విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆనంద్ దేవరకొండ. `దొరసాని` చిత్రంతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత మూడు సినిమాలు ఓటీటీలోనే వచ్చాయి. పెద్దగా ప్రభావాన్ని చూపించలేదు గానీ కంటెంట్ ఉన్న సినిమాలుగా ప్రశంసలందుకున్నాయి. ఈక్రమంలో గతేడాది `బేబీ`తో హిట్ కొట్టాడు ఆనంద్ దేవరకొండ. సుమారు వంద కోట్లు వసూలు చేసిందీ మూవీ. దీంతో తనకంటూ ఓ గుర్తింపు, క్రేజ్, మార్కెట్ ఏర్పడింది. ఇప్పుడు `గం గం గణేశా` చిత్రంతో వస్తున్నాడు. క్రైమ్ యాక్షన్ కామెడీగా ఈ మూవీ తెరకెక్కింది. కొత్త దర్శకుడు ఉదయ్ శెట్టి రూపొందించారు. ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. నేడు శుక్రవారం ఈ మూవీ విడుదలైంది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథః
గణేష్(ఆనంద్ దేవరకొండ), శంకర్(ఇమ్మాన్యుయెల్) అనాథలు. చిన్న చిన్న దొంగతనాలు చేసి లైఫ్‌ని లీడ్ చేస్తుంటారు. గణేష్‌కి లవర్(ప్రగతి శ్రీవాస్తవ) కూడా ఉంటుంది. ఇలా దొంగతనాలతో వచ్చిన డబ్బుని జల్సాలు చేస్తుంటారు. గణేష్ తన లవర్‌తో ఎంజాయ్ వాడుతుంటాడు. ఈ క్రమంలో తన లవర్ తాను పని చేసే షాప్ హోనర్‌తో పెళ్లికి రెడీ అవుతుంది. దీంతో గణేష్ హార్ట్ బ్రేక్ అవుతుంది. డబ్బు కోసమే అతన్ని పెళ్లి చేసుకున్నావ్ కదా, పెళ్లి అయ్యే లోపు తాను కూడా కోటీశ్వరుడిని అవుతానని లవర్‌తో సవాల్ చేస్తాడు గణేష్. ఇంతలో గోల్డ్ షాప్ హోనర్ కొడుకు అరుణ్ సుథారియా(బిగ్ బాస్ యావర్)నుంచి పెద్ద డీల్ వస్తుంది. తన షాప్‌లో ఉన్న ఓ అరుదైన డైమాండ్ కొట్టేస్తే భారీగా డబ్బు ఇస్తానని చెబుతాడు. ప్లాన్ ప్రకారం రాత్రి సమయంలో డైమండ్ కొట్టేస్తారు. కానీ పోలీసులకు తెలిసి వీరిని వెతుకుతుంటాడు. ఆ డైమండ్‌తో గణేష్, శంకర్ చెన్నైపారిపోయి అమ్ముకోవాలనుకుంటారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటాయి. నంధ్యాలలో ఎన్నికలు చాలా హాట్ హాట్‌గా సాగుతుంటాయి. ప్రభుత్వం స్థానిక లీడర్ కిశోర్ రెడ్డిని అణగదొక్కాలని, ఆయన ఆస్తులు, డబ్బు సీజ్ చేస్తారు. దీంతో తన స్నేహితుడి సహాయంతో ముంబయి నుంచి వంద కోట్ల డబ్బుని తెప్పిస్తుంటారు కిశోర్ రెడ్డి. ఎన్నికల నేపథ్యంలో చెక్ పోస్ట్ ల వద్ద పోలీసులు తనికీలు చేస్తుంటారు. అయితే తన డైమండ్ కోసమే వాళ్లు చెక్ చేస్తున్నారని భావించి, తమ వెనకాల ఉన్న గణేష్ విగ్రహం లోపల డైమండ్‌ని పడేస్తాడు గణేష్. చెక్ పోస్ట్ దాటాక వీరి కారు పెట్రోల్ లేక ఆగిపోతుంది. గణేష్ విగ్రహంతో ఉన్న లారీ వెళ్లిపోతుంది. దీంతో తమ డైమండ్ మిస్ అయ్యిందని బాధపడుతుంటారు గణేష్, శంకర్. మరోవైపు గణేష్ విగ్రహం వచ్చిందనే సంబరంలో ఉన్న కిశోర్ రెడ్డి ఆ విగ్రహాన్ని కరిగించగా, అందులో డబ్బు ఉండదు. దీంతో ఆ డబ్బు ఎలా మాయమైంది?, డైమండ్ ఎలా మిస్ అయ్యింది? ఈ క్రమంలో ఎలాంటి ట్విస్ట్ లు చోటు చేసుకున్నాయి? చివరికి ఏం జరిగింది? ఇందులో వెన్నెల కిశోర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ.
