Sita Ramam:దుల్కర్ సల్మాన్ 'సీతా రామం' రివ్యూ

First Published Aug 5, 2022, 12:57 PM IST


  'సీతా రామం' చిత్రం ఓ బ్యూటిఫుల్ మ్యాజికల్ లవ్ స్టోరీ అని ఇప్పటికే విడుదలైన టీజర్ - ట్రైలర్ లను బట్టి అర్థం అవుతోంది. రామ్ - సీతా మహాలక్ష్మి మధ్య అందమైన ప్రేమ కథను ఆవిష్కరింస్తుందనే విషయాన్ని తెలియజెప్పాయి. అయితే ఆ కథేంటి...సినిమా ఎలా ఉంది?


వెండితెరపై  ప్రేమ కథలకు ఎప్పుడూ గిరాకీనే. అయితే ఆ ప్రేమ కథ మనస్సుని తట్టేలా ఉండాలి. ..కుర్రాళ్లకి పట్టేలా ఉండాలి. అప్పుడే అది క్లిక్ అవుతుంది.  దర్శకుడు హను రాఘవపూడి  తొలి నుంచి తన ప్రయారిటీ ప్రేమ కథలకే ఇస్తూ వస్తున్నారు. అయితే వాటిలో సక్సెస్ రేటు తక్కువే. అలాగే అవి ఓ వర్గానికే పరిమతమవుతూ వస్తున్నాయి. తాజాగా హను దర్శకత్వంలో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్  హీరోగా యుద్ధం నేపధ్యంలో  రూపొందిన ప్రేమకథ చిత్రం ఇది. వైజయంతీ మూవీస్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్ సమర్పణ కావటంతో సినిమాపై ఎక్సపెక్టేషన్స్ ఏర్పడ్డాయి. అలాగే మంచి నటి అయిన మృణాళిని ఠాకూర్ హీరోయిన్ పాత్రలో కనిపించగా రష్మిక మందన్న మరో కీలకమైన పాత్రలో కనిపించటం కూడా క్రేజ్ కు మరో కారణమైంది. ఇక దుల్కర్ కు తెలుగులో ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఈ కాంబోలో రూపొందిన ఈ చిత్రం సక్సెస్ అయ్యిందా...ఈ లవ్ స్టోరీ కుర్రాళ్లకు పట్టేదేనా....కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 

కథ

లండన్ లో ఉన్న అఫ్రిన్ (ర‌ష్మిక‌) కి  తన తాత (స‌చిన్ ఖేడ్క‌ర్‌) ఆఖరి కోరిక తీర్చాల్సిన భాధ్యతలాంటి పని మీద పడుతుంది. అదేమిటిటంటే... లెఫ్ట్‌నెంట్ రామ్ (దుల్క‌ర్ సల్మాన్‌)... హైద‌రాబాద్‌లో ఉన్న‌ సీతామాల‌క్ష్మి కి రాసిన ఉత్తరం ఆమెకు చేర్చాలి. అలా చెయ్యకపోతే ఆమెకు ఆస్తి ఇవ్వను అని కండీషన్ కూడా పెడతాడు ఆయన.  ఇంతకీ ఆ ఉత్తరం ఎక్కడ ఉంది..ఎప్పుడు రాసింది అంటే పాతికేళ్ల క్రితం.. అదీ ప్రస్తుతం  పాకిస్దాన్ లో ఉన్న ఉత్తరం. దాన్ని తీసుకుని ఆఫ్రిన్ ఇండియాకు బయిలుదేరుతుంది. సెర్చింగ్ మొదలెడుతుంది. బాలాజీ (తరుణ్ భాస్కర్) సాయిం తీసుకుంటుంది. అక్కడనుంచి ఒక్కొక్కరని కలిసే  క్రమంలో ఆమెకు లెఫ్ట్‌నెంట్ రామ్ కు చెందిన  విషయాలు రివీల్ అవుతాయి. 

