శివాజీ(బ్రహ్మానందం పాత్ర) ఓ అపార్ట్ మెంట్ లో వాచ్‌మెన్‌గా పనిచేస్తుంటారు. సింపుల్‌గా, సరదాగా సాగే గార్గి లైఫ్‌ని బాలిక గ్యాంగ్‌ రేపు ఘటన మలుపుతిప్పుతుంది. ఓ రోజు రాత్రి జరిగిన బాలిక గ్యాంగ్‌ రేప్‌ కేసులో గార్గి తండ్రిని అరెస్ట్ చేస్తారు పోలీసులు. దీంతో ఆమె జీవితం మొత్తం తలక్రిందులవుతుంది. ఆమె కన్న కలలన్నా భగ్నమవుతాయి. సమాజం గార్గి కుటుంబాన్ని దోషులుగా చూస్తుంది. దీంతో ఎన్నో అవమానాలు ఎదుర్కోవల్సి వస్తుంది. కానీ తండ్రి తప్పు చేయలేదని బలంగా నమ్ముతుంది గార్గి. దీంతో న్యాయపోరాటానికి సిద్ధమవుతుంది. అక్కడ కూడా కష్టాలే. ఏ లాయర్‌ తన తండ్రి కేసుని వాదించేందుకు ముందుకు రారు. చివరికి అసిస్టెంట్‌ లాయర్‌ గా పనిచేస్తున్న కాళీవెంకట్‌(గిరీశం పాత్ర) గార్గి తండ్రి కేసుని ఒప్పుకుంటాడు. మరి అక్కడి నుంచి గార్గి ప్రయాణం ఎలా సాగింది? ఈ క్రమంలో ఎలాంటి ఆటుపోట్లని ఎదుర్కొంది. ఎలా ధైర్యంగా నిలిచింది. తండ్రిని నిర్ధోశిగా బయటకు తీసుకొచ్చిందా? లేదా? అనేది మిగిలిన సినిమా కథ. 
 

Latest Videos


విశ్లేషణః 

సాయిపల్లవి సినిమా అంటే కచ్చితంగా బలమైన కంటెంట్ ఉంటుందనే నమ్మకం జనాల్లో ఉంది. ఆ విషయంలో సాయిపల్లవి కూడా ఆడియెన్స్ నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నమే చేస్తుంది. `గార్గి`తో అదే చేసింది. `గార్గి` బాలికలపై అత్యాచార ఘటనలను చర్చించింది. అయితే ఈ బ్యాక్‌డ్రాప్‌ కొత్తదేం కాదు. ఇప్పటికే అనేక సినిమాలు వచ్చాయి. చాలా సినిమాల్లో ఇలాంటి అంశాలను చర్చిస్తూనే ఉంటారు. కానీ దీన్ని దర్శకుడు భిన్నంగా నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా అత్యాచార ఘటనలో బాధితుల ఫ్యామిలీ, నిందితుల ఫ్యామిలీ మెంబర్స్ స్ట్రగుల్స్ ని ఆవిష్కరించిన చిత్రమిది. వారు ఎంతటి అవమానాలు భరించాల్సి ఉంటుందో కళ్లకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు గౌతమ్ రామచంద్రన్‌. ఆడపిల్లలకు అడుగడుగున వివక్ష, వేధింపులు ఎదురవుతూనే ఉన్నాయనే అంశాన్ని చర్చించారు.  Gargi Movie Review.

ఏదైనా ఒక ఘటనలో నిజనిజాలు నిరూపితం కాకముందే నిందితులను నేరస్థులుగా ముద్ర వేస్తుంటారు. అది వారి ఫ్యామిలీకి ఎంతటి నరకమనేది `గార్గి`లో ఆవిష్కరించారు. అదే సమయంలో ఇలాంటి ఘటనల్లో మీడియా చేసే ఓవరాక్షన్‌ని చూపించారు. ఇష్టానుసారం ప్రసారం  చేసే వార్తల వల్ల వారి కుటుంబం ఎంతటి మనో వ్యథను అనుభవిస్తుందో `గార్గి`చూస్తే తెలుస్తుంది. చిన్నారులపై ఆకృత్యాలతోపాటు వారి కుటుంబాలు పడే వేదన మనసుల్ని కదిలిస్తాయి. అదేసమయంలో ఆడపిల్లల పెంపకం విషయంలో పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని ఇందులో ఆమోదయోగ్యంగా చూపించడం విశేషం. Gargi Movie Review.