విశ్లేషణః
`బేబీ`తో హిట్ అందుకున్నాడు ఆనంద్ దేవరకొండ. దానికి భిన్నంగా కథతో `గం గం గణేశా` చిత్రం చేశాడు. క్రైమ్ కామెడీ మూవీ ఇది. జనరల్‌గా డబ్బు చుట్టూ, ఏదైనా విలువైన వస్తువుల చుట్టూ కథ తిరగడం, దానికోసం రెండు మూడు గ్రూపులు వెతకడం, పోటీపడటం ఇలాంటి క్రైమ్ కామెడీ చిత్రాల్లో జరుగుతుంటుంది. అందులో భాగంగానే సిచ్చ్యువేషనల్ కామెడీ వర్కౌట్ అవుతుంటుంది. అదే సినిమాకి మెయిన్ అసెట్. ఆ కామెడీ వర్కౌట్ అయితే సినిమా హిట్, లేదంటే ఫట్. `గం గం గణేశా` విషయంలోనూ దర్శకుడు ఉదయ్ శెట్టి, హీరో ఆనంద్ దేవరకొండ, ఆయనతో నటించిన ఇమ్మాన్యుయెల్ అదే చేశారు. ఇన్నోసెంట్ యాక్టివిటీస్‌తో కామెడీని పుట్టించడంలో కొంత వరకు సక్సెస్ అయ్యారు. సినిమా మొత్తంగా అది వర్కౌట్ కాకపోయినా మధ్య మధ్యలో ఆ ఫన్ పేలింది. ప్రారంభంలో ఆనంద్ దేవరకొండ, ఇమ్మాన్యుయెల్ చేసే చిన్న చిన్న దొంగతనాలు, అమాయకపు పనులు, ఒకరిపై ఒకరు కామెంట్ చేసుకోవడం ఫన్నీగా ఉంటాయి. అదే సమయంలో ఆనంద్ ఓ అమ్మాయిని ప్రేమించడం, ఆమె తాను పనిచేసే హోనర్‌నే పెళ్లి చేసుకోవాలనుకునే సీన్లు కూడా ఫన్నీగా చూపించాడు. తన లవర్‌తో అమ్మాయిల గురించి ఆనంద్ చెప్పే డైలాగ్ సైతం బాగా పేలింది. బేబీ తరహాలోనే ఇందులో కూడా ఆ కాసేపు హో అనిపించేలా ఉంది. కాకపోతే ఫస్టాఫ్ మొత్తం కాస్త పాత్రల ఎస్టాబ్లిష్, కథ ముందుకు నడవడం కోసం డిఫరెంట్ స్టోరీస్ ఎంట్రీ కావడానికే టైమ్ పడుతుంది. దీంతో ఫస్టాఫ్‌లో పెద్దగా ఫన్ వర్కౌట్ కాలేదు. కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. ఆ డైమండ్, ఆ మనీ ఎలా మిస్ అయ్యిందనేది ఆడియెన్స్ లు ఉత్సుకతని పెంచుతుంది.
సెకండాఫ్ మొత్తం ఓ ఊరుకి షిఫ్ట్ అవుతుంది. అక్కడ వినాయకుడి విగ్రహం చుట్టూ తిరుగుతుంది. అందులోనే డబ్బు ఉందని అటు కిశోర్ రెడ్డి గ్యాంగ్, మరోవైపు అందులోనే డైమండ్ ఉందని గణేష్, శంకర్ భావిస్తుంటారు. ఈ రెండు గ్రూపులు ఆ రాజావారిని, ఊరు జనాలను బురిడి కొట్టించే ప్లాన్ ఈ క్రమంలో పుట్టే కామెడీ నవ్వులు పూయించేలా ఉంటుంది. సెకండాఫ్ సినిమా చాలా వరకు హిలేరియస్‌గా మారుతుంది. సెకండాఫ్‌లో వెన్నెల కిశోర్ ఎంట్రీ తర్వాత సినిమా నెక్ట్స్ లెవల్‌కి వెళ్తుంది. డాక్టర్‌గా ఆయన చేసే ఫన్ మామూలు కాదు. ఉన్నంతలో నవ్వులు పూయించే పాత్ర ఏదైనా ఉందంటే అదే. దాని చుట్టూనే ఈ కామెడీ జనరేట్ అవుతుంది. అదే సమయంలో డబ్బు కోసం, డైమండ్ కోసం రెండు గ్రూపులు పడే తంటాలు సైతం నవ్వించేలా ఉంటాయి. దీంతోపాటు మెడపై టాటూ నీ పేరే వేయించుకున్నా అని ఆనంద్ అందరికి చెప్పడం మరింత హైలైట్‌గా నిలిచింది. అయితే అదంతా అక్కడక్కడ వర్కౌట్ అయిన కామెడీ సీన్లు. క్లైమాక్స్ ఊహించినట్టుగానే ఉంటుంది. ఇలాంటిదే చాలా సినిమాల్లో ఉంటుంది. ఇందులోనూ సేమ్. అందులో కొత్తదనం లేదు. మరోవైపు యావర్ టీమ్ కి సంబంధించిన సన్నివేశాలు సినిమాకి సెట్ కాలేదు. అవి అడ్డంకిగానే ఉన్నాయి. ఫస్టాఫ్‌లో ఆశించిన కామెడీ పండలేదు. అది కాస్త డిజప్పాయింట్ చేస్తుంది. ఊర్లో విగ్రహం చుట్టూ జరిగే సన్నివేశాలు కూడా కాస్త చిరాకుగా అనిపిస్తాయి. అదే సమయంలో రొటీన్‌గా అనిపిస్తుంటాయి. క్లైమాక్స్ ని మరింత బాగా డిజైన్ చేస్తే సినిమా బాగుండేది. కానీ ఓవరాల్‌గా టైమ్ పాస్‌కి నవ్వుకునే సినిమా అవుతుంది.