Latest Videos



రామ్   ..మద్రాస్ రెజిమెంట్ కు చెందిన సైనికుడని తెలుస్తుంది. అలాగే బోర్డర్స్ ని కాపలాకి పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK) కు పోస్టింగ్ చేయబడ్డాడని అర్దమవుతుంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్, సుమంత్ అతని రెజిమెంట్ ఆఫీసర్స్ గా పరిచయం అవుతారు.  జమ్ము ,కాశ్మీర్ లో కొందరని తన ధైర్య ,సాహసాలతో కాపాడటంతో అక్కడ హీరో అవుతాడు. ఆ క్రమంలో ఆల్ ఇండియా  రేడియోకు ఇచ్చిన ఇంటర్వూలో తనో అనాధ అని చెప్తాడు. అక్కడ నుంచి దేశం నలుమూలల జనం అతనికి సపోర్ట్ గా ఉత్తరాలు రాయటం మొదలెడతారు. అందులో చాలా భాగం లవ్ లెటర్స్. ఆ ఉత్తరాల్లో ఒకటి రామ్ ని ఎట్రాక్ట్ చేస్తుంది. ఫ్రమ్ అడ్రస్ లేని ఆ లెటర్  సీతామాల‌క్ష్మి(మృణాల్ ఠాకూర్) నుంచి వస్తుంది. కానీ అందులో కంటెంట్ కాలక్షేపం కాదని ఓ సీరియస్ లవ్ అని అనిపిస్తుంది. సీత  ఉత్తరాలతో ప్రేమలో పడిన రామ్ ..ఆమెను కలుస్తాడు. అతని ఒంటిరి జీవితాన్ని  ఆమె ఆలోచనలుతో నింపుతూంటాడు.  ఓ రోజు మొత్తానికి సీతామహాలక్ష్మిని కలుస్తాడు. 
 


స్నేహం..ప్రేమను..పెళ్లిగా టర్న్ చేసి పెళ్లి చేసుకుందామని ప్రపోజల్ పెడతాడు. ఆమె ఒప్పుకోదు. విడిపోతారు. ఈ లోగా రామ్ ...ఓ సీక్రెట్ మిషన్ పై పాకిస్దాన్ కు వెళ్తాడు. అక్కడ పట్టుబడిపోతాడు. అక్కడ నుంచే సీత కు చివరి సారిగా ఓ ఉత్తరం రాస్తాడు. రామ్ పట్టుబడటానికి కారణం ఏమిటి...సీక్రెట్ మిషన్ విషయం అక్కడ వాళ్ళకు ముందే ఎలా తెలిసింది..రామ్, సీత ల ప్రేమ కథ ఏమైంది...ఈ కథలో విష్ణు శర్మ (సుమంత్) పాత్ర ఏమిటి....అఫ్రిన్ చివరకు రామ్ ని కలిసిందా...రామ్, సీత లు విడిపోవటానికి కారణం ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

విశ్లేషణ

1965 యుద్ధం బ్యాక్ డ్రాప్ లో సెట్ చేయబడిన ఈ కథ ఎక్కువగా ప్లాష్ బ్యాక్,లైవ్ ఇలా రెండు కాలాల్లోనూ సాగుతుంది. కన్ఫూజన్ కాకుండా ,కన్ఫూజ్ చేయకుండా మనకేమి కావాలో అంతవరకూ చెప్తూ,క్లూలు ఇస్తూ ముందుకు సాగే స్క్రీన్ ప్లే ఇది. ఇదే బ్యానర్ నుంచి వచ్చిన మహానటిలోనూ ఇదే స్క్రీన్ ప్లే దాదాపు ఫాలో అయ్యి సక్సెస్ అయ్యారు. ప్రేక్షకుడుకి ఎక్కువ ఊహకు అవకాశం ఇవ్వకుండా ఎంత వరకూ ఏం చెప్పాలో అదే చెప్పి కట్టిపాడేయటం మామూలు విషయం కాదు.  ఇది కాస్త కష్టమే. ఆ విషయం లో డైరక్టర్ సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా సెకండాఫ్ లో సీతా మహాలక్ష్మి పాత్రకు ట్విస్ట్ పెట్టి సినిమాని నిలబెట్టాడు. సెకండాఫ్ కనుక ...ఆసక్తికరమైన మలుపులు లేకపోతే ఖచ్చితంగా బొమ్మ తేడా కొట్టి ఉండేది. ఎందుకంటే ఫస్టాఫ్ పెద్దగా మనకు ఏమీ ఇవ్వదు. బాగుందంటే బాగుంది..జస్ట్ ఓకే అనిపిస్తుంది. 
 

