Chiraiya Review: పెళ్లి చేసుకుంటే చాలు భర్తకు భార్యపై అన్ని హక్కులు వచ్చేస్తాయి అనుకుంటారు. లైంగికంగా వేధిస్తారు. ఆమెకి ఇష్టమా లేదా అనేది అడగకుండానే మ్యారిటల్ రేప్‌కు పాల్పడతారు. అలాంటి వారి కోసమే ఈ వెబ్ సిరీస్ చిరయా.
చిరయా అంటే చిన్న పిట్ట అని అర్థం. ఆ చిన్న పిట్ట ఎవరో కాదు సమాజంలోని మహిళే. ప్రస్తుతం హాట్ స్టార్ లో ప్రసారమవుతున్న చిరయా వెబ్ సిరీస్ చుట్టూ ట్రోలింగ్ జరుగుతోంది. దీన్ని ఒక రాజకీయ, సామాజిక వివాదంగా కూడా మార్చేశారు. ఏది ఏమైనా చిరయా వెబ్ సిరీస్ చెప్పేది ఒక్కటే.. మహిళ అనుమతి తీసుకోకుండా ఆమె భర్త అయినా సరే ఆమెను ముట్టుకోవడానికి ఎలాంటి హక్కు లేదు. చట్టం అలాంటి హక్కును భర్తకు ఇవ్వలేదు. అయినా సరే భర్త పూర్వకాలం నుంచి భార్య తన సొంత ఆస్తిగా భావించి ఆమెపై మ్యారిటల్ రేప్ కు పాల్పడుతూనే ఉన్నాడు. అది ఒక మనిషిని ఎంత బాధిస్తుందో కళ్ళారా చూపించింది చిరయా వెబ్ సిరీస్. దీనిపై గతంలో చాలా సినిమాలు వచ్చి ఉంటాయి. ఇంకా వస్తూనే ఉంటాయి. కానీ అందులో చిరయా కచ్చితంగా ఒక గొప్ప వెబ్ సిరీస్ గా నిలిచిపోతుంది.
24
కొత్త పెళ్లికూతురు చుట్టే కథ
ఇక కథ విషయానికి వస్తే సుకుమార్ భ్రమర్ ఒక పెద్ద వ్యక్తి. మంచి కవి. పైగా నేషనల్ స్థాయిలో గుర్తింపు పొందిన వాడు. అతడికి ఇద్దరు కొడుకులు. ఈయన పెద్దకోడలు కమలేష్. ఈమె ఇంటికి మహారాణిలా ఫీలవుతూ ఉంటుంది. ఇక చిన్న కొడుకు పేరు అరుణ్. కమలేష్ పెళ్లి నాటికే అరుణ్ కేవలం పదేళ్ల వాడు కావడంతో తనకి తల్లిలా మారుతుంది కమలేష్. ఈమెకు ఒక కూతురు ఉంటుంది. మగ పిల్లలు లేకపోవడంతో అరుణ్‌ను తన సొంత కొడుకుగా భావించి పెంచుతుంది. అరుణ్‌కి కూడా వదిన అంటే తల్లితో సమానం. ఇక అరుణ్‌కి పూజ అనే అమ్మాయితో పెళ్లి జరుగుతుంది. శోభనం రోజు రాత్రి పూజకు ఏ మాత్రం ఆరోగ్యం బాగోదు. పూజ తాను కలయికకు సిద్ధంగా లేనని, ఆరోగ్యం బాగోలేదని చెబుతుంది. అయినా కూడా అరుణ్ ఏమాత్రం పట్టించుకోడు. ఆమె ఇష్టం లేకుండానే... రేప్ చేస్తాడు. ఆమె ఏడుస్తూ బయటికి వచ్చేస్తుంది.
కానీ బయట ఉన్న వారికి తన బాధను చెప్పుకోలేక మళ్ళీ గదిలోకి వెళ్తుంది. అప్పుడు కూడా అరుణ్ మళ్లీ అలాగే ప్రవర్తిస్తాడు. ఆ రోజు నుంచి వారం రోజులు పాటు ఆమెకు టార్చర్ చూపిస్తాడు. ఆ టార్చర్ నుంచి బయటపడేందుకు పూజ తనను తానే తీవ్రంగా గాయపరచుకుంటుంది. చివరికి తన పరిస్థితిని తన తోటి కోడలు కమలేష్ కు అర్థం అయ్యేలా చెబుతుంది. తనలా కోడలిగా ఇంటికి వచ్చిన పూజకు తల్లిలా మారి కమలేష్ అండగా నిలుస్తుంది. అంతేకాదు పురుషాధిపత్యంతో రగిలిపోతున్న తన మావయ్య, మరిదిలకు బుద్ధి చెబుతుంది. కమలేష్ భర్త మాత్రం చాలా మంచి వ్యక్తిగా ఇందులో చూపించారు.
34
అది సంసారం కాదు అత్యాచారం
భార్య అంటే ఒక వస్తువు కాదు.. అనుభవించి వదిలేయడానికి. ఆమెకు కూడా ఒక మనసు ఉంటుంది.. ఆమె ఇష్టపడితేనే ఆమె మీద ఎవరైనా చెయ్యి వేయాలి అనేది ఈ చిరయా వెబ్ సిరీస్ ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా భర్త అనేవాడు ఆమెను ఆస్తిగా కాదు.. తనలాంటి ఒక మనిషిగా గుర్తించాలని ఈ వెబ్ సిరీస్ చెబుతోంది. వివాహమైన తర్వాత భర్తతో శృంగారానికి అడ్డు చెప్పకూడదని ఏ చట్టంలోనూ లేదు. భార్య అంగీకరిస్తేనే భర్త ఆమెను ముట్టుకోవాలి. అదే బలవంతం చేస్తే అది అత్యాచారం కిందకే వస్తుందని ఈ చిరయా వెబ్ సిరీస్ ఉద్దేశం.
సాధారణంగా స్త్రీకి స్త్రీనే ప్రధాన శత్రువు అని చెప్పుకుంటారు. కానీ ఈ వెబ్ సిరీస్ చూస్తే అది నిజం కాదని అనిపిస్తుంది. ఒక బాధితురాలు అయిన స్త్రీకి మరొక స్త్రీ ఎంత అండగా నిలిచిందో.. అందుకోసం తన బంగారు కాపురాన్నే పణంగా పెట్టిందో అర్థం చేసుకోవచ్చు. సమాజంలో ప్రతి చోటా జరుగుతున్న మ్యారిటల్ రేప్‌ను హైలెట్ చేసేందుకే ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు. చిరయా ఒక సందేశాత్మక వెబ్ సిరీస్. కేవలం వినోదం కోసం తీసినది కాదు. సమాజంలోని కొన్ని నిజాలను చూపించడానికి చేసిన ప్రయత్నం. ఏ భార్యా కూడా భర్త తనపై చేసిన అఘాయిత్యం గురించి ఎవరితోను చెప్పుకోదు. అది కేవలం కాపురంగానే భావిస్తుంది. కానీ భర్తయినా కూడా తనకు ఇష్టం లేకుండా తన శరీరం మీద చెయ్యి వేస్తే అది ఎంత నరకంగా ఉంటుందో ఆ మహిళకే తెలుస్తుంది. ఆ బాధను ఈ చిరయా వెబ్ సిరీస్లో చాలా బాగా చూపించారు. ప్రతి సీను ఒక భావాన్ని బలంగా నాటుతుంది. ఇది బోల్డ్ కాన్సెప్టే కావచ్చు కానీ మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పెళ్లయిన మహిళలంతా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలో ఇది ఒకటి.