విశ్వక్సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' రివ్యూ

First Published | May 31, 2024, 1:36 PM IST

 చల్ మోహన్ రంగా, రౌడీ ఫెలో వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. గతంలో కొన్ని సినిమాలకు లిరిసిష్టుగా వ్యవహరించిన ఆయన త్రివిక్రమ్ శిష్యుడిగా పేరు తెచ్చుకున్నాడు.

Gangs Of Godavari


క్రైమ్ నేపధ్యంలో వచ్చే సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అందుకే మాస్ సినిమా అంటే మనకు నేర నేపధ్యం ఉన్న సినిమానే. అయితే ప్రతీ క్రైమ్ సినిమా పక్కాగా హిట్ అవుతుందని చెప్పలేం. దానికి ఓ స్క్రీన్ ప్లే, ఫెరఫెక్ట్ క్యారక్టరైజేషన్, రీజనింగ్ అవసరం. అలాంటి మాస్ సినిమానే అంటూ హామీ ఇస్తూ వచ్చిన   'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' నిజంగానే అంచనాలకు తగినట్లు ఉందా..లేక మాడు పగలకొట్టిందా చూద్దాం.  

Gangs of Godavari Review


స్టోరీ లైన్ 

అదో లంక గ్రామం.  రాజమండ్రి – కొవ్వూరు మధ్యలో ఉన్న గోదావరిలో  ఉంటుంది. అదే మన హీరో  రత్న(విశ్వక్సేన్) నేటివ్ ప్లేస్. చిన్నతనం నుంచి అల్లరి చిల్లరగా తిరటానికి అలవాటుపడ్డ రత్న  చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ కాలక్షేపం చేస్తూంటాడు. అయితే అతని మనస్సులో మాత్రం ఎప్పటికైనా గొప్పోడు అయ్యిపోవాలనే కోరిక ఉంటుంది. అందుకోసం దేనికైనా తెగించే తెగువ, ఉచ్చం నీచం వదిలేసే మనస్తత్వం బోనస్ గా ఉంటాయి. వాటితో తను అడ్డంగా నిలువుగా ఎదిగిపోవాలని అవకాసం కోసం ఎదురుచూస్తుంటే ఇసుక ర్యాంపులపై దృష్టి పడుతుంది. దాంట్లో వచ్చే ఆదాయం చూసి కన్నుకుడుతుంది. వెంటనే ఆ ర్యాంపులు నడుపుతున్న ఎమ్మెల్యే దొరస్వామి రాజు ( గోపరాజు రమణ) క్యాంప్ లో వచ్చిపడతాడు. అయితే అక్కడా అతని కాలు కుదురుగా ఉండదు. ర్యాంపులు కన్నా రాజకీయాలు అయితే రాజాలా ఉండచ్చు,పవర్ మన చేతిలో ఉంటుందనే బుద్ది పుడుతుంది. 

Latest Videos


Gangs of Godavari Review


దాంతో  రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వటం కోసం తన యజమాని దొరస్వామి ప్రత్యర్ది నానాజీ (నాజర్ ) గ్రూప్ లోకి జంప్ అవుతాడు.   పనిలో పనిగా  నానాజీ కూతురు బుజ్జి(నేహా శెట్టి) ని లైన్ లో పెట్టేస్తాడు. అంతేకాకుండా ఆ పలుకుబడి వాడేసి  ఎమ్మల్యే కూడా అవుతాడు.   దాంతో  నానాజీకి కూడా మండుద్ది.  దాంతో అటు నానాజీ, ఇటు దొరస్వామి ఇద్దరూ రత్నను ఎలాగైనా వేసేయాలని తిరుగుతూంటారు.  కానీ అనుకోకుండా రత్న చేతిలో నానాజీ చచ్చిపోతాడు. ఈ క్రమంలో ఒకపక్క దొరస్వామి మరొకపక్క నానాజీ రత్నను ఎలా అయినా దెబ్బ తీయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. 

Gangs of Godavari Review

ఈ క్రమంలో ఎన్నోసార్లు అతని మీద హత్యా ప్రయత్నం కూడా జరుగుతుంది. అయితే అప్పుడే ఓ విషయం రత్నకు రివీల్ అవుతుంది. తన దగ్గర ఉన్న వాళ్లే తనను చంపేయటానికి కత్తి కట్టారని. కత్తి కట్టటమంటే ఏమిటి... రత్న వెంటే ఉన్న ప్రెండ్సే  అతనిని చంపేందుకు ఎందుకు కత్తి కడతారు.   బుజ్జి తన తండ్రి నానాజీని చంపింది రత్నే అని తెలిసిందా ది? రత్నకు రత్నమాల(అంజలి)కి రిలేషన్ ఏంటి? వంటి  విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.


