
తరుణ్ భాస్కర్ రూపొందించిన `ఈ నగరానికి ఏమైంది` మూవీ అప్పట్లో ఒక సంచలనం. యూత్‌ని బాగా ఆకట్టుకుంది. ఫ్రెండ్షిప్, ఫన్, యూత్‌ఫుల్ కామెడీని కొత్తగా పరిచయం చేసిన చిత్రమిది. ఇందులో విశ్వక్ సేన్, అభినవ్ గోమటం మధ్య కామెడీ అదిరిపోతుంది. ఇప్పుడు సరిగ్గా ఎనిమిదేళ్ల తర్వాత దీనికి సీక్వెల్‌ని రూపొందించాడు తరుణ్ భాస్కర్.
ఇందులో విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, శ్రీనాథ్ మాగంటి, వెంకటేష్ కాకుమాను, రామ్, శివాత్మిక రాజశేఖర్, శ్రీరామ్ చంద్ర వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ఎస్ఎస్ ఒరిజినల్స్, రూట్నాడ్ సినిమాస్ పతాకాలపై సృజన్ యారబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మించారు. ఈ చిత్రం నేడు గురువారం(నవంబర్ 19)న విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? `ఈ నగరానికి ఏమైంది` మ్యాజిక్ రిపీట్ అయ్యిందా? విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్లకు హిట్ పడిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం.
మొదటి భాగంలో సినిమా తీయాలనే కలతో గోవాకు వెళ్లిన స్నేహితుల బృందం వివేక్ (విశ్వక్ సేన్), కౌశిక్ (అభినవ్ గోమటం), ఉప్పి (వెంకటేష్ కాకుమాను), కార్తీక్ (శ్రీనాథ్ మాగంటి) ఫస్ట్ సినిమా ఫెయిల్యూర్‌తో ఎవరికి వాళ్లు దూరంగా ఉంటారు. సడెన్‌గా కార్తీక్ చెల్లి కీర్తన(శివాత్మిక రాజశేఖర్)కి పెళ్లి సెట్ అవుతుంది. పెళ్లి చేసుకునే అబ్బాయి అంకిత్(శ్రీరామ చంద్ర) బ్యాచ్‌లర్ పార్టీ ఇవ్వాలనుకుంటారు. అందుకు ఈ నలుగురు మరోసారి కలుస్తారు.
కానీ ఆ రోజు రాత్రి పబ్‌లో గొడవ అవుతుంది. అంకిత్‌ని కొట్టడంతో పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. కీర్తన గురించి వాళ్ల డాడీ(సాక్షి రామ్)కి తెలుస్తుంది. ఆయన ఫైర్ అవుతాడు. మీకోసం చాలా ఖర్చు చేశాను, ఆ డబ్బులు కట్టాలని, లేదంటే ఈ సినిమా పిచ్చి వదులుకోవాలని కండీషన్ పెడతాడు. కానీ వివేక్.. ఆయనతో సవాల్ విసురుతాడు. తాము సినిమా తీసి హిట్ కొట్టి చూపిస్తామని చెబుతాడు.
అందుకు ఒక సర్వైవల్ ఫిల్మ్ తీయాలని నిర్ణయించుకుంటారు. మరి సినిమా తీశారా? ఈ క్రమంలో ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? కీర్తనని కార్తీక్ లవ్ స్టోరీ ఏంటి? వివేక్ డైరెక్టర్‌గా సక్సెస్ అయ్యాడా ? లేదా? కీర్తన సినిమాల్లో నిరూపించుకుందా లేదా? అనేది మిగిలిన కథ.
`ఈ నగరానికి ఏమైంది` మూవీ సక్సెస్ కి కారణం.. ఫన్, ట్రెండీ డైలాగులు, రియలిస్టిక్ సన్నివేశాలు, స్నేహం వంటి అంశాలు ప్రధానంగా చెప్పొచ్చు. సింపుల్‌గా సాగే కథనం మరో మెయిన్‌గా చెప్పొచ్చు. ఇప్పుడు కూడా ట్రెండీ డైలాగులు, జెంజీని ఎట్రాక్ట్ చేసే అంశాలు, నలుగురు ఫ్రెండ్స్ మధ్య జరిగే రియలిస్టిక్ అంశాలను ప్రధానంగా చేసుకొని ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో ఇవే హైలైట్‌గా చెప్పొచ్చు. మొదటి భాగానికి కంటిన్యూ చేస్తూ, కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత పెళ్లి విషయంలో వీరంతా కలవడం, మళ్లీ పాత జ్ఞాపకాల్లోకి వెల్లడం, నలుగురు కలిసి పార్టీ చేసుకోవడం, ఉపేంద్ర చెల్లి పెళ్లి మ్యాటర్ పెంట పెంట చేయడంతో ఈ కామెడీ స్టార్ట్ అవుతుంది. అయితే ప్రారంభంలో కథని ఎస్టాబ్లిష్ చేయడానికి టైమ్ తీసుకున్నారు. ఆయా సీన్లు పెద్దగా అర్థం కావు, కానీ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తాయి. శ్రీరామ చంద్ర,శివాత్మిక పెళ్లి చూపులు సీన్ ఫర్వాలేదు. సినిమా షూటింగ్లో శ్రీనాథ్ మాగంటి, శివాత్మిక మధ్య సీన్లు, ఆయన ప్రపోజ్ చేయాలనుకోవడం, అక్కడ కామెడీ కావడం బాగుంది. ఆ తర్వాత పబ్‌లో గొడవలు అదిరిపోయాయి. వాళ్ల మధ్య కన్వర్జేషన్ క్రేజీగా ఉంటుంది. గొడవ పడే సీన్లు కూడా ఆకట్టుకుంటాయి. అవి రియాలిటీకి దగ్గరగా ఉంటాయి.