నటీనటులుః
గణేష్‌గా ఆనంద్ దేవరకొండ బాగా చేశాడు. గతంలో ఆయన పాత్రలు చాలా సెటిల్డ్ గా, కంపోజ్‌గా ఉండేవి. కానీ ఇందులో చాలా ఓపెన్ అయ్యాడు. ఫన్ యాంగిల్ బయటకు వచ్చింది. కామెడీ చేయడంలోనూ కొంత వరకు సక్సెస్ అయ్యాడు. ఇమ్మాన్యుయెల్ సినిమాకి ఓ హైలైట్ అతనితో కలిసి ఆనంద్ చాలా వరకు నవ్వించే ప్రయత్నం చేశాడు. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. ఇంకా బాగా వర్కౌట్ అయితే సినిమా ఫలితం వేరేలా ఉండేది. ఇక సెకండ్ పార్ట్ లో వెన్నెల కిశోర్ కామెడీ సినిమాకే హైలైట్. తనదైన స్టయిల్‌లో రెచ్చిపోయాడు వెన్నెల కిశోర్. ఇక రుద్ర పాత్రలో చైతన్య, కిశోర్ రెడ్డిగా రాజ్ అర్జున్ అదరగొట్టారు. రాజావారి పాత్రలో సత్యం రాజేష్ కి యాప్ట్ పాత్ర పడింది. ఇటీవల హీరోగా చేస్తున్న ఆయన మరోసారి తన కామెడీతో నవ్వులు పూయించే ప్రయత్నం ఏచశాడు. హీరోయిన్ల పాత్రలకి పెద్దగా ప్రయారిటీ లేదుకానీ ఉన్నంత సేపు ఇద్దరు హీరోలు ఓకే అనిపించారు. యావర్ జస్ట్ ఓకే అనిపించాడు, కానీ ఆయన పాత్ర కథలో సెట్ కాలేదు. మిగిలిన నటీనటులు ఫర్వాలేదనిపించారు.
టెక్నీషియన్లుః
సినిమాకి చేతన్ భరద్వాజ్ సంగీతం ప్లస్ అయ్యింది. రెండు పాటలు అదిరిపోయాయి. వినసొంపుగా ఉన్నాయి. అదే సమయంలో బీజీఎం కూడా హైలైట్ అయ్యింది. రేసీగా సాగే స్క్రీన్‌ని అంతే బాగా ఎలివేట్ కావడంతో బీజీఎం కీలక పాత్ర పోషించిందని చెప్పొచ్చు. దీంతోపాటు ఆదిత్య జవ్వాడి కెమెరా వర్క్ బాగుంది. విజువల్‌గా చాలా నీట్‌గా ఉంది. రిచ్‌గానూ ఉంది. సినిమా నిడివి తక్కువే. ఎడిటర్ అవసరం లేని సీన్లు తీసేయాల్సింది. ఇక దర్శకుడు ఉదయ్ శెట్టి రొటీన్ క్రైమ్ కామెడీనికి కొత్త ట్రీట్‌మెంట్ ఇచ్చాడని చెప్పొచ్చు. స్క్రీన్‌ప్లే చిన్న మ్యాజిక్ చేశాడు. అది కొంత వరకు ఫర్వాలేదనిపించింది. రొటీన్‌గా అనిపించినా, ఫన్ అక్కడక్కడ వర్క్ కావడంతో నడిచిపోయింది. సహజమైన ఫన్ క్రియేట్ చేయడంలో పూర్తిగా సక్సెస్ కాలేకపోయినా, తొలి సినిమా పరంగా చూస్తే బెటర్‌గానే చేశాడని చెప్పొచ్చు. మరీ విసిగించే సన్నివేశాల విషయంలో కేర్ తీసుకుంటే బాగుండేది.
ఫైనల్‌గాః `గం గం గణేశా` కొంత వరకు నవ్వించే మూవీ.
రేటింగ్‌ః 2.5
నటీనటులు :
ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక, కరిష్మా, వెన్నెల కిషోర్, సత్యం రాజేశ్, జబర్దస్త్ ఇమాన్యూయల్, రాజ్ అర్జున్, తదితరులు.
టెక్నికల్ టీమ్ :
ఆర్ట్: కిరణ్ మామిడి
ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్
సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాడి
సంగీతం - చేతన్ భరద్వాజ్
లిరిక్స్ - సురేష్ బనిశెట్టి
బ్యానర్ - హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్
కొరియోగ్రఫీ: పొలాకి విజయ్
కో-ప్రొడ్యూసర్ -అనురాగ్ పర్వతనేని
నిర్మాతలు - కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి
రచన, దర్శకత్వం - ఉదయ్ శెట్టి