Happy Birthday:లావణ్య త్రిపాఠి 'హ్యాపీ బర్త్ డే' రివ్యూ

First Published | Jul 8, 2022, 1:59 PM IST

స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ప్రధాన పాత్రలో మత్తువదలరా ఫేమ్ రితేష్ రానా (Ritesh Rana) దర్శకత్వంలో చేస్తున్న యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ‘హ్యాపీ బర్త్ డే'(Happy Birthday). క్లాప్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ (Mythri Movie makers)పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి(చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన సర్రియల్ జూలై 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. 


కొత్తదనం ఎప్పుడూ ఆహ్వానించే విషయంలో తెలుగువారు ఎప్పుడూ ముందు ఉంటారు. అందుకే తెలుగు పరిశ్రమలో అనేక ప్రయోగాత్మక చిత్రాలు వచ్చాయి. కమర్షియల్ సినిమాకు కేరాఫ్ ఎడ్రస్ ఎలాగో...వైవిధ్యానికి తెలుగు సినిమా అవకాశం వచ్చినప్పుడల్లా రెడ్ కార్పేట్ వేస్తోంది. అయితే ఆ వైవిధ్యం, వినోదం సగటు సినీ ప్రేక్షకుడుకి  అర్దం కావాలి. .. అలరించాలి. ఆకట్టుకోవాలి. ఆ క్రమంలోనే వచ్చిన చిత్రం 'హ్యాపీ బర్త్ డే'. తెలుగుకు కొత్త జానర్ అయిన Surreal humour తో ఈ సినిమా తెరకెక్కింది. మత్తు వదలరా చిత్రంతో తానేంటో ప్రూవ్ చేసుకున్న దర్శకుడు ఈ సినిమాతో మరోసారి మనందరికి నచ్చేసాడా? అసలు ఈ సినిమా కథేంటి..బర్డడేలో ఏం జరిగింది వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.


కథ..
 రక్షణ శాఖ మంత్రి  రిత్విక్ సోధీ (వెన్నెల కిషోర్‌) ఇంటికో  గన్ తెస్తాడు. దాంతో…దేశంలో ఎక్కడ చూసినా  గన్స్ గోలే. ప్రతీ ఒక్కరూ ఒక గన్ కొనుక్కుని తమతో పెట్టుకోవాలని ఉత్సాహపడుతూంటారు. బహిరంగ మార్కెట్ లో గన్స్ ..కామన్ థింగ్స్ అయ్యిపోతాయి. క్యాజువల్ గా షాప్ కు వెళ్లి జనం కొనుక్కుంటూంరా.   ఇదిలా ఉంటే  పసుపులేటి హ్యాపీ త్రిపాఠీ (లావణ్యా త్రిపాఠీ)... తన  ఫ్రెండ్ స‌ర్‌ప్రైజ్‌ బర్త్ డే పార్టీ ప్లాన్ చేశానంటే రిట్జ్ గ్రాండ్ హోటల్‌కు వెళుతుంది. పార్టీ విసుగ్గా , చిరాగ్గా ఉండటంతో ఉండటంతో సేమ్ హోటల్‌లో ఉన్న పోష్ పబ్‌కు వెళుతుంది. 
Happy Birthday  Review

Latest Videos



అయితే హ్యాపీ ఆర్డర్ చేసిన డ్రింక్‌లో మత్తు మందు కలుపుతారు. ఆమెను ఒక బేరర్ కిడ్నాప్ చేస్తాడు. మత్తు నుంచి కోలుకున్నాక... మళ్ళీ అదే  హోటల్‌కు హ్యాపీ వస్తుంది.  మరో ప్రక్క అదే హోటల్ లో ప‌నిచేస్తున్న ల‌క్కీ (నరేష్ అగస్త్య) కు ఓ పని అప్పచెప్పబడుతుంది.  ఓ లైట‌ర్ సంపాదించ‌డానికి నానా తంటాలు పడుతూంటాడు. అలాగే మాక్స్ పెయిన్ (స‌త్య‌) ఓ శ‌వాన్ని పాతిపెట్టే పని ఒప్పుకుని అక్కడికే వస్తాడు.   గన్ లైసెన్స్‌లు లీగలైజ్ చేసిన రిత్విక్ సోది (వెన్నెల కిషోర్) కూడా అక్కడికే వ‌స్తాడు. ఆ త‌ర‌వాత‌… ర‌క‌ర‌కాల క్యారెక్ట‌ర్లు ప‌బ్‌లోకి వ‌స్తుంటాయి. ఇంత‌కీ హ్యాపీని కిడ్నాప్ చేసిందెవ‌రు? ఆ లైట‌ర్ గొడవ ఏమిటి? ఈ  పాత్ర‌ల‌కు ఒక‌రితో మ‌రొక‌రికి ఉన్న లింక్ ఏమిటి?  ఒకరికొకరు పరిచయం ఉన్నవారేనా, కథలో మెయిన్ ట్విస్ట్ ఏమిటి..  అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 