విశ్లేషణ

అప్పట్లో మోహన్ బాబు హీరోగా యమ్ ధర్మరాజు ఎంఏ అనే సినిమా వచ్చింది. నక్క జిత్తులతో నయ వంచనతో ఎలాగైనా ఎదిగి పడిపోయే ఓ వ్యక్తి కథ అది. దాదాపు అలాంటి కథే ఇది. అలాగే ఈ సినిమాలో హీరో క్యారక్టరైజేషన్ కూడా మనకు కొత్తేమీ కాదు. కేజీఎఫ్,పుష్ప,  నేనే రాజు నేనే మంత్రిలో రానా పాత్ర గుర్తుకు వస్తాయి. నెగిటివ్ హీరోయిజంతో బేస్ తో రాసుకున్న కథ. అయితే సమాజంలో ఇలాంటి పాత్రలు కొత్తేమీ కాదు కాబట్టి ఆశ్చర్యం పోవాల్సింది లేదు. కాపీ అనాల్సిన పని లేదు. అయితే ఈ సినిమాతో వచ్చిన చిక్కల్లా సంఘటనలు వరస పెట్టి వెళ్లిపోతూంటాయి. కానీ ఏవీ స్ట్రాంగ్ గా రిజిస్టర్ కావు. అలాగే ప్రారంభంలో ఉన్న కిక్ ఇచ్చే సీన్స్ తగ్గిపోయి ఊహకు అందేలా కథనం జరగటం మొదలవుతుంది. రత్నం క్యారక్టర్ తెలిసిపోయాక ఇలాగే ఇక్కడ ప్రవర్తిస్తాడు అని అర్దమైపోతుంది. అందుకు విరుద్దంగా ఎక్కడా  ఏమీ జరగదు. 
 

Gangs of Godavari Review


దాంతో స్క్రీన్ ప్లేలో హెచ్చు తగ్గులు,  ఎగుడుదిగుడులు లేకుండా అలా ప్లాట్ గా కథనం వెళ్తూంటుంది. ఫైట్స్ వచ్చినప్పుడు ఇంట్రస్టింగ్ గా అనిపిస్తుంది. ఎందుకంటే అవి బాగా డిజైన్ చేసారు కాబట్టి. వాటిని పట్టుకుని ప్రెజెంట్ చేసే స్క్రీన్ ప్లే మాత్రం అంత రేసీగా పరుగెత్తించలేకపోయారు. అన్నిటి కన్నా ముఖ్యంగా డ్రామా కొరవడుతుంది. పేరుకు ప్రత్యర్దులే కానీ హీరోకు సవాల్ విసిరి అతన్ని ఇరుకున పెట్టే వాళ్లు కనపడరు. విలన్స్ వీక్ అన్నమాట. హీరోనే విలన్ గా ఉంటే చేసేదేముంది అంటారా. అయినా వాడిని ఇరుకున పెట్టే విలన్ ఉండాలి కదా. అలా జరక్క పోవటంతో  హీరో ప్యాసివ్ పాత్రగా నడుస్తుంది. యాక్షన్ ప్యాసివ్ పాత్ర అన్నమాట. అతని  పెయిన్ ఎక్కడా కనపడదు. దాంతో ఎమోషన్ కు మనం కనెక్ట్ కాలేం. ట్విస్ట్ లు అయితే కొన్నిపండాయి. అవే ఉన్నంతలో కాస్త సేవ్ చేసాయి. 