సినిమా ప్రారంభం నుంచే సింపుల్‌గా సాగుతుంది. ఎలాంటి ఆర్భాటాలకు తావులేకుండా స్ట్రయిట్‌గా కథలోకి వెళ్లాడు దర్శకుడు. గార్గి నేపథ్యాన్ని చూపించి వెంటనే తండ్రిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లడం, సమాజం నుంచి అవమానాలు ఎదురు కావడం వంటి సన్నివేశాలు చకచకా జరిగిపోతాయి. మొదట్లో సినిమా పరుగులు పెట్టిస్తుంది. కోర్ట్ వరకు వెళ్లేంత వరకు ఆసక్తికరంగా సాగుతుంది. కోర్ట్ రూమ్‌ డ్రామా వచ్చే సరికి సినిమాలో వేగం తగ్గుతుంది. ఇప్పటికే తెలుగు ఆడియెన్స్ చాలా కోర్ట్ రూమ్‌ డ్రామాలు చూసిన నేపథ్యంలో ఇందులో ఆయా సన్నివేశాలు అంతగా మెప్పించలేకపోయాయి. పైగా ప్రతి సీన్‌ నత్తనడకన సాగడం ఆడియెన్స్ ఓపికని పరీక్షిస్తుంది. సినిమా నిడివి తక్కువే అయినా, వేగం లేకపోవడం వల్ల చాలా సేపు చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్ వరకు నెమ్మదిగా సాగుతుంది. క్లైమాక్స్ లో ఊహించని మలుపులు ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఊహించిన క్లైమాక్స్ ఆడియెన్స్ హృదయాలను కదిలిస్తుంది. ఎమోషనల్ కి గురి చేస్తుంది. సినిమాలో ఆర్ట్ చిత్ర ఛాయలు కనిపిస్తాయి. సందేశాత్మకంగా సాగిన ఈ చిత్రంలో కమర్షియల్‌ హంగులు లేకపోవడం వల్ల కమర్షియల్‌గా వర్కౌట్‌ కావడమనేది సాహసమనే చెప్పాలి. Gargi Movie Review.

నటీనటులుః
సాయిపల్లవి నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె బలమైన పాత్రలు దొరికితే ఇరగదీస్తుంది. `గార్గి`లోనూ విశ్వరూపం చూపించింది. తండ్రిని నిర్ధోశిగా నిరూపించడం కోసం  ఆధారాలు సేకరించే సమయంలో ఆమె ఆరాటం, పడే వేదన వంటి సీన్లలో అద్భుతమైన భావోద్వేగాలు పలికించింది. అవార్డులు, రివార్డులు తెచ్చేంతటి నటనని ప్రదర్శించిందని చెప్పొచ్చు. గార్గి పాత్రలో ఆమెని తప్ప మరెవ్వరినీ ఊహించుకోలేం. అయితే సాయిపల్లవి నుంచి ఆమె అభిమానులు ఆశించే డాన్సులు ఇందులో మిస్సింగ్‌. లాయర్ గిరీశం పాత్రలో కాశీ వెంకట్‌ బాగా చేశారు. అంతో ఇంతో వినోదం ఆయన పాత్ర ద్వారానే పుడుతుంది. అత్యాచార బాలిక తండ్రిగా కలైమామణి శరవణన్‌ నటన హృదయాలను కదిలిస్తుంది. జడ్జ్ గా ట్రాన్స్ జెండర్‌ చేయడమనేది సినిమా ప్రత్యేకతని ఆవిష్కరిస్తుంది. జయప్రకాష్‌, ఐశ్వర్య లక్ష్మి జస్ట్ మెరిశారు. Gargi Movie Review.

టెక్నీషియన్లుః 
దర్శకుడు గౌతమ్‌ రామచంద్రన్‌ ఈ సినిమా కథని రాసుకున్న తీరు చాలా బాగుంది. ఇదే సినిమాకి బలం. తాను చెప్పాలనుకున్న అంశాలను నీట్‌గా, క్లీయర్‌గా తెరపై ఆవిష్కరించారు. చాలా మెచ్యూర్ గా తెరకెక్కించారు. అయితే మొదట్లో కథని పరుగులు పెట్టించిన ఆయన ఇంటర్వెల్‌ తర్వాత ఆ వేగాన్ని కంటిన్యూ చేయలేకపోయారు. మెలోడ్రామా కాస్త ఎక్కువైన ఫీలింగ్‌. కోర్ట్ రూమ్‌ డ్రామాని రక్తికట్టించలేకపోయారు. సినిమా నిడివి తక్కువే అయినా వేగం లేకపోవడంతో బోర్ ఫీలింగ్‌ని కలిగిస్తాయి. ఓవరాల్‌గా దర్శకుడిగా తన ప్రతిభని చాటుకున్నారని చెప్పాలి. కెమెరా వర్క్ బాగుంది. గోవింద వసంత బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకి పెద్ద అసెట్‌. చాలా చోట్ల బ్యాక్‌ గ్రౌండ్ స్కోరే మాట్లాడుతుందని చెప్పొచ్చు.  Gargi Movie Review.

ఫైనల్‌గాః 
`గార్గి` ఒక జెన్యూన్ అటెమ్ట్. చిన్న కథ పెద్ద సందేశం. కమర్షియాలిటీ, వినోదం అనే అంశాలు పక్కన పెట్టి చూస్తే సినిమా అందరికి నచ్చుతుంది. సాయిపల్లవి అభిమానులకు మరంతగా నచ్చుతుంది. Gargi Movie Review.

రేటింగ్‌ః 3

click me!