Happy Birthday  Review

విశ్లేషణ

కొత్తదనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాల్సిందే. ప్రయోగాలకు పట్టం కట్టాల్సిందే. అయితే ఆ కొత్తదనం చెత్తదనం కాకూడదు అనేది తెలుగు ప్రేక్షకుడి ట్యాగ్ లైన్. ఈ సినిమా విషయంలో చేసిన ప్రయోగం వికటించింది.  ఈ సినిమా స్టోరీ లైన్ ఉన్నంత క్రేజీగా సినిమాని తీర్చిదిద్దలేకపోయారు. క్యారక్టర్స్ పాయింటాఫ్ లో స్టోరీ నేరేట్ చేయటం ఈ స్క్రీన్ ప్లే బ్యూటీ. కొత్త క్యారక్టర్ ప్రవేశించినప్పుడల్లా కొత్త డైమన్షన్ కథలో కనపడుతుంది. పాత్రలు అన్ని మెయిన్ స్టోరీ కి లింక్ వేసిన విధానం సైతం బాగుంది. అలాగే కథని చాప్టర్స్ గా విభజించిన తీరు  Quentin Tarantino సినిమాల  స్క్రీన్ ప్లే గుర్తు చేస్తుంది. అర్బన్ సొసైటి మీద, టీవి షోల మీద వేసిన కొన్ని సెటైర్  డైలాగులు అదిరిపోయాయి. 


అయితే Surreal humour అనేది మనకు పరిచయం తక్కువే. హాలీవుడ్ లో కూడా అప్పుడప్పుడూ పలకరించే జానర్.  చిత్రమైన ఆలోచలనే స్టోరీ ఐడియాగా ఇలాంటి సినిమాలు తెరకెక్కుతూంటాయి. అయితే  వీటిని రెగ్యులర్ ఫన్ మూవీస్ గా చూసేస్తే మాత్రం పెద్దగా ఆసక్తిగా అనిపించవు. ఆ స్టోరీ వరల్డ్ లోకి వెళ్లి...ఆ Surreal సెన్స్ ని బుర్రకెక్కించుకుంటేనే కిక్ ఇస్తాయి. హ్యాపీ బర్తడే సినిమాని సైతం Surreal కామెడీగా చెప్పారు. ఈ సినిమాలో పాత్రలు అలాగే బిహేవ్ చేస్తాయి. అయితే కథగా కామన్ ఆడియనా్ కు అర్దమయ్యేలా కొంత దిగి వచ్చి రాసుకున్నారు. అయినా ఫన్ పగలబడి నవ్వేటంతగా వర్కవుట్ కాలేదు. 

ఓ సెన్సాఫ్ హ్యూమర్ కే కొన్ని సీన్స్ పరీక్ష పెడతాయి. ముఖ్యంగా మీమ్స్ పేజీలో వచ్చే జోక్స్, వాట్సప్ లో వచ్చే వన్ లైనర్స్ ఈ సినిమాలో ఎక్కువగా కనపడతాయి. అవి అంతంత మాత్రంగా నచ్చుతాయి. కొన్ని సార్లు వెగటు పుట్టిస్తాయి.  'జబర్దస్త్ జడ్జ్‌లా సంబంధం లేకుండా నవ్వుతున్నావ్' అని సినిమాలో ఓ డైలాగ్ ఉంది.  అదే విధంగా మనకు ఈ సినిమా చూస్తూంటే ఇది ఫన్ సినిమా అని ఎందుకు ప్రచారం చేసారు అని అడగాలి అనిపిస్తుంది. అలాగే డైరక్టర్ ...ఇవివి గారి స్కూల్ లోకి కూడా కొన్ని సార్లు వెళ్లి .. 'నిర్మాతల కోరిక మేరకు చిత్రీకరించబడింది' వంటి వాక్యాలు వాడాడు. 

ఓవరాల్ గా ఫస్టాఫ్ ఫన్ ,కొత్త సెటప్ తో పాసై పోయినా సెకండాఫ్ మాత్రం చతికిలపడింది. ఒకే తరహా సీన్స్ రిపీట్ అవుతున్న ఫీలింగ్ ఉంటుంది. సెకండాఫ్ లో పాత్రలు కాస్త తగ్గిస్తే బాగుండేది. అలాగే సినిమాలో మెయిన్ ట్విస్ట్ అనుకున్నది పెద్దగా పేలలేదు. 

Happy Birthday  Review.

టెక్నికల్ గా...

దర్శకుడుగా రితేష్ రానా ..రొటీన్ గా వెళ్లకుండా కొత్తగా ప్రయత్నించారు. అక్కడ దాకా ఆయన సక్సెస్. అయితే కాస్త తెలుగు ప్రేక్షకుడుని కూడా దృష్టిలో పెట్టుకుంటే అనవసరమైన కన్ఫూజన్ తప్పేది. డైరక్టర్ ఒకటి అనుకుంటే ప్రేక్షకుడు మరొకటి అనుకునే ప్రమాదాలే సినిమాలో అడుగడుక్కీ ఉన్నాయి. ఇక సంగీతం విషయానికి వస్తే...సినిమాకు కాలభైరవ ఇచ్చిన పాటలు అంత గొప్పగా లేవు. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ఫెరఫెక్ట్ గా సింక్ అయ్యింది. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ చేయచ్చు. సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. సినిమాలో ఆర్ట్ వర్క్ మాత్రం అద్బుతంగా ఉంది. వాళ్లదే కష్టం. ప్రొడక్షన్ వాల్యూస్...బాగా చిన్న సినిమాకి బాగా ఖర్చుపెట్టారనిపించేలా ఉన్నాయి.  

నటీనటుల్లో 

లావణ్య త్రిపాఠి...డీసెంట్ గా, కొత్తగా చేసింది. అయితే ఆమె పాత్ర ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే  half-baked అనిపించకపోను. అయితే తన వంతు గా ఆడియన్స్ ని ఎంగేజ్ చేయటంలో మాత్రం లావణ్య ఫెయిల్ కాలేదు.,ఈ సినిమాలో ఫుల్ మార్కులు సత్యాకే పడతాయి.  హిలేరియస్ గా నవ్వించాడు. వెన్నెల కిషోర్ ప్రారంభంలో ఇచ్చే ఇంటర్వూ, కొన్ని సీన్స్ బాగున్నాయి. అలాగే నరేష్ కూడా.  మిగతా పాత్రలు వచ్చి వెళ్లిపోయాయి కానీ గుర్తుండిపోయేలా లేవు.  
 

బాగున్నవి:
సత్య కామెడీ సీన్స్ 
సెటైర్స్ తో కూడిన డైలాగులు
ప్రొడక్షన్ వాల్యూస్

బాగోలేనివి :

కొత్త తరహా స్క్రీన్ ప్లే అని తికమక చేసేయటం
కీ క్యారక్టర్ హీరోయిన్ 
ప్రతీ రెండో సీన్ కు కొత్త పాత్ర ప్రవేశం
సెకండాఫ్ బోర్ కొట్టడం
 

ఫైనల్ థాట్

 ఈ పార్టికి గన్ తెచ్చుకుంటే పొరపాటున కాల్చుకోవాలనిపించవచ్చు..జాగ్రత్త 

---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating: 2

నటీనటులు: లావణ్యా త్రిపాఠీ, నరేష్ ఆగస్త్య, సత్య, వెన్నెల కిషొర్, గెటప్ శ్రీను తదితరులు 
సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం
సంగీతం: కాల భైరవ
సమర్పణ: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి
నిర్మాతలు: చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: రితేష్ రానా
విడుదల తేదీ: జూలై 8, 2022

click me!