అయితే ఇంటర్వెల్ లో వచ్చే చిన్న ట్విస్ట్ దాకా పెద్దగా ఏమీ జరిగినట్లు ఉండదు. దానికి తగ్గట్లే స్లో నేరేషన్. సెకండాఫ్ లోనే మొత్తం మెలిక ఉంది. అదే మ్యాజిక్ చేసింది. ఇక సెకండాఫ్ లో సీత గురించి  వచ్చే ట్విస్ట్.. కథంతా పూర్తిగా రివీలయ్యాక ..వచ్చే ఫైనల్ ట్విస్ట్ ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి. హను గత చిత్రాల్లో ఇలా సెకండాఫ్ ని నడిపింది లేదు. ఏదో ఒక ఎమోషన్ పట్టుకుని సాగతీసేవాడు. ఈ సారి అలా ప్రక్కకు వెళ్లకుండా పద్దతి ప్రకారం ప్రేక్షకుని ఇన్వాల్వ్ చేస్తూ , ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తూ ..ట్విస్ట్ లతో ఆశ్చర్యపరిచే ప్రయత్నం చేసాడు. అందులో ఎంతవరకూ సక్సెస్ అయ్యాడంటే చాలా వరకు అని చెప్పాలి. వాస్తవానికి  రామ్ ..సీత కథ మాత్రమే తీసుకుని చెప్తే ....అది ఖచ్చితంగా బోర్ కొట్టేది. వన్ వే ట్రాఫిక్ లా ఉండేది. రష్మిక క్యారక్టర్ ని అడ్డం పెట్టి..కథను ఎక్కడ ఎంతవరకూ రివీల్ చేయాలో అంతే చేయటం సినిమాకు కలిసి వచ్చింది. అయితే సినిమా అయ్యిపోయిందనుకున్న టైమ్ లో లాగటం మాత్రం కాస్త ఇబ్బందికరమే. ఎండింగ్ మనం ఊహించేస్తాం. 

ఈ  పీరియడ్ లవ్  డ్రామా ని మిస్టరీ ప్లాట్ గా మార్చటం, సస్పెన్స్ థ్రిల్లర్ గా నేరేట్ చేయటం కలిసొచ్చింది. కథ,కథన లోపాలను కప్పి పుచ్చింది.  

టెక్నికల్ గా...

డైరక్టర్ గా హను రాఘవపూడి పొయిటిక్ నేరేషన్ తో  ప్రేమ కథను చెప్పే ప్రయత్నం చేసారు. ప్రాక్టీస్ మేక్స్ మెన్ ఫెరఫెక్ట్...వరస ప్లాఫ్ లు హను రాఘవపూడికు మంచి పాఠాలే నేర్పి ట్రాక్ లో పెట్టాయి.  మణిరత్నం చెలియా చిత్రం ఛాయిలు  కొన్ని చోట్ల గుర్తుకు వస్తాయి. స్క్రిప్టు విషయంలోనే మరీ పొయిటిక్ గా చెప్పాలన్న తాపత్రయంలో కొన్ని సీన్స్ లాగుతూ పోయారు. అవి ఎంతసేపున్నా తెమలవు.

 సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ పాటలు ఎలా ఉన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాకు నెక్ట్స్ లెవిల్ ఫీల్ ఇచ్చాడు. పీరియడ్ లవ్ స్టోరీకు ప్రాణం పోసాడు. ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే...పీఎస్ వినోద్ వంటి టాప్ టెక్నీషియన్ ఉన్నాక చెప్పుకునేదేముంది. కాశ్మీర్ అందాలు అద్బుతంగా చూపించాడు. ఆ పాత రోజుల్లోకి తీసుకెళ్లాడు. అయితే ఎడిటింగ్ వర్క్  మాత్రం మరింత ట్రిమ్ చేయచ్చు అనిపించింది. చాలా చోట్ల లాగ్ లు వదిలేసారు. ఫీల్ కోసం అనుకున్నా అలాంచిచోట బోర్ కొట్టేసింది. ఆర్ట్ డిపార్టమెంట్ అద్బుతంగా వర్క్ చేసింది. కాస్ట్యూమ్స్ డిపార్టమెంట్ కష్టం కనపడుతుంది. నిర్మాణ విలువలు బ్యానర్ కు తగ్గ స్దాయిలో ఉన్నాయి. 


నటీనటుల్లో :

దుల్కర్,మృణాల్ ఇద్దరూ పోటీ పడి నటించారు. ఫెరఫెక్ట్ జోడీ అనిపించారు. దుల్కర్ స్క్రీన్ ప్రెజన్స్ కొన్ని చోట్ల ఆశ్చర్యపరిస్తే...మృణాల్ హావభావాలు మరికొన్ని చోట్ల అబ్బురపరుస్తాయి.వీళ్లిద్దరే సినిమాని మోసేసారు. రష్మిక, తరుణ్ భాస్కర్ ...కథను నడిపించే సూత్రధారులు మాత్రమే. సుమంత్ కు సహ నటుడుగా అయినా మంచి పాత్ర లభించింది. సెటిల్డ్ ఫెరఫార్మెన్స్ ఇచ్చాడు. సునీల్, వెన్నెల కిషోర్ కామెడీ సినిమాకు కలిసి రాలేదు. ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్ వంటి స్టార్ సపోర్టింగ్ యాక్టర్స్ ని సరిగ్గా వాడుకోలేదనిపించింది. వారిని కొద్ది సీన్లకే పరిమితం చేసారు.

sita ramam

  
నచ్చినవి:

లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ
అదరిపోయే విజువల్స్
దుల్కర్ స్క్రీన్ ప్రెజన్స్ 
 

నచ్చనవి:

కామెడీ సీన్స్ దారుణం
ఫస్టాఫ్ బాగా స్లో అనిపించటం
సెకండాఫ్ లోనూ కొన్ని సీన్స్  లాగటం..
ఊహించగలిగే ఎండింగ్

Sita Ramam Telugu Movie Review


ఫైనల్ థాట్ :

ఇలాంటి క్లాస్  సినిమాలు మల్టిఫ్లెక్స్ ని దాటి మామూలు జనాల్లోకి వెళ్లినప్పుడే పూర్తి సక్సెస్ అయ్యినట్లు. 
 

---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2.75

బ్యానర్: స్వప్న సినిమా
తారాగణం: దుల్కర్ సల్మాన్ - మృణాల్ ఠాకూర్ - రష్మిక మందన్న - సుమంత్ - గౌతమ్ మీనన్ - ప్రకాష్ రాజ్ - భూమికా చావ్లా - తరుణ్ భాస్కర్ - శత్రు - సచిన్ ఖేడేకర్ - మురళీ శర్మ - వెన్నెల కిషోర్ తదితరులు
 ఛాయాగ్రహణం : పీఎస్ వినోద్
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
ప్రొడక్షన్ డిజైన్: సునీల్ బాబు
ఆర్ట్ డైరెక్టర్: వైష్ణవి రెడ్డి
కాస్ట్యూమ్ డిజైనర్: శీతల్ శర్మ
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: హను రాఘవపూడి
సమర్పణ: వైజయంతీ మూవీస్
నిర్మాతలు: అశ్వినీదత్, ప్రియాంక దత్
Run Time:2 hr 43 mins
విడుదల తేదీ: 5 ఆగస్ట్, 2022
 

click me!