అలాగే పీరియడ్ సినిమానేకానీ ఆ మూడ్ ని క్యారీ ఫార్వర్డ్ చేయకుండా జాగ్రత్తపడ్డారు.  కత్తి కట్టడం అంటే ఏమిటి? ఎందుకు?  వంటివి బాగా చూపించారు. ఏదైమైనా ఇన్నాళ్లూ గోదారి అంటే ఫన్, అనుబంధాలు అంటూ  ఓ యాంగిల్ లోనే చూసిన మనకు అక్కడ గ్యాంగ్ లు పోరుని ఫ్యాక్షనిజం లెవిల్లో  చూపాలనే డైరక్టర్ ఇంట్రస్ట్ మాత్రం గొప్పది. ముఖ్యంగా ఎలక్షన్స్ లో గెలిచి ఎమ్మల్యేగా అయ్యిపోవటం అనే ఎపిసోడ్ చూస్తే మనకూ ప్రేరణ వచ్చి ఇంత ఈజీనా అనిపిస్తుంది.  వాస్తవానికి గోదావరి రాజకీయాలు వేరు. అక్కడతందా బ్రెయిన్ తో పోరాటాలే. ఎత్తులు పై ఎత్తులు. అక్కడ చంపుకోవటాలు,గ్రూప్ లు లేవు అని కాదు కానీ అక్కడ రాజకీయాలు వేరే విధంగా నడుస్తూంటాయి. 
 


ప్లస్ లు 
విశ్వక్సేన్
కొన్ని యాక్షన్ బ్లాక్ లు 
డైలాగులు
కెమెరా వర్క్, బీజీఎమ్

మైనస్ లు 

బోర్ కొట్టించే స్క్రీన్ ప్లే 
ఎడిటింగ్ 
సెకండాఫ్ లో వచ్చే ట్విస్ట్ లు
సరైన విలన్ లేకపోవటం
 

ఎవరెలా చేసారు

రత్న  పాత్రలో విశ్వక్సేన్ తన ఈజ్ ని మిక్స్ చేస్తూ  సీరియస్ గా కనిపించాడు. ఆ పాత్రకు తన ఆహార్యం సరిపోయింది. అయితే చాలా వరకూ ఒకటే గోదావరి యాస, మాడ్యులేషన్ లో డైలాగులు చెప్పడం కాస్తంత ఇబ్బందిగా అనిపిస్తుంది.  ఇందులో తనకో ప్రేమకథ లాంటింది వుంది. కానీ ఈ కథలో అది కలవలేదు.  రత్నమాలగా అంజలి బాగా చేసింది.  మిగతా పాత్రలని విశ్వక్సేన్ డామినేట్ చేసేసారు. దాంతో ఇందులో సరిగ్గా రిజిస్టర్ కానీ చాలా పాత్రలు కనిపిస్తాయి. ఐటమ్ సాంగ్ లో ఆయేషా ఖాన్ అందాల ప్రదర్శన బాగా చేసి రక్తి కట్టించింది. 
 

Gangs of Godavari Review


టెక్నికల్ గా ..

ఇలాంటి సినిమాలుకు కావాల్సిన మూడ్ ని బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీతో సాధించారు. అయితే పాటలు జస్ట్ ఓకే అనిపిచాయి. ఐటమ్ సాంగ్ కూడా సోసోగా ఉంది. అయితే సినిమాలో చాలా చోట్ల డైలాగులు బాగా పేలాయి. ఇక ఈ సినిమాలో చెప్పుకోదగ్గ టెక్నికల్ డిపార్టమెంట్ అదిరిపోయే యాక్షన్ బ్లాక్స్ సెట్ చేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్స్.  స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ ఈ రెండు కలసి సినిమాని  ప్లాట్ నేరేషన్ లోకి తీసుకొచ్చేసాయి. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు తగ్గట్లు బాగా ఖర్చు పెట్టారు. 
 

Gangs Of Godavari


ఫైనల్ థాట్

సినిమా అంటేనే ఓ ఎమోషన్ జర్ని. అదే మిస్సైనప్పుడు ఎన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నా ఏమీ ఫలితం ఉండదు. మనస్సుకు పట్టదు. 
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating: 2.5
 

తెర వెనుక..ముందు

నటీనటులు: విశ్వక్ సేన్, అంజలి, నేహా శెట్టి, గోపరాజు రమణ, అజయ్ ఘోష్, హైపర్ ఆది, నాస్సర్, సాయి కుమార్, పృథ్విరాజ్ తదితరులు 

సంగీతం: యువన్ శంకర్ రాజా

ఛాయాగ్రహణం: అమిత్ మాదాడి 

నిర్మాతలు: సూర్యదేవర నాగ వంశి, సాయి సౌజన్య 

దర్శకత్వం: కృష్ణ చైతన్య 

విడుదల తేదీ: 31 మే, 2024

click me!