పెళ్లి తర్వాత వీరి మధ్య వచ్చే సీన్లు అదిరిపోయాయి. ఫ్లైట్‌లో సీన్లు, సినిమా తీసేందుకు థాయిలాండ్ వెళ్లడం అక్కడ సీన్లు అదిరిపోయాయి. కొంత బోరింగ్‌గా ఉన్నా, తర్వాత ఆకట్టుకుంటుంది. రాబర్ట్ పాత్రతో కామెడీ వాహ్ అనిపిస్తుంది. క్లైమాక్స్ ఎమోషనల్‌గా ఉంటుంది. ఆ తర్వాత ఇతర దర్శకుల ఎంట్రీ, సినిమా షూటింగ్ సీన్లు ఆకట్టుకుంటాయి. సర్ప్రైజ్ చేస్తాయి.
కొన్నిచోట్ల కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది. కొన్ని చోట్ల అంతగా పండలేదు. డైలాగ్‌లు అర్థమయ్యేలా లేవు. ఫాస్ట్ గా వెళ్లడం మైనస్. నలుగురు స్నేహితుల మధ్య వచ్చే కన్వర్జేషన్లో క్లారిటీ మిస్ అయ్యింది. ఇంటర్వెల్ కి ముందు సీన్లు నవ్విస్తాయి. ఇంటర్వెల్ తర్వాత కొంత లాంగ్ ఫీలింగ్ తెప్పిస్తుంది. కానీ ఆ తర్వాత హిలేరియస్‌గా వెళ్తుంది.
థాయిలాండ్ సీన్లు సినిమాకి మరో హైలైట్‌గా చెప్పొచ్చు. కాకపోతే సెకండాఫ్‌లో కొంత వరకే ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ ని బాగా రాసుకున్నారు. కానీ కొన్ని చోట్ల కామెడీ వర్కౌట్ కాలేదు. ఫోర్స్ డ్గా ఉంటుంది. డైలాగ్‌లో క్లారిటీ లేకపోవడం, సినిమాలో మెయిన్‌గా కథ లేదు, సీన్లని ఆధారంగా చేసుకొని రూపొందించారు. కానీ దాన్ని చాలా బాగా రాసుకున్నారని చెప్పొచ్చు. కుర్రాళ్లని ఆకట్టుకునేలా సినిమాని తెరకెక్కించారు. మరింత కామెడీగా, మరింత అర్థవంతమైన డైలాగ్‌లతో, సీన్లతో రూపొందించి ఉంటే సినిమా అదిరిపోయేది. కాకపోతే ఇతర స్టార్స్ సర్ప్రైజ్లు హైలైట్‌గా చెప్పొచ్చు.
విశ్వక్ సేన్ మరోసారి వివేక్ పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. తనదైన బాడీ లాంగ్వేజ్, ఎనర్జీ, కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. అభినవ్ గోమటం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. తన డైలాగ్ డెలివరీ, ఎక్స్‌ప్రెషన్స్‌తో నవ్వులు పూయించారు. కొన్ని సన్నివేశాల్లో అభినవ్ కామెడీ ప్రత్యేకంగా నిలుస్తుంది. కాకపోతే ఆయన బ్రహ్మానందంని అనుసరిస్తున్నట్టుగా ఆయన నటన ఉండటం గమనార్హం.
వెంకటేష్ కాకుమాను ఉప్పి పాత్రలో మరోసారి మెప్పించారు. ఆయన కామెడీ టైమింగ్, అమాయకత్వంతో కూడిన నటన సినిమాకు బలంగా నిలిచాయి. శ్రీనాథ్ మాగంటి కార్తీక్ పాత్రలో చక్కగా నటించారు. గతంలో సాయి సుశాంత్ రెడ్డి పోషించిన పాత్రను కొత్త నటుడితో కొనసాగించడం సవాలుతో కూడుకున్న విషయమే. శ్రీనాథ్ తన నటనతో ఆ పాత్రకు న్యాయం చేశారు. శివాత్మిక రాజశేఖర్, అనీషా అంబ్రోస్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమాకు ప్రధాన బలం. స్నేహితుల మధ్య ఉండే సహజమైన సంభాషణలను తెరపై ఆవిష్కరించడంలో మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ముఖ్యంగా మెటా కామెడీ, సినిమా తీయాలనే ప్రయత్నం చుట్టూ అల్లిన సన్నివేశాలు కొత్తదనాన్ని అందిస్తాయి. డైలాగ్స్ ప్లస్, మైనస్. కొన్ని కామెడీ సీన్లు అంతగా పండలేదు, ఇరికించినట్టుగా ఉన్నాయి. కానీ సహజత్వాన్ని ఆవిష్కరించేలా మూవీ తీయడం విశేషంగా చెప్పొచ్చు. సినిమాకి సంబంధించిన సీన్లు, ఎమోషనల్ సీన్లు మరో హైలైట్‌గా నిలుస్తాయి.
వివేక్ సాగర్ సంగీతం సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా సన్నివేశాలకు మంచి ఫీల్‌ను తీసుకొచ్చింది. ఏజే ఆరోన్ సినిమాటోగ్రఫీ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. విజువల్స్‌ను చాలా సహజంగా, అందంగా చూపించారు. రవితేజ గిరిజాల ఎడిటింగ్ బాగుంది. అయితే సినిమా నిడివిని మరికొంత తగ్గించి ఉంటే మరింత వేగంగా సాగేది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. చాలా రిచ్‌గా ఉన్నాయి.
‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ మొదటి భాగం స్థాయిలో లేకపోయినా, యూత్‌ని, జెంజీని ఆకట్టుకునే మూవీ అవుతుంది. కుర్రాళ్లు బాగా ఎంజాయ్ చేస్